Previous Page Next Page 
ప్రేమ నక్షత్రం పేజి 13


    "కొంచెం" అతను నవ్వాడు.

 

    "పడుకోండి, నీరసంగా వున్నారు."

 

    అతను మళ్ళీ ఇందాకటిలా పడుకొని, ఆమె చేతిని తనచేతిలోకి తీసుకుని గుండెమీద వుంచుకుని, వ్రేళ్ళు నిమురుతున్నాడు.

 

    "శైలూ!"

 

    "ఊ."

 

    "చాలా......చాలా.......థాంక్స్."

 

    "దేనికి?"

 

    "ఎందుకంటే....." అతనేదో అనబోతున్నాడు.

 

    "థాంక్స్ చెప్పాలి కాబట్టి" ఆమె అనేసింది.

 

    అతను నవ్వాడు "కాదు."

 

    "మరి?"

 

    "నా ప్రాణం కాపాడావు కాబట్టి."

 

    "ఎంత పెద్దమాట! ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది.

 

    అతనాశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూస్తున్నాడు. ఎర్రబడ్డ ఆమె ముఖంలో ముక్కుపుడకలోని ఎర్రనిరాయి ఎంత అందంగా మెరుస్తోంది? అలావున్న ఆమె ముఖం ఎంత గొప్పగా వుంది?

 

    "ఒక స్త్రీకి ముక్కుపుడక ఇంత అందమిస్తుందా?"

 

    "ఫణీ!"

 

    "ఊ."

 

    "ఏమిటి చూస్తున్నావు?"

 

    "శైలజలోని శైలూని."

 

    "పో."

 

    "పోలేను. ఎందుకంటే...ఆగు నువ్వు చెప్పవద్దు, నేనే చెబుతాను. పోలేను కాబట్టి."

 

    ఆమె నవ్వింది. కాసేపు నిశ్శబ్దంగా గడిచాక "....మరి రేపు ఎలాగ?" అనడిగింది.

 

    "అదే ఆలోచిస్తున్నాను."

 

    "ఆలోచించి ఏం చేస్తారు?"

 

    "ఏం చేస్తానో తెలీదు. అన్నట్లు.....మీరున్నారుగా?"

 

    "ఉన్నానులెండి, ఉండి ఏం చేస్తాను?"

 

    "ఆపదలో అడ్డుకుంటారు."

 

    "అమ్మా ఆశ! అంత శక్తి వుండొద్దూ? అయినా అంత అవసరం నాకేమిటి?"

 

    "ఎందుకంటే......." అంటూ ఆగిపోయాడు.

 

    "చెప్పండి?"

 

    "మీరిప్పుడు కేవలం శైలజ కాదుకాబట్టి. శైలూ అయారు కాబట్టి."

 

    "ఓహో! అలాగా?" అంటూ ఆమె వాచీ చూసుకుంది. వెంటనే ముఖంలో భయం గోచరించింది. "అమ్మో! చాలా ఆలస్యమయింది. అత్తయ్య చంపేస్తుంది. ఇహ వెడతాను" అంటూ లేచింది.

 

    "అప్పుడేనా?" అన్నాడతను నిరాశగా.

 

    "అవునూ.." అన్నాడు మళ్ళీ "నేను మంచంమీదినుంచి లేస్తాననుకోండి. అప్పుడు నాకు కళ్ళు తిరిగితే ఎవరు పట్టుకుంటారు?"

 

    "నారాయణమ్మ."

 

    "అబ్బ! అంత పెద్దమ్మాయా?"

 

    "ఏం? చిన్నమ్మాయి అయితే ఫర్వాలేదా?"

 

    "పొండీ."

 

    "పోతున్నాను. ఎందుకంటే పోవాలి కాబట్టి" ఆమె గుమ్మంవరకూ వెళ్ళి ఏదో గుర్తుకువచ్చినట్లు ఆగింది.

 

    "అన్నట్టు రేపు మీరు కాలేజీకి రారుగా?"

 

    "రాలేననుకుంటాను."

 

    "సరే" ఒక్కనిముషం అక్కడే మౌనంగా నిలబడి తర్వాత నెమ్మదిగా వెళ్ళిపోయింది.

 

    ఏదో కాంతికిరణం గదినుంచి నిష్క్రమించినట్టయింది. వెలితిగా వుంది. బాధగా వుంది, శూన్యంగా వుంది. గదిలో లైటు వెలుగుతున్నా చీకటి ఆవహించినట్లుగా వుంది.

 

    కాసేపటికి లేచి కూర్చున్నాడు. కొద్దిగా బలం వచ్చినట్లుగా వుంది. ఇందాకటంత నీరసంగా లేదు.

 

    ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. క్షణక్షణానికీ శైలజ గుర్తుకొస్తూనే వుంది.

 

    ఈ గుర్తు రావటంలో ఎంత హాయి వుంది?

 

    అదేంకాదు, అతనింకో విషయం కనిపెట్టాడు - ఉన్నట్టుండి తనకి ముక్కు పుడకమీద ఎలర్జీ పోయిందని.

 

    పోవటమేకాదు. తన కంటికి అందంగా కనిపించటం మొదలుపెట్టిందని.

 

                                             4

 

    మరునాడు సాయంత్రం మంచంమీద గోడకానుకుని కూర్చునివున్నాడు. ఇలా ఎప్పుడూ మంచంమీద కూర్చుంటే బోర్ గానే వుంటుంది. కానీ వేరే కుర్చీలేదు.

 

    అయిదయింది, అయిదుం పావయింది, అయిదున్నర అయింది.

 

    శైలజ రాలేదు.

 

    రాదా?

 

    ఆమె వస్తానని చెప్పలేదు. ఆమె వస్తుందని ఎదురుచూసే హక్కు తనకి లేదని తెలుసు. మళ్ళీ సమర్ధించుకున్నాడు. హక్కు లేకపోతే పోనీగనక. ఆ మాటకొస్తే ఈ దేశంలో అందరూ హక్కు ఉండే అన్నిపనులూ చేస్తున్నారా?

 

    ఆమె వస్తే మొదట ఆమెను క్షమాపణ కోరుకోవాలి. ఆమెను బాధపెట్టి నందుకుకాదు, ఆమె ముక్కుపుడకను తిట్టినందుకు.

 

    అంతేకాదు, ఆమెను పొగుడుతాను. ఆమె అందాన్ని మెచ్చుకుంటాను.

 

    కానీ ఆమె రాదు.

 

    అతను నిరుత్సాహంగా అనుకోబోయాడు.

 

    కానీ ఆమె వచ్చింది.

 

    "శైలూ" అని పిలువబోతూ ఆమె ముఖంలోకి చూసి ఆగిపోయాడు.

 

    ముఖం కొత్తగా వుంది. ఏమిటోగా వుంది, ఏమిటది? తెలియటంలేదు.

 

    ఆమె దగ్గరకు వచ్చింది.

 

    "ఏమిటలా చూస్తున్నావు?"

 Previous Page Next Page