Previous Page Next Page 
ఆపరేషన్ మేడిపండు పేజి 13

    ఆడది సవతిని చేరదీయగలదు, సవతిబిడ్డను ఆదరించ గలదు. కానీ రాజకీయపక్షం మరో పార్టీ బడుగును-ఆ వ్యక్తి బడుగే అవుగాక-ఆదరించగలదా, చేరదీయగలదా?
    అందుకే సర్ ఆలోచన రాజకీయవాదులకు నచ్చలేదు. ఇది మొగ్గలోనే త్రుంచేయాలనుకున్నారు. సర్ విన్నట్లు లేదు. బహుశా ఈ కిడ్నాప్ కు గుర్తింపు రిజర్వేషన్ కూడా కారణం కావచ్చు"
    "రాజు ఆలోచిస్తున్నాడు. బ్రహ్మం చెప్పింది నిజమే అనిపిస్తోంది. ప్రొఫెసర్ అజేయ్ ఆలోచన  దేశ రాజకీయ స్వరూపాలనే ఓ ఊపుతుంది. ఎందుకంటే సమర్థులను సత్కరించడానికి మన ప్రభుత్వం చేతిలో వున్న అవార్డులిన్నీ అన్నీ కాదుకదా!
    "ఇంతకీ దియాలో అవార్డు నీకు రిజర్వయిందా?"
    "అన్నీ నీకు చెప్పను-ఒకేఒక్క అవార్డు గురించి మాత్రం చెప్పగలను...."ఆగాడు బ్రహ్మం.
    నేటి బాలలే రేపటి పౌరులు.నేటి రీసెర్చి స్కాలర్స్ రేపటి సైంటిస్టులు.
    మనిషికే కాదు- మంచి ఆలోచనకూ మహిళ మాత్రమే జన్మనివ్వగలదు.
    మన దేశంలో ఉద్యోగావకాశాలు లేక రీసెర్చి స్కాలర్స్ నిస్పృహ చెందుతున్నారు.
    ఇరవయ్యోశతాబ్దపు మలి సంధ్యాసమయంలోకూడా మహిళలు వెనుకబడేవున్నాను.
    తీగెకు పూవు, చెట్టుకు కాయ అందమైనట్లు మనిషికి ప్రతిభ అందం.
    ఇవన్నీ దృష్టిలో వుంచుకుని లేడీ రీసెర్చి స్కాలర్స్ కోసం 'దియా సుందరి' అనే అవార్డును సృష్టించాడు ప్రొఫెసర్ అజేయ్.
    ప్రత్యేకంగా ఆ అవార్డుకోసం ఆయన ఇంటర్వ్యూలు చేసి-ముత్యాలమ్మను ఎన్నిక చేశాడు. అంటే 'దియాసుందరి' అవార్డు ముత్యాలమ్మకు రిజర్వయింది....
                                                                  *    *    *
    అలారం అదేపనిగా మోగుతుంటే ఉలిక్కిపడి నిద్రలేచిన ముత్యాలమ్మటైము చూసుకుని, 'అరే అప్పుడే తోమ్మిదయింది. నాకింత మొద్దునిద్ర పట్టేసిందేమిటీ?'అనుకుంటూనే బద్దకంగా ఒళ్లు విరుచుకుంది.
    ముత్యాలమ్మ చకచకా కలాకృత్యాలు నిర్వహిస్తూనే ఆలోచిస్తోంది.
    తనకంత మొద్దునిద్ర ఎలా పట్టేసిందీ అన్నది అంతుబట్టడంలేదు.
    తనకు తెలిసి జీవితంలో ఒక్కసారి కూడా ఆమె అంత నిద్రపోలేదు.
    అదలాగుంచితే తొమ్మిదింటికి అలారం మోగడం ఇంకా చిత్రం.
    సాధారణంగా అలారాన్ని ఆరింటికి పెట్టుకుంటుంది తను.
    అయితే ఆ టైము ఎలా మారింది? తనే మార్చితే ఎప్పుడు మార్చింది?
    స్నానం కూడా అయి బట్టలు వేసుకుంటున్నప్పుడు ముత్యాలమ్మకు ఉన్నట్లుండి ఒక విషయం గుర్తుకువచ్చింది. దాంతో ఆమెలో కంగారు రెట్టింపయ్యింది.
    తన అలారం బ్యాటరీతో పనిచేస్తుంది. బ్యాటరీ అయిపోయి అది ఆగిపోతే కొత్త బ్యాటరీ వేయాలని సుమారు వారం రోజుల్నించి అనుకుంటూ మర్చిపోతోంది.
    ఈ రోజు అలారం మోగింది. అదీ తొమ్మిది గంటలకి.
    ఎవరో  తన టైమ్ పీస్ లో బ్యాటరీ వేశారు. అలారం తొమ్మిదికి పెట్టారు.
    అలా ఎందుకు జరుగుతుంది?
    ప్రొఫెసర్ అజేయ్ కిడ్నాపయ్యాడు. తనయనకు ప్రియతమ స్టూడెంటు.
    ఆపాదమస్తకం వణికింది ముత్యాలమ్మ.అప్పుడామె చేతిలోని డ్రస్సు కిందకు జారిపోయింది.
    అద్దంముందు నిలబడ్డ ముత్యాలమ్మ ఉలిక్కిపడింది.
    అద్దంలో తను-బర్త్ డే సూట్ లో!
    అప్రయత్నంగా ఆమె అటూ ఇటూ  చూసింది. ఇంట్లో ఇంకెవరూ లేరు.
    ముత్యాలమ్మ మనసులో ఏవేవో జ్ఞాపకాలు అపశ్రుతుళ్ళా మెదులుతున్నాయి.
    చటుక్కున ఆమె డ్రస్సులో తనఒంటిని దాచుకుంది. అయినా ఆమె శరీరం ఇంకా వణుకుతూనేవుంది.
    'క్యాంటీన్ కి వెళ్ళి వేడివేడిగా కాఫీ తాగితే కానీ బుర్ర పనిచేయదు' అనుకుంటూ ఆమె చెప్పుల స్టాండు వద్దకు వెళ్ళింది.
    ఆమెకు పన్నెండు జతల చెప్పులున్నాయి. డ్రస్సుణు బట్టి వాటినేన్నుకుంటుందామె.
    ఏమయ్యాయో-ఇప్పుడక్కడ ఒక్కటే చెప్పుల జత వుంది.
    ఆమె చుట్టూ చూసింది. అన్ని జతల చెప్పులూ ఏమయ్యాయో అనుకుంటూనే ఉన్న ఒక్క జతా చేతుల్తో తీసింది.
    అంతే-వాటిలోంచి ఒక కాగితం మడత జారిపడింది.
    మామూలుగా అయితే ముత్యాలమ్మ పట్టించుకునేది కాదు. కానీ మడతపెట్టబడిన ఆ కాగితం చెత్తకాగితం కాదు. ప్రేమికుల లెటర్ ప్యాడ్ లా రంగురంగులతో వున్న ఆ కాగితం నుంచి పరిమళం గుప్పుమంది.
    ముత్యాలమ్మ చెప్పులు జారవిడిచింది. ఆ కాగితాన్నందుకుంది.
    మడత విప్పితే అందులో ఎర్రటి గుండ్రటి అక్షరాలతో ఒకటే వాక్యం.
    'డయల్ 37123 ఫర్ ఎనీ డౌట్స్'
    ఎవరు-ఎవరు రాశారా ఉత్తరం?
    ఆ దస్తూరీ తనకు పరిచయం లేదు. ఆ నంబరు తనకు తెలియదు.
    ఎవరో అపరిచితులు తనకోసం ఈ సందేశం విడిచివెళ్ళారు. ఎందుకు?
    ముత్యాలమ్మ ఎక్కువసేపు ఆలోచించలేదు.
    తిన్నగా తన ఫోనుదగ్గరకు వెళ్ళింది. రిసీవరెత్తి జీరో నొక్కింది.
    డయల్ టోన్ రాగానే 37123 నంబరు డయల్ చేసింది.
    "హలో మేడమ్! మెలకువొచ్చిందా?" అందవతలి గొంతు.
    ముత్యలమ్మకా గొంతెవరిదో తెలియలేదు. కానీ అది మగాడి గొంతు.
    "ఈజిట్ 37123?" అనడిగిందామె అనుమానంగా.
    "ఎస్-నువ్వు ముత్యాలమ్మవుకదా-నీకీ నంబరిచ్చింది నేనే!"
    "ఎవర్నువ్వు?"
    "అన్నీ నీ దగ్గరకే వచ్చి చెబుతాను. హాస్టల్ రూమ్ లోనే వుండు"
    "ఎవర్నువ్వు?" రెట్టించింది ముత్యాలమ్మ.
    "నేనెవరినో చెబుతాను. నువ్వెవరివో కూడా చెబుతాను. జస్ట్ వెయిట్!"
    "ఎవర్నువ్వు?" ఇంచుమించు అరిచింది ముత్యాలమ్మ.
    "నా గురించి చెప్పాలంటే  పంచ భంగిమల గురించి చెప్పాలి. ఫోన్లో ఆ వివరాలు వినడానికి అభ్యంతరం లేదంటే తప్పకుండా  చెబుతాను"
    ఆ గొంతులో వెటకారాన్ని ముత్యాలమ్మ అర్థంచేసుకుంది. కానీ-
    పంచ భంగిమల గురించి ఆ మనిషికెలా తెలుసు? ఆ వివరాలు ఒక్కరికి తప్ప మరో మనిషికి  తెలియడానికి వీల్లేదు. కానీ ఈ గొంతు కొత్తది.
    "ఓ.కే. రూమ్ లో నీకోసం వెయిట్ చేస్తూఉంటాను...." అందామె.
    "క్యాంటీన్ కి వెళ్లి టిఫిన్ చేసిరా- మనం చాలాసేపు మాట్లాడుకోవాలి. ఖాళీ కడుపుతో కూర్చుంటే నీరసం రాగలదు మరి!"
    "నిన్ను కలుసుకునేదాకా-నాకు ఎ టిఫినూ ఎక్కదు" అంది ముత్యాలమ్మ .
    "అయితే వెంటనే వస్తున్నాను" అవతల క్లిక్ మంది.
                                                                        *    *    *
    కాలింగ్ బెల్ విని వెళ్లి తలుపుతీసింది ముత్యాలమ్మ.
    అతడు చిరునవ్వులు చిందిస్తూ "అయాం ఫ్రమ్ 37123" అన్నాడు.
    ముత్యాలమ్మ వెనక్కు తప్పుకుంది. అతడు లోపలకు వస్తూనే తలుపులు బార్లా తీసి వెనక్కు పడకుండా  పక్కనేవున్న బల్ల  అడ్డుపెట్టాడు.
    "ఏమిటిది?" అంది ముత్యాలమ్మ అసహనంగా.
    "ఆడపిల్లవు. అపరిచితుణ్ణి. మనం చాలాసేపు ఈ గదిలో గడపబోతున్నాం. ఎవరికీ ఏ అనుమానం రాకుండా ఇలా తలుపులు తీసి వుంచాను. అంతా నీ క్షేమం కోరే! ఎవరెప్పుడు గదిలో ప్రవేశించినా వారికి అవాంఛిత దృశ్యాలేం కళ్ళక్కనబడవు"
    అప్పుడామె అతణ్ణి పరీక్షగా చూసింది.
    ముఖం చూస్తే నడివయస్కుడిలాగున్నాడు. రంగేస్తున్నాడో ఏమో- జుత్తు మాత్రం నల్లగానే వుంది. చూడ్డానికి మర్యాదస్థుడిలా వున్నాడు. అతడి భిజానికో ఫ్లాస్కు వేలాడుతోంది. ఆమె దృష్టి ఫ్లాస్కుమీద పడగానే , "కాఫీ -ఇట్స్ ఫర్ యూ. కాఫీ అయినా పుచ్చుకోకుండా మనం ఏం మాట్లాడుకుంటాం?" అన్నాడతడు.
    ఆమె వెనక్కు నడిచింది. అతడికి కుర్చీ చూపించింది. తను వెళ్లి రిఫ్రిజిరేటర్లోంచి బ్రెడ్, బటర్, జామ్ తీసుకొచ్చి టీపాయ్  మీద పెట్టింది. తర్వాత కప్పులు, చాకు, వాటర్ జగ్, గ్లాసులు వగైరాలు తెచ్చింది.
    ఎందుకో ముత్యాలమ్మకు అతణ్ణి చూడగానే మనసు తేలికపడింది.
    ఇద్దరూ బ్రెడ్ తిన్నారు. మంచినీళ్ళు తాగేరు. ఆ తర్వాత కాఫీ  పుచ్చుకున్నారు.
    "మేడమ్! నాకు చాలా తెలుసని అర్థమైయుంటుంది. కాబట్టి సంకోచం విడిచిపెట్టి నేనడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబివ్వాలి" అన్నాడతడు.
    "మళ్ళీ అడుగుతున్నాను. ఎవర్నువ్వు?" అంది ముత్యాలమ్మ.
    "ప్రొఫెసర్ అజేయ్ కి  మిత్రుణ్ణి. మేమిద్దరం ఒకరినొకరు ఏరా అనుకుంటాం. ప్రపంచానికంతటికీ పరిచయమైనా అజేయ్ కీ-నాతో ఏకాంతంలో వుండే అజేయ్ కీ  ఎంతో తేడా వుంది.
    "నీకు నీతో ఏం పని?"
    "నాకు అజేయ్ తొ పని వుంది. అందుకని నీతో పనిబడింది" అన్నాడతడు.
    "అజేయ్  సర్ కిడ్నాపయ్యారు. ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు"
    "కానీ నీకు తెలుసు"
    "నాకెందుకు తెలుస్తుంది?" అందామె.
    అయిదునిముషాలసేపు వాళ్లిద్దరూ ఎవరి మాట మీద వాళ్ళు నిలబడ్డారు.
    "ఇంటినుంచి బయలుదేరబోయేముందు అజేయ్ నాకు ఫోన్ చేశాడు. నీనుంచి ఫోన్ అందుకుని వెడుతున్నాననీ-సాయంత్రానికల్లా వచ్చేస్తాననీ అన్నాడు"
    "ముత్యాలమ్మ అసహనంగా- "ఆ విషయం ఆయన మీకెందుకు చెప్పాలి?" అంది.
    "ఎందుకేమిటి? ఇలాంటి వివరాలు నాతో పంచుకోవడమే వాడికి ఆనందం"
    ముత్యాలమ్మ  కళ్ళలో నీళ్ళు ఏముందో మొత్తమంతా నాకు తెలుసు. ఆ అనుభవాలను  వాడు భార్యతో పంచుకొలేడుకదా- అందుకని నాకు చెప్పుకుంటాడు. అదీ  ఎందుకంటే సైంటిస్టుగా వాడి బుర్ర అమోఘం కావచ్చు. ఇందులో మాత్రం మట్టిబుర్ర. వాడికి నేను సలహాలిస్తాను. తూచా తప్పకుండా పాటిస్తాడు. అన్నీ నేను చెప్పినట్లే జరిగేసరికి వాడికి  నామీద గురి పెరిగిపోతూ వచ్చింది. ఆఖరికి ఆ ఫోటోల ఐడియా కూడా నాదే!"
    "ఏ ఫోటోలు?" కంగారుగా అడిగిందామె.
    "అవే-పంచ భంగిమల.."
    "నువ్వు అబద్ధం చెబుతున్నావు..."అంది ముత్యాలమ్మ.
    "నా మాటలు నిజమని నమ్మడానికి నీకు కొన్ని రుజువులు చెబుతాను"
    ముత్యాలమ్మ మాట్లాడలేదు.
    అతడు కొన్ని తేదీలు, సంఘటనలు చెప్పి, "సభా మర్యాదను పాటించానుకదూ! తప్పును చెప్పడానికైనా కాశీనాధుని విశ్వనాథ్ బాణీ మనది. నువ్వు మరీ నొక్కిస్తే తప్ప మిగతావాళ్ల రూట్లోకి రాలేను" అన్నాడు.
    ఆమె వెంటనే ముఖం రెండు చేతుల్లోనూ కప్పుకునియా ఏడ్వసాగింది.
    "నువ్వెందుకేడుస్తున్నావో నాకర్థంకావడంలేదు. నువ్వేం తప్పుచేయలేదు"
    గంభీరంగా అన్న అతడి మాటల్లో ఓదార్పును వెదుక్కుంటూ కాసేపటికి తమాయించుకుందామె. "నాతో నీకేం పని?" అంది.
    "నువ్వు ఫోన్ చేశాక ఇంట్లోంచి బయల్దేరిన అజేయ్ ఆ తర్వాత ఏమైపోయాడో ఎవరికీ తెలియకుండా వుంది. ఏం జరిగిందో నువ్వు చెప్పాలి. ఒకవేళ అజేయ్ నీ దగ్గరకు రాకపోతే-అసలు నువ్వెందుకు ఫోన్ చేశావో చెప్పాలి"
    "ఆ రోజు నేను సర్ కు ఫోన్ చేయలేడు" అంది ముత్యాలమ్మ.
    "నువ్వు చేయలేదనే నా అనుమానం కూడా నీచేత ఎవరు చేయించారో చెప్పు"
    "అసలా రోజు నేను సర్ తో ఫోన్లో మాట్లాడనేలేదు"
    "మేడమ్! డోన్ట్ ఇన్వైట్ రిస్క్. ఇంతవరకూ నేను మర్యాదగా చెబుతున్నాను. ఇక బెదిరించక తప్పదు" అన్నాడతడు.
    "నాకేం తెలియదంటే నమ్మవేం?"
    "అయితే నేను అజేయ్ గురించి పోలీస్ కంప్లయింట్ ఇస్తాను. నువ్వు ఫోన్ చేసిన సంగతి చెబుతాను. నీకూ. అజేయ్ కి. మధ్యనున్న వ్యవహారం చెబుతాను. పంచ భంగిమల్ని పోలీసులకు అందజేస్తాను...."
    "నో...." అరిచింది ముత్యాలమ్మ.
    "అరిచి లాభం లేదు. నేనడిగిండానికి జవాబు చెప్పాలి" అన్నాడతడు.
    "మీ ఉద్దేశ్యమేమిటో నాకర్థంకావడంలేదు...." అంది ముత్యాలమ్మ.
    "ప్రొఫెసర్ అజేయ్ మీద నీకు కక్ష వుంది. సమయంకోసం ఎదురుచూస్తున్నావు. అవకాశం రాగానే  అతణ్ణి కిడ్నాప్ చేయించావు."
    "సర్ ని కిడ్నాప్ చేయడంవల్ల నాకేమిటి లాభం? నా భావిష్యత్తంతా సర్ మీద ఆధారపడివుంది. నేనాయన శ్రేయోభిలాషిని...."
    "పగ,ప్రతీకారం భవిష్యత్తుని చూసేమాటైతే ప్రపంచంలో ఇన్ని నేరాలు జరుగవు. అందుకే నేను వర్తమానం గురించి అడుగుతున్నాను...."
    ముత్యాలమ్మ తేలికగా నిట్టూర్చి-
    "నేను సర్ కిడ్నాప్ కి సహకరించడానికి పగ, ప్రతీకారం కదా కారణమంటున్నారు. నాకాయన మీద ఆశే తప్ప పగ లేదు. ఆయన కిడ్నాప్ నుంచి ఎప్పుడు బయటపడతారా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నాను నేను" అంది.
    అప్పుడు వారిద్దరి మధ్యా మరిన్ని ప్రశ్నలు నడిచాయి. వాటిలోంచి చిత్రమైన ఆమె కథ అబయతపడింది.
                                  *    *    *   
    చిన్నతనంలోనే తల్లి పోయింది ముత్యాలమ్మకు. తండ్రిరెండోపెళ్ళి చేసుకున్నాడు.
    సవతితల్లి రమణమ్మకు ముత్యాలమంటే గిట్టేది కాదు. తండ్రి ఆమెను అదుపు చేయలేకపోయేవాడు. ఫలితంగా ముత్యాలమ్మకు జీవితం నరకమే అయింది.
    ముత్యాలమ్మకు మూడు నిండగానే రమణమ్మకు సత్యవతి పుట్టింది. ఆ తర్వత ఏడాదికే రఘు పుట్టాడు. ఆపైన తండ్రి ఆపరేషన్ చేయించుకున్నాడు.
    ముత్యాలమ్మను స్కూల్లో వేశారు. ఆమెకు చదువంత బాగా వచ్చేది కాదు. అందుకని ఆమె కష్టపడి చదివేది. బడిలో పాఠాలు శ్రద్దగా వినేది. తన వంతు కృషికి లోటు రానిచ్చేది కాదు.
    రమణమ్మ ముత్యాలమ్మ చదువుకు ఎన్ని విఘాతాలు  కల్పించాలో అన్నీ కల్పించేది. ఇంటిపనులు చాలావరకూ  ఆమెవే. పిల్లల చాకిరీ కూడా ఆమెదే!
    అయితే చూసేవాళ్ళకు బాగుండదని రమణమ్మ ఆమెను స్కూలుమాత్రం మానిపించేది కాదు. మార్కులు బాగా రాకుంటే మాత్రం నానామాటలూ అనేది. అస్తమానూ "ఎంత చదివినా టెన్త్ దాకానేగా- ఆ తర్వాత నువ్వు గట్టెక్కేదీ లేదు. మేము చదివించేదీ లేదు" అంటూండేది.
    తన చదువు టెన్త్ తో ఆగిపోతుందని ముత్యాలమ్మకు బెంగ. అయితే పరీక్షలంటే ఆమెకు భయం. అందులోనూ పబ్లిక్ పరీక్షలమెకు గండంగానే అనిపించేవి.
    అందుకని ముత్యాలమ్మ క్లాస్ మేట్సందరితో మంచిగా వుండేది. గురువులను బాగా కాకాపట్టేది. ఏమాత్రం వీలున్నా తన కథను సూచనప్రాయంగానైనా తెలియజేసి సానుభూతిని సంపాదించేది.
    ఆడపిల్ల. అందమైనది. సానుభూతిని కోరుతున్నది.
    పన్నెండేళ్ళ వయసులోనే ముత్యాలమ్మ ఎంతో మనోహరంగా వుండేది.
    కాపీ చేసి ముత్యాలమ్మ  ఏడు ప్యాసయింది. టెన్తూ గట్టెక్కింది. ఇంటరూ పూర్తి చేసింది. ప్రభుత్వం ధర్మమా అని మహిళల రిజర్వేషన్లోంచి ఆమె బియస్సీలో సీటు కొట్టేసింది. ఎమ్మెస్సీ అనిపించుకుంది. క్లాస్ మెట్స్ క్లి ఆమె తెలివి తెలుసు. ఆమె అంత దూరం ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపడేవారు. ఆశ్చర్యపడుతూనే ఆమెకు సాయమూ చేసేవారు. సాయపడుతూనే ఆమె అభివృద్దికి దోహదం చేసేవారు.

 Previous Page Next Page