Previous Page Next Page 
ప్రార్థన పేజి 15


    కొద్దికొద్దిగా ఇస్తూన్న పెంటథాల్ మందుని ఆపుచేసి, సూది శరీరానికి అలాగే వుంచి సిరంజి తీసేశాడు.

 

    బ్యాండేజి పైకెత్తి, కనుగుడ్డు లోపలి భాగం పరిశీలించి, పాప పూర్తిగా మత్తులోకి వెళ్ళిపోయిందని గ్రహించాడు.

 

    అనస్తటీస్టు చేసే ఈ పనులని రాబర్టుసన్ మౌనంగా గమనిస్తున్నాడు.

 

    (చాలామంది అనుకుంటారు. మత్తు ఇంజెక్షన్ ఇవ్వగానే మనిషికి స్పృహ తప్పుతుందనీ- ఆపరేషన్ మొదలవుతుందనీ! సినిమాలు తప్పుదారి పట్టిస్తున్న అభిప్రాయం ఇది!!! స్పృహ తప్పటం వేరు, మత్తెక్కటం వేరు. శరీరం మత్తెక్కకపోతే స్పృహ తప్పినా బాధ తెలుస్తుంది)

 

    సూదికి మరో సిరెంజి అమర్చి పాప శరీరంలోకి స్కాలిన్ ఇంజెక్ట్ చేసేడు.

 

    ప్రార్థన శరీరం భూకంపం వచ్చినట్టూ రెండు క్షణాలపాటూ ప్రకంపనాలకి లోనై అటూ ఇటూ కదిలి, ఒక్కసారిగా పక్షవాతం వచ్చినట్టూ చచ్చుబడి పోయింది. కండరాలన్నీ పనిచెయ్యటం మానేసి, ఛాతి కండరాలు కూడా కదలకపోవటంవల్ల ఆమె వూపిరి ఆగిపోయింది. ఆపరేషన్ లో ఇది రెండో అంశం. శరీరాన్ని 'పారలైజ్' చెయ్యటం!

 

    అనస్తటీస్టు చేతులు మిషన్ కన్నా వేగంగా కదిలినయ్. ఊపిరి ఆగిపోయిన తర్వాత రోగిని ఆ స్థితిలో ఎక్కువసేపు వుంచకూడదు.

 

    చేతినుంచి స్కాలిన్ సిరెంజిని తీసేసి, అదే సూదికి గ్లూకోజ్ సెలైన్ అమర్చాడు. ఆమె శరీరంలోకి ఆ ద్రవం సవ్యంగా ప్రవహిస్తూందని సంతృప్తి పడ్డాక, వేగంగా కదిలి ఎండో-ట్రాకియల్ ట్యూబ్ ని చేతుల్లోకి తీసుకొని, మరొక చేత్తో ఆమె నోటిని వేళ్ళతో తెరిచాడు. గొట్టాన్ని ఆమె నోట్లోకి కొద్దికొద్దిగా జొనిపాడు. స్కాలిన్ ఇంజక్షనువల్ల దృఢత్వం కోల్పోయిన ఆమె కండరాలు ఆ గొట్టానికి వెంటనే దారి నిచ్చాయి. గొంతుగుండా గొట్టం లోపలికి వెళ్ళి ఊపిరితిత్తుల ద్వారానే చేరుకుంది. ఆ గొట్టపు రెండో చివర బాయిల్స్ ఆపరేషనుకి అమర్చబడివుంది.

 

    అతడు దాన్ని ప్రారంభించగానే ఆక్సిజన్, నైట్రాస్ ఆక్సైడ్ ల మిశ్రమ వాయువు సన్నటి ఒత్తిడితో ఆమె ఊపిరితిత్తుల్లో కృత్రిమంగా ప్రవేశించి, తిరిగి శ్వాస ప్రారంభమయింది.

 

    ఈ ఆక్సైడే శరీరానికి స్పర్శజ్ఞానాన్ని పోగొట్టేది. అది ఊపిరితిత్తులలోకి ప్రవహిస్తున్నంతకాలం పేషెంట్ మత్తులోనే వుంటుంది. దీనితో పాప శరీరం ఆపరేషన్ కు సిద్ధమయింది.

 

    అన్నీ సవ్యంగా వున్నాయో లేవో చూసుకుని, బి.పి. ఆపరేటస్ ని మరోమారు పరీక్షించుకుని, అనస్తటీస్టు పక్కకు తొలగి, సర్జెనువైపు తిరిగి 'రెడీ సర్' అన్నాడు.

 

    అప్పుడిక సర్జెను పని ప్రారంభం అయింది.

 

    ఒక నర్సువచ్చి పేషెంట్ శరీరాన్నంతా ఆకుపచ్చటి దుప్పటితో కప్పేసింది. కేవలం ముఖం దగ్గిర మాత్రం నోరు కనపడేటట్టూ రంధ్రం వుందంతే. అక్కడున్న వాళ్ళందరూ ఆకుపచ్చటి డ్రస్ లోనే వున్నారు. రక్తం ఎర్రరంగు కొట్టిచ్చినట్టూ కనపడకుండా వుండటానికి ఆకుపచ్చరంగు దోహదం చేస్తుంది. లేకపోతే ఆపరేషను చేస్తున్నప్పుడు చిందే ఎర్రటిరక్తం ఎంతటి డాక్టరునయినా మానసికంగా బలహీనుణ్ని చేస్తుంది. ఆకుపచ్చమీద ఎరుపు నల్లగా కనపడుతుంది.

 

    రాబర్టుసన్ ఒక క్షణం పాప నోటిని పరీక్షించి, స్పిరిట్ తో ముందు చుట్టూ శుభ్రం చేశాడు. ట్యూబ్ ని కాస్త పక్కకి తొలగించి, నోటిలో గాగ్ ని పెట్టాడు. నాలుకని అది క్రిందకు నొక్కి వుంచి, కొండనాలుక ఇరువైపులా స్పష్టంగా కనపడేటట్టూ చేస్తుంది.

 

    అసిస్టెంట్స్ ఇద్దరూ అతడు చేసేపనిని జాగ్రత్తగా గమనిస్తున్నారు. చాలా సున్నితంగా, కానీ వేగంగా, చురుగ్గా కదిలే అతడి చేతివేళ్ళ సామర్థ్యాన్ని తమ స్మృతుల్లో భద్రపర్చుకుంటున్నారు. రాబర్టుసన్ ఒక్కసారి గొంతు లోపలిభాగాన్ని పరిశీలించి, చేతిలోకి వల్ సెల్లవమ్ ని తీసుకొని దాంతో పాప గొంతులో కుడివైపు ఉబ్బెత్తుగా వున్న మొదటి టాన్సిల్ ని పట్టుకుని కాస్త ముందుకు లాగాడు. తాటికాయ నుంచి చూపుడువేల్తో తోస్తే ముంజె బైటికి వచ్చినట్టూ టాన్సిల్ ముందుకు వచ్చింది.

 

    నాలుక మీద నుంచి కత్తి గొంతు దగ్గరికి తీసుకువెళ్లి సుతారంగా దాన్ని కోసేడు.

 

    మొట్టమొదటి శత్రు సైనికుడు చీకట్లోంచి బయటికొచ్చినట్టూ మొదటి రక్తపుచుక్క బయటకొచ్చింది.

 

                                                             *    *    *

 

    స్... స్ స్ స్

 

    ఎలక్ట్రికల్ బ్లడ్ సక్కర్ సన్నటి శబ్దం చేస్తూంది.

 

    రాబర్టుసన్ కుడిచేత్తో దాన్ని పాప నోటి లోపలకు దూర్చాడు. ఆ గొట్టంలోంచి గాలి వేగంగా లోపలికి పీల్చుకోబడుతుంది. దాన్ని కొండనాలుక పక్కకు తీసుకువెళ్ళగానే, బయటకొచ్చిన రక్తమంతా దాని గుండా గొట్టంనుంచి బయటికి వెళ్లిపోయింది.

 

    అతడు గొట్టాన్ని నర్సుకు అందించి, నైఫ్ తీసుకొని, యింకో చేతిలో వల్ సెల్లమ్ మరోమారు తీసుకొని టాన్సిల్ ని పట్టుకోబోయాడు.

 

    ఈ లోపులో తిరిగి రక్తం బయటకొచ్చింది.  

 

    అసిస్టెంట్స్ ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. టాన్సిల్ కత్తిరించకుండానే అతడు సక్కర్ ఉపయోగించటం వారికి కొత్తగా వుంది. అతడూ అలా చేసేవాడు కాదు- కానీ అనుకున్న దానికన్నా ఎక్కువగా రక్తం బయటకు వచ్చింది.

 

    అతడు ఈసారి దాన్ని పట్టించుకోకుండా వల్ సెల్లమ్ ని కొద్దిగా వెనక్కి లాగి, దాంతోపాటూ వచ్చిన టాన్సిల్ ని కత్తితోకోసి, స్టిక్కర్ ఉపయోగించి బయటకు లాగేసి బేసినులో పడేసేడు.

 

    పాప అనారోగ్యానికీ, మాటిమాటికీ వస్తున్న జ్వరానికీ కారణం అనుకుంటున్న చిన్న కండరం ముక్క బేసినులో తేలుతూంది.

 

    అసిస్టెంట్స్ ఇద్దరూ తేలిగ్గా గాలి పీల్చుకున్నారు.

 

    రాబర్టుసన్ మరోమారు సక్కర్ తీసుకుని ముందుకు వంగాడు. అడ్డుగా వున్న రాయి తొలగించగానే నూతిలోంచి జలపడినట్టూ - పాప గొంతులో కండరం తొలగించిన చోటునుంచి రక్తం ఉబికి ఉబికి వచ్చింది.

 

    సక్కర్ ద్వారా దాన్ని బయటికి పీల్చేసి, పొడి అయిన గొంతు గాయం దగ్గిర దూదిపెట్టి, గట్టిగా ఒత్తి పట్టుకున్నాడు.

 

    పక్కనున్న నర్సులూ, అసిస్టెంట్లూ రిలాక్స్ అయ్యారు. కుడివైపు ఆపరేషను దాదాపు అయిపోయినట్టే. అనస్తటీస్టు పాప గుండెల్లోంచి వెళుతున్న గాలిని మరొకసారి పరీక్షించుకొని సంతృప్తి చెందాడు.

 

    ఆ తర్వాత ఒత్తి పట్టుకున్న దూదిని గాయం దగ్గిర్నుంచి తొలగించి బేసిన్ లో పడేసేడు రాబర్టుసన్.

 

    మరో టాన్సిల్ ని పరీక్షించటం కోసం ఈసారి ఎడమవైపుకు వంగబోతూ, గొంతుని చూసి అదిరిపడ్డాడు. అతడు దూది తీసీ తియ్యగానే గొంతులో జల వూరినట్టూ మళ్ళీ రక్తం బయటకొచ్చి నోరంతా ఎర్రగా అయింది. మళ్ళీ సక్కరు ఉపయోగించి శుభ్రం చేసేడు. సెలైన్ లో ముంచిన దూదిని గాయం దగ్గర పెట్టి బలం అంతా ఉపయోగించి గట్టిగా వత్తి పట్టుకుని రక్తం రాకుండా నిరోధించాడు. ఈసారి మూడు నాలుగు నిముషాలు అలానే వుంచి మళ్లీ తీసేసేడు. దూది వుంచినంతసేపూ బాగానే వుంటుంది- తీసెయ్యగానే స్రవిస్తుంది.

 Previous Page Next Page