12
మెడికల్ కాలేజీ జీవితం చాలా కొత్తగా కనిపించింది. ఆర్ట్స్ కాలేజీలోలాగా ఇక్కడ విచ్చలవిడిగా వుండరు విద్యార్థులు. ప్రతివాడికీ ఓ వ్యక్తిత్వం ఓ అహంభావం, ఏదో ప్రకర్ష- కళాత్మకమైన అనుభూతి ఏమీ వుండదు. అసలు విద్యార్ధికి తీరిక అంటూ లేదు. ఉదయంనుంచీ సాయంత్రంవరకూ ఆ శవాలమధ్య, మైక్రోస్కోప్ ళ ముందు, లేదా ప్రొఫెసర్లచేత చీవాట్లుతింటూ యంత్రంలా పనిచేసుకుపోవాలి. గదికి వచ్చాక మరునాటికి తరగని పని. రాత్రి పన్నెండూ, ఒంటిగంటా అయ్యేవరకు చదువుతోనే సరిపోయేది. ఇహ విశ్రాంతి. కొంతమందికి ఆటల ప్రమేయం వుండేది. మధుబాబు సాహిత్య పిపాసని గురించి ఎవరూ పట్టించుకునే అవకాశం లేకపోయింది. ఓ రకంగా ఇంచుమించు అతనే మరిచిపోయాడు. కాలేజీ వాతావరణంలో పడి అదంటే ఆసక్తికూడా సన్నగిల్లింది. ఇదివరకు నిరంతరం ఏదో ఒక యితివృత్తాన్ని గురించో, పాత్రనుగురించో మనసులో మెదుల్తూండేది. ఇప్పుడు ఏదో అస్పష్టంగా ఎప్పటికైనా రాయాలి అన్న ఆరాటమేగాని నిర్దుష్టమైన వత్తిడి ఏమీలేదు లోపలినుంచి. పైగా మూడునెలల్లోనే కెమిస్ట్రీ పరీక్షలు. అతను హడావుడిగా చదవసాగాడు. రాజ్యలక్ష్మిని అతడు మరిచిపోలేదు. కాని గుర్తు పెట్టుకుని చేసేదేముంది నిద్ర పాడుచేసుకుని కన్నీళ్లు విడవటం తప్ప?
* * *
క్రమంగా మెడికల్ కాలేజి వాతావరణానికి అలవాటు పడిపోయాడు. జీవితంలో ఇదివరకెన్నడూ ఇంత కష్టపడి చదవలేదు. తన ఓపికకి తనకే ఆశ్చర్యంగా వుండేది.
కెమిస్ట్రీ లెక్చరర్ పేరు శ్యామలరావుగారు. ఆయన ఇంకా యువకుడు. సాహిత్యంలో చాలా అభిలాష వుంది. ఎవరో మధుబాబుని గురించి ఆయన చెవిలో ఊదారు. ఇతనికథలు ఆయన కొన్ని చదివి వున్నారు. "అరె! ఇంత చిన్నవాడా ఇతను?' అని విస్మయంచెంది ఓసారి ప్రాక్టికల్ హాలులో పలకరించి "ఓసారి మా ఇంటికి రండి" అని ఆహ్వానించాడు మధుబాబును. మరునాటి సాయంత్రం మధుబాబు ఆయనకోసం వెళ్లాడు. ఆయన కూచోబెట్టి, కాఫీయిచ్చి చీకటిపడేవరకూ ఏవో వివిధ విషయాలనుగురించి మాట్లాడుతూ కూర్చున్నారు. లిటచేచర్ లో ఆయనకంత అభినివేశం వుందని మధుబాబుకి పూర్వం తెలియదు. ఈ వాతావరణంలో ఇలాంటి తోడు దొరికినందుకు అతనికి చాలా సంతోషంగా వుంది. ఇద్దరూ ఎంతో సన్నిహితులైపోయారు. అప్పటి నుంచి అవకాశం వున్నప్పుడల్లా కలుసుకుంటూ వుండేవాళ్ళు. మధుబాబు సబ్జక్టుని గురించి తనకున్న అనుమానాలు. ఆయన్ని అడిగి తీర్చుకుంటూ వుండేవాడు.
ఎలక్షన్ల విషయంలో ఇక్కడకూడా ఆ వాతావరణమే వుండటం గ్రహించాడు మధుబాబు. వాటిల్లో పాల్గొనటానికి అతనికి మనస్కరించలేదు. కాని అతను రచయిత అని తెలిసి బలవంతంగా మేగజైన్ సెక్రటరీగా అతన్ని నిల్చోబెట్టారు. తీరాచూస్తే అతనికి పోటీలేకుండా పోయింది. అతను ఏకగ్రీవంగా ఎన్నిక అయినాడు.
* * *
కెమిస్ట్రీ పరీక్షలు జరిగాయి. మధుబాబు ఓరల్సు కూడా బాగానే ఆన్సర్ చేసి ఇంటికి బయల్దేరాడు. ఎగ్లామినర్స్ అందరూ రైల్లో పోతూండగా కాలక్షేపానికి శ్యామలరావు విగతవాళ్లకు ఓ కథచెప్పి "ఇది రాసింది మా స్టూడెంటే, పేరు మధుబాబు" అని చెప్పాడు. చిత్రం ఏమిటంటే ఎగ్జామినర్స్ లో ఒకరికి మధుబాబు అభిమాన రచయిత. "అయ్యో! ముందుగా చెప్పకపోయిరే? అతనెవరో తెలీకుండానే అతనికి ఓరల్స్ తీసుకున్నానా? అతను పరీక్ష ప్యాసయ్యాడో లేదోనండీ! నెంబరెంత? నెంబరెంత?" అని ఆదుర్దా పడసాగాడు. శ్యామలరావుగారికికూడా అతని నెంబరు గుర్తురాలేదు. "జ్ఞాపకం లేదండీ" అన్నాడు విచారంగా.
కాని మధుబాబు పరీక్ష ప్యాసయ్యాడు.
13
వేసవి సెలవులు. చాలారోజులకు మధుబాబుకు సాపకాశంగా ఆలోచించుకునేందుకు వ్యవధి దొరికింది. ఇంటికి వచ్చిన సాయంత్రం అలా నడుచుకుంటూ కృష్ణానదీతీరానికి వెళ్ళాడు. కృష్ణా బ్రిడ్జిమీద, ఉపరితలాన మనుషులు నడవటానికి దారుంది. దానిమీద ఎక్కి నడుస్తూ నడిమధ్యకు వచ్చి క్రింద ప్రవహిస్తోన్న నదీతరంగాలని తిలకించసాగాడు. గతస్మృతులన్నీ తలపుకు రాసాగినై. రాజ్యలక్ష్మి తనను అన్యాయం చేసి యీ లోకంనుంచి నిష్ర్కమించింది. తనకు యీ భూమ్మీద తల్లీ, తండ్రీ, అక్కా, చెల్లెలూ, తమ్ముడూ వీళ్లంతా వున్నారు. అయినా వంటరితనం పీడిస్తోంది. తను ఒక్కడూ ఒకటి, ప్రపంచమంతా ఒకటి అనిపిస్తోంది. ఏమిటో ఈ చదువు. ఈ అభవృద్ధి, ప్రాకులాట.....ఎందుకోసం ఇదంతా?
ఆ రాత్రి బరువుగా గడిచింది.
మరునాడు ఉమాపతి కలిశాడు. ఎంతో హాయి అనిపించింది. మధుబాబుకు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. తాను కొత్తగా రాసిన కథ ఒకటి వినిపించాడు ఉమాపతి. కథలో "మెరుపు" కనిపించలేదు మధుబాబుకు. వాస్తవానికి దగ్గరగా వున్నమాట యదార్ధమే. కావలసినంత నిజాయితీ కూడా అవుతుందా? కథకులుగా పేరొందిన ప్రముఖులు ఇదేపద్దతిలో రాయటం చూశాడు మధుబాబు. వాస్తవికత పేరుతో ఇంత పేలవంగా యెందుకు రచనలు తయారుచేస్తున్నారో బోధపడేదికాదు అతనికి. సాహిత్యానికి ప్రధానాంశమైన అనుభూతి లోపిస్తుంది. వాటిల్లో సమగ్రత, నిండుతనం వుండటం లేదు వాటిల్లో ఉమాపతికూడా కోవకు చేరుకున్నాడు.
ఎట్లా వుందని అడిగాడు.
మధుబాబు మొహమాటస్థుడు. "బాగుంది" అన్నాడు క్లుప్తంగా. అది బాగున్నామాట వాస్తవమే. కాని చాలా బాగుందేందుకు అనేక అభ్యంతరాలున్నాయి.
"మీరేం రాయటంలేదా?" అని అడిగాడు ఉమాపతి.
"లేదండీ, తీరిక వుండటంలేదు బొత్తిగా మెడికల్ స్టడీస్ లో పడిపోయాను. అదో ఊబి, ఆలోచించేందుకు తగినకాలం, వ్యక్తిత్వం కోల్పోయే వాతావరణం."
చాలాసేపు ఏవో మాట్లాడుకున్నారు. గుమస్తా ఉద్యోగంచేస్తూ, ఆ మనస్తత్వాన్ని పూర్తిగా జీర్ణుంచుకున్న ఉమాపతి, ఆ పరిసరాల్లోంచే సమస్యలని తీసుకుంటున్నాడు. ఆర్ధికశాస్త్రం చదివి, అందులో లోతుపాతులను అర్థం చేసుకోవాలని ఉబలాటపడ్తున్నాడు.
మళ్ళీ రాయాలన్న జిజ్ఞాస రేకెత్తింది మధుబాబులో. ఆ రాత్రి పడుకున్నప్పుడు తీవ్రంగా ఆలోచించాడు. కాని ఓ గమ్యం చేరలేదు. చికాగ్గా నిద్రపోయాడు.
మరునాడు సాయంత్రం ఏమీతోచక తెలుగు సినిమాకు వెళ్లాడు మధుబాబు. ఆ సినిమాలో హీరోయిన్ వేషం వేసిన ఆమెను చూడగానే షాక్ తిన్నట్లయింది. అతనికి బాగా సన్నిహితమైన వ్యక్తి ఎవరో, ఎవరా ఎవరా అని మతి పాడు చేసుకున్నాడు. బయటకు వచ్చి వాల్ పోస్టర్ మీద వున్నపేరు చూశాడు. పరిచితమైనది కాదే. మళ్ళీ లోపలకు వచ్చి కూర్చున్నాడు......ఓహ్! రజని. అవును....ఆమె రజని. తనూ, అక్కా బడినుంచి వస్తూంటే చిన్నప్పుడు పిలిచి బిస్కెట్లూ కాఫీ ఇచ్చి ఆప్యాయత ప్రదర్శించిన అందగత్తె. అక్కడనుంచి వెళ్ళిపోయినాక ఆమె ఉనికి ఏమీ తెలియలేదు. క్రమంగా ఆమెగురించి కూడా మరచిపోయాడు. ఇప్పుడు సినిమాలో చేరిందన్నమాట. ఈ రెండుమూడు సంవత్సరాలు ఎక్కడవుందో! ఎట్లా గడిపిందో! అతనికి హృదయం ఆర్థ్రమైంది ముగ్దుడయి చూడసాగాడు. అప్పటికన్నా అందంగా పొంకంగా వుంది. ఎంత బాగా నటిస్తోందో! ఆమెని చూడాలనీ కలుసుకావాలనీ అతనికావేశం కలిగింది.
ఆ రాత్రి ఇంటికి వచ్చి ఆమెని గురించే ఆలోచిస్తూ పడుకున్నాడు. జీవితం నిజంగా చిత్రమైనదే. ఒక్కొక్క వ్యక్తి పురోగమనంలో ఎన్ని మలుపులు!
వీటన్నిటిమధ్యా ఏదో రాయాలన్న ఆరాటం దానికి స్వరూపం ఇవ్వలేని అస్పష్టత అతన్ని వేధించసాగాయి.
ఒకప్పుడు ఎంత తేలిగ్గా, సునాయాసంగా రాసేశాడు! ఆలోచనకూడా శ్రమ అనిపించేదికాదు. కొంతపేరు వస్తోన్న తరుణంలో ఇంచుమించు రాయటం మానుకున్నాడు. తనని రచయితగా క్రమేపీ అంతా మరచిపోతారేమో! అతనికి భయంవేసింది.
మరునాడు ప్రొద్దున్న ఇంటికి వచ్చిన వారపత్రిక తిరగవేస్తోంటే.....అందులో ఓ ప్రకటన కనబడింది. నవలల పోటీయట. ఉత్సాహంగా వివరాలన్నీ చదివాడు. అతనికి ఉద్రేకం కలిగింది. రాయాలి! రాయాలి.
సామాజిక ఇతివృత్తం తీసుకోవాలి.
అనుకోకుండా ఆ మధ్యాహ్నం అతను రాయటం మొదలు పెట్టాడు. అంతా ఊహాగానమే. ఓ మధ్యతరగతి కుటుంబాన్ని తీసుకున్నాడు. తండ్రీ, తల్లీ, కొడుకులూ, కూతుళ్లూ....వాళ్ల ప్రత్యేక స్వభావాలు.....
అతని కలం సాగిపోతోంది.
ఓ పదిరోజుల్లో సగం నవల తయారయింది. మొదట గజిబిజిగా, ఏమిటోగా వున్న భావాలను ఇప్పుడో ఆకృతి ఏర్పడింది. పాత్రలను విశిష్టంగా మలచగలుగుతున్నాడు. లోపలకు ప్రవేశం దొరికినకొద్దీ, పరిధిని విశాలం చేసుకుంటూ, స్వేచ్చగా, తడుములాట లేకుండా రాసుకుపోసాగాడు. తనకు తెలియని సంగతులు కూడా అందులోకి దొర్లుకు రాసాగాయి.
ఓరోజు ఉదయం మధుబాబుని వెతుక్కుంటూ ఓ పెద్దమనిషి వాళ్ల ఇంటికి వచ్చాడు. ఆయన్ని అంతవరకూ ఎప్పుడూ చూడలేదు. అందుచేత తెల్లబోయి, ఆయన్ని కూర్చోబెట్టి ప్రశ్నార్థకంగా చూశాడు.
ఆయన తనకితాను పరిచయం చేసుకున్నాడు. ఈమధ్య హైదరాబాద్ నుంచి ప్రచురితమౌతున్న కొత్త వారపత్రిక సంపాదకులలో ఒకరు. పనిమీద ఈ ఊరువచ్చి మధుబాబు ఇక్కడ వున్నాడని తెలుసుకుని చూడడానికి వచ్చాడుట. ఆ పత్రిక గురించి మధుబాబుకు తెలుసు. కొత్తగా స్థాపితమయినావృద్ధిలోకి వస్తోంది. ఫీచర్స్ బాగుంటున్నాయి.
"మంచి సీరియల్ ఏమైనా ప్రారంభించాలని వుందండీ, త్వరగాకూడా మొదలెట్టాలి. కాని మంచి నవల వున్నట్లుండి యెలా పుట్టుకువస్తుంది? మీరు నవలలేమయినా రాశారా?" అనడిగాడు సంపాదకుడు.
అసలు పత్రికతాలూకు సంపాదకుడు తనని గురించి తెలుసుకుని రావటమే గొప్పగావుంది మధుబాబుకు. ఈ ప్రశ్న మరీ ఉత్సాహం రేకెత్తించింది.
"ఒకటి రాస్తున్నానండి. ఇంకా పేరు పెట్టలేదు. సగంవరకూ పూర్తయింది" అన్నాడు.
"ఏదీ....పట్రండి చూద్దాం" అన్నాడాయన ఆతృతగా.