Previous Page
ఆపరేషన్ మేడిపండు పేజి 15

    అజేయ్ తల అడ్డం ఊపాడు.
    "ఆపరేషన్ మేడిపండు" అందామె.
    "అంటే?" అన్నాడు ప్రొఫెసర్ అజేయ్.
    "మాకు నీమీద కక్ష లేదు. ఆశలేదు. ఆసక్తి లేదు" నవ్వుతూ అందామె.
    "అయితే నన్నెందుకు కిడ్నాప్  చేశారు...
    "ప్రొఫెసర్! మనదేశంలో ప్రజాస్వామ్యం వచ్చింది. కానీ రాజరికం పోలేదు. అందు వల్ల ప్రజాసేవకులు ప్రజానాయకులవుతున్నారు. ఈ సంప్రదాయాన్ని మార్చడానికి నీవంటి వారి సహకారం కావాలి...." ఆగిందామె.
    "ఇందుకు నేనేం చేయగలను?" అన్నాడు అజేయ్ ఆశ్చర్యంగా.
    "అదే ఆపరేషన్ మేడిపండు...." అందామె.
    అప్పటికీ ప్రొఫెసర్ అజేయ్ కామాట అర్థం తెలియలేదు.
    "మనదేశంలో ప్రజాస్వామ్యం మేడిపండుయింది. దాని పొట్ట విప్పితే రాజరికపు పురుగులు. దేశానికి ఈ మేడిపండు అవస్థ  తప్పాలంటే ప్రజా నాయకులకు నాయకులన్న పేరు పోయి-సేవకులన్న పేరు రావాలి. వారు సేవా కార్యక్రమాల్లోనే తప్ప వేడుకల్లో పాల్గొనకూడదు. అంటే ప్రారంభోత్సవాలు చేయరాదు. పదవుల్లో వున్నంతకాలం వేదిక లెక్కరాదు. ఆసనాలపై కూర్చోరాదు. ఒక ఇంట్లో సేవకుడికెలాంటి స్థానముంటుందో-దేశమనే ఇంట్లో  ప్రజాసేవకులకు అలాంటి స్థానమే వుండాలి...."
    "నువ్వు చెప్పింది బాగానేవుంది. కానీ, అది నావల్ల ఎలా అవుతుంది?"
    "వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. అందుకే ఇందుకు నిన్ను ఎన్నుకున్నాం"
    "అంటే మీరు నన్ను జాతి వజ్రంగా భావిస్తున్నారన్నమాట-థాంక్సేలాట్...."
    "ఇది ఆపరేషన్ వజ్రం కాదు. ఆపరేషన్  మేడిపండు...."
    ఉలిక్కిపడ్డాడు ప్రొఫెసర్  అజేయ్. "అంటే?"
    "ఇంకా వేరే చెప్పాలా-నువ్వొక మేడిపండువి-అది రుజువుకూడా అయింది...."
    అజేయ్ ముఖం పాలిపోయింది. అతడామెను విదిలించుకున్నాడు.
    ఆమెకూడా అతడికి దూరంగా జరిగి కూర్చుని, "నేను మేడిపండుకు దగ్గర కావడం నీకూ నచ్చినట్లు లేదుకదూ" అంది.
    "బిహేవ్ యువర్ సెల్ఫ్" అన్నాడు అజేయ్.
    "నీకు నీతి లేదు, నిజాయితీ లేదు. స్వార్థం తప్ప మరోటి తెలియదు. సిగ్గూ శరంలేవు. ఉచ్చనీచాలు లేవు. కానీ దేశానికి ఆశాదీపంగా పేరు తెచ్చుకున్నావు. మేడిపండు అన్న పేరు నీకు తప్ప ఇంకెవరికి అమరినట్లు అతుకుతుంది?" అందామె.
    "పోనీ-నేను మేదిపండునే-అలాంటప్పుడు నన్నెందుకు కిడ్నాప్ చేశారు?"
    "చెప్పానుగా-మేడిపండు వంటి మన  ప్రజాస్వామ్య వ్యవస్థను మేడిపండువైన నువ్వె మార్చాలి. వజ్రాన్ని కోయడానికి వజ్రం. అదే ఆపరేషన్ మేడిపండు"
    "నాకాపని అప్పజెప్పడానికి కిడ్నాప్ చేయాలా? దియాకు వచ్చి మాట్లాడాల్సింది"
    "కానీ అంతకుముందు-నువ్వు మేడిపండువని మాకూ, భారతప్రజలకూ నిర్ధారణ కావాలికదా-అందుకే ఆపరేషన్  మేడిపండు"
    అజేయ్ ముఖం మళ్ళీ పాలిపోయింది. "ఇంతకీ మీ పని  నేనెలా చేయాలి?"
    "చాలా సులభం. దియాలో వ్యవస్థను మార్చు. రాజరికాన్ని తెలియజేసే డైరెక్టర్ పేరును తొలగించి-ఆ పదవికి అటెండర్ అని పేరు  పెట్టు. నీకు సలహాలిస్తూ సాయపడే దియా మేనేజర్లుకు సర్వెంట్స్ అని పేరు  పెట్టు. పొరపాటున కూడా కుర్చీ ఎక్కకు. నేలమీదే  కూర్చో. నీ ఆఫీసులో అటెండర్స్  కుండే సదుపాయాలను మాత్రమే పొందు. చిన్న పని చేసేవారికి పెద్దపీట వెయ్యి. ప్రమోషన్లు వచ్చేకొలదీ, జీతం పెరిగేకొలదీ పదవిలో గౌరవం తగ్గి, సేవాధర్మం పెరగాలి. ప్రస్తుతమున్న రాజరికపు చాయలు తొలగిపోవాలంటే నువ్వీ విప్లవం తీసుకునిరావాలి"
    తనలో రక్తం మరుగుతూంటే ఆవేశం పోంగుతూంతే ఎలాగో తమాయించుకున్నాడు అజేయ్. తర్వాత నెమ్మదిగా, "ఈ విప్లవం నా వల్ల కాదు. ఎందుకంటే మీరు నన్ను విడిచిపెట్టెక నాకు నా పదవి ఎలాగూ వుండదు" అన్నాడు.
    "నీ పదవికి డోకా వుండదు.అందుకు మాదీ  హామీ"
    "అదెలా సాధ్యం?"
    "నీ ప్రాణాలకు ముప్పని ప్రకటించినా-ప్రభుత్వం నీమీద ఎంక్వయిరీ ఆపలేదు. అంటే నీ ప్రాణాలు కాపాడతగినంత విలువైనవి కావని ప్రభుత్వం గ్రహించింది. నీ అసలు రంగు బయటపెట్టడమే ఈ కిడ్నాప్ ఉద్దేశ్యం. ఇప్పుడు ప్రజలకు నీ అడలురంగు తెలిసింది. ప్రజాప్రభుత్వం వర్తిల్లె దేశంలో నీకింక పతనం లేదు. ఎందుకంటే ఇంతకుమించిపతనమెలాగూ వుండదుకదా!" అందామె.
    ప్రొఫెసర్ అజేయ్ మాట్లాడలేదు. అప్పుడప్పుడే ఆయనకు తనను కిడ్నాప్ చేసిందెవరో స్ఫురిస్తోంది.
                                                               *    *    *
    ఆ గదిలో-ఒకరికొకరు ఎదురుగా- రాజు.....గజపతి.
    "దియా ఒక రమ్యహర్మ్యం అనుకున్నాను. కానీ అది మాయాజాలం. వందమంది రాకుమారులను బలి ఇచ్చి- ప్రపంచాన్నేలే శక్తిని సంపాదించాలనుకునే దుష్టమంత్రికుల మాయాజాలమది!" అన్నాడు రాజు.
    "ఒక్క రాకుమారుడి గురించి చెప్పు" అడిగాడు గజపతి.
    "బ్రహ్మం" అన్నాడు రాజు.
    గజపతి ఆశ్చర్యపోలేదు. "ఆ విషయం బ్రహ్మనికి తెలుసా?" అన్నాడు.
    "తెలుసు. కానీ ఒప్పుకోడు"
    "ఏమిటతణ్ణి కమ్మిన మాయాజాలం"
    "బ్రహ్మం తెలివైనవాడు, సమర్థుడు. ఇంకా చెప్పాలంటే జీనియస్. ప్రొఫసర్ అజేయ్ దీ అతడిదీ ఒకటే ఫీల్టు. బ్రహ్మం పనిచేస్తాడు. అజేయ్ వ్యాపారం చేస్తాడు. అజేయ్  రీసెర్చి స్కాలర్స్ ను  బ్రహ్మం గైడ్ చేస్తాడు. అజేయ్ వ్యాపారం చేస్తాడు. అజేయ్  రీసెర్చి స్కాలర్స్ ను బ్రహ్మం గైడ్ చేస్తాడు. అజేయ్ ప్రాజెక్టులకు బ్రహ్మం స్కీమ్స్ వేస్తాడు. అజేయ్  విజయాలకు బ్రహ్మంవెనుకనుంటాడు. అందుకు బ్రహ్మానికి రొట్టెముక్కలు దొరుకుతాయి. అజేయ్ సామ్రాజ్యం ఏలాతాడు. చక్రవర్తి అజేయ్  ప్రపంచం పర్యటిస్తాడు. బ్రహ్మాన్ని కదలనివ్వడు. పెద్దగా  ఎదగనివ్వడు"
    గజపతి చిన్నగా నవ్వి, "సుబ్రహ్మణ్యం  వంటివారుండగా బ్రహ్మలెందుకూ అజేయ్ కి?" అన్నాడు.
    "జీవితంలో పైకి రావాలనుకున్నవారి కత్తులకు రెండువైపులా  పదునుంటుంది. ఒకటి ప్రచారం. అందుకు సుబ్రహ్మణ్యం. రెండుప్రజ్ఞ. అందుకు బ్రహ్మం. ఇంకా మధ్యరకం వాళ్ళూ వుండి స్వర్ణకిరణాలు సృష్టిస్తూంటారు. అజేయ్ కీ ప్రపంచంలో ఎదురుండదు"
    "కానీ బ్రహ్మం వంటి ప్రజ్ఞాశాలి అజేయ్ కెందుకు లోబడాలి?"
    "ప్రతి మనిషికీ బలహీనత వుంటుంది"
    "బ్రహ్మం బలహీనత ఆడది"
    "ఎవరా ఆడది?" అన్నాడు గజపతి.
    "ఎవరైతే మనకెందుకు? కానీ బ్రహ్మం గురించి నేనొక అపూర్వమైన రహస్యం తెలుసుకున్నాను" అన్నాడు రాజు.
    "ఏమిటది?"
    "రెండ్రోజులగా బ్రహ్మం గెడ్డం బాగా మాసివుంది"
    "అయితే"
    "అతణ్ణి నేను  గుర్తుపట్టాను"
    "ఎవరతను?"
    "నాయుడమ్మభవనంలో కిడ్నాప్ గురించి నాకు చెప్పిన దియా సైంటిస్టు అతడే!"
    "రాజు ముఖం గంభీరంగా వుండడం చూసి ఫక్కున నవ్వాడు గజపతి.
    "నవ్వుతారేం? నేను నిజం చెబుతున్నాను" అన్నాడు రాజు.
    "నువ్వు నిజమే చెబుతున్నావని నాకూ తెలుసు. కనీ నిజం తెలుసుకుందుకు ఇన్నాళ్లు పట్టినందుకు నవ్వొస్తోంది"
    "అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా?"
    "నువ్వు అజేయ్ ని కిడ్నాప్  విషయంలో హెచ్చారించేక ఆయన కిడ్నాపయ్యాడుకదా- దాంతో నీ గురించి అన్వేషణ మొదలయింది. నిన్ను ఐడెంటిపై చేయడం జరిగేక-ఆ రోజు కార్యక్రమం వీడియో క్లిపింగ్స్ చూశాం. అందులో నీపక్కన దియా  సైంటిస్టు బ్రహ్మం కనపడ్డాడు. అప్పుడు బ్రహ్మం గురించి ఆరా తీశాం. బ్రహ్మం దియాలో అజేయ్  దోపిడీకి గురవుతున్న సైంటిస్టు అని చాలా  తొందరగా  తెలిసింది. అప్పుడు నిన్నక్కడ ప్రవేశపెట్టాలనుకున్నాం. నేను నిన్ను కలిశాను...."
    రాజు ఆశ్చర్యంగా, "నువ్వు నన్ను కలవడం వెనుక ఇంత కథ వుందా?" అన్నాడు.
    గజపతి నవ్వి, "సిబిఐ ఏ పని చేసినాఇంత కథా దాని వెనుక వుంటుంది" అన్నాడు.
    "మరి బ్రహ్మం గురించి అంతా తెలిసి ఇన్నాళ్ళాగడమెందుకు?"
    "అజేయ్ అపహరణలో ఎవరి హస్తముందో అనుమానం కలిగినా మేము చేయగలిగిందేమీ లేదు. అపహరణకు కారణమేమిటో తెలియాలికదా"
    "ఇప్పుడైనా తెలిసిందా?"
    "తెలుస్తూనే వుందికదా- బ్రహ్మం నీకు చూపించిన ఫైలు అజేయ్ సృష్టి కాదు. అది బ్రహ్మం  సృష్టి. ఆపరేషన్  మేడిపండు అనే పేరు  అజేయ్ కు  తెలియదు. అది బ్రహ్మం  ప్రాజెక్టు. అజేయ్ ఆగడాలనొకక్కటిగా బయటపెట్టాలనే అతడి ఆశయం. అందుకే నీకు ముందు సుబ్రహ్మణ్యం గురించీ, తర్వాత జగన్నాథ్ గురించీ చెప్పాడు"
    "నాకు చెప్పడంవల్ల ప్రయోజనమేమిటి?"
    "బ్రహ్మం తెలివైనవాడు. దియాలో నువ్వు చేరిన పద్ధతిబట్టి నీ వెనుక పోలీసులుంటారని ఊహించివుంటాడు. అందుకే అజేయ్ గురించి పల్లెత్తు మాటనకుండా నీకు  అవసరమైన సమాచారం అందించాడు. సుబ్రహ్మణ్యం విషయంలో అజేయ్  బండారం బయటపడగానే అతడికి నీవు  పోలీసుల మనిషివని పూర్తి నమ్మకం కుదిరింది"
    రాజు ఆశ్చర్యంగా "నేనిదంతా నమ్మలేకుండా వున్నాను" అన్నాడు.
    "ఇంకా నమ్మలేని విషయాలు చాలా వుంటాయి. ఒకసారి బ్రహ్మాన్ని కలుసుకుందాం" అన్నాడు గజపతి.
                                                               *    *    *
    "అజేయ్ నన్ను దోపిడీ చేస్తున్నాడు. నేనొక సైంటిస్టుని. నా తెలివి పుస్తకాలకూ, ప్రయోగాలకూ పరిమితం. నేను వేదిక లెక్కి మాట్లాడను. బిరుదులకోసం తాపత్రయపడను. అడపాదడపా వచ్చే ప్రమోషన్లు నాకు చాలు. అందువల్ల  అజేయ్ దోపిడీ ని నేను మౌనంగా  సహించాను. దేశవ్యాప్తంగా ఆయన తెచ్చుకుంటున్న పేరు నాలో కాసిని రేపేది. ఆయన  మేడిపండని ఎలుగెత్తి అరవాలనిపించేది. కానీ అందువల్ల నేను పతనమవడం మినహా మరే ప్రయోజనమూ వుండదు...." అన్నాడు బ్రహ్మం.
    "ఎందుకని?"
    "మనదేశంలో కొన్ని ప్రయోగశాలలు అజేయ్ వంటి వారిని నియంతలుగా మార్చడానికే పనికివస్తున్నాను. సైంటిస్టులా జీవితాలు, మేథస్సు-వారికి లొంగి ఊడిగమైనా చేయాలి. లేదా ఎదురుతిరిగి కృంగి కృశించిపోవాలి. అధికారమే తప్ప బాధ్యతలు లేని  పదవిని స్వీకరించిన అజేయ్ లో అహంకారాన్ని పాలుపోసి పెంచుతోంది పాలనా యంత్రాంగం. ఆలోచించగల ప్రతి మనిషినీ ఈ వాతావరణం కలచివేస్తూంటుంది. నేను మౌనంగా ఇదంతా  భారిస్తున్నాను. ముత్యాలమ్మ ఇక్కడ చేరేదాకా...."ఆగేడతడు.
    మాట్లాడకుండా వింటున్నారు గజపతి, రాజు.
    "నాకు ముత్యాలమ్మంటే ప్రేమ పుట్టింది. ప్రొఫెసర్ ఆమెను నాకు అప్పజెప్పాడు. నేనామెకు నా ప్రేమ గురించి  చెప్పాను. ఆమె తన ఆశయం చెప్పింది. ఆ ఆశయం అజేయ్ ద్వారానే నెరవేరుతుంది. నావల్ల కాదు. నేనెంత చెప్పినా వినక ఆమె ఊబిలోకి దిగింది. అయినా నేనామెకు సాయపడ్డాను. అజేయ్ కి  భయపడి కాదనీ, ఆమె పై ప్రేమతో సాయపడుతున్నాననీ స్పష్టం చేశాను.
    ఆర్నెల్లలో నా సాయంతొ ఆమె పేపరు పబ్లిష్ చేసింది. అయినా ఆమె అజేయ్ నే నమ్ముకుంది. అలాంటి  సమయంలో ఆమెకు నివేదిత పరిచయమైంది" బ్రహ్మం ఆగిగొంతు సవరించుకుని ఆ వివరాలు కొనసాగించాడు. వారి సారంశమిది:
    నివేదికూ ముత్యాలమ్మకూ యూనివర్సిటీలో పరిచయమైంది. ఇద్దరూ అందగత్తెలు. జీవితంలో ఎలాగో అలా పైకి రావాలనుకుంటున్నారు.
    అయితే ఇద్దరివీ దారులు వేరు. ముత్యాలమ్మకు పేరు కావాలి. నివేదితకు డబ్బు కావాలి. తను కాల్ గర్ల్ గా డబ్బు సంపాదిస్తున్నానని ముత్యాలమ్మకామె నిస్సంకోచంగా చెప్పుకుంది.
    "నీ తెలివికి-నువ్వు పేరు తెచ్చుకోవాలంటే-అందాన్ని పణంగా పెట్టక తప్పదు. అయితే నీకు కాల్ గర్ల్ గా నాకున్న స్వేచ్చ వుండదు' అనేదామె ముత్యాలమ్మతొ.
    నివేదిత చడువిలా అవగానే అలా బొంబాయి వెళ్ళింది. అక్కడ మోడలింగ్ లో క్లిక్కయిందామె. ఆ జీవితమూ ఆమెకు నచ్చింది. సుమారు ఏడాది తర్వాత ఆమె వెనక్కు వచ్చి ముత్యాలమ్మను కలుసుకుని, 'నువ్వూ బొంబాయి వచ్చెయ్. తిరుగులేని సంపాదన గౌరవానికి లోటుండదు. చదువు, అందం వున్న ఆడది స్వేచ్చను కోరుకుంటే బొంబాయి వంగి సలాములు చేస్తుంది,అని చెప్పింది.
    ముత్యాలమ్మను రమ్మనడంలో నివేదితక కొంత స్వార్థమూ వుంది.ఆమెకు తొడు కావాలి. అదీ అడతోడు. అది అక్కడి సమాజంలో  నిలదొక్కుకుందుకు బలాన్నిస్తుంది. ఒకరికిద్దరైతే-ఆ కొత్త జీవితంలో క్లిష్టతను సులభంగా ఎదుర్కోవచ్చు.
    ముత్యాలమ్మ నివేదితను నిరసించింది. అప్పుడు నివేదిత, 'నిన్ను చూస్తేనే అర్థమవుతోంది. నీకంటే నేనే  మెరుగు' అంది.
    అప్పుడు ముత్యాలమ్మలో ఆత్మవిశ్లేషణ మొదలైంది. బ్రహ్మానికి తనపై వున్న ప్రేమ గురించి నివేదితనకు చెప్పింది. నివేదిత బ్రహ్మాన్ని కలుసుకుని,'ముత్యాలమ్మను పెళ్ళిచేసుకో' అని సలహా ఇచ్చింది.
    "అతడామెను పెళ్లిచేసుకుందుకు సిద్దంగా వున్నాడు. కానీ అజేయ్ ముత్యాలమ్మనుబ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.అప్పటికి ముత్యాలమ్మకు ప్రొఫెసర్ నిజస్వరూపం తెలిసింది. ఆయన ఆమెను ఇప్పట్లో పెళ్లిచేసుకోనివ్వడు.
    విషయం పూర్తిగా బ్రహ్మానికి తెలిసింది. అతడి రక్తం సలసల మరిగింది.
    అప్పుడు తయారయింది-ఆపరేషన్ మేడిపండు.
    "ఒకరోజున-ఆదివారంనాడు-ముత్యాలమ్మ అజేయ్ కి ఫోన్ చేసింది.
    నివేదిత కార్లో బ్రహ్మం ఆయన ఇంటికి మారువేషంలో వెళ్ళాడు.
    అజేయ్ కిడ్నాపయ్యాడు-నివేదిత విశాఖపట్నం ఊరిచివర కొన్న బంగళాలో అక్కడ నివేదిత అజేయ్ ను జాగ్రత్తగా కనిపెడుతోంది. ఆయన అవసరాలు చూస్తోంది.
    ఆపరేషన్ మేడిపండు పేరు చెప్పి ఒకటొక్కటిగా అజేయ్  బండారాలు బయట పడుతున్నాయి. నేడో రేపో ప్రొఫెసర్ బయటపడనున్నాడు.
    "దిసీజే బ్లడ్ లెస్ కూ" అన్నాడు బ్రహ్మం.
    "కంగ్రాచ్యులేషన్స్" అన్నాడు గజపతి. "ఈ  విషయంలో నిన్నేవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే కిడ్నాపింగ్ గురించి అజేయ్  ఫిర్యాదు చేయలేడు"
    "నన్నేకాదు-ఇప్పుడు అజేయ్ ని ఏమీ చెయ్యలేరుమనదేశంలో ఎంక్వయిరీ కమిటీలు దోషాన్ని ఎత్తిచూపగలవే తప్ప- శిక్షించలేవు...." అన్నాడు బ్రహ్మం.
    "ఇంత జరిగేక అజేయ్  దియా డైరెక్టరుగా కొనసాగడానికి ఒప్పుకుంటాడు" అన్నాడు బ్రహ్మం తను సమాధానమిస్తూ.
    అప్పుడు రాజు చటుక్కున, "ఇందాకట్నుంచి గమనిస్తున్నాను. నువ్వు అజేయ్ ని సర్  అనడంలేదు" అన్నాడు.
    "ఆపరేషన్ మేడిపండు సక్సెస్ పుల్" అన్నాడు గజపతి.
                                                                *    *    *
    ముత్యాలమ్మ గృహిణి కావడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడింది.
    బ్రహ్మం ఆమెను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నానని చెబుతూ-
    "మనం గతంలోకి ఎప్పుడూ తొంగిచూడవద్దు. భవిష్యత్తుపై కలలు పెంచుకుంటూ వర్తమానంలో సుఖపడదాం" అన్నాడు.
    "నీ ఆపరేషన్ మేడిపండు నా విషయంలో సక్సెస్ పుల్" అంది ముత్యాలమ్మ.
                                                               *    *    *
`    రాజు దియాలో కొనసాగుతూనే కంప్యూటర్ కోర్సులో చేరాడు.
    "రాణీ! నువ్వు చెప్పినట్లే చేద్దాం. ఇద్దరం కంప్యూటర్ కోర్సు పూర్తిచేశాక స్వతంత్రంగా జీవిద్దాం. మనకు ప్రభుత్వోద్యోగాలూ వద్దు. శాస్త్ర పరిశోధనలూ వద్దు" అన్నాడు రాజు తన ప్రియురాలితో.
    "ఆపరేషన్ మేడిపండు నీ విషయంలోనూ సక్సెస్ పుల్" అంది రాణి.
                                                                *    *    *
    "మనదేశంలో కమిటీలు ముందే నిర్ణయించిన తీర్పుకు ఆమోదముద్ర వేయడానికే తప్ప-స్వంతంగా ఏదో తెలుసుకుందుకు కాదు" అన్నాడు గజపతి.
    "నేనలా కాదు. నీతి, నిజాయితీలను నమ్ముకున్నవాణ్ణి న్యాయంకోసం ఒంటరి పోరాటానికైనా సిద్దమే" అన్నాడు గోవిందరావు పట్టుదలగా.
    "అయితే మీ నీతి, నిజాయితీలను పరీక్షకు పెట్టాల్సిందేకిడ్నాపర్స్ ను ఉసిగోలిపేదా?" అన్నాడు గజపతి.
                                 *    *    *
    ఆపరేషన్ మేడిపండుకు మరోపేరైన ప్రజాస్వామ్యం ఎన్నికలు మళ్ళీ ప్రజలమీదకు వచ్చిపడ్డాయి-మధ్యంతరం రూపంలో అర్థంతరంగా.
    ప్రజలు ఓట్లేయడానికి సన్నద్దులవుతున్నారు. వారి తీర్పు ఇంకా రాలేదు-కానీ అప్పుడే అజేయ్ దియాలో తన పదవిలో కొనసాగుతున్నాడు.
                 _____శుభం_____

 Previous Page