"నేను వస్తున్నాను!"
సౌందర్య ఆపరేషన్ థియేటర్ లోకి అడుగు పెట్టగానే ఇంచుమించు అందరి చూపులు ఒక్కసారి పైకి లేచి క్రిందకి వాలాయి. ఎవ్వరూ ఏమీ మాట్లాడక పోయినా అందరి మనసులూ క్షణికంగా చెదిరాయి. ఒకే ఒక వ్యక్తి చూపులు మాత్రం పేషెంట్ మీద నుంచి కదలలేదు. చుట్టు ప్రక్కల ఏం జరుగుతుందో అతనికి తెలియటం లేదు. అతని చేతులు నిబ్బరంతో తను చేస్తున్న పనిలో కేంద్రీకరించినట్లుగా పని చేస్తున్నాయి. తన జీవశక్తినంతా తను చేస్తున్న పనిలో కేంద్రీకరించినట్లుగా పని చేస్తున్నాడు అతడు.
సౌందర్య అతడినే చూస్తూ నిలబడిపోయింది. మొహానికి మాస్క్ కట్టుకోవడం వల్ల రూపురేఖలు తెలియడం లేదు. అవి తెలుసుకోవాలని సౌందర్యకు అనిపించలేదు. కర్తవ్య ఏకాగ్రతతో కదిలే ఆ చేతులనే చూస్తూ నిల్చుంది. ఆ గదిలో వామనమూర్తి కూడా ఉన్నాడనీ, అతడు హడావుడిగా అటు ఇటు తిరుగుతూ ఏదో చేస్తున్నాడనీ సౌందర్య గుర్తించలేదు. ఆ క్షణంలో సౌందర్య కూడా వామనమూర్తినీ, మిగిలిన ప్రపంచాన్ని మరిచిపోయింది. ఆపరేషన్ పూర్తయ్యాక నర్స్ సహాయంతో అతడు చేతులు శుభ్రం చేసుకుంటున్నాడు... అప్పుడు బయటకు వచ్చింది సౌందర్య...
"ఆపరేషన్ సక్సెస్ ఫుల్! ఇంకేం ఫరవాలేదు. ట్రబులా? నో! నో! ఇది ట్రబుల్ కాదు, ఒక ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా చెయ్యగలిగినప్పుడు డాక్టర్ కు కలిగే ఆనందం ఊహించగలిగితే మీరిలా మాట్లాడరు.....నేను" చటుక్కున ఆగిపోయాడు వామనమూర్తి. సౌందర్య చూపులు అతన్ని ఆపేశాయి...
సౌందర్య వామనమూర్తి దగ్గరగా వచ్చింది.
"కంగ్రాట్యులేషన్స్ వామన్!"
"థాంక్స్!"
గొణుగుతున్నట్లుగా అన్నాడు.
"నీకు తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంది. నీ పేరు ఇంకా ఇంకా ప్రఖ్యాతి పొందుతుంది..."
"థాంక్స్!"
"అతని పేరేమిటి?"
"ఎవరు? ఎవరి పేరు?" గొంతు పొడారిపోయినట్లుగా పలికింది వామన మూర్తికి.
"నేను అడుగుతున్నదేమిటో నీకు తెలుసు! చెప్పు!"
"విక్రమ్!"
అతని ఇష్టం లేకుండానే ఆ పేరు అతని నోట వచ్చింది. తన నోట వచ్చిన ఆ పేరు తనే వినలేనట్టు ముఖం చిట్లించుకున్నాడు.
"అతను నీ దగ్గర నుండి వెళ్ళిపోకుండా చూసుకో"
"వెళ్తాడా? ఎందుకు వెళ్తాడు?"
"మీరే వెళ్ళగొడతారు! అతడిని మీరు భరించలేరు!"
సౌందర్య అక్కడ ఉన్నంతవరకూ మతిపోయి నిల్చున్న వామనమూర్తి సౌందర్య అక్కడ నుంచి వెళ్ళగానే "దెయ్యం! భూతం!" అని కసితీరా అనుకున్నాడు
అటు తర్వాత సౌందర్య ఆపరేషన్ జరిగినప్పుడల్లా తెలుసుకుని హాస్పిటల్ కి వచ్చేది. విక్రమ్ ని చూస్తూ నిల్చునేది. విక్రమ్ ముఖం ఎలా ఉంటుందో సౌందర్యకు తెలియదు. తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. ఆపరేషన్ పూర్తి కాగానే వెళ్ళిపోయేది! వామనమూర్తికి శరీరమంతా కారం రాసినట్లే ఉండేది! కానీ సౌందర్యను ఆటంకపరచగలిగే శక్తి అతనికి లేదు.
సౌందర్య తరచుగా హాస్పిటల్ కు వెళ్ళటం గమనించాడు శశాంక....అతనికి ఆశ్చర్యం కలిగింది.
వామనమూర్తిని పిలిపించాడు. శశాంక పిలుస్తున్నారనగానే వచ్చాడు వామనమూర్తి...
చూడ ముచ్చటగా అందంగా ఉన్న వామనమూర్తిని చూశాడు శశాంక.
"బాగున్నాడు! కానీ విగ్రహంలా ఉన్నాడు" అనుకున్నాడు.
"కూర్చో! కూర్చో!" అని ఆహ్వానించాడు.
వామనమూర్తి కూర్చుంటూ "ఎప్పుడూ మీ దగ్గరకు రావాలనే అనుకుంటాను. కానీ ఎన్నో పనుల మధ్య ఉండే మీకు ఇబ్బంది కలిగించటం ఇష్టం లేక..." అన్నాడు.
"గుడ్!" గట్టిగా నవ్వాడు శశాంక.... బెదురుగా చూస్తున్న వామనమూర్తిని చూసి మళ్ళీ నవ్వి "నాకు నచ్చావు. బ్రతకనేర్చినవాడివి" అన్నాడు.
శశాంకలో కూడా సౌందర్యలో ఉన్న ఏదో వాడి ఉన్నట్లు తోచింది వామనమూర్తికి! అయితే ఇది మరీ అంత తీక్షణంగా జ్వలించటం లేదు.
"ఏం లేదు, ఈ మధ్య సౌందర్య తరచు నీ దగ్గరకు వస్తోంది కదూ!"
వామనమూర్తికి వళ్ళంతా చెమటలు పట్టినట్లయింది. గొప్ప వాళ్ళ అమ్మాయి. మామూలు యువకుడ్ని ప్రేమిస్తే తండ్రి కోపం తెచ్చుకుని.....వగైరా కథలు అతడు చాలా చదివాడు.
"అవునండీ! అదే, హాస్పిటల్ కు వస్తుంది. ఆపరేషన్స్ చూడటం సౌందర్యకు చాలా ఇష్టం..."
"ఆపరేషన్ చేసేది నువ్వేగా..."
"నేను...నేనేనండీ"
"నువ్వు ఆపరేషన్ చేస్తుంటే చూడటం సౌందర్యకు ఇష్టమా?"
"అహ!.. అంటే అనుకుంటానండి!"
"నిన్ను గురించి విన్నాను! పేపర్లో కూడా చదివాను. నాకు చాలా సంతోషంగా ఉంది."
ఆయన కంఠంలో ధ్వనించింది సంతోషం కాదు. అనుమానం.....
"ఏముందండీ! ఏదో నా వృత్తి ధర్మం నేను నెరవేరుస్తున్నాను."
"అయితే సౌందర్య ఆపరేషన్ ఉన్నప్పుడల్లా వస్తుందన్నమాట!"
"వస్తుందండీ!"
"సౌందర్య అలా రావటం నీకు ఇబ్బందిగా లేదు కద?"
"ఇబ్బందా? నాకు చాలా సంతోషంగా ఉందండీ! నా పని సౌందర్యకు ఆనందం కలిగించటం కంటే నాకు కావలసిందేముంది? అహ! సౌందర్య తెలివయినది. అంత తెలివైన వ్యక్తి మెచ్చుకుంటే..."
తడబడుతున్న వామనమూర్తిని చూసి నవ్వుకున్నాడు శశాంక.
"సౌందర్యకు ఆనందం కలిగించటమే నీకు కావలసినదయితే నువ్వు నాకు ఆత్మీయుడివే! నాకు కావలసినదీ అదే! విష్ యు బెస్ట్ ఆఫ్ లక్!"