కృష్ణప్రియ బస్సు దిగి చుట్టూ చూసింది.
ఆ బజారు పెద్ద సందడిగా లేదు. దూరంగా పెద్ద పెద్ద ఫ్యాక్టరీ షెడ్స్ కనిపిస్తున్నాయి.
కిందకు దిగి, క్షణం కూడా ఆగకుండా ఒక వీధి వైపుకు నడిచిపోతున్న అతనిని వెంబడించింది కృష్ణప్రియ.
దూరంగా రైల్వేగేటు కనిపిస్తున్నది...
అది ఫాక్టరీ రోడ్డు నిర్మానుష్యంగా వున్నది.
ఫాక్టరీ ముందు వున్న లైట్ల వెలుగులో రోడ్డు స్పష్టంగా కనబడుతున్నది.
అతను నడుస్తూనే వున్నాడు.
కృష్ణప్రియ ఎంత వేగంగా అడుగులు వేస్తున్నా వారి మధ్య దూరం పెరుగుతూనే వుంది.
ఒక్కసారిగా ఆ పరిసరాలు, తానున్న పరిస్థితి కృష్ణప్రియకు గుర్తుకు వచ్చాయి.
అది ఊరి చివర అని చాలా స్పష్టంగా తెలిసి పోతున్నది.
టైమ్ అప్పటికే ఏడుదాటింది.
చుట్టూ ప్రక్కల ఒక్క ఆటో కూడా కనిపించడం లేదు.
కుమార్ తో కలిసి తాజ్ హోటల్ కు వెళ్ళినప్పుడు ఇంటికి రింగ్ చేసింది. రాత్రి లేట్ గా వస్తానని అయాతో చెప్పింది.
టింకూకు ఇవ్వాళే పత్యం పెడదామనుకున్నది__తను లేకపోతే మారాం చేస్తాడేమో...ఏదయినా వీలయినంత తొందరగా ఇంటికి చేరాలి అనుకున్నది కృష్ణప్రియ.
"ఏమండి..."
చీకటిలో కలిసిపోతున్న అతనిని గొంతు చించుకుని మరీ పిలిచింది.
ఆ వ్యక్తి క్షణం ఆగి వెను తిరిగాడు.
వడివడిగా అడుగులు వేస్తూ అతన్ని సమీపించిందామె.
అతని నవ్వుని చూసి నిర్ఘాంతపోయింది.
కిళ్ళీ వేయడం వలన కాబోలు పళ్ళు గారపట్టి వున్నాయి. జుట్టు చిందర వందరగా అతని ముఖాన్ని కప్పివేస్తున్నది. అతని నోటి నుండి ఘాటైన సారా వాసన గుప్పు మంటున్నది. రాక్షసత్వం వుణికి పుచ్చుకున్నట్టు అతని చూపులు మింగేసేట్టు వున్నాయి.
తనకు కావలసిన వ్యక్తి అతనుకాదు-
దూరం నుంచి చూస్తే అతనిలానే వున్నాడు.
క్షణం నివ్వెరపోయి వెంటనే తేరుకున్నది.
"డాక్టర్ కరుణగారి యిల్లు యెక్కడ-" తన తెలివి తక్కువతనాన్ని బయట పడనీయకుండా ఖంగారుగా అడిగింది.
తనకు తెలియదన్నట్లు తలూపి వెళ్ళిపోయాడు అతను.
అతను ఏమీ మాట్టాడకుండానే వెళ్ళిపోవడంతో ఆమె హృదయం తేలికపడింది. ఆపద నుంచి బయట పడ్డానని అనుకోవడంతో ఎక్కడలేని ఓపిక వచ్చింది, వచ్చినంత వేగంగానే వెనుదిరిగింది.
అంతకు ముందు వచ్చిన డబుల్ డక్కర్ బస్సు అప్పుడే కదలబోతున్నది.
పరుగులాంటి నడకతో వచ్చి ఆ సిటీ బస్సును అందుకుంది.
కృష్ణప్రియ గుండె యింకా వేగంగా కొట్టుకుంటూనే వుంది.
* * *
ఫియర్ కారును రామకృష్ణా ధియేటర్ లో పార్క్ చేశాడు కుమార్.
అతని చేతిలోని టిక్కెట్లు గాలికి రెపరెప లాడుతున్నాయి.
బయట హౌస్ ఫుల్ బోర్డు...
ఆలస్యం అవుతున్న కొద్దీ అతనిలో అసహనం పెరిగిపోతున్నది.
కృష్ణప్రియ ఇక రాదని తెలిసినా ఏదో ఆశ అతనిని ఇంకా అలానే నిలబెట్టింది. ఆమె కావాలనే తనను ఆట పట్టించిందని అర్ధమైందతనికి.
ధియేటర్ లో టైటిల్స్ పడుతున్నాయి.
కుమార్ లో కోపం తారాస్థాయికి చేరుకున్నది. అటూ ఇటూ పచార్లు చేస్తున్న అతని దృష్టి అప్పుడే వచ్చి ఆగిన ఆటోపై నిలిచింది.