"నా మొహం. నాకు తెలివేమిటండీ. ఏదో చదివాను. మనసులో నాటుకుపోయింది."
సాహిత్యం సమాజాన్ని మార్చలేకపోవచ్చు. కానీ ఎక్కడో ఎవరో మనిషిని తప్పక ప్రభావితం చేస్తుంది.
ఉదాహరణ ఎక్కడో లేదు. తన భార్యే తన ఉనికికి భంగం రానంతవరకూ మనిషి పక్కవాడి అక్రమాల్ని భరిస్తాడని చెప్పిన చిన్న కథ-
తన భర్త నిజాయితీని మెచ్చుకొనేటంతగా ఆవిడమీద ప్రభావం చూపించింది.
"ఏమిటి మళ్ళీ ఆలోచనల్లో పడ్డారు?"
ఆయన నవ్వి, "అసలు ఈ ఆలోచనంతా దేనిగురించి వచ్చిందో తెలుసా? విద్యాధరి తండ్రి గురించి చెప్పింది. నువ్వు గమనించావా? ఆ అమ్మాయి చెప్పినదాంట్లో నీకేం కనిపించింది?" అని అడిగాడు.
"ఆ అమ్మాయినెవడో పాపం భలే భయపెట్టేశాడండి. అలాంటివాళ్ళని ఏం చేసినా పాపం లేదు-"
ఆయన అనుకున్నది అదికాదు. విద్యాధరి చెప్పినదాంట్లో in between lines ఆయన చాలా వినగలిగాడు. ఆ అమ్మాయి అదోరకమైన, మానసికమైన ఫోబియాతో బాధపడుతూంది. ఆ ఫోబియా 'భయం' కాదు. నిరంతరమైన అనుమానం.... బహుశా దీనికి కారణం ఆమె ఇంటి వాతావరణం కావచ్చు. తల్లిదండ్రులకి తరచు దెబ్బలాట జరిగే ఇళ్ళల్లో.... మహిళామండలిలో రోజుకి పధ్నాలుగు గంటలు గడిపే తల్లులున్న ఇంట్లో ఇలా తయారవుతారు. అయినా ఆమె తల్లి చిన్నతనంలోనే చచ్చిపోయింది. కాబట్టి ఈ రెండూ కారణాలయి ఉండవు.
విద్యాధరికి ప్రతీదాన్ని నిశితంగా పరిశీలించే గుణం వున్నదని ఆయన మొదట్లోనే గ్రహించాడు. బహుశ ఈ అమ్మాయి తండ్రిని బాగా గమనిస్తూ వుండి వుండాలి. తండ్రి ప్రవర్తనవల్ల ఏహ్యభావాన్ని కలిగించుకుని వుండాలి. ఆ తండ్రి యింటికి వచ్చేవాళ్ళందరూ ఎలాటివాళ్ళో ఆయనకు తెలుసు. జార్జెట్ చీరెల చిరునవ్వులు- సీసాల బహుమత్తులో రచనల ప్రచురణకోసం అర్థింపులూ.... చిన్నతనంలో ఆమె ఇంటి ప్రపంచమంతా ఈ రకమైన కృత్రిమత్వంతో నిండివుండి వుంటుంది. మొత్తం మనుష్య జాతిమీదే ఆమెకి అపనమ్మకం ఏర్పడి వుంటుంది. ఈ రకమైన సోషల్ అంత్రోపాలజి ఆమెకి ఏవగింపు కలగజేసి వుంటుంది. మనిషికీ మనిషికీ మధ్య బాంధవ్యం కేవలం స్వార్థం తప్ప మరేది లేదన్న బలమైన ముద్ర ఆమెమీద చిన్నతనంలోనే (తన ఇంటి పరిస్థితుల్ని చూసి) పడి వుంటుంది.
ఆయనకి ఆ అమ్మాయిపట్ల జాలివేసింది.
ఇలాటి ఆప్యాయతారాహిత్యంలో పెరిగిన వాళ్ళు ఎవరితోనూ సుఖపడలేరు. ప్రేమకన్నా ముందు, దాని పునాదిపట్ల అనుమానం ఎక్కువగా వుంటుంది. ఏదైనా విస్ఫోటనం జరిగి వారికి ఎవరో ఒక మనిషి పరిచయమై- నిజమైన ప్రేమంటే ఏమిటో నిరూపిస్తే తప్ప.... లేకపోతే ఈ అంతర్ సంఘర్షణ జీవితాంతం వారిని వదలిపెట్టదు. ఒక్క విద్యాధరి సంగతేమిటి? ఆలోచిస్తుంటే తనకే అనుమానం వస్తుంది.
"ఏవోయ్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని అడుగుదామనుకున్నాడు. ముప్పై సంవత్సరాల కాపురం తరువాత యిప్పుడా ప్రశ్న అడుగుతే వచ్చే పరిణామాల్ని తల్చుకుని భయపడి మానేశాడు. ఆయనకి ఫిడ్లర్ ఆన్ ది రూఫ్ లో పాట గుర్తొచ్చింది.
"నీవు విప్పిన బనీను తడిపి ఆరేశాను.
నీ పిల్లల నాప్ కిన్ లు ఉతికి శుభ్రం చేశాను.
నువ్వు తాగొచ్చినప్పుడు మౌనంగా మేజోళ్ళు విప్పాను.
నీకు జ్వరం వస్తే నేను భోజనం మానేశాను.
నీకిష్టం లేదనీ నేను పచ్చ నైట్ గౌను వేసుకోవటం మానేశాను.
మూడుసార్లు అబార్షనయినా నీ కోసం నాలుగోసారి మొగపిల్లాడ్ని కన్నాను.
ఇంత చేస్తే - ఇప్పుడు అడుగుతావా-
"Do you love me' అని....."
అంతలో ఆయన భార్య అంది- "విద్య అంటే గుర్తుకొచ్చింది. ఆ సినిమాహాల్లో అల్లరిపెట్టిన అబ్బాయి కోసం వెళ్ళిన విశ్వనాథం ఏమయ్యాడండీ?"
"అవును, కనీసం ఫోన్ కూడా చెయ్యలేదేమిటి? బహుశా తీసుకెళ్ళి లాకప్ లో పడేసి వుంటాడు. రాత్రి డిస్టర్బ్ చేయటం ఎందుకులే అనుకుని వుంటాడు. రేప్రొద్దున్న వస్తాడేమోలే-"
అన్నాడేగానీ ఆయనకెందుకో అనుమానంగా వుంది.
విశ్వనాథం అలా చెయ్యడే-
* * *
విశ్వనాథం చాలా కోర్కెలున్న మనిషి. డిపార్టుమెంటు లోతు తెలిసినవాడు. అది బంగారు గని తెలుసు. ధర్మారావు దగ్గర కొత్తగా వచ్చాడు. ఆటలు సాగటంలేదు. అయినా కాకా పట్టటం మానలేదు. "కమీషనర్ మనిషి" అని నలుగురికీ తెలిస్తే చాలు, పనులు జరిగిపోతాయి. అప్పటినుంచీ వెంటే తిరుగుతున్నాడు. ఆ దంపతులతోపాటు సినిమాకి వచ్చాడు.
ఇంటర్వెల్లో గొడవ జరిగింది.
దానిపట్ల కమీషనర్ ఇంటరెస్ట్ చూపించటమే కాకుండా, ఆ కుర్రవాడెవడో కనుక్కురమ్మని పంపటంతో రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది. ఆ కాలంలో చూసి రమ్మంటే కాల్చివచ్చాడు అంజనేయుడు.ఇప్పుడు కనుక్కురమ్మంటే విరుచుకు వెళ్ళాలనుకున్నాడు విశ్వనాథం.
అతడు విద్యాధరి దగ్గరికి వెళ్ళేసరికి జనం గుమిగూడారు. ఆ గుంపులో అనుదీప్ అతనికి కనపడలేదు. చారలషర్టు కోసం వెతికాడు. లేదు.
అంతలో అది గుమ్మం దాటుతూ కనిపించింది. అటు పరుగెత్తాడు. అక్కడికి వెళ్ళేసరికి రోడ్డుమలుపు తిరుగుతూ కనిపించింది.
"ఎయ్ మిష్టర్ ఆగు" అని అరిచాడు.
వినపడనట్టే అతడు నడక సాగించాడు. వినపడిందని యస్సైకి తెలుసు. ఒళ్ళు మండిపోయింది. "ఇంతకు ఇంతా అనుభవిస్తావ్ రా నా కొడకా" అనుకుంటూ వేగం పెంచాడు.
రెండు నిమిషాల్లో అతడిని పట్టుకున్నాడు.
"మిష్టర్ నీ పేరు?"
"ఎందుకు?"
"తిరుగు ప్రశ్నలు కాదు. సమాధానం చెప్పు."
"అనుదీప్"
"నాతో రా"
"ఎక్కడికి?
"తిరుగు ప్రశ్న వేస్తే నాకు వళ్ళుమండుతుంది. రా..."
ఇద్దరూ సినిమాహాలు దగ్గరికి వస్తూంటే కమీషనర్ కార్లో విద్యాధరి ఎక్కటం, కారు కదలటం కనిపించింది.
ఆ అమ్మాయి కమీషనర్ గారికి కావల్సిన అమ్మాయి అని తెలుసుకున్నాడు. ఎంత కావల్సింది కాకపోతే తనని స్వయంగా పంపిస్తారు -సినిమా పూర్తిగా చూడకుండా మధ్యలో ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతారు?
అటువంటి కమీషనర్ గారి ప్రాపకం సంపాదించటానికి ఇంతకంటే మంచి ఛాన్సు ఏముంది? ఆ అమ్మాయిని సినిమాహాల్లో ఇంతగా వేధించిన ఈ మనిషికి తగిన గుణపాఠం చెప్తే - కనీసం ఆ అమ్మాయి మెచ్చుకుంటుంది. దానిద్వారా ఆయన ప్రాపకం లభిస్తుంది.
వెళ్ళిపోతున్న కారునుంచి దృష్టి మరల్చి "పోలీస్ స్టేషన్ కు పద" అన్నాడు.
"ఎందుకు" అని అడిగాడు అనుదీప్.
"నీ పెళ్ళి చేయటానికి" మనసులో అనుకుని, పైకి "... నీతో మాట్లాడాలి, ఆ సినిమాహాల్లో అమ్మాయి గురించి" అన్నాడు.
విద్యాధరి ప్రసక్తి రాగానే మారుమాట్లాడకుండా అనుదీప్ అతడిని అనుసరించాడు.
విశ్వనాథం గర్వంగా నవ్వుకున్నాడు. దాదాపు పావుగంట నడిచి ఇద్దరూ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. విశ్వనాథం ఆలోచించాడు. ఆ సమయంలో కమీషనర్ ఇంటికి ఫోన్ చేసి ఇతడిని పట్టుకున్నానని చెప్పటం అనవసరం. ఎవరో తెలిసిన అమ్మాయిని వీడు అల్లరి పెట్టబోతే తనని పంపించారు. ఆ అమ్మాయిని తమతోపాటు ఆ దంపతులు తీసుకువెళ్ళారు.
వీడిని తనే 'సరిచేసి' లాకపులో పడేస్తే రేపు ఆయన వచ్చాక ఆఫీసు టైమ్ లోనే చెప్పొచ్చు. ఆ అమ్మాయి ఆయనకి మరీ కావల్సిందైతే -వీడు ఆ అమ్మాయిని చాలా రోజుల్నుంచీ ఏడిపిస్తున్న వాడయితే ఏదో ఒక కేసు పెట్టి మూణ్ణెల్లు తోసెయ్యటం అంత కష్టమేమీ కాదు.
స్టేషను చేరుకున్నాక సెంట్రీని మంచినీళ్ళు తెమ్మని, తాగి "ఊ చెప్పు - ఆ అమ్మాయినేం చేశావు?" అని అడిగాడు అధికారం నిండిన స్వరంతో.
అప్పటివరకూ అనుదీప్ మౌనంగా వున్నాడు. ఇన్ స్పెక్టర్ రమ్మన్నప్పుడు మొదట్లో నాలుగైదు ప్రశ్నలు వేశాడంతే -తరువాత నిశ్శబ్దంగా అనుసరించాడు. ఈ ప్రశ్నకి సమాధానంగా, "ఏ అమ్మాయిని?" అని అడిగాడు.
విశ్వనాథం లాఠీతో బల్లమీద గట్టిగా కొడుతూ "మాదచ్చోద్ - ఏ అమ్మాయో కూడా తెలీదా?" అని అరిచాడు.
"నేనే అమ్మాయినీ ఏమీ చెయ్యలేదు."
"మరేం చెయ్యకుండానే ఆ అమ్మాయి హాలు కప్పు లేచిపోయేలా అరిచిందా?"
"ఏమైనా చేస్తేనే అమ్మాయిలు అరుస్తారని మీరు అనుకోవటం తప్పు. అఫ్ కోర్స్ - ఎక్స్ స్టసీతో ఏమీ చెయ్యకుండానే అమ్మాయిలు అరుస్తారనుకోండి. కానీ చాలాసార్లు ఏమీ చెయ్యకుండానే అరుస్తారు. ఉదాహరణకి బల్లి పడినప్పుడు - ప్రసవవేదన పడుతున్నప్పుడు - భర్త ఆలస్యంగా వచ్చినప్పుడు -"
"నోర్ముయ్, ఆడోళ్ళు ఎప్పుడెప్పుడు అరుస్తారు అని పాఠాలు చెప్పించుకోవటం కోసం కాదు నిన్నిక్కడికి తీసుకొచ్చింది. అవన్నీ మాకు తెలుసు-"
"ఏం తెలుసు మీకు? 'ఎక్స్ స్టసీ' అంటే ఏమిటో చెప్పండి చూద్దాం..?"
విశ్వనాథానికి తెలీదు. అతడి భార్యకూడా ఇన్నేళ్ళ దాంపత్య జీవితంలోనూ ఏనాడూ ఎక్స్ స్టసీతో అరవలేదు. ఆ విషయం కప్పెట్టి - "ప్రశ్నలడగాల్సింది నేను, నువ్వుకాదు అని ఇంతకు ముందొకసారి చెప్పాను" అన్నాడు.
"సరే - అడగండి".
"ఆ అమ్మాయి ఎన్నాళ్ళనుంచి తెలుసు నీకు?"
"ఎవరు? విద్యాధరా?"
"ఆ అమ్మాయి పేరు విద్యాధరి" అని విశ్వనాథానికి అప్పుడు తెలిసింది. "ఔను విద్యాధరే" అన్నాడు.
"గత ఏడు సంవత్సరాలుగా"
"ఏడు సంవత్సరాలనుంచీ వెంటపడి ఏడిపిస్తున్నావన్నమాట."
"లేదు. ఏడురోజుల్నుంచీ... కాస్త ఇటు అటుగా."
"సినిమాహాల్లో ఆమెని ఏం చేశావ్?"
"పొరపాటున 'సినిమా బావుంది కదూ' అన్నాను. అది నేను చేసిన తప్పు. బహుశా నేనా సినిమాకి దర్శకుణ్ణో, నిర్మాతనో అనుకుని వుంటుంది. భయంతో అరవటం ప్రారంభించింది."
"మిస్టర్, నీకిదంతా జోక్ గా వున్నట్టుంది" అని పోలీస్ వైపు తిరిగి, "వీడిని లాకప్ రూమ్ లోకి తీసుకువెళ్ళు" అని ఆజ్ఞాపించాడు. అనుదీప్ ని పోలీసు లోపలి గదిలోకి తీసుకువెళ్ళాక ఒకసారి వళ్ళు విరుచుకున్నాడు. మళ్ళీ మంచినీళ్ళు తాగాడు. అతడికి చాలా ఉత్సాహంగా వుంది. ఎప్పుడో గానీ ఇలాంటి ఛాన్స్ రాదు. చాలా కాలమైంది. చేతులు దురద పెడుతున్నాయి.
లాఠీ తీసుకుని లోపలికి వెళ్ళాడు.
"బయట నిలబడు" అని పోలీసుకి ఆజ్ఞ ఇచ్చి అనుదీప్ వైపు తిరిగాడు.
"నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు."
"నేను నిజం చెప్పనని అనటంలేదే? మీకే నిజం కావాలి? చెప్పండి."
"ఆ అమ్మాయిని ఏం చేశావ్?"
"మీ భార్య సుమతిమీద ఒట్టు. ఏం చెయ్యలేదు."
విశ్వనాథం అతడివైపు అనుమానంగా చూస్తూ "నా పెళ్ళాం నీకెలా తెలుసు?" అన్నాడు.