"నువ్వు చెప్పింది నిజమే. కానీ నేను బయల్దేరింది కూడా వాళ్ళని కలుసుకోవాలనే కదా.....అప్పుడు ఈ అభ్యంతరాలేమీ లేవే. నేనెందుకైతే బయల్దేరానో ఆ పని అదృష్టవశాత్తూ మనం అంతదూరం వెళ్ళే అవసరం లేకుండానే పూర్తి కావస్తూంది. ఇటువంటి సమయంలో ఈ అవకాశాన్ని వదిలిపెట్టటం అవివేకం. మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి అవకాశం రాదు." - అని ఆగి, నువ్వేమైనా భయపడుతున్నావా?" అడిగాడు.
వాయుపుత్ర మొహం ఎర్రగా కందిపోయింది. ".......ప్రాణాలమీద ఆశ వున్నవాడు ఎవడూ ఇలా అంతరిక్షంలో వెతుక్కుంటూ రాడనుకుంటాను" అన్నాడు వ్యంగ్యంగా.
"మరీ అంత కోపం తెచ్చుకోకు. నీది చిన్నపిల్లాడి మనస్తత్వం అనుకుంటానే. కనపడగానే కళ్ళనీళ్ళు పెట్టుకుంటావు. అంతలోకే ఎగిరెగిరిపడతావు - నేననేది ఏమిటంటే, భూమిమీద నుంచి ప్రయాణమయ్యేటప్పుడు మనం వేర్వేరు క్యూటీలమీద బయల్దేరాం. మాయాస్ ని కలుసుకోవటం ణా డ్యూటీ. అందులో విఫలమై నేను శూన్యంలోకి జారిపోతే నన్ను పట్టుకోవటానికి నువ్వు వచ్చావు. కాబట్టి ఇప్పుడా ప్లయింగ్ సాసరుని పట్టుకోవలసిన బాధ్యత నీకు లేదు. కేవలం నాకే వుంది. అందుకని అడుగుతున్నాను-"
వాయుపుత్ర మాట్లాడలేదు.
"ఏం వెళ్దామా? ఈ నౌకకి కెప్టెన్ వి నువ్వు వెళ్దామంటేనే వెళ్ళటం జరుగుతుంది."
"సరే."
అంతరిక్ష నౌక మరింత వేగం పుంజుకుంది.
ఒక్క ప్లయింగ్ సాసరులోకి ప్రవేశించబోయే మొట్టమొదటి మానవులు తామిద్దరూ! అసలెలా వుంటారు వాళ్ళు? తమనెలా రిసీవ్ చేసుకుంటారు?
గత కొద్ది రోజులుగా జరిగింది తల్చుకుంటే అతడికి భయంగా కూడా లేకపోలేదు. తమ ఉనికి వాళ్ళకి తెలుసు. రాయ్ కి మతిభ్రమించేలా చేశారు. తమ రాకెట్ ని విస్ఫోటనం చేశారు.... అయినా యశ్వంత్ అటువైపు ప్రయాణం చేయిస్తున్నాడు.
ఇప్పుడు రెండు వాహనాలు దాదాపు సమాంతరంగా వెళ్తున్నాయి.
యశ్వంత్ స్పేస్ సూట్ వేసుకున్నాడు. వీపుకు మినీ రాకెట్ అమర్చుకున్నాడు.
భూమినుంచి గ్రీన్ సిగ్నెల్ వచ్చింది.
యశ్వంత్ ఎయిర్- లాక్ తెరిచి, వాయుపుత్రకేసి బొటనవేలు పైకెత్తి చూపివెళ్తున్నానన్నట్టు సైగచేసి- శూన్యంలోకి అడుగు పెట్టాడు.
అతడు ప్లయింగ్ సాసర్ వైపు వెళ్ళటం టీ.వీ.లో స్పష్టంగా కనిపిస్తోంది.
వాయుపుత్ర టెన్షన్ తో చూస్తున్నాడు. ప్రసారం రిలే చేశాడు.
భూమ్మీద సగంపైగా జనాభా ఉత్సుకతతో, ఉద్వేగంతో,ఊపిరి బిగపట్టి చూస్తున్నారు.
ఆ అపురూపమైన సంగమంకోసం..... రెండు విభిన్న విశ్వాల సంస్కృతీ సమ్మేళనం కోసం.
ఈ చూస్తున్న వారిలో అనూహ్య కూడా వుంది.
వేళ్ళు వణుకుతుండగా, మనసంతా ఉద్వేగం నిండి వుండగా, ఆమె కన్నార్పకుండా ఆ టి.వి. తెరవైపే చూస్తూంది. ఆమె అతడికేమీ కాదు. ఒకప్పటి భార్య, అంతకన్నా ప్రస్తుతం ఎక్కువేమీ కాదు. కానీ అతడు కొంచెంసేపటి క్రితం మాటలాడిన మాటలు ఆమెలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే వున్నాయి. ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ఆమె అతడి క్షేమాన్ని కోరుకుంటోంది. భర్త క్షేమాన్ని భార్య కోరుకున్న దానికన్నా ఎక్కువైన అనుబంధం- ఆప్యాయతలు దాని వెనుక వున్నాయి.
ఈ లోపులో యశ్వంత్ ఆ గోళాకారపు పళ్ళేన్ని పట్టుకున్నాడు. గంటకి కొన్నివేల మైళ్ళ వేగంతో ఆ ప్లయింగ్ సాసరు, యశ్వంత్, భూమినుంచి వచ్చిన రాకెట్ వరుసగా శూన్యంగా సాగిపోతున్నాయి. అయితే మూడూ అదే వేగంతో వెళుతున్నాయి కాబట్టి, చుట్టూ వున్నది శూన్యం కాబట్టి ఆ వేగం తెలియటం లేదు.
గోడకున్న దారాలమీద పాకే సాలీడులా యశ్వంత్ ఆ ప్లయింగ్ సాసర్ మీద ఇట్నుంచి అటు తిరిగాడు. వెనుకవైపు కనిపించింది ద్వారం. ఆశ్చర్యం కలిగిస్తూ అది తెరుచుకుంది.
అతడు లోపలి ప్రవేశించాడు.
లోపలికి వెళ్ళగానే అతడి శరీరం క్రమక్రమంగా బరువెక్కటాన్ని అతడు గమనించాడు. ఆ అంతరిక్ష నౌకకి కూడా News (Natural environment within ship) వున్నట్టు గ్రహించాడు. కాళ్ళమీద నిలబడగానే అతడు పరీక్షించింది ఆ నౌకలోకి వెలుగు ఎలా వస్తుందా? అని!! వెలుగు యొక్క కేంద్రాలు చిన్న చిన్న రాళ్ళలా మెరుస్తూ వుండటాన్ని అతడు చూశాడు. అదేవిధంగా, ఆ నౌక యొక్క నిర్మాణం భూమికి సంబంధించిన ఏ లోహంతోనూ కాక, మానవులకి తెలియని మరో లోహంతో జరిగినట్టు కూడా గమనించాడు.
అతడి బాగా విస్మయం కలిగించిన విషయం ఏమిటంటే ఆ లోపలి అంతర్భాగంలో ఎక్కడా ఏ విధమైన అలికిడి లేక పోవటం. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన స్పేస్ షిప్పా ఇది అన్న అనుమానం కూడా కలిగింది. క్షణాల్లో అది స్థిరపడింది. అవును. లేకపోతే సూర్యుడి సామీప్యం నుంచి ఇది భూమి దగ్గరగా ఎందుకు వస్తుంది?
అతడిని ఒక్కసారిగా నిరాశ ఆవిరించింది. వాళ్ళు శత్రువులు గానీ, మిత్రులుగానీ ఎవరైనా సరే ఆ పరలోకవాసుల్ని ఒక్కసారి చూస్తే, ఒక్కసారి వారితో కమ్యూనికేషన్ ఏర్పర్చుకోగలిగితే బావుణ్ణు అని అతడు ఎంతో ఆత్రంతో చూశాడు. అదిప్పుడు ఫలించేటట్టు లేదు. అతడికి మరొక అనుమానం కూడా వచ్చింది. భూలోకంమీద ప్రాణులు కేవలం ఘనపదార్ధంతోనే వుంటారు. కానీ ఏకకణ జీవులైన ప్రోటోజోవా (అమీబా)లు ద్రవంలో కూడా కలిసిపోగలవు. ఈ గ్రహాంతర వాసులు వాయురూపంలో కూడా పరిణితి చెందగలరా అన్న అనుమానం అతడికి కలిగింది. ఘనమూ ద్రవరూపమూ సాధ్యమైనప్పుడు వాయురూపం ఎందుకు సాధ్యపడదు?
కానీ వెంటనే అతడి ఆలోచన అతడికే తప్పుగా కనపడింది. ఇంతలో చెవి దగ్గర వాయుపుత్ర కంఠం వినిపించింది.
"యశ్వంత్ మీరు క్షేమంగా వున్నారా?"
తను ప్లయింగ్ సాసర్ లోకి చేరుకోగానే ఇక్కడి పరిస్థితుల్ని స్పేస్ షిప్ కి వివరించి చెప్పటం మర్చిపోయినందుకు సారీ చెప్తూ "ఇక్కడ ఏ జీవీ వున్నట్టు తోచటం లేదు. ఇది ఖాళీచేసిన వాహనం లాగా కనపడుతూంది" అన్నాడు.
"వాయురూపంలో వున్నారేమో?"
"ఆ ఆలోచన నాకూ వచ్చింది. కానీ ఎంతో తర్కదూరమైన ఆలోచన అది. మళ్లీ రెండు నిముషాల తరువాత నీతో మాట్లాడతాను" రేడియో ఆపుచేసి, యశ్వంత్ చుట్టూ కలియచూశాడు. కుర్చీలుగానీ, అటువంటి సామాగ్రికానీ లేవు. అంటే ఆ జీవులకి వెన్నెముక, కూర్చునే అలవాటుగానీ లేవు. దీనికి రెండు రకాలైన కారణాలు వుండి వుండవచ్చు. ఈ నౌకని శూన్యంలోకి వదిలేస్తున్నప్పుడు వాటిని తమతో తీసుకుపోవటం మొదటి కారణం లేదా అటువంటి సాంకేతికమైన పరికరాలన్నీ వారి మెదడే అవటం రెండో కారణం.
కంప్యూటర్నే టెలీపతితో కంట్రోలు చేయగలిగిన వారి మెదడుకి వేరే పరికరాలు అనవసరం.
ఒక మూల అర్ధ వృత్తాకారంలో చిన్న చిన్న ప్లేట్స్ లాగా వున్నాయి. యశ్వంత్ వంగొని వాటిక్రింద చూశాడు. అక్కడ కనబడ్డాయి బటన్స్. అయితే వాటికి వైర్లు ఏమీలేవు.ఎలక్ట్రానిక్స్ కన్నా ఆధునికమైన శాస్త్రం బహుశ మయాస్ కి తెలిసి వుండవచ్చు. ప్లేట్స్ క్రింద బటన్స్ వుండటం బట్టి, మనుష్యుల్లాగా నిలువుగా కాకుండా, వాళ్ళు బల్ల పరుపుగా, నేలమీద పొడవుగా వుండివుంటారని ఊహించాడు. మరొక గదిలో వున్న మంచాల్లా వున్నవి అతడి ఆలోచనని ధృవపర్చాయి.
అతడు తను చూస్తున్న విషయాలకి తన తర్కం ఉపయోగించి, ఆ జీవులు ఎలా వుంటారన్నది ఊహిస్తున్నాడు. భూమ్మీద అందరూ తను ఏం చెప్పబోతాడా అని ఎదురుచూస్తూ వుంటారని అతడికి తెలుసు. అప్పటివరకూ చూసింది రన్నింగ్ కామెంటరీల ప్రసారం పంపించాడు.
"ఆ గ్రహాంతర జీవుల ఛాయల ఒక్కటి కూడా లేవా?"
"లేవు. నౌకని ఖాళీచేసి వుంటారని నేను భావిస్తున్నాను" భూమినుంచి వచ్చిన ప్రశ్నకి సమాధానం ఇచ్చాడు."
"మనకి పనికివచ్చే వివరాలు ఇంకేమయినా వున్నాయా?"
"ఇంకా చూస్తున్నాను. మరో అయిదు నిముషాల తరువాత కాంటాక్టు చేస్తాను?"
అతడు తిరిగి పరిశోధన మొదలుపెట్టాడు. మరో నాలుగు నిముషాలు గడిచినా అతడికేమీ దొరకలేదు. అతడికి తను అనుకున్నదే నిజమని అనిపించింది. ఎలక్ట్రానిక్ కన్నా ఆధునికమైన రిమోట్ కంట్రోల్ ద్వారాయే ఈ అంతరిక్ష వాహనంలో అన్ని పనులూ జరుగుతూ వుండవచ్చు.
చివరగా అతడు మిషన్ రూమ్ లోకి ప్రవేశించాడు. అక్కడి దృశ్యం అతడికి ఆశ్చర్యం కలిగించింది. మామూలు పరిస్థితుల్లో అది మిషన్ రూమ్ అని ఎవరూ నమ్మరు కానీ ఆ అంతరిక్ష నౌకలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కగదీ చూస్తున్నాడు కాబట్టి అతడు నమ్మగలిగాడు. కంప్యూటర్లు. వైర్లు, శక్తిని అందించే మిషనులు ఇండికేటర్లు ఏమీలేవు. ఒక ధనవంతుడి బెడ్ రూమ్ లా వుంది అది.
అతడి విస్మయం క్షణక్షణానికి హెచ్చు అవుతూంది. తను చూస్తున్నాదంతా నిజమైతే, తను ఊహిస్తున్నదంతా నిజమైతే, ఆ 'మాయాస్' మనిషి మేధస్సు కందనంత తెలివిగలవాళ్ళు, అద్భుతమైన మేధాసంపత్తి గలవాళ్ళు అయివుంటారు లేదా వాళ్ళ కెనెటిక్ ఎనెర్జీ విపరీతమైన శక్తి గలది అయివుంటుంది.
సరే - వాళ్ళ శరీరాల్లోనే ఆ శక్తి వుందనుకుంటే, వాళ్ళు వదిలేసిన ఈ నౌకలోకి కూడా ఆ శక్తి ఎలా వస్తూ వుంది? ఇంకా ఈ దీపాలు ఎలా వెలుగుతూనే వున్నాయి. ఏదో ఒకటి పరీక్షించకుండా అతడు ఆ నౌకనుంచి తిగిరి వెళ్ళదల్చుకోలేదు. శక్తి యొక్క మూలాధారాన్ని పరిశీలించటానికి అతడు నౌకలో వెలుతుర్నిచ్చే దీపాన్ని ఎన్నుకున్నాడు.
మామూలు బల్బులాగా వుంది అది. కానీ గాజుకవర్ ఏమీ లేదు. పూర్వకాలం రాజుల కిరీటాల్లో మెరుస్తూ వెలుగులు విరజిమ్మే వజ్రంలా వుంది. అతడు డానికి ఏ కనెక్షన్ వుందా అని పరీశిలించబోయాడు. ఏ ఆధారంతో అది వెలుగుతుందా అని దాన్ని తీసి చూడబోయాడు. అతడి చెయ్యి యింకా అడుగు దూరంలో వుండగానే షాక్ తగిలినట్టయింది. వెనక్కి విరుచుకు పడిపోయాడు.
7
అతడికి మెలకువ వచ్చికళ్ళు విప్పేసరికి ఆత్రంగా తన వైపే చూస్తున్న వాయుపుత్ర కనిపించాడు. "ఎంతసేపయింది నేనిలా పడిపోయి" అని అడిగాడు.
"అరగంట."
అప్పుడు గమనించాడు అతడు - తను ప్లయింగ్ సాసర్ లో లేననీ, తను అంతరిక్ష నౌకలోనే వున్నానని...... అతడి అనుమానం గ్రహించినట్టుగా వాయుపుత్ర"........పది నిముషాలు రేడియోలో ప్రయత్నించాను. మీ నుంచి జవాబు రాకపోయేసరికి ఆ 'మాయాస్' మిమ్మల్ని ఏమైనా చేసి వుంటారని భయం వేసింది. వెంటనే నేనూ ఆ వాహనంలోకి ప్రవేశించాను. మీరు స్పృహతప్పి పడివున్నారు. ముందు అక్కడినుంచి మిమ్మిల్ని బయటకు తీసుకురావటం ముఖ్యం అనిపించింది. తీసుకొచ్చాను" నవ్వుతూ అన్నాడు.
"దీనికి మనవాళ్ళ నుంచి అనుమతి తీసుకున్నారా?"
"ఇలాటి అడ్వెంచర్స్ కి మనవాళ్ళు వప్పుకోరు. మీకు తెలుసుగా......"
యశ్వంత్ వాయుపుత్రవైపు కృతజ్ఞతతో చూశాడు. అతడు చెప్పింది నిజమే. "ప్లయింగ్ సాసర్ లో ప్రవేశించిన మనిషి బయటకు రాలేదు. నన్నేం చెయ్యమంటారు?" అని గానీ వాయుపుత్ర భూమిని సలహా అడిగుంటే-' అతడిని వదిలేసి నువ్వు తిరిగి వచ్చెయ్యి' అని వారు చెప్పి వుండేవారు. చూస్తూ చూస్తూ మరొక రెండో ప్రాణిని బలి పెట్టటానికి ఎవరూ ఒప్పుకోరు. తనకి తగిలింది చిన్న షాక్ అయినా, ఆ వదిలివేయబడిన ప్లయింగ్ సాసర్ తో పాటూ తనుకూడా దిశాంతరాలకు పయనిస్తూ శూన్యంలోకి వెళ్ళిపోయి వుండేవాడు.