Previous Page Next Page 
ఆఖరి వీడ్కోలు పేజి 14

    "వెడ్డింగ్ కార్డు ఇవ్వకుండానే పెళ్ళి చేసేసుకొన్నావా?"

    "పెళ్లి అనుకోకుండా తొందరగా జరిగిపోయింది. చాలామందికి వెడ్డింగ్ కార్డు అందనేలేదు!"

    "ఏ ఊరు పిల్ల?"

    "మా వూరే. మాకు కావలసినవాళ్లే. మా చెల్లెల్ని వాళ్లన్నయ్యకిచ్చి ఆమెను నేను చేసుకొన్నాను."

    "ఏమైనా లౌ...... "

    "అలాంటిదేం లేదు. మా నాన్నగారు ముహూర్తం పెట్టి టెలిగ్రాం ఇచ్చారు నాకు."

    "పిల్లను చూడకుండానే పుస్తె కట్టేశావన్నమాట!"

    "మా వూరే కదా?  ఆ అమ్మాయిని చిన్నప్పటి నుండీ చూస్తూనే వున్నాననుకో, కాని ఆ అమ్మాయే నా భార్య అవుతుందనుకోలేదు."

    నౌకర్ని పంపించి టీ తెప్పించాడు స్వరూప్. మాధవ్ కి ఇచ్చి తనూ తీసుకొన్నాడు.

    "నీ ఎరికలో ఏవైనా ఇళ్ళుంటే చెప్పరా!"

    "ఒక పని చెయ్యి."

    "ఏమిటి!"

    "ఈ పై పోర్షన్ ఐదు గదులది! నేను రెండు గదులలో సర్దుకోగలను. మిగతా మూడు గదుల్లో మీరుండవచ్చుకదా?"

    "అయితే రెంటు తీసుకోవాలి."

    "ఉహుఁ.స్నేహితుడవని ఇస్తున్నాను. ఈ పోర్షన్ మా కోసం అట్టే పెట్టుకోవడం అలవాటు. అమ్మావాళ్లు ఎప్పుడైనా వస్తే దిగుతారు."

    "ఎంత స్నేహితుడివైనా ఊరికే నీ యింట్లో ఉండాలంటే నా వల్ల కాదు. అయితే నువ్వొక పనిచెయ్యి!"

    "ఏమిటి?"

    "నువ్వు హోటల్ నుండి టీ, టిఫిన్ లు ఏవీ తెప్పించుకోకూడదు! మా దగ్గరే భోజనం చేయాలి!"

    "మీ ఆవిడ వంట బాగా చేస్తుందా?" నవ్వుతూ అడిగాడు.

    "ఏదీ? ఆవిడ పంట చూసే అవకాశ మెక్కడ? పెళ్లవుతూనే జ్వరంతో పడింది. శోభనం వాయిదా పడింది. అంతలో మూఢమి రాక్షసిలా వచ్చేసింది!"

    "ఓ!"

    ఆ రోజు మాధవ్ ని వదిలిపెట్టలేదు స్వరూప్. తనతో ఉంచేసుకున్నాడు. హోటల్లో భోజనం చేసి సినిమా చూసి వచ్చారు. అర్దరాత్రివరకూ కబుర్లు చెప్పుకొన్నారు.

    "నీలో ఏదో మార్పు కనిపిస్తోందిరా, స్వరూప్?" అన్నాడు మాధవ్.

    "ఏ మార్పు?"

    "ఇదివరకులా ఉత్సాహం గంతులు వేయడం లేదు నీ ముఖంలో. వుండి వుండి పరధ్యానంలో మునిగిపోతున్నావు! నీ మనసు నీది కానట్టుగా, అది మరొకరిదైనట్టుగా..."

    విషాదంగా మూలిగాడు స్వరూప్. "అది మరొకరిది కావడమూ జరిగింది. ఆవిడచేత నిర్దాక్షిణ్యంగా నలిపివేయడమూ  జరిగింది!"

    "ఇలాంటిదేదో జరిగి వుంటుందని నీ ముఖం చూసి అనుకొన్నాను. ఇలా ఎలా జరిగింది, స్వరూప్?" బాధతో తొణికే స్వరంతో ప్రశ్నించాడు.

    "మా మనసులు కలిశాయిగాని, కులాలు కలవలేదు. మేం పెళ్లిచేసుకోవడమే జరిగినా వాళ్ళ నాన్న దూలానికి ఉరేసుకు చస్తానన్నాడట. వాళ్ళ అమ్మ బావిలో దూకి చస్తానందట. పిచ్చిది! బెదిరిపోయింది!"

 Previous Page Next Page