Previous Page Next Page 
అతని భార్య ప్రియుడు పేజి 13

   
    ప్రమాణస్వీకార ఉత్సవం ప్రారంభమైంది. అంతా సందడి...... కార్యకర్తల్లో ఆనందం..... పదవీ స్వీకారంచేసిన మంత్రిని పూలమాలలతో ముంచెత్తే అభిమానులు.   

    మహరాజు నిండుకొలువులా వుంది.

    వెంకటపతిరాజు చెప్పినట్లు ఒకవేళ తను కూడా మంత్రి అయితే? గౌరవ హోదాలన్నీ అనుభవించవచ్చును. మహరాణిలా ఆజ్ఞలు జారీచేయవచ్చు.

    జయజయ ధ్వానాలు పలికే జన సందోహం, అన్నింటికంటే అధికారం చేతిలో వుంటే తాను అనుకున్నది సాధించవచ్చు.

    కొద్దిక్షణాలు ఆమె తనని తాను మరిచిపోయింది.

    ఏమిటి?   

    తనిలా ఊహల్లో తేలిపోతోంది.

    ఈమాత్రం ఆర్భాటానికే లొంగిపోతుందా!

    వెంకటపతిరాజుగారు ఆయన్ని పలకరిస్తున్నవారిని నాగమణికి పరిచయం చేసారు.

    "రాజకీయ వారసురాలు, మిసెస్. జి.కె."

    "నమస్తే"

    "నమస్తే"

    "వెరీగుడ్"

    "వాంగ్ స్టర్"

    అని కామెంట్స్, అభినందనలు......

    "ఇతను కార్తీక్, రెవెన్యూ మంత్రి వీరారెడ్డిగారి మేనల్లుడు"

    ఎత్తు..... విశాల వక్షస్థలం...... బలిష్టంగావున్న యువకుడ్ని పరిచయం చేశాడు వెంకటపతిరాజుగారు.

    అతన్ని చూడగానే మనస్సులో ఏదో అలజడి.............

    తడబడుతూ విష్ చేసింది.

    "నైస్ టు మీట్ యూ!"

    కార్తీక్ కళ్ళల్లో...... ఏదో చదివింది.

    కళ్ళతోనే ఇంకేదో చెప్పాడతను.

    అందగాడు.......

    మగాళ్ళలో అంత అందం ఉంటుందా?

    ఏమిటి, అతని గురించి తనలా ఆలోచిస్తోంది.

    అతనికి తెలీకుండానే ఏదో ఆకర్షణకి గురి అవుతోంది.

    ఇదే అతనిలో ప్రత్యేకతేమో!

    ఇంకెవర్నో పరిచయం చేస్తుంటే తల తిప్పింది నాగమణి.

    ఇంక అక్కడ వుంటే..... కార్తీక్ గురించి ఆలోచించడం తనకే నచ్చలేదు.

    ఎందుకొస్తుందీ మార్పు?

    తెలీకుండానే నిట్టూర్పు పెదవులపైన.

    "బోరు కొట్టిందా?" అడిగారు వెంకటపతిరాజు.

    "అబ్బే లేదు. ఇక వెళ్ళిపోదాం" అంది.

    "పద" అన్నారు.

    ఆయన్ని నలుగురైదుగురు అనుసరిస్తోంటే ఓసారి వెనక్కి తిరిగిచూసింది.

    కార్తీక్ ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఓ మూల నిలబడి.

    ఆమెకేమిటో అసహనం.

 Previous Page Next Page