Previous Page Next Page 
ఆఖరి మజిలి పేజి 14


    "చూడు కృష్ణా! ఇప్పుడు నాకు నీ సహాయం అవసరమయింది. ఓ టిపికల్ కేసులో ఒక స్త్రీ మనస్తత్వాన్ని తెలుసుకోవలసిన అవసరం పడిందమ్మా. ఈ కేసు నువ్వు స్టడీ చేయాలి. దీనిమీదే నా పరిశోధన ఆధారపడి వుంది. ఈ కేసులో నేను విజయం సాధిస్తే రాష్ట్రపతి పతకం నాకు రావడం ఖాయం..." అన్నాడు సంతోషంగా.

    "బాగానేవుంది నీకు పతకం వస్తే నాకేమిటి లాభం?" అంది బుంగమూతి పెడుతూ.

    "ఎంచక్కా ఆ బంగారుపతకం కరిగించి నగ చేయించుకోవచ్చు. నాకు పెళ్ళి ఖర్చు తగ్గుతుందిగా..." అన్నాడు నవ్వుతూ ఆ అన్న.

    "చీపో అన్నాయ్! నా పెళ్ళి గురించి తప్పుతే నీకు వేరే ఆలోచన లేనట్టుంది." చిరుకోపం ప్రదర్శించింది కృష్ణప్రియ.

    "అయితే రేపటినుంచే ఈ కేసును నువ్వు స్టడీ చేయాలి" అంటూ తనే పేషెంటు విషయం చెప్పి, ఆమె అడ్రస్ ఇచ్చాడు.

    ఆమె ప్రవర్తన విన్న తరువాత కృష్ణప్రియకు ఇంట్రెస్టు పెరిగింది. తను చదివిన మెడికల్ బుక్సులో ఎక్కడా అందనట్టున్న ఆమె మనస్తత్వాన్ని ప్రత్యేకంగా ప్రత్యక్షంగా తెలుసుకోవలసిందే అని పట్టుదల పెరిగింది.  

    "ఓ. కే. డన్..." అంది హుషారుగా అన్నకు చేయి చూపుతూ.

    నవీన్ తనమీద ఇప్పటివరకువున్న భారాన్ని ఎవరో తొలగించినంత సంబరపడిపోయాడు.

    "వస్తానమ్మా...ఏదయినా విషయం వుంటే వెంటనే ఫోన్ చేయి..."

    నవీన్ వెళ్ళిపోయాడు.


                        *    *    *


    మనసు మనసులో లేదు డా|| కృష్ణప్రియకు.

    "టింకూను హాస్పిటల్ కు తీసుకువెళ్ళి పరీక్షలు చేయాలనుకున్నది. సమయానికి కారు లేదు. అనవసరంగా కుమార్ ను వదిలేసి వచ్చింది.

    కారు వచ్చేవరకు టింకూను కదపడం ఇష్టంలేక ఆటోలో హాస్పిటల్ కు వెళ్ళింది.

    కృష్ణప్రియ కనపడడంతోనే వార్డుబోయ్ ఫియట్ కారు తాళాలు తెచ్చి ఇచ్చాడు.

    "డాక్టర్...కుమార్ గారు మీకు ఇమ్మన్నారు"

    తలూపుతూ కారును సమీపించి డోర్ తెరచిన కృష్ణప్రియ ఖంగుతిన్నది.

    సెంటువాసన గుప్పుమన్నది...!

    మల్లెపూలు అక్కడక్కడా చెల్లాచెదరుగా పడివున్నాయి.

    వెనుక సీట్ లో బట్టల పాకెట్ ఒకటి కనిపించింది...దానికి పంచ్ చేసిన బిల్ పై 'లిల్లీ' పేరు వుండడంతో ఏం జరిగిందో వూహించింది.

    కుమార్ తో తనకంపెనీ తలచుకోవడంతో  జుగుప్స, అసహ్యం ఒకసారిగా ముంచెత్తాయి...మనస్సును సమాధానపరచుకుంటూ కృష్ణప్రియ కారును స్టార్టుచేసింది.

    వెంటనే ప్లాట్ కు వెళ్ళి టింకూను తీసుకుని హాస్పిటల్ కు వచ్చింది.

    టింకూ ఇంతవరకూ తన తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నించలేదు...ఒకవేళ అడిగితే ఏం చెప్పాలో సమాధానం తన దగ్గర సిద్ధంగా లేదు...ఇప్పుడు వాడికి ఐదేళ్ళు నిండాయి...

    కాస్తో కూస్తో లోకజ్ఞానం తెలుసుకునే వయస్సు వచ్చింది కాబట్టి ఎప్పుడయినా తన కన్న తండ్రి ఎవరో అడగకపోడు...ఒకవేళ టింకూకి అలాంటి ఆలోచన రాకపోయినా ఈ సమాజానికయినా టింకూ తల్లిదండ్రులు ఎవరో తెలియడం అవసరం.

    టింకూను కారులో నుంచి దింపడం చూస్తున్నా ఒక్క నర్సు కూడా సాయం రాలేదు.

    అప్పుడే అటుగా వెళుతున్న స్టాఫ్ నర్స్ లిల్లీ ఎదురయింది...

    "లిల్లీ...నీ పాకెట్ ఒకటి రాత్రి నా కారులోనే మరచిపోయినట్టున్నావు. అది ఇంటిదగ్గర వుంది...సాయంత్రం వచ్చి తీసుకువెళ్ళు..." అన్నది కృష్ణప్రియ.

 Previous Page Next Page