"ఏమిటి?"
స్వరూప్ స్వప్న నుదురు చుంబించి "ఇది మాత్రమే. వెళ్లు, స్వప్నా! ఇంకెప్పుడూ నేను నీ కళ్లబడనని నీకు హామీ ఇస్తున్నాను," అన్నాడు. అని అక్కడ నిలువలేదు. గబగబా వెళ్లి తన స్కూటర్ స్టార్ట్ చేసి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు.
గడ్డిలో కుప్పగా కూలిపోయి దయనీయంగా రోదించసాగింది స్వప్న.
అయిపోయింది.
ఇక్కడ పెంచుకున్న ప్రేమలతను తన చేతులతో ఇక్కడే ఛిన్నాభిన్నం చేసింది! ఈ చోటికి స్వరూప్ ని వెతుక్కుంటూ తనెప్పుడూ రాదు! స్వరూప్ కూడా రాడు!
స్వరూప్ ఎప్పుడూ కూర్చునే ఆ చోటుని ఆప్యాయంగా తడిమింది స్వప్న.
4
ఆ గడియ వస్తే కళ్యాణం అదే అయిపోతుందన్న ఉదాశీనత్వం వదిలిపోయింది విశ్వేశ్వరయ్యకు కూతురికి వెంటనే పెళ్లి చేసి పంపేయాలని సంబంధాల కోసం కాళ్లకు బలపాలు కట్టుకొన్నట్టుగా తిరగడం మొదలుపెట్టాడు. ఇదివరలో "నా బిడ్డ బి. ఎ. చదివిందికదా? ఎమ్. ఎ.నో అంతకంటే ఎక్కువ చదివినవాడో కావాలి" అనేవాడు. ఇప్పుడు అలాంటిదేం పెట్టుకోలేదు. సంప్రదాయస్తులైన కూటికీ గుడ్డకీ లోపం లేకపోతే చాలన్నట్టుగా వున్నాడు.
ఏ సంబందం తెచ్చినా వ్యతిరేకించే స్థితిలో లేదు స్వప్న. తల నరకడానికి ఏ కత్తి అయితేనేం అన్నట్టు జడత్వం దాల్చిందామె.
"నీ కూతురికి కట్నం డబ్బులు సంపాదించి పెట్టడానికే నన్ను కన్నావా" అని అడిగే పురుషోత్తం ఇప్పుడు ఏ సంబంధానికైనా వాళ్లనుండి ఎంత కట్నం పిండడానికైనా సిద్దంగా వున్నాడు.
ఈ సంగతి తెలిసి సుజాతకి కంపరమెత్తింది. ఆమె పురుషోత్తంమీద అనురాగం పెంచుకొన్న మనిషి. అతడితో జీవితం పెనవేసుకోవాలని తాపత్రయపడుతున్న మనిషి.
ఒకరోజు దిగులుగా తండ్రికి చెప్పిందీ విషయం. "నాన్నా! పురుషోత్తానికి సంబంధాలు వస్తున్నాయట!"
"నిన్ను చేసుకొంటానని మాటిచ్చాడు కదమ్మా?"
"ఏమో? నిన్న కలుసుకొని మాట్లాడాలని చూస్తే ముఖం తప్పించాడు."
"నేను కనుక్కుంటాలే అమ్మా!"
ఆ రోజే వెళ్లి విశ్వేశ్వరయ్యను కదిలించాడు శీనయ్య.
"మావాడికి పదిహేను వేలు కట్నం ఇస్తే తప్ప ఏ సంబంధమూ ఖాయపరచను!" ఖచ్చితంగా చెప్పేశాడు విశ్వేశ్వరయ్య.
"పదిహేను వేలా?" ముక్కుమీద వేలుంచుకున్నాడు శీనయ్య. "నీ కొడుకు చదివింది బి. ఎ. నే కదా! చేస్తున్నది రెవిన్యూ ఆఫీసులో ఎల్. డి. సి. నే కదా? నువ్వూ, నీ తాతలూ సంపాదించిపెట్టిన ఆస్తి ఏం లేదు కదా? నీ కొడుక పదిహేనువేలు విలువ చేస్తాడా నీ ఆశ కాకపోతే?" ఒళ్ళు మండిపోయి అన్నాడు శీనయ్య. బావ వరుసే కాబట్టి వెనుకా ముందు ఆడాల్సిందేం కనిపించలేదాయనకి.
"ఎమ్మేలు అటెండరు పోస్టులకి ఎగబడుతున్న కాలమిది! ఇంజనీర్లు, డాక్టర్లు ఉద్యోగాలు లేక గోళ్లు గిల్లుకొంటున్నారు. నా కొడుకు చేసేది ఎల్. డి. సి. అయినా పర్మనెంట్ జాబ్. తాసీల్దారువరకు ప్రమోట్ అవుతాడు. రెండు చేతులా సంపాదిస్తాడయ్యా! ఈ లెఖ్కన పదిహేనువేలు తక్కువే. ఏమిచ్చినా కట్నం ఇచ్చేది ఒక్కసారేకదా మళ్లీ మళ్లీ ఇవ్వరు కదా?"
"ఎందుకూ? పెళ్లయిన ప్రతదానికీ నీ కొడుకుచేత విడాకులిప్పిస్తూ పో. కట్నం కావలసినన్ని సార్లు కొట్టొట్టు!"