రెండు
రాత్రి పన్నెండింటికి... చీకటి దట్టంగా అలుముకొని వున్న ఆ ప్రదేశంలో ఒక చిన్న కదలిక - చెత్తా చెదారం మధ్యనుంచి అటూ ఇటూ చెదిరి - ఒక చిన్న తల బయటికి వచ్చింది.
ఆ తర్వాత ఆ చెత్తలోంచి దాని శరీరం పూర్తిగా బయటికి వచ్చింది. అప్పుడు దాని ఆకారం చూస్తే ఎవరికైనా వళ్ళు గగుర్పొడుస్తుంది. చిన్నసైజు బావురుపిల్లిలా వుందది. శరీర పరిమాణానికి ఏ మాత్రం పొందికలేని చిన్నతల- మధ్యలో సన్నగా చీలిన నోరులాంటి ప్రదేశం నుంచి పై పదవి కండరం కాస్త పైకి వెళ్ళగానే కనపడే రంపంలాంటి కోరలు- ఇవి కాదు భయపెట్టేవి ... దాని కళ్ళు.
అప్పుడే ఎగరటం నేర్చుకుంటున్న పక్షిపిల్ల ఒకటి, కొత్తగా నడక నేర్చుకున్న ఉత్సాహంలో గాలిలో ఎగిరి తల్లిదండ్రుల్నించి దూరమయి రెక్కల్లో శక్తి వున్నంతవరకూ ఎగిరి ఎగిరీ- జాలిగా అరుస్తూ ఆకాశంలోంచి టప్ మని నేలకు జారిపోయి ఆ కుప్పమీద పడింది.
ఆ నిశ్శబ్దంలోంచి తిరిగి చిన్న కదలిక.
అపాయాన్ని పసిగట్టిన పక్షిపిల్ల లేవలేక కదల్లేక నిస్సహాయంగా చూసింది.
కసుక్కుమంటూ రెండు పళ్ళు దాని లేత శరీరంలోకి దిగాయి.
ఆ శరీరం కొద్దిసేపు కొట్టుకోవటానికి విఫల ప్రయత్నం చేసి, తర్వాత అచేతనమయింది.
* * *
"ఎప్పుడు పెట్టుకుందాం ఆపరేషన్?" రాబర్ట్ సన్ కుర్చీలోంచి ముందుకు వంగుతూ అన్నాడు.
భార్గవ వాచీ చూసుకొని, "ఇరవై ఎనిమిదో తారీఖునైతే బావుంటుంది" అన్నాడు.
"గుడ్. బైదిబై నీ మ్యారేజి ఎప్పుడన్నావ్?"
"పదో తారీఖు"
"సారీ, అంతవరకూ వుండలేకపోతున్నాను".
"నేనే సారీ చెప్పాలి నీకు. సరదాగా మా దేశం వచ్చిన వాడికి స్వార్థంతో పని చెపుతున్నాను. ఒకోసారి నా ఆలోచన్లు నాకే సిల్లీగా అనిపిస్తాయి".
"పదిహేను నిముషాల ఆపరేషన్ కోసం నువ్వు నన్నేదో ఇబ్బందిలో పెట్టినట్టు మాట్లాడతావేం? ఇక ఆ సంగతి ఆలోచించటం మానేసి, మనకు కావల్సిన ఆపరేషన్ థియేటర్ చూడు".
"చూసేను. గ్రాండ్స్ నర్శింగ్ హోమ్, ఈ ఊళ్ళోకెల్లా అధునాతన మైనది. ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం బుక్ చేసేను".
"గుడ్" అంటూ లేచాడు రాబర్ట్ సన్. భార్గవ కూడా లేచి నిలబడ్డాడు. వయసు, విజ్ఞానం తెచ్చిన హుందాతనం, దానికితోడు విశిష్టమైన పొడవూ. రాబర్ట్ సన్ ప్రక్కనే పొడవైన భార్గవ పొట్టిగా కనపడుతున్నాడు.
"గుడ్, ఒకరోజు టైము వుంటుంది కదా. వచ్చిన తరువాతే ప్రిలిమినరీస్ అవీ చూసుకుందాంలే..." ఇద్దరూ కారు దగ్గరకు చేరుకున్నారు. (ఆపరేషన్ కి ముందు చేసే పరీక్షల్ని ప్రిలిమినరీస్ అంటారు) షేక్ హాండిస్తూ రాబర్ట్ సన్ నవ్వాడు- "నాకే గమ్మత్తుగా వుంది. చాలా కాలం తర్వాత టాన్సిల్స్ ఆపరేట్ చెయ్యబోతున్నాను".
భార్గవ నవ్వలేదు. అతడికి మొహమాటంగా వుంది. ముందేదో హుషారులో మిత్రుడిని అడిగేసేడు కానీ ఇప్పుడు సిగ్గుపడుతున్నాడు- ప్రపంచంలోకెల్లా మొదటి ముగ్గురు ప్రముఖ సర్జెన్లలో ఒకరైన రాబర్ట్ సన్ ని ఇంత చిన్న పనికి ఆహ్వానించటం...
* * *
"ఆపరేషన్ అయ్యాక ఆ అమెరికన్ డాక్టర్ రెండ్రోజుల్లో వెళ్ళిపోతే ఫర్లేదా" అనుమానం వెలిబుచ్చింది వసుమతి.
"ఆపరేషన్ అయ్యాక పదినిముషాల్లో వెళ్ళిపోయినా ఫర్లేదు. పాపకి ఐస్ క్రీం తినిపించి యింటికి తీసుకొచ్చెయ్యొచ్చు. అంత చిన్న ఆపరేషన్ యిది".
"ఐస్ క్రీం ఎందుకు?"
"గొంతులో రక్తం తొందరగా అరికట్టబడటానికి"
వసుమతి ఏదో చెబ్దామనుకొని మళ్ళీ మానేసి, "ఆపరేషన్ ముందు రోజంతా ఆస్పత్రిలో వుండాలా?" అని అడిగింది.
"అసలు దానికి ఆపరేషన్ అన్నంత పెద్ద పేరే అనవసరం. ముందురోజు మామూలుగా స్కూలుకి వెళ్ళవచ్చు కూడా".
"మీరు ముందురోజే కాంప్ నుంచి వచ్చేస్తారుగా"
"వచ్చేస్తాం. ఏం?"
వసుమతి ఊరిస్తున్నట్లుగా "మీరొచ్చిన రోజు చెప్తాను. ఆ సాయంత్రం ఏ ప్రోగ్రాం పెట్టుకోకండి" అంది.
"ఏమిటి?"
"ఉహు- తర్వాత చెప్తానన్నాగా. మీరు అసలు వూహించలేరు, అంతా నేనే స్వయంగా చేస్తున్నాను. మీరు చూస్తే అదిరిపోతారు".
భార్గవ నవ్వి "నీ నోటివెంట ఆ మాట వినటం చాలా గమ్మత్తుగా వుంది" అన్నాడు.
ఆమె అర్థంకాక, "ఏ మాట" అంది.
"అదిరిపోవటం... అన్నమాట. అది స్త్రీ శరీరానికి సంబంధించిన మాట అనీ, సాధారణంగా మొగవాళ్ళే ఉపయోగిస్తారనీ అనుకుంటున్నాను"
ఆమె సిగ్గుపడి, చిరుకోపంతో "మీకు మీ సోమశేఖరం మాటలు బాగా వంటబట్టినట్టున్నాయే" అంది. భార్గవ నవ్వేడు. ఆమె అతడి చేతిమీద చెయ్యివేస్తూ "మర్చిపోకండేం. మళ్ళీ ఆ సాయంత్రం ఏ ప్రోగ్రామో వుందని దాటెయ్యవద్దు" అంది.
"అంత ముఖ్యమైనదా 'నీ' ప్రోగ్రాం".
"ఆఁ మనిద్దరి జీవితాల్లోనూ చాలా ముఖ్యమైనది".
"ఏమిటి"
"ఉహూ, ఇప్పుడు చెప్పను".
* * *
ఇరవై ఏదో తారీఖు.
ప్రొద్దున్న పదింటికి.
గ్రాండ్స్ నర్శింగ్ హోమ్ లో...