చదువులో ఒకోమెట్టే ఎదుగుతున్నకొద్దీ ముత్యాలమ్మకు స్వేచ్చ పెరుగుతున్నట్లే వుంది. ఆ స్వేచ్చ ఎంతో కొంత ఆమెకు నచ్చింది.
రమణమ్మ ఆమె చదువుకు అభ్యంతరంపెట్టేది కాదు. రెండోపెళ్లివాడికిచ్చి చేసినా తన ఇంట్లో కంటే సవతి కూతురు ఎక్కువ సుఖపడిపోతుందని ఆమె భయం. చదువు చాలా కష్టమనీ, చదువుకున్న ఆడపిల్లకు పెళ్ళి కష్టమనీ, క్రమంగా ఆమె జీవితం మోడువారిపోతుందనీ నమ్మిన రమణమ్మ తన కూతురికీ మాత్రం టెన్త్ దాటగానే పెళ్ళిచేసింది. అందుగురించి ఎవరైనా ఏమైనా అంటే,"చద్దన్నం తిన్నమ్మ మొగుడాకలెరగదు. డానికి పెళ్ళి తొందర లేదు. అందుకని నా కూతుర్నేక్కడ ఆపగలనూ" అనేది.
ఏంచేసినా రమణమ్మకు భర్త మద్దతు వుండేది. చదువు తనకు స్వేచ్చనిస్తుందని నమ్మిన ముత్యాలమ్మ కూడా రమణమ్మను ఈ విషయంలో మెచ్చుకునేది.
చదువు పేరు చెప్పి ముత్యాలమ్మకు పెద్దగా ఖర్చూ అయ్యేది కాదు. కాలేజీలో, యూనివర్సిటీలో రకరకాల స్కాలర్ షిప్పుండేవి. ఎక్కడెక్కడి వివరాలూ ఆమెకు ఎవరో ఒకరు అందజేసేవారు. అందానికి మంచితనం జతపడ్డంవల్ల ఆమె అవసరానికి మించిన సానుభూతి లభించేది.
మనదేశంలో చదువయ్యేదాకా అబ్బాయికి జీవితం నల్లేరుపై బండి నడక. అమ్మాయికి మాత్రం పదేళ్ల వయసునుంచే జీవితమొక సవాలుగా మారుతుంది. అందువల్ల అబ్బాయిలు అనుభవాల కోసం వెదుకుతూంటే అమ్మాయిలు అనుభవాల్లో పాఠాల కోసం వెదుకుతూంటారు.
ముత్యాలమ్మ చాలా తొందరగా ఎన్నో పాఠాలు నేర్చుకుంది. అందీ అందని ఆడదాని అందమే పురుషులకెక్కువ ఆకర్షణ అని ఆమె తెలుసుకుంది. అమాయకత్వాన్ని నటించగలిగితే పురుషుడిలో ఆశ పెంచవచ్చునని గ్రహించింది. ఫలితాన్ని బట్టి ప్రతిఫలమివ్వాలని నేర్చుకుంది. ఒక్కరోజులో ఇవన్నీ నేర్చుకోలేదామె. ఆమెవల్ల కొన్ని తప్పులు జరిగాయి. తన తప్పులు పతానానికి దారితీయకుండా- ఔన్నత్యానికి మెట్లయ్యేవిధంగా చేసుకోగలిగిందామె.
ముత్యాలమ్మకు ఎమ్మెస్సీలో ఫస్ట్ క్లాసివ్వాలని ప్రొఫెసర్ విశ్వప్రయత్నం చేశాడు. బ్యాట్స్ మన్ సెంచరీ కొట్టాలంటే అంపైర్ పూర్తిగా సాయపడలేడుకదా- బ్యాట్స్ మన్ కూడా తన వంతు కృషి చేయాలి. ముత్యాలమ్మ తన వంతు తాను చేయగా ఆయన దాన్ని సెకండ్ క్లాస్ స్థాయికి తేగాలిగాడు. అదే ముత్యాలమ్మకు సెంచరీ అయింది.
అప్పుడు ప్రొఫెసరామెను-ప్రొఫెసర్ అజేయ్ కు పరిచయం చేశాడు.
అజేయ్ ఆమెను డిపార్టుమెంట్లో ఇంటర్వ్యూచేసి, "సబ్జక్టుండక్కర్లేదు. సబ్జక్టులో రాణించాలన్న కోరిక వుంటే చాలు- నోబెల్ ప్రైజ్ దాకా ఎదగొచ్చు" అన్నాడు.
అప్పుడు ముత్యాలమ్మ తను పిహెచ్ డి చేయాలనుకుంటున్నట్లు చెప్పింది.
అజేయ్ ఆమెను దియాకు అప్లై చేయమన్నాడు. అంతకుముందోసారి వచ్చి పర్సనల్ గా కలుసుకొమన్నాడు.
ముత్యాలమ్మ ఆయన్ను పర్సనల్ గా కలుసుకుంది.
"నీ ప్రొఫెసర్ గురించి అంతా చెప్పాడు. నీ పద్ధతి నాకు నచ్చింది" అన్నాడాయన.
అంతా అంటే ఏం చెప్పి వుంటాడో ముత్యాలమ్మ ఊహించుకోగలిగింది.
"ఆయన నీకు ఏమ్మెస్సీలో సెకండ్ కాస్లిప్పించాడు. నేను నీకు రీసేర్చిలో అవార్డు ఇప్పించగలను. సైంటిస్తుగా అంతర్జాతీయస్థాయికి తీసుకునివెళ్ళగలను" అంటూ ఆయన ఆమె చేయి పట్టుకున్నాడు.
ముత్యాలమ్మ చేయి విడిపించుకోలేదు. అలాగని ఆ చేతిని అంతకంటే ముందుకు వెళ్ళనివ్వనూ లేదు."దియాకు అప్లై చేసేదా సర్" అందామె ఎంతో వినయంగా.
అజేయ్ ఆమె చేతిని విడిచిపెట్టాడు. అప్లికేషన్ ఫారాన్నిచ్చాడు.
ఆ తర్వాత టాలెంట్ సెర్చి పేరిట దియాలో పెద్ద హడావుడి జరిగిమంది.
ఎమ్మెస్సీ చదివినవారిలోంచి-మార్కులను బట్టి కాక-ప్రతిభను బట్టి రీసేర్చికి ఎన్నిక చేయడానికి దియా తనదంటూ ఓ కొత్తపద్దతిని ప్రవేశపెడుతున్నట్లు పేపర్లో ప్రకటన వెలువడింది.
ఆ ప్రకటన చూసి ఎందరో అప్లికేషన్లు పెట్టారు. వారిలో చచ్చిచెడిప్యాసైనవారూ వున్నారు. యూనివర్సిటీ ఫస్టులూ వున్నారు. అభ్యర్థి ఎన్నిక ఇంటర్వ్యూ మీదనే ఆధారపడి వుంటుందని నమ్మి వాళ్లందరూ అహొరాత్రాలు కృషిచేశారు.
ఎలక్షన్లకే కాదు-ఇంటర్వ్యూలకూ రిగ్గింగ్ వుంటుంది.
ముత్యాలమ్మ ఆ ఇంటర్వ్యూలో ప్రథమురాలిగా నిలిచి దియాలో చేరింది.
ప్రొఫెసర్ అజేయ్ ఆఫీసుగదిని అనుకుని చిన్న లాబరేటరీ వుంది. అది ఆయన పరిశోధనలకు ప్రత్యేకం. ముత్యాలమ్మకు ఆ చిన్న లాబరేటరీలో అప్పుడప్పుడు స్థానం లభిస్తూంటుంది.
దియాలో రీసెర్చి స్కాలర్స్ ఆఫీస్ టైములు పాటించారు. పగలనక రాత్రనక వారు ప్రయోగాలు చేస్తూనేవుంటారు.
అందువల్ల అక్కడ ఎవరెంతసేపున్నా చర్చనీయాంశం కాదు. దియాలో సెకండ్ ఫ్లోర్ లో ఆమెకో రూముంది. ఆ ఫ్లోర్ లోనే కొన్ని లాబరేటరీ కూడా వుంది.
అజేయ్ లాబరేటరీలో కొన్ని అదనపు సదుపాయాలున్నాయి. రీసెర్చి స్కాలర్స్ ముందుగా అపాయింట్ మెంట్ తీసుకుని అందులో ప్రయోగాలు కొనసాగించవచ్చు. ఆ అపాయింట్ మెంట్ చార్టుని మాత్రం అజేయ్ స్వయంగా మెయిన్ టైన్ చేస్తాడు. అక్కడ ఏ సమయంలో ఎవరికి అపాయింట్ మెంట్ వుందో మూడోకంటివాడికి తెలియదు. ఆ లాబరేటరీకి కారిడార్లోంచి కాక మరోవైపునుంచి ప్రవేశద్వారాముంది.
ముత్యాలమ్మ కాస్త తరచుగానే ఆ లాబరేటరీకి వేడుతూంటుంది.
ఇప్పుడు అజేయ్ ఆమె చేతిని కాదు- ఆమెనే పట్టుకుంటున్నాడు, మొదట్లో ముత్యాలమ్మ కొంత బెట్టు చేసింది. అయితే చేరిన ఆర్నేల్లకే ఆమె ఒక జర్నల్లో పేపరు పబ్లిష్ చేసింది. అప్పటికింకా ఆమెకు రీసెర్చి అంటే అవగాహన లేదు.
ఒపప్పుడు నటనాసామర్థ్యం నటిని తారను చేసేది. అప్పటికీ కొన్ని త్యాగాలు చేయవలసివస్తే అది వేరే సంగతి. ఇప్పుడు తార కావడానికి నటనా సామర్థ్యం అవసరంలేదు. తలవంచగలిగితే చాలు.
ఈ జీవితమొక నిత్యనూతన చలనచిత్రం మనుషులందరూ పాత్రధారులు. తగినవారి ముందు తలవంచినవారు బాగుపడతారు, అహంకరించివారు తలదించుకునే బ్రతకాల్సోస్తుంది.
ప్రొఫెసర్ అజేయ్ ఈ వేదాంతాన్ని ముత్యాలమ్మలో ఎక్కించాడు.
ముత్యాలమ్మ వేదాంతం కంటే భవిష్యత్తు ముఖ్యం. ఆ భవిష్యత్తుకో పిహెచ్ డి డిగ్రీ-సైంటిస్టు పోస్టు-ఫారిన్ అవకాశం-లాంటివి కావాలంటే అజేయ్ ఆలంబన ముఖ్యం.
ముత్యాలమ్మ అతడిముందు తలవంచింది. అందువల్ల ఆమె దియాలో తలెత్తుకు తిరగగలుగుతోంది.
భార్యతో యాంత్రికంగా దాంపత్యసుఖాన్ననుభావించే అజేయ్ కు మత్యాలమ్మ ముందు కోర్కెలు పురివిప్పుతున్నాయి. అతడికి పరాయి ఆడది కొట్ట కాకపోవచ్చు. కానీ ముత్యాలమ్మ అసమాన సౌందర్యం ఆయన్ను సమ్మోహితుణ్ణి చేస్తోంది.
ముత్యాలమ్మ అజేయ్ కు ఆఫీసులో భార్య అయింది. అయితే ఆమె భార్యలా కాకప్రియురాలిలా మసులుతూ ఆయనకు తన పట్ల వున్న ఆకర్షణ నిలుపుకుంటోంది.
నిత్య నూతనంగా వుండే ముత్యాలమ్మ పట్ల ఆయన ఆకర్షణ రోజురోజుకీ పెరిగిపోతోందే తప్ప తరగడంలేదు.
ఏకాంతంలో ఆయన వైవిధ్యం కోసం ఆమెతో రకరకాల ఆటలు సృష్టిస్తాడు.
ఒకరోజున ఆమె పేషెంటు. ఆయన డాక్టరు.
ఒకరోజున ఆమె భక్తురాలు. ఆయన స్వామిజీ.
ఒకరోజున ఆమె నటి. ఆయన దర్శకుడు.
విచిత్రమేమిటంటే ఈ ఆటలు ఆమెలో మరింత ఉద్రిక్తతను పెంచి- ఆ రోజు కోసం ఎదురుచూసేలా చేసేవి.
అలా ఒకరోజున మోడల్ అయింది. ఆయన ఫోటోగ్రాఫరయ్యాడు.
అప్పుడు తీశాడాయన పంచ భంగిమలు.
పోలరాయిడ్ కెమెరాలోంచి వచ్చిన ఆ ప్రింటులు చూసేదాకా జరిగిందేమిటో ముత్యాలమ్మకు తెలియలేదు.
ఆ ఫోరోలు చూడగానే ఆమెకు సిగ్గుతో ఒళ్లు చచ్చిపోయినట్లనిపించింది.
అజేయ్ ఆమెను సముదాయించాడు. ఆ ఫోరోలు తనకూ, ఆమెకూ మాత్రమే పరిమితమన్నాడు. ఏకాంతంలో తనకవి ఉత్తేజాన్ని కలిగిస్తాయన్నాడు.
ముత్యాలమ్మ వాటిని చింపేయమని కోరింది.
"నేనేమైనా బ్లాక్ మెయిలర్ననుకున్నావా?" అన్నాడు అజేయ్.
ఆ తర్వాత ఆమె చాలా సార్లు మోడల్ అయింది కానీ ఫోటో గ్రాఫర్ గా ఆయన్ను మారనివ్వలేదు.
ఆ ఫోటోల కారణంగా తను ఆయన గుప్పెట్లో వున్నానని ఆమెకు తెలుసు. అయితే ఆ గుప్పెట్లోంచే భవిష్యత్తుకు సోపానాలేర్పతయానీ ఆమెకు తెలుసు.
పిహెచ్ డి, అవార్డులు, ఉద్యోగం, ఫారిన్ చాన్సు-ఇలా ఎన్నో ఆ గుప్పెట్లోంచి బయటపడునున్నాయి.
* * *
"ఆడదానికి శీలం అనే పదాన్ని మగాడు సృష్టించాడు. కాబట్టి అతడే ఆడదాని శీలాన్ని రక్షించాలి. మగాడు పట్టించుకోని శీలం గురించి నాకే బెంగా లేదు. అందువల్ల అజేయ్ సర్ మీద నాకే ద్వేషం లేదు. ఆయనకేదైనా అయితే నేను భరించలేను. ఎందుకంటే మళ్లీ నాకు అంత మంచి ఆలంబన దొరకదు" అంది ముత్యాలమ్మ తనకథను ముగిస్తూ.
అతడు కుర్చీలో వెనక్కు వాలి, "చాలామంది ఆడవాళ్ళు తమని తాము మోసగించుకుంటారు. నువ్వూ వాళ్ళ జాబితాలోకే చేరతావు. ఏ ఆడదీ తనను ఆటబొమ్మలా ఆడించే మగాడిని భరించలేదు. ఆడది ప్రేమను కోరుతుంది" అన్నాడు.
ముత్యాలమ్మ ఆశ్చర్యంగా అతడి వంక చూసింది. అతడు కొనసాగించాడు.
"ఆడది ప్రేమమూర్తి. ఆ ప్రేమ పలువిధాల ఆమెను బలహీనపరుస్తుంది. మగాడు ఆమె ప్రేమను అనుభవించడానికి బదులు బలహీనతలను పట్టుకుంటాడు. ఆమెను పురుషప్రపంచానికి బానిసను చెయ్యడానికి అవసరమైన జిత్తులన్నీ ఉపయోగిస్తాడు. అందుకే భర్తపోయిన ఆడదాన్ని మగాడు విధవ అంటే- ఆ వైధవ్యాన్ని ఆడదే ప్రోత్సహిస్తుంది. వివాహిత కాని స్త్రీకి గర్భం వస్తే-ఆ మగాడెవరూ అని కూడా ఆలోచించక ఆడదే ఆమె చెడిపోయిందని అంటుంది. భర్త వున్న స్త్రీ పరాయి మగాడిని చేరదీస్తే -ఆడదే ఆమెను కులట అంటుంది.
నువ్వు శీలం గురించిన పట్టింపు లేదంటున్నావు. కానీ నీకు నిజమైన స్వేచ్చవుంటే- ఉరిశిక్షపడదన్న హామీ వుంటే- నిస్సంకోచంగా అజేయ్ ని హత్యచేసి వుండేదానివి"
"ఎవరు నువ్వు?" అంది ముత్యాలమ్మ చటుక్కున.
"ఇంకా నేను చెప్పాల్సినదుంది"
"నువ్వు నాగురించి చెబుతున్నవన్నీ నీకెలా తెలిశాయి?"
అతడు నవ్వి-"ఆడది మగాడిముందు తలవంచితేనే-అతడి తలను వంచగలదు. మగాడి తలవంపులు ఆడదానితో ముడిపడివున్నాయి. అవునా?"
"నువ్వు....నువ్వు..." ముత్యాలమ్మకు చెమటలు పట్టాయి.
"అవును-నేను అజేయ్ స్నేహితుణ్ణి కాను"
"కాదు....నువ్వు ...నువ్వు..." ముత్యాలమ్మ గొంతులో తడారిపోయింది.
"అవును-నీకు తెలియాలనే నేను నీ డైరీలోని మాటల్ని వాడాను"
"నా డైరీ-అది నా పర్సనాల్ - అది నువ్వెందుకు చదివావు?"
"జైన్ డైరీలూ పర్సనలే-కానీ కొందరవి చదివారుకదా"
"అది సిబిఐ పని"
"ఎస్-అయామ్ ఆల్ సో ఫ్రమ్ సిబిఐ. నా పేరు గజపతి" అంటూ అతడు తన ఐడెంటిటీ కార్డునామెకు చూపించాడు.
ముత్యాలమ్మ నివ్వెరపోయింది. ఒక్కక్షణం తర్వాత తమాయించుకుని, "అన్నీ తెలిసీ-నువ్వు నన్నెందుకు కలుసుకున్నట్లు?" అంది.
"నిజాన్ని డైరీలో చదవడంకంటే ముఖంలోంచి చదవడం ముఖ్యం. ఇది జైన్ డైరీల నుంచి సిబిఐ నేర్చుకున్న అనుభవపాఠం" అన్నడు గజపతి.
ముత్యాలమ్మ తన కుర్చీలో ఇబ్బందిగా కదులుతోంది.
అది గమనించిన గజపతి, "మేడమ్! అర్హతకు మించిన ఎత్తుకు ఎదగాలనుకోవడం మానవ సహజం. అందుకు ఎలాంటి ఆధారాన్నయినా ఆలంబన చేసుకోవడం, దారిలో బురద అంటినా సరేననుకోవడమూ మానవ సహజమే! అయితే మనిషికిఉన్నత హొదా తృప్తినివ్వాలంటే అది లభించే తీరు ముఖ్యం. ఆ హొదాలో వ్యవహరించే తీరూ ముఖ్యమే!
నీవు దియాలో రీసెర్చి స్కాలరువైనావు. అది నీకు తృప్తినిచ్చింది. కానీ రీసెర్చి స్కాలరుగా నీ కార్యకలాపాలు నీకు తృప్తినివ్వడంలేదు. ఇంకా చెప్పాలంటే అవి నీలో అశాంతిని రేపుతున్నాయి. అందుక్కారణం ప్రొఫెసర్ అజేయ్. ఆయనపై నీకు గుండెల నిండా కసి రేపుకునివుంది. ఆ విషయం నీ డైరీ చెబుతోంది...." అన్నాడు.
"నో! ఆయనపై నాకు కసి లేదు. ద్వేషం లేదు" అరిచింది ముత్యాలమ్మ.
"మేడమ్!ప్రొఫెసర్ అజేయ్ ను నీవు కిడ్నాప్ చేయలేదు. కిడ్నాపైన ఆదివారం నీవతడికి ఫోన్ కూడా చేయలేదు. అసలు ఆ ఆదివారం నాడు అజేయ్ కు నీ నుంచి ఫోను వచ్చిందా అన్న విషయం కూడా మాకు తెలియదు. నీ డైరీలోని విశేషాలను బట్టి లా జరిగుండే అవకాశమున్నదేమోనని ఓ రాయివేసి చూశానంతే. కాబట్టి నీవిక భయపడనవసరంలేదు. నీవు అనుమానితురాలిని కావు. ఇక దైర్యంగా నిజం ఒప్పుకో-అజేయ్ ను నువ్వింకా అభిమానిస్తున్నావా? ఆసరాగా భావిస్తున్నావా? లేక ఆయన్నుచంపేయలన్నంత ఆవేశంతో ద్వేషిస్తున్నావా?" అన్నాడు.
ముత్యాలమ్మ అనుమానంగా "నామీద నీకేవిధమైన అనుమానమూ లేనప్పుడు- నా ఈ సమాధానాల నుంచి నువ్వేమాశిస్తున్నావు?" అంది.
"మనదేశంలో సాహిత్యం, సంగీతం, క్రీడలు, లలితకళలు- ఇలా ఏ రంగం తీసుకున్నా ప్రజ్ఞ వేరు, గుర్తింపు వేరు అవుతోంది. అది విజ్ఞానరంగానికి కూడా పాకడం దురదృష్టం. ఎందుకంటే- ఒకే పాట ఒక్కొక్కరికి ఒకో రకం అనుభూతినిస్తూంది. అందువల్ల పాట మంచిచెడ్డల నిర్ణయాలు అనుభూతిని పోందేవారిని బట్టి మారుతూంటాయి. అక్కడ ప్రజ్ఞకూ, గుర్తింపుకూ పొంతన లేకపోతే సరిపెట్టుకోవచ్చు.
కానీ విజ్ఞానరంగంలో అనుభూతులకు తావులేదు. ఫలితాలకు ఖచ్చితమైన కొలబద్దలున్న విజ్ఞానరంగం మనదేశంలో-గుర్తింపు విషయంలో ఇతర రంగాల స్థాయికి పడిపొయిందంటే-ఆ పతనాన్ని అరికట్టడం ఎంతైనా అవసరం. అసత్యం,మోసం, ప్రచారం, బుకాయింపు-విజ్ఞానరంగంలో కూడా ప్రగతినీ, హొదాను ఇవ్వగలిగితే ఆ దేశానికిక మోక్షమనేదే వుండదు.
ప్రొఫెసర్ అజేయ్ నీ విషయంలో అమానుషంగా ప్రవర్తించాడు. ఆయన వ్యవహారాన్ని బయటపెట్టాలి. ఈ విశేషాలన్నీ పత్రికలకెక్కాలి. అప్పుడే ఇలాంటివారికి కనువిప్పవుతుంది. హెచ్చరిక లభిస్తుంది. నీ పేరు బయట పెట్టకుండా అజేయ్ గుట్టు రట్టు చేయబోతున్నాను. అయినా ఎందరో ఆ అజ్ఞాత యువతి నీవేనని ఊహించవచ్చు. అందుకు నువ్వు సిద్ధపడాలి. రోట్లో తలపెట్టావు. రోకటిపోటుకు భయపడతావా?" అన్నాడు గజపతి.
ముత్యాలమ్మ ముఖంలో కలవరపాటు కనపడింది. "ఇప్పుడిప్పుడే నా ఇంట్లో నాకు అంతో ఇంతో గౌరవం లభిస్తోంది సవతితల్లి కూడా కొద్దికొద్దిగా నేనంటే భయపడుతోంది. ఈ సమయంలో ఈ కథంతా బయటపెడితే- నా బ్రతుకు కుక్కలు చింపిన విస్తరి అవుతుంది" అందామె.
"ఇదొక మహా యజ్ఞం. ఇందులో కొందరు సమిధలు కాక తప్పదు.అగ్నిజ్వాలలకు సిద్దపడివుండు. అగ్నిపునీతవు కాగలవనే నా నమ్మకం" అంటూ అక్కణ్ణుంచి లేచాడు గజపతి.
* * *
ప్రొఫెసర్ అజేయ్ లీలలు దేశంలో గొప్ప సంచలనాన్ని కలిగించాయి.
దియాలో జరుగుతున్న ఘోరాలు ఒకటి కాదు, రెండు కాదు- ఎన్నోఎన్నో.
అక్కడి అపాయింట్ మెంట్స్ వెనుక బంధుప్రీతీ-లేదా-అదృశ్యహస్తాలు.
కోట్ల విలువ చేసే పరికరాల కొనుబడిలో చెప్పలేనన్ని లాభాలు-కమిషన్ల రూపంలో... వాటిలో కొన్నింటిని కొనడం వరకే ఆసక్తి. అటుపైన అది ఎలా పనిచేస్తున్నదీ , ఎలా వినియోగపడుతున్నదీ పట్టించుకునేవారే లేరు. మరికొన్ని పరికరాలు పరిశ్రమలకు మాత్రమే పరోక్షంగా సాయపడతాయి.
రీసెర్చి పేరిట కొనబడిన ఆ పరికరాలు- ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ కు టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్ సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. ఆ పని ఆఫీసువేళల్లో అజేయ్ రీసెర్చి స్కాలర్స్ చేస్తే -అజేయ్ దూరపుబంధువులా పేరిట వున్నటెస్టింగ్ సెంటరు పేరిట ఆ సమాచారం పత్రికల కందజేయబడుతుంది.
ఆదాయం ఆ టెస్టింగ్ సెంటర్ ది. వ్యయం దియాది. పరిశ్రమలకు-టెస్టింగ్ పరికరాలపై కోట్లు వెచ్చించాల్సిన అవసరం తప్పుతోంది.
దియాలో విజ్ఞానంకంటే ప్రచారానికే ప్రాముఖ్యం. పరిశోధన కంటె ఆకర్షణ ముఖ్యం. దియాకు సంబంధించిన వార్తలు-పత్రికలలో ప్రత్యేక ఆకర్షణ అయింది.
అలాంటి సమయంలో దేశానికి సంబంధించిన కొందరు ప్రముఖ శాస్త్రజ్ఞులు అజేయ్- భారతీయ విజ్ఞానశాస్త్ర రంగానికి పట్టిన చీడపురుగు అన్నారు.
అలాంటివారిలో ముఖ్యుడు గోవిందరావు.
గోవిందరావు ప్రొఫెసర్. అజేయ్ కు మంచిమిత్రుడు. వారిద్దరూ ఎన్నో పర్యాయాలు వేదికలపై ప్రశంసలందజేసుకున్నారు.
అయితే అజేయ్ కున్నంత పేరు గోవిందరావుకు లేదు. ఆయన ఉత్తరప్రదేశ్ లో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్. అజేయ్ ప్రాపకం సంపాదించి తరచు నిపుణుడిగా దియాకు వస్తూండేవాడు. దియాకూ, గోవిందరావుకూ కంబైన్డ్ ప్రాజెక్ట్స్ వున్నాయి. దియా రికమండేషన్ వాళ్ల గోవిందరావుకు చాలా గ్రాంట్సు వచ్చి యూనివర్సిటీలో ఓ వెలుగు వెలుగుతున్నాడు.
కానీ గోవిందరావుకు అజేయ్ వైభవం కడుపుమంటగా వుండేది. దియాను తన వశం చేసుకోవాలని ఆయనకు ఆశ. దానేక్కడా బయటపడనివ్వకుండా-దియా సైంటిస్టులతో ఆయన ఎంతో మంచిగా వుండేవాడు. వారి గురించి గొప్పగా చెప్పేవాడు. దియాకు వెళ్ళినప్పుడు ఒక రాజకీయనాయకుడు తన నియోజకవర్గం ప్రజలతొ మాట్లాడే తీరులో వుండేది ఆయన లెక్చరు.
ఇప్పుడు దియా గురించి ఒకటోక్కటిగా కథలు బయటపడుతూంటే-ఇదే అవకాశమని గోవిందరావు విజృంభించాడు. పత్రికలావారికి ఇంటర్వ్యూలిచ్చాడు. దియాతో ఆయనకున్న సంబంధ బాంధవ్యాలవాళ్ల ఆయన మాటలకు విలువ వచ్చింది.
దియా వ్యవహారం సరిగ్గా లేదని తనకెన్నడో అనుమానం వచ్చిందన్నాడాయన. ఎన్నోసార్లు తను నచ్చజెప్పి చూశాననీ, అజేయ్ వినేవాడు కాదానీ చెప్పాడాయన. అప్పుడు తాను ఈ విషయాన్ని పైదాకా తీసుకుని వెడదామనుకుని అజేయ్ కున్న రాజకీయ బలానికి భయపడి వెనుకడుగు వేశానన్నాడు. ఈ దేశంలో అందరికంటే మేధావులే బలహీనులనీ- అందువల్ల కొందరిపై మేధావులన్న పదాన్ని బలవంతంగా రుద్దుతున్నారానీ వాపోయాడు.
'ఇప్పటికీ దియాలో సైంటిస్టులు అఖండ ప్రజ్ఞాశాలురు. అక్కడి సదుపాయాలను సద్వినియోగపరిస్తే అద్బుతమైన ఫలితాలు సాధించవచ్చు. దియాపై రాజకీయ ప్రభావాన్నీ, దియానుంచి రాజకీయల్నీ తొలగిస్తే-దియాను ఈ భూమి గర్వించతగ్గ పరిశోధనాశాలగా తీర్చిదిద్దడం-నా వంటివాడిక్కూడా సాధ్యపడుతుంది' అన్న ఆయన స్టేట్ మెంట్ అన్ని పత్రికల్లోనూ మొదటి పేజీలో వచ్చింది.
ప్రొఫెసర్ అజేయ్ అవినీతిపరుడనీ, కోట్లకు కోట్లు బ్లాక్ మనీ ఆర్జించివుంటాడనీ, ఆ నల్లధనం కోసమే దుండగులు అతణ్ణి అపహరించివుంటారనీ గోవిందరావు అభిప్రాయపడ్డాడు. అజేయ్ అపహరణకు విజ్ఞానశాస్త్ర పరిశోధనలు కారణం కావు కాబట్టి దేశంలోని శాస్త్ర జ్ఞులెవరూ భీతి చెందనవసరంలేదని ఆయన విజ్ఞప్తి కూడా చేశాడు.
అదీ పత్రికల్లో వచ్చింది. అజేయ్ కీర్తిప్రతిష్ఠలు మంటగలుస్తూంటే గోవిందరావు పేరుప్రఖ్యతులు మింటికెగస్తున్నాయి.
ప్రభుత్వం దియా వ్యవహారాలను సమీక్షించడానికి ఓ కమిటీ వేసింది. ఆ కమిటీకి చైర్మన్ ప్రొఫెసర్ గోవిందరావు.
ఆలోగా అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఒకరోజున కిద్నాపర్స్ తరపు నుంచి ప్రముఖ పత్రికలన్నింటిలోనూ ఒక ప్రకటన వెలువడింది.
'ప్రొఫెసర్ అజేయ్ మావద్ద క్షేమంగా వున్నాడు. ప్రస్తుతానికి ఆయనకు వచ్చిన ప్రమాదమేమీ లేదు. ఆయన గురించి కానీ, దియా గురించి కానీ ఏవిధమైన ఇన్వెస్టిగేషనూ జరుగడానికి వీల్లేదు. ఇది ప్రభుత్వానికి మా హెచ్చరిక! ఈ హెచ్చరికను చెవిని పెట్టకపోతే ప్రొఫెసర్ అజేయ్ ప్రాణాలకు ముప్పు వుంది. గ్రహించగలరు'
ప్రకటన హెడ్డింగ్-'ఇది ఎవరికీ సంబందిస్తే వారికి....'అని వుంది. క్రింద ప్రొఫెసర్ అజేయ్ అపహరకులు- అని వుంది.
* * *
ఆమె అతడి వుంది. కిలకిలా నవ్వుతోంది.
ప్రొఫెసర్ అజేయ్ గంభీరంగా వున్నాడు. అతడు తీవ్రాలోచనలో వున్నాడు.
"జస్టే స్మైల్-నవ్వు ప్రొఫెసర్ -నాకు నీ నవ్వు చూడాలనుంది" అందామె.
"నన్ను మీరు డబ్బడగలేదు. నానుంచి ఏమాశిస్తున్నారో చెప్పలేదు. నాకు సమస్త సుఖాలూ ఇచ్చారు. మర్యాదగా చూశారు. నామీద ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేయబోతే వద్దని బెదిరించారు. మీరు నాకు మిత్రులో, శత్రువులో తెలియడంలేదు. ఇది తేలేదాకా నేను నవ్వలేను"
"ఇంకా తెలియదా ప్రొఫెసర్ " అందామె.