"ఇంతకూ నీ కడుపుమంట ఏమిటి?" విశ్వేశ్వరయ్య చుర చుర చూశాడు."
"మా సుజాతను మీ పురుషోత్తం చేసుకోడానికి ఇష్టపడ్డాడు. చేసుకొంటానని మాట కూడా ఇచ్చాడు."
"ఈ కాలంలో ఆడపిల్ల తలిదండ్రులు తెలివి మీరి పోయారనడానికి ఇదొక నిదర్శనం! కాస్త కంటికి నదురుగా కనిపించిన పిల్లాడికి పిల్లను ఎరగా వేసి వాడిని వల్లోకి లాక్కోవడం, కానీ కట్నం లేకుండా పిల్ల పెళ్లి దాటించడం!"
"అలాగా? నువ్వదే పనిచేస్తున్నావా బావా?"
"నాకేం అంత ఖర్మపట్టలేదతు. పురుషోత్తానికి వచ్చిన కట్నం తీసి స్వప్న పెళ్లి జరిపిస్తాను మహరాజులా!"
"ఒకిల్లు కూల్చి ఒకిల్లు కట్టడమన్నమాట!"
"నీకూ ఓ ఇంజనీరు కొడుకున్నాడు కదా? ఏ ఇల్లూ కూల్చకుండానే పెళ్లిచేస్తావా?"
"ఛత్! నేను నీలాగా పిల్ల పెళ్లి పేరు చెప్పి కట్నం తీసుకోవడాన్ని సమర్దించుకోను. నా పిల్లకు పెళ్లికాక పోయినా సరే. నేను మా మాధవి కి కట్నం తీసుకోను."
"ఎప్పుడూ ఇదే మాట అంటాను. కావాలంటే మీ స్వప్నని మాకివ్వు. కానీ కట్నం లేకుండా మా మాధవ్ కి చేసుకోకపోతే చూడు!"
"నోరు జారానని పశ్చాత్తాపపడవు కదా?"
"నేను మొదటినుండీ ఒక ఆదర్సానికి కట్టుబడి నడుచుకొనేవాడిని" శీనయ్య దర్పంగా అన్నాడు.
"ఎదురు వియ్యం అంత మంచిది కాదంటారు. అయినా ఎవరి నుదుటి రాతలు వాళ్లవే. మా స్వప్నని మీ మాధవ్ కి చేసుకొనే పక్షంలో మీ సుజాతను మా పురుషోత్తానికి చేసుకొంటాను."
తధాస్తు అన్నారేమో దేవతలు, రెండు పెళ్ళిళ్లు పదిహేనురోజుల్లో తిరిపతి కొండమీద జరిగిపోయాయి!
5
" మాధవ్! రే, మాధవ్!"
ఇళ్లకోసం గాలిస్తూ తిరుగుతున్న మాధవ్ ని వెనుక నుండి పరిచిత కంఠం పిలిచింది. వెనుదిరిగాడు. స్వరూప్! బి. ఇ. లో తన క్లాస్ మేట్. ప్రాణస్నేహితుల్లో చెప్పుకోదగిన వాడు!
గబగబా అంగలు వేస్తూ స్వరూప్ ని సమీపించాడు మాధవ్. "నువ్విక్కడే వుంటున్నావురా?"
"ఉఁ. ఎక్కడ పనిచేస్తున్నావురా?"
మాధవ్ చెప్పాడు. "నువ్వు ఏ ఆఫీసులో పనిచేస్తున్నావు?"
"ప్రస్తుతం సెలవులో వున్నాను. ఇక్కడికే ట్రాన్స్ ఫర్ కి చేస్తున్నాను. ఒకటి రెండు వారాల్లో ఆర్డర్స్ రావచ్చును. పదరా, ఇంటికి వెళ్ళి మాట్లాడుకొందా!"
" ఇంట్లో నువ్వొక్కడివే వుంటున్నావా?"
"నాన్నగారు సాగర్ లోనే పనిచేస్తున్నారు. క్రింది పోర్షన్ అద్దెకిచ్చేశాం. పై పోర్షన్ లో నేనున్నాను."
స్కూటర్ మీద ఇద్దరూ స్వరూప్ ఇంటికి వచ్చారు.
"ఉఁ ఇక చెప్పరా కబుర్లు! ఇక్కడెక్కడికి వచ్చావు!"
"అద్దెకు ఇల్లు కావాలిరా! మూఢమి వెళ్లాక మా శ్రీమతిని తీసుకువస్తున్నాను."