Previous Page Next Page 
ఆఖరి మజిలి పేజి 13


    హౌస్ ఫుల్ బోర్డు చూసి ఏం చేయాలో తోచక ఉస్సూరుమంటున్న స్టాఫ్ నర్స్ లిల్లీ కనిపించడంతో కుమార్ మనసు ఆనందంతో గంతులు వేసింది.

    కృష్ణప్రియతో పాటే ఉస్మానియాలో పనిచేస్తుంది లిల్లీ.

    కుమార్ కు ఆ సమయంలో కృష్ణప్రియ రాకపోవడమే మంచిదనిపించింది.

    ఆమె కావాలని తనను ఇబ్బంది పెట్టినా అది ఒక విధంగా మంచిదనిపించింది.

    ఆమె కావాలని తనను ఇబ్బంది పెట్టినా అది ఒక విధంగా తనకు వరమే అయింది!

    ఆటో రివర్స్ చేసుకుని వెళ్ళబోతున్నది లిల్లీ...

    అది గమనించిన కుమార్ ఖంగారు పడిపోయాడు.

    లిల్లీని...ఆమె అందమయిన వంపు సొంపులను కళ్ళతోనే ఆస్వాదిస్తూ ఆటో వైపు వడివడిగా కదిలాడు కుమార్.

   
                                                           *    *    *


    రాత్రంతా నిద్రలేక కళ్ళు ఎర్రబడ్డాయి డాక్టర్ కృష్ణప్రియకు.

    "టింకూకు నార్మల్ కు వచ్చిన టెంపరేచర్ ఒక్కసారిగా పెరగడంతో రాత్రంతా వాడిని కనిపెట్టుకుని బెడ్ దగ్గరే కూర్చుంది. తెల్లవారుతుండగా టెంపరేచర్ తిరిగి నార్మల్ కి రావడంతో టింకూ నిద్రపోయాడు.

    చిక్కిన ఎముకల పోగులావున్న టింకూను చూస్తున్న ఆమెకు గిర్రున కళ్ళనీళ్ళు తిరిగాయి. బొద్దుగా ముద్దు లొలికే టింకూ అలా అయిపోవడంతో తన ట్రీట్ మెంట్ మీద తనకే నమ్మకం సన్నగిల్లింది.

    ఆలోచిస్తూనే ఉదయం పూట వచ్చిన పేషెంట్లను పరీక్ష చేసింది. అయినా ఆమె దృష్టి తను చేస్తున్న పరీక్షల మీద లేదు.

    ఎదురుగా కనిపిస్తున్న ఇన్ స్పెక్టరు నవీన్ ను చూడగానే అప్పటివరకువున్న  బడలిక, చికాకు ఏక కాలంలో  పటాపంచలయిపోయాయి.

    చూస్తున్న పేషెంట్ ను బయటకు పంపింది.

    నవీన్ రావడంతోనే కృష్ణప్రియను కౌగిలించుకున్నంత పనిచేశాడు.

    "బాగున్నావమ్మా..." అంటూ ఆప్యాయతతో, అనురాగంతో."

    "బాగానేవున్నాను. వదినా నువ్వూ నన్ను పూర్తిగా మరచిపోయినట్టున్నారు..." అన్నది కళ్ళొత్తుకుంటూ.

    తోడబుట్టినవాడు ఎదురుపడగా తన కష్టాలు అన్నీ ఒక్కసారిగా ఏకరువు పెట్టాలనిపించింది. కాని, రాక రాక వచ్చాడు. వచ్చిన వాడితో మంచి చెడుకు కాక ఎకాయెకిన తన సమస్యలు చెప్పటం మొదలెడితే తనతోపాటు తోడబుట్టిన వాడిని కూడా బాధపెట్టినట్టవుతుందని నోటిదాకా వచ్చిన తన బాధను దిగమ్రింగింది కృష్ణప్రియ.

    "ఏమ్మా! కళ్ళకింద ఆ నల్లఛాయలేవిటి. కళ్ళల్లో ఆ కన్నీరేమిటి? నీకేమన్నా కష్టం కలిగితే నీ అన్న లేడనుకున్నావా తల్లీ?  నాకు వెంటనే ఫోను చేయవచ్చు కదమ్మా..." నవీన్ నిష్టురంగా అన్నాడు ప్రేమగా పలికాడు.

    "ఏం లేదు అన్నాయ్...! ఒదినా పిల్లలు అంతా కులాసాయేగా?" చాలారోజులు తరవాత కలుసుకున్నట్లున్నది ఇద్దరి సంభాషణ.

    "ఏమ్మా! నువ్వు అనుకున్నట్లు నీ చదువు, తరువాత హాస్పిటల్ లో ఉద్యోగం అన్నీ ఏర్పాట్లు చేసుకున్నావు. ఇప్పుడన్నా జీవితంలో సెటిల్ అవ్వడానికి ప్రయత్నించవా? అన్నట్టు మొన్నామధ్య కుమార్ కనిపించాడు. ఇక్కడెక్కడో ప్రయివేటు ప్రాక్టీసు పెట్టాడట. నీ దగ్గరికి వచ్చాడా?..."

    "ఊ..." అంది ముభావంగా డాక్టరు కృష్ణప్రియ.

    కుమార్ పేరు ఎత్తగానే చెల్లెలి మొఖంలో  వచ్చిన మార్పును గమనించాడు ఇన్ స్పెక్టరు నవీన్.

    "నీకు తగ్గట్టుగా అతనికి కూడా పి.జి. వుంది. నువ్వంటే అతను ఇష్టపడుతున్నట్టు  అర్ధమౌతుంది. ఇక, నీ అభిప్రాయం చెబితే మాట్లాడతాను..." అన్నాడు చెల్లి తల నిమురుతూ.

    "అన్నాయ్! ఈ విషయం గురించే మాట్లాడడానికి వచ్చావా? నాకు ఇప్పట్లో పెళ్ళి చేసుకోవాలని లేదు..." కోపంగా అంది కృష్ణప్రియ.

    "సారీకృష్ణా! అసలు నేను వచ్చింది ఈ విషయం గురించి కాదు. ఏదో ఉండబట్టలేక బాధ్యతగా అనేశాను. నీకిష్టంలేని విషయాలగురించి  ఇంకెప్పుడూ  మాట్లాడను. సరేనా!..." తిరిగి చెల్లిని మంచి మూడ్ లో పెట్టాలని అన్నాడు నవీన్.

 Previous Page Next Page