తెల్లటి దుస్తులు వేసుకున్న లావుపాటి నర్సు ప్రార్థన చూపుడు వేలుమీద సూదితో చప్పున పొడిచి, లోపల్నుంచి పొంగిన రక్తాన్ని అద్దం మీదకు తీసుకుంది.
అట్టమీద క్లిప్పుకున్న కాగితంలో ఆ విషయాన్ని నోట్ చేసుకుంటూ ఉండగా ఇంకో నర్సు వచ్చి ఆవిడకి ఫోన్ వచ్చిందని చెప్పింది.
లావు నర్సు వరండాలోకి వెళ్ళి ఫోన్ అందుకుంది. అట్నుంచి ఫోన్ చేసింది, ఆమె బాయ్ ఫ్రెండు. సాయంత్రం పార్కులో కలవాలా, సినిమాకి వెళ్ళాలా అన్న విషయం మీద పావుగంటా, ఏ చీర కట్టుకుని రావాలా అన్న విషయం మీద పావుగంటా చర్చించుకున్న తరువాత తిరిగి ప్రార్థన దగ్గిర కొచ్చింది.
ఈ లోపులో ప్రార్థన చుక్కచుక్కగా వస్తున్న రక్తాన్ని ఆపటానికి చేతి రుమాల్తో చాలా అవస్థపడాల్సి వచ్చింది. రక్తం క్లాట్ ఆపటానికి దాదాపు ఇరవై నిమిషాలు పట్టింది.
లోపలికి వచ్చిన నర్సు తను చెయ్యవలసిన రెండు పరీక్షల్లో ఒకటి మాత్రమే చేశానని గుర్తొచ్చి నాలుక్కర్చుకుని, పాప చేతిని తీసుకొని చూసింది. సూదితో పొడిచినచోట మామూలుగానే వుంది.
ప్లాస్టిక్ గొట్టం పక్కన పడేసి... మళ్ళీ రెండో పరీక్షకోసం ఇంకోసారి గుచ్చటం ఎందుకని, 'బ్లడ్ క్లాటింగ్ టైమ్!' అని వున్న చోట... 'నాలుగు నిముషాలు' అని వ్రాసి, రిపోర్టు తీసుకెళ్ళి డాక్టరుకి అందించింది.
డాక్టర్ రాబర్టుసన్ రిపోర్టు చేతుల్లోకి తీసుకొని పరిశీలించాడు.
బ్లడ్ క్లాటింగ్ టైమూ, బ్లడ్ బ్లీడింగ్ టైమూ, విత్ సెల్ కౌంట్ ఈజ్నోఫీల్ గ్రాన్యులోసైటిస్...
రిపోర్టు జూనియర్ డాక్టరుకి అందజేస్తూ "ఓ.కే." అన్నాడు.
2
ప్రొద్దున్న ఆరింటికే ఆస్పత్రి చైతన్యాన్ని సంతరించుకుంది. ఇద్దరు నర్సులు హడావుడిగా తిరుగుతున్నారు. నర్స్ రిసెప్షన్ కౌంటర్ వెనుకనున్న ఆఫీసు నుంచి ప్రార్థన తాలూకు కేస్ షీటు తీసుకుని థియేటర్ లోకి వెళుతూంది. ప్రార్థన తాలూకు బ్లడ్ రిపోర్టు, బ్లడ్ క్లాటింగ్ టైమ్ (రక్తస్రావం ఆగటానికి పట్టేసమయం), రక్తం ఏ గ్రూపుకి చెందిందీ వగైరా అంశాలున్న రిపోర్టు అది.
ఆకాశం కొద్దిగా మేఘావృతమై వుంది. సూర్యుడు ఇంకా తూర్పునుంచి పూర్తిగా బయటకి రాలేదు.
అత్యవసరం అయితే తప్ప అంత తెల్లవార్నే ఆపరేషన్ చెయ్యటం ఆ ఆస్పత్రికి కొత్త అవటంవల్ల కాస్త కొత్తగా వుంది తప్పితే మిగతా అంతా మామూలుగానే సాగిపోతూంది.
డాక్టరు రాబర్టుసన్ అయిదున్నరకే తన సామాను తీసుకుని ఇటునుంచి ఇటే విమానాశ్రయానికి వెళ్ళిపోవటానికి హోటల్ ఖాళీచేసి వచ్చేసేడు.
పావు తక్కువ ఆరింటికి ప్రార్థనని తీసుకొని భార్గవ, వసుమతి వచ్చారు. రాత్రి నుంచీ ఏమీ తినకపోయినా ప్రార్థన హుషారుగానే వుంది. టాన్సిల్స్ ఆపరేషన్ అయిపోతే యెన్ని ఐస్ క్రీములు తిన్నా పర్లేదని తండ్రి చెప్పాడు. ఆమె ఐస్ క్రీము అంటే పడి ఛస్తుంది. కానీ ఎప్పుడు తిన్నా జలుబు చేస్తుంది. దానికి కారణం టాన్సిల్సేనట. అందుకే ఈ ఆపరేషన్ అంటే సహజంగా వుండాల్సిన భయం లేకపోగా, ఎప్పుడు అవుతుందా అని తొందరగా వుంది.
ప్రార్థన రాగానే, ఆమెని తీసుకుని వెళ్ళి, ఒక నర్సు మొట్టమొదట స్టెరైల్ వాటర్ తో నోటిని శుభ్రం చేసింది.
ఈ లోపులో నర్సు ప్రార్థన తలని కొద్దిగా వెనక్కి వంచి, కళ్ళ మీద దూదివుంచి బ్యాండేజి కట్టింది. పేషెంట్ ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళగానే అక్కడి వాతావరణాన్నీ లైట్లనీ, మాస్కులు కట్టుకున్న డాక్టర్లనీ, కత్తుల్నీ చూసి ఒక్కసారిగా 'షాక్' తగలకుండా కళ్ళకి బ్యాండేజి.
"పడుకుంటావా?"
ప్రార్థన తలూపి, వెల్లకిలా పడుకుంది.
తరువాత చక్రాలు కదులుతున్న చప్పుడు. స్ట్రెచర్ తోసుకు వెళుతూంటే పాపకి గమ్మత్తుగా వుంది. స్ట్రెచర్ మలుపు తిరగటం తెలుస్తూంది. ఒక్కసారి చల్లటిగాలి తగిలింది. రూంలోంచి వరండాలోకి వచ్చినట్టూ గ్రహించింది. ఆపరేషన్ గది తలుపులు తెరుచుకోవటం తెలుస్తూంది. స్ట్రెచర్ మళ్ళీ ఇంకో మలుపు తిరిగింది.
అకస్మాత్తుగా కళ్ళమీద వెయ్యి కాండిల్స్ లైట్లు నాలుగైదు పడటంతో ఒక కొత్త వాతావరణంలోకి ప్రవేశించినట్టూ మార్పు వచ్చింది. అదోరకమైన మందుల వాసన. బ్యాండేజీ సందులోంచి లైటు కిరణాలు సన్నటి సూదుల్లాగా కనపడుతున్నాయి. తిరుగుతున్న వజ్రంమీద లైటు పడినట్టూవుంది. కుడికన్ను క్రిందనుంచి కొద్దిగా కనిపిస్తూంది. ప్రార్థన దొంగతనంగా తల కొద్దిగా పైకెత్తి చూసింది. మూతికి గుడ్డ కట్టుకొని రాబర్టుసన్ అంకుల్ గమ్మత్తుగా కనపడ్డారు. అంతలో ఒక చెయ్యి వచ్చి ఆమెని సరీగ్గా పడుకోబెట్టింది. సన్నటి స్వరంతో ఎవరో ఏదో అడుగుతున్నారు. స్త్రీలు కత్తులు ఒకదాని కొకటి తగిలి, రాపిడి అయిన ధ్వని.
రాబర్టుసన్ దగ్గిరకొచ్చి అడిగాడు. "హౌఆర్యూ బేబీ".
"బ్లయిండ్" అంది.
ఎప్పుడూ సీరియస్ గా వుండే అనస్తటీస్టు కూడా ఆ మాటలకి నవ్వాడు. ప్రార్థన దగ్గిరకొచ్చి "ఇప్పుడు నీకో ఇంజెక్షన్ ఇస్తాను పాపా! ఓ.కే..." అన్నాడు.
"ఊఁ" అంది ప్రార్థన.
అతడు తన చెయ్యి అతడి చేతుల్లోకి తీసుకోవడం తెలుస్తూంది. ఒక్కసారిగా చురుక్కుమని మంట. ఏదో లోపలికి గుచ్చుకున్నట్టూ... అదృష్టవశాత్తూ వీన్ మొదటిసారే దొరికింది.
"నొప్పిగా వుందా?"
"ఊహు. లేదు".
"అస్సలుండదు".
ప్రార్థన మాట్లాడలేదు.
"నీకు డాడీ అంటే ఇష్టమా? మళ్ళీ అంటేనా?"
"డాడీ అంటే ... ఉహూ.. కాదు. నిన్న రాత్రినుంచీ మమ్మీ అంటే".
"ఏం నిన్న రాత్రి ఏమయ్యింది?"
"మమ్మీ నన్ను డాన్స్ కి తీసు ... కెళ్ళింది"
"నిన్న డాన్సు బాగా జరిగిందా?"
"బాగా ... జరిగిం..ది"
"డాన్స్ ఎవరు చేసేరు నువ్వేనా?"
"ఆఁ .. నేనే... చేశా...ను"
"చప్పట్లు కొట్టారా?"
"కొట్టారు, బా..గా..కొ...ట్టా...రు"
"ఏమిటి?"
"చప్ప...చ..చ.." అంతే.
- ఆమె ఆపు చెయ్యటంతో థియేటర్ లో గాఢమైన నిశ్శబ్దం ఒక క్షణం రాజ్యమేలింది.