Previous Page Next Page 
ఆమని కోయిల పేజి 12

    "ఆయుష్షు పెరగటం అవస్తలు పడటానికే. నేను సుఖంగా వుండటం నీకిష్టం లేదా వదినా!"

    "అదేంమాట." అంది అన్నపూర్ణమ్మ.

    అక్కడ జరుగుతున్నది పెళ్ళికాదు. పేరంటంకాదు. ఏ విధమైన అక్కరలేదు. కాని అందరూ సరదాపడి పోతూ సమావేశం అయ్యారు. లోలోపల ఒకరంటే మరొకరికి పడనివాళ్ళు కూడా ఒకేమాట మీద సమావేశం అయ్యారు.

    వివిధరకాల మనస్తత్వం గల ఆడవాళ్ళు, బద్ధశత్రుత్వం గల వాళ్ళు అంతా ఒకేమాట మీద ఇక్కడ సమావేశం కావటానికి ఒకేమాట మీద ఇక్కడ సమావేశం కావటానికి ఒకేఒక స్త్రీ కారణం.

    ఆ స్త్రీ ఎవరో కాదు దీక్ష.

    ఎర్రగా బుర్రగా చావకట్టెతో చేసిన గట్టి శిల్పంలాగ వున్న ఆ పిల్ల దాని చర్యలు అందరాడవాళ్ళకి వింతగా, విస్మయంగా, కుతూహలంగా, కొందరికో భయంగా వుండటంతో నలుగురు కలిసి చర్చించుకుని తాడో పేడో తేల్చేద్దామనుకున్నారు.

    దీక్ష అనే అందమైన పలువరుస, చక్రాల్లాంటి కళ్ళు, పెదవి బిగింపులో నొక్కిపట్టిన చిరునవ్వు గల అమ్మాయి ప్రతిరోజూ మధ్యాన్నం వేళ ఇల్లిల్లూ తిరిగి రోజుకో రకం పాంప్లెట్ పంచి పెట్టడం... ఓ వింత అయితే పాంప్లెట్ లో విషయాలు రోజు రోజుకీ మారిపోతూ, కడువిడ్డూరంగా కాన వచ్చాయి ఆ రాతలు.

    ఈ వ్యవహారం నాలుగు రోజులు చూసి "ఏమిటమ్మాయ్ యిది?" అని కొందరు పని గట్టుకుని అడిగారు.

    "నాలుగు రోజులు ఎలాగూ ఆగారు. మరో రెండు రోజులు ఆగలేరా! దయచేసి ఇప్పుడు నన్నేమి అడగవద్దు" అంది దీక్ష.

    కొందరు మొండిగా పాంప్లెట్లు తీసుకోమని చెప్పారు. ముఖాన తిరస్కరించినా దీక్ష ముఖం చిన్న బుచ్చుకోలేదు. చిరునవ్వుతో గుమ్మంలో పాంప్లెట్ పెట్టి వెళ్ళిపోయేది. దాంతో ఇష్టమున్నా లేకపోయినా ఈరోజు పాంప్లెట్ మీద కొత్త రాతలు చూద్దామన్నట్లు కుతూహలంగా చదివేవారు.

    ఇది అందరిలో పెద్ద చర్చ నీయాంశం అయిపోయింది.

    చాలామంది ఆడవాళ్ళు భయపడుతూ ఇంట్లో మగవాళ్ళకి ఈ విషయం చెప్పారు.

    "ఇది పబ్లిసిటీ స్టంట్. ఎన్నికల విషయమే చూడండి. తమ్ముడు గెలవాలన్నా తిమ్మడు గెలవాలన్నా ఆడవాళ్ళ ఓట్లు పడటమే ముఖ్యం. ఆడవాళ్ళకి బట్టల షాపులు ఆరొందల రకాలువుంటే మగాళ్ళకి పట్టుమని పది కూడా లేవు. ప్రచారం చేస్తున్న పిల్ల ఆడది. మీరు ఆడవాళ్ళు. పునిస్త్రీ వ్రత మహత్యం లాంటి ఆడాళ్ళ సినిమాగాని మరో చీరల షాపుగాని మొత్తానికి ఆ బాపతు పబ్లిసిటీలో భాగం ఇది." అంటూ చాలామంది మగవాళ్ళు కొట్టి పారేశారు.

    "మీ చేతలకి నోటికి హద్డా ఆపా! ఇల్లు కడగటం మొదలు బియ్యం కడగటం వరకూ మీకు బాగావచ్చు. బూజు దులపటం దగ్గరనుంచి చెత్తా చెదారం వరకు తూర్పార పట్టటం ఇంకా బాగావచ్చు. ఈదపా ఆ పిల్ల గుమ్మంలోకి రాగానే నాలుగు ఝాడించి కడిగి దులిపి తూర్పార పట్టండి. ఓ వేళ ఆ పిల్ల మీ దాటికి తట్టుకోలేక బ్యార్ మంటే కన్నీళ్ళు తుడవండి." అంటూ కొందరు మగవాళ్ళు విషయాన్ని తేలిగ్గా తీసుకుని జోకులు పేల్చారు.

    ఇదంతా యిలా వుండగా ఈ మధ్య ఊళ్ళో దొంగల భయం ఎక్కువ అయింది. పిల్లలని ఎత్తుకు పోయేవాళ్ళు వచ్చారు. గోరు చుట్టు మీద రోకటి పోటులాగా ఆడవాళ్ళ ప్రాణానికి రేపిష్టులు తయారయారు.

    ఓ మొగుడు పెళ్ళాం రెండో ఆట సినిమా నుంచి డొంక రోడ్డుని వస్తుంటే మొగుడుని తన్ని పెళ్ళాన్ని ఎత్తుకుపోయి రేప్ చేసి వదిలేశారు. ఓ కాలేజీ అమ్మాయిని కొందరు కలిసి రేప్ చేశారు. బజారు నుంచి యింటికి వస్తున్న ఓ స్త్రీ దగ్గర దారి అని పక్క సందులోంచి వస్తుంటే ఆమెని సామూహిక మానభంగం చేశారు. ఫలానా పార్టీ వాడి పెళ్ళాన్ని ఎగస్ పార్టీ వాడి తాలూకూ మనుషులు రేప్ చేయటం వల్ల ఎగస్ పార్టీ తాలూకా మనుషులు ఫలానా పార్టీ వాడి భార్యని చెల్లెలిని రేప్ చేసి వదిలారు.

    ఈ రేప్ అనే పదజాలం ఊళ్ళో ఎక్కువ అయేసరికి ఆడవాళ్ళ మాన ప్రాణాలు గుప్పెటిలో పెట్టుకుని వణికి పోయే పరిస్థితి ఏర్పడింది. పోనీ పోలీసు రిపోర్ట్ యిద్దామా అంటే లంచగొండులు, దొంగలు, రేపిష్టులు, కాకీ చిక్కాలలోను, ఎర్రటోపీల లోనూ వున్నారని దేశం మొత్తానికి తెలుసాయే.

 Previous Page Next Page