Previous Page Next Page 
Sri N T Rama Rao Prasangalu పేజి 12

 

తెలుగు తల్లికి రక్త తిలకం దిద్దిన త్యాగ మూర్తి అల్లూరి
    
    జననీ జన్మభూమిశ్చ స్వర్గాదసీ గరీయసీ , ఇది ఈనాడు మనం నేర్చుకోవలసింది. సీతారామరాజుగారి పట్నాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుకోవడం కాదు మన ముఖ్యోద్దేశ్యం. ఎప్పుడు జరిగింది ఈ విప్లవం? 1922 -24 సంవత్సరాల మధ్య జరిగింది. ఎందుకు వెలిగింది అంత అఖండ జ్యోతి ఆ సంవత్సరమున్నర కాలంలో? దానిలో ఉన్న అవేశామేమిటి? దానిలో ఉన్నటువంటి పరమార్ధం ఏమిటి? ఆ మహానుభావుడు పొందిన ఫలితం ఏమిటి? మీకు తెలుసో తెలియదో - అన్నారు కొందరు ఆనాటి నాయకులూ - అల్లూరు సీతారామరాజు అండ్ హిస్ ఫాలోయర్స్ ఆర్ నధింగ్ బట్ బాండిట్స్ అని. మన తెలుగువారే అన్నారు. సిగ్గుచేటు . ఏమిస్తారు దీనికి సమాధానం? ఏమి చెపుతుంది తెలుగు జాతి దీనికి సమాధానం? - అని అడుగుతున్నాను. మీ వాడిని నీవు గుర్తించలేవు. తెలుగుతనం చచ్చింది మనలో ఎప్పుడో. పుట్టింది ఆనాడే సమతా సిద్దాంతం. పల్నాటి బ్రహ్మన్న కాలంలో చాపకూడు తిన్నారు. అందరూ ఒక బంతిలో. అలనాడే వెలసిన సంస్కృతీ ఏమైంది ఈనాడు మనలో. ఎక్కడుంది వీరావేశం తెలుగువారిలో. దేశాన్ని మర్చిపోయాము. జాతిని మర్చిపోయాము. డబ్బుతో చస్తున్నాం. రాజకీయ పరమార్ధం అదేనని ఈనాడు మనం బ్రతుకుతున్నామని మీ అందరికి మనవి చేస్తున్నాను. ఎందుకోసమని బ్రతికాడు ఆ మహనీయుడు? ఎవరి కోసం? అటవీజాతుల కోసం. గుర్తుందా పెద్దలు మీ అందరికీ ఈనాడు అటవీ జాతులు ఏవిధంగా ఉన్నారు. మన్యం వెళితే తెలుస్తుంది. ఆదిలాబాద్ జిల్లా వెళితే తెలుస్తుంది. ఈరోజున  సామాజిక న్యాయం ఎక్కడుంది మన దేశంలో. న్యాయదేవతకు మనమే కట్టాం కళ్ళగంతలు. వినటానికి చెవులే లేని, చూడటానికి కళ్ళు లేవని చెప్పి ఈనాడు ఆ అంధకారంలో అన్యాయాలు చేసి గడుపుతున్నాము. ఈనాడు సామాజిక పరమైనటువంటి న్యాయం కావాలి. న్యాయదేవతకు కట్టిన గంటలు విప్పదీయాలి. సమాజాన్ని చూచేటట్లు అవకాశం కల్పించాలి. నీముందున్న సమాజం ఏమిటి ఈరోజు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు కన్పిస్తుంది. అర్ధాకలితో అలమటిస్తూ , తినటానికి తిండి లేకుండా, కట్టడానికి బట్ట లేకుండా, పిల్లలకు చదువు చెప్పడానికి యోగ్యతా లేకుండా నూటికి యాభై శాతం ప్రజానీకం ఈనాడు దారిద్ర్యరేఖకు దిగువనే బ్రతుకుతుంటే ఏమిటి స్వాతంత్ర్యం వారికి ఇచ్చినది? ఏమిటి స్వాతంత్ర్యం మనదేశానికి తెచ్చినది. మన పరిపాలన కంటే బ్రిటీషు వారే బాగా పాలించారేమో అన్న గతాన్ని స్మరణకు తెస్తున్నటువంటి ఈ పరిపాలనా విధానం ఎంత సిగ్గుచేటుగా, అవమానకరంగా ఇంతకాలం సాగిందో ఒక్కసారి ఆలోచించమని సోదరులందరికీ నేను మనవి చేస్తున్నాను. కావాలి సామాజిక న్యాయం .... న్యాయమంటే ఒక వర్గానిది కాదు. సమస్త ప్రజానికానికి కల్గాలి న్యాయం. అవకాహాలు అందరికీ కల్పించబడాలి. అదీ నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. అటువంటి విధానం ముందుకు రావాలి. ఆనాడు వెలుస్తుంది ప్రగతి మన కళ్ళ ముందు . సోదరులా ఈనాడు సీతారామరాజు గారి గురించి ఆలోచించుకొనేటప్పుడు మంచి గురించి మాట్లాడుకోవడం మన ధర్మం కాబట్టి వారు ఏ విధమైనటువంటి నిస్వార్ధమైనటు వంటి త్యాగంతో దేశానికి మేలు కోరారో, మేలును ఆచరించడానికి ఆయన జీవితాన్ని ధారబోశారో అటు వంటి మహనుభావుని జయంతి సందర్భంగా కాస్తయినా స్వార్ధం మానుకొని గతాన్ని గుర్తు తెచ్చుకొని మన జాతి పురోభివృద్దిని లక్ష్యంగా పెట్టుకొని మన భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడం మన ధర్మం అని మనవి చేస్తున్నాను. ఈనాడు రాజకీయమంటే పదవులు కాదు. కుర్చీలలో కూర్చునడం కాదు. అది కాదు ఆదర్శం. నీకున్న అవకాశాన్ని ప్రజల కోసం వినియోగించినపుడే నువ్వు నాయకుడవు అవుతావు. లేనినాడు గద్దె శాశ్వతం కాదు. నీ పదవి శాశ్వతం కాదు. పదవికి నీవల్ల గౌరవం కలగాలి. అటువంటి గౌరవాన్ని సాధించడానికి మానవుడు ప్రయత్నించాలని మనవి చేస్తున్నాను. ఎందరో ముద్దు బిడ్డలు తెలుగుతల్లి బిడ్డలు త్యాగం చేశారు. కనుకనే ఈనాడు మనం స్వాతంత్ర్యం వచ్చిందని కులుకుతున్నాము. కాని ఆ స్వాతంత్ర్యం ఎందుకు వాడుకొంటూన్నాము? మన పొట్టలు నింపుకోనటానికి వాడుకుంటున్నాము. ఏ ప్రజలయితే దారిద్ర్యరేఖకు దిగువున ఉన్నారో, వారి సంగతి మనకు కనిపించకుండా ఇంతవరకు స్వార్ధంతోనే గడుపుకుంటూ ప్రజాస్వామ్యాన్ని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి మన బ్రతుకులు బ్రతుకుతున్నాము. కనుకనే ఈ దేశం ఈ విధంగా దురవస్థల పాలయిందని మనవి చేస్తున్నాను. లేకపోతే ఎక్కడున్నది ఈనాడు ఆర్ధిక సమానత్వం - సమాజంలో? అహర్నిశలు కష్టించి, చమటోడ్చి నీకింత కూడు పెడుతున్న ఆ రైతు ఏ విధంగా ఉన్నాడు? రైతు కార్మికులు ఏవిధంగా ఉన్నారు? మురికివాడల్లో మురికి బ్రతుకే బ్రతుకుతూ ఆలో లక్షణా అని ఆక్రోశిస్తూ దినం గడవక పిల్లల క్షేమం చూచుకోలేక వాళ్ళు బ్రతుకుతుంటే ఈనాడు ఏ.సి. రూములో ఉంది పెత్తనం చేస్తున్నాము మేము. నాయకుడు కింద గుడిసెలో ఉండాలి. వారి బ్రతుకులు తెలుసుకోవాలి. ఆనాడు గాని నిజమైన నాయకత్వం దేశానికి రాదు. అందుకే చెపుతున్నాను - మనకు కావాలి సామాజిక న్యాయం. న్యాయదేవత యొక్క అసంతృప్తికర విధానాన్ని చూడాలి కళ్ళతో. చేయగల మహనీయులు న్యాయం చేయగల ధైర్యం , దమ్ము ఉన్న తెలుగు మగాడు రావాలి నాయకుడుగా. అప్పుడు కలగాలి సామాజిక న్యాయం. మీకు హామీ ఇస్తున్నాను. ఉన్నది వదులుకొని వచ్చాను నేను ఇక్కడికి. ఎంత వరకు నా కోసం నేను బ్రతుకుతాను? కనీసం కొంతయినా నా జాతికి పరమార్ధత కల్పించాలనే ఉద్దేశ్యంతో వచ్చాను. ఈ పదవికి ఎన్నిట్లో గౌరవం నేను చవి చూశాను. ఈనాడు వచ్చిన పరమార్ధం వేరు. నాకు కావలసింది ఏమీ లేదు. నాకు కావలసినది నా దేశం. ఆరుకోట్ల తెలుగువారి యొక్క సంక్షేమం. ఏ కొద్ది మంది యొక్క ప్రయోజనాలకో ఆరుకోట్ల తెలుగు ప్రజల సంక్షేమాన్ని వారు నా పట్ల, నా పార్టీ పట్ల విశ్వాసాన్ని , నమ్మకాన్ని అమ్ముకోనేంత హీనుణ్ణి కాదని చెపుతున్నాను. పరిపూర్ణంగా ఈ బొందిలో ప్రాణం ఉన్నంతవరకు నా తెలుగుతల్లి గౌరవానికే నేను బ్రతుకుతానని మీకు హామీ ఇస్తున్నాను. ఏమైనా చేస్తే ఎవరు ఏమి అడ్డుకున్నా ఏమి కోపం వచ్చినా ఈనాడు పురజనులు నా పక్షాన ఉన్నారు. నన్ను కోరారు. కాబట్టి ఆ బలమే నాకు చాలు. 

నేను అనుకొన్నటువంటి విప్లవాత్మక విదానాలన్నీ ప్రజా సంక్షేమం కోసం, పేదరికాన్ని నిర్మూలించడం కోసం, పేదవారి సముద్దరణ కోసం, శ్రామికుల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసమేనని సభా పూర్వకంగా పెద్దలకు నేను మనవి చేస్తున్నాను. ఇటు వంటి కార్యక్రమంలో మీరు ఈనాడు నా కిచ్చినటు వంటి ఈ ఆవేశ పూరితమైనటు వంటి బలాన్ని నేను ఊతగా పెట్టుకుంటాను, ముందుకు సాగుతాను. సోదరులందరూ ఇటువంటి మహత్తరమైన సీతారామరాజుగారి జయంతి సందర్భంలో ఇటువంటి దృడ విశ్వాసాన్ని, దృడ నమ్మకాన్ని, నాలో నేను కల్పించుకునే అవకాశం ఇచ్చినందుకు - ముఖ్యంగా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్నో విగ్రహాలు పెట్టుకున్నాము. ఎంతమందినో పూజిస్తున్నాము. కావాలి ఒక వీరుడు. దేశం కోసం గుండెలో ఉన్న రక్తాన్ని చిందించిన ప్రతి రూపం కావాలి మనకు. ఈనాడు చూస్తె తెలిసింది సీతారామరాజు గారి స్వభావం ఇదా అని. అది ఆరుకోట్ల ప్రజల సమక్షాన ఉంచటానికి ఒక నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని నేను హైదరాబాదు నగరంలో ఆవిష్కరిస్తానని నేను మనవి చేస్తున్నాను. అదే కావాలి మన ఆదర్శం. నీకోసం కాదు నీవు బ్రతికింది. నీవు కట్టిన కాషాయం నీకోసం కాదు దేశానికి. సర్వసంగ పరిత్యాగం చేసిన మహనీయుడు తెలుగువాడని ప్రతి ఒక్కడు కూడా గుండె మీద చరచుకొని తెలుగుజాతి కీర్తిని , ప్రతిష్టను పునశ్చరణ చేసుకొనే విధంగా నేను ఆ నిగ్రహాన్ని నిర్మిస్తానని మనవి చేస్తున్నాను. ఎన్నో పనులు చేస్తున్నాము. ఎంతో ఖర్చులు ఉన్నాయని చెప్పుకుంటూన్నాము. అయినా మంచికి మంచితనానికి మనకున్నటువంటి స్థితిని వాడుకోవడం అది ఒక మరమార్ధమైన విషయం అని నేను గుర్తుకు తెచ్చుకుంటూ ఈనాడు అల్లూరి సీతారామరాజు గారి సోదరులు సత్యనారాయణరాజుగారు అంతటి అన్నను పోగొట్టుకొని ఇంతటి పేదరికంలో ఉన్నాడు కనుక ఉడతాభక్తిగా ఏదైనా సరే దేశానికి, ప్రజలకు , తెలుగు తల్లికి చేసిన సేవలకు గుర్తించి, మానవతా విలువలను మనస్సులో ఉంచుకొన్న మనిషిగా, తెలుగు తల్లి బిడ్డగా, మీ వాడిగా ఈ సందర్భంగా 500 రూ లు వారి కుటుంబానికి ఈ సభాముఖంగా అందజేస్తానని ప్రకటిస్తున్నాను.

    1983 జూలై 4 న అల్లూరి సీతారామరాజు జయంత్యుత్సవంలో.

 

 Previous Page Next Page