Previous Page Next Page 
చీఫ్ మినిస్టర్ పేజి 12

 

"ఈ సీఎం భార్య పైకి కనపడదు కానీ చాలా తెలివైనది అని విన్నా. ఏదైనా కవర్ చేస్తుందేమో అని అనుమానం గా ఉంది. అతనికి రాజకీయ వ్యూహకర్త ఆమే అని చెప్పుకుంటారు అంతా" మెచ్చుకోలుగా అన్నాడు.

"మీకు నేను, మా పుట్టింటి వాళ్ళు తప్ప అందరూ తెలివైన వాళ్ళుగానే కనపడతారు" మూతి తిప్పుకుంటూ, గొణుక్కుంటూ లోపలికి వెళ్లిపోయింది ఆమె.

***
జర్నలిస్టులు హడావిడి పెడుతున్నారు.

లోపల విష్ణు వాళ్ళతో బృంద ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో సిద్ధం చేస్తున్నాడు.

బృంద ప్రెస్ ముందుకి రావటానికి ఉపక్రమిస్తోంది.

అప్పుడు జరిగింది ఒక సంఘటన.

జర్నలిస్టులు అందరూ సుధీర్ ఆఫీస్ గది వైపు చూస్తున్నారు.

జర్నలిస్టులు ఉన్న గది ఎంట్రన్స్ తలుపు దగ్గర అలికిడి. ఎవరూ పట్టించుకోవట్లేడు.

తన గది నుంచి అప్పుడే బయటికి వచ్చిన బృంద ఆశ్చర్యాన్ని అదుపు లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ అటు వైపు చూస్తుండటం తో అందరి దృష్టి అటు వైపుకి మరలింది. 

ఆశ్చర్యంతో విష్ణు నోరు తెరుచుకుంది.

ఎదురుగా సీఎం.

అంతా అతణ్ణి చుట్టుముట్టారు.

"సర్, మీరు ఒక వారం రోజులు గా కనపడక పోవటానికి, మీరు కనపడకుండా పోయారన్న వార్తలకి మీ సమాధానం ఏమిటి?"

"ఈ వారం రోజులు గా మీరెక్కడ ఉన్నారు?" ప్రశ్నలు గుప్పిస్తున్నారు జర్నలిస్టులు.

అతను భుజాలు ఎగరేసి వాళ్లను వారిస్తూ అన్నాడు

"ఒకరి తర్వాత ఒకరు అడగండి..." 

వాళ్ళు మాట్లాడే లోపు మళ్లీ తనే అన్నాడు.

"మీరు అడగబోయే ముందుగా మీకు ఒక విషయం తేల్చి చెప్పాలి. నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. మీరందరూ అనుకున్నట్లుగా, ప్రచారం చేసినట్లుగా మిస్సింగ్ కూడా కాదు."

"మన రాష్ట్రానికి పెట్టుబడిదారులను తీసుకురావటానికి న్యూజెర్సీ లో జరుగుతున్న ఒక సమావేశానికి వెళ్ళాను. ఫ్లైట్ దిగుతూనే ఇక్కడ జరుగుతున్న హడావిడి కి ఆశ్చర్యపోయాను".

"ఏం సమావేశం? మీ మీటింగ్ తర్వాత ఎంత మంది ఇన్వెస్టర్స్ మన రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టబోతున్నారు? ఎన్ని కంపెనీలు రాబోతున్నాయి?" అడిగాడు వాల్మీకి.

అతని వైపు చూసి నవ్వేశాడు సీఎం.

"Confidentiality అన్న పదం ఒకటి ఉంది తెలుసా? ప్రతి విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దాని వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు పక్క రాష్ట్రానికి వెళ్లే అవాశాలున్నాయి".

"మీలో ఏదో తేడా కనిపిస్తోంది సర్" పళ్ళన్నీ తెరిచి నవ్వి అడిగింది మరో జర్నలిస్ట్.

"మీకీ మధ్య అనుమానాలు ఎక్కువయ్యాయి. అఫ్ కోర్స్, మా రాజకీయ నాయకులు చేసే పనులు కూడా అట్లాగే ఉంటున్నాయనుకొండి.  అయితే ఇక్కడ మీరు ఊహిస్తున్నంత ఏమీ జరగటం లేదు. అంతా నార్మల్. మీ పనులు మీరు చేసుకోవచ్చు" కొంచెం వ్యంగ్యం ధ్వనించింది అతని స్వరం లో.

అక్కడితో సమావేశం ముగిస్తున్నట్లు ప్రకటించాడు విష్ణు.

మరెవ్వరికీ మాట్లాడే ఆస్కారం ఇవ్వకుండా అందరికీ చేతులు జోడించి అభివాదం చేస్తూ లోపలకి వెళ్ళిపోయాడు సీఎం.

*** 

సీఎం ఇంట్లో...

కింద హాల్ లో ఎదురెదురుగా సోఫాల్లో కూర్చున్నారు బృంద, కార్తీక్. 

విష్ణు కొద్ది దూరం లో చేతిలో ఐపాడ్ తో అతి వినయంగా నిలబడి ఉన్నాడు. చెవులు రిక్కించి వాళ్ళు మాట్లాడేది వినటానికి ప్రయత్నిస్తున్నాడు.

మనుషుల్లో సాధారణంగా కనపడే జబ్బు ఇది. వేరే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో అవసరానికి మించిన కుతూహలం ఉంటుంది. ఆ విషయం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేకపోయినా సరే. అందుకే ఈ నెల ఫోన్ బిల్ కట్టటం మర్చిపోవచ్చేమో కానీ పక్కింటి పిన్ని వచ్చే నెల ఏ రోజు ఊరెళ్తుందో మాత్రం బాగా గుర్తుంటుంది.

అందులోనూ అతను పీఏ. సీఎం కుటుంబ విషయాల్లో అతనికి ఆసక్తి ఉండటం లో ఆశ్చర్యం కూడా ఏమీ లేదు.

"రానన్నావ్?" కార్తీక్ తో అంది బృంద.

"ఎప్పుడూ నువ్వు ఎవర్నీ ఏమీ అడగవు కదా. అందులో నన్ను అసలు అడగలేదు. పైగా నాకిప్పుడు నా అన్న వాళ్ళు ఎవరున్నారు? సుధీర్ అంటావా...వాడు నాకు అన్నో, శత్రువో అర్థం కాకుండా ఉంటోంది వాడి ప్రవర్తన. మీకు పుట్టిన వాడిని నేనింత వరకూ నా కళ్ల తో చూడలేదు. కాబట్టి అక్కడ ఆ సెంటిమెంట్ కూడా లేదు"

కొనసాగిస్తూ అన్నాడు."అందుకే నువ్వు అడిగాక కాదనాలనిపించలేదు."

"నువ్వు అనుమానించినట్లే ఈ వంక చూపించి సుధీర్ తర్వాత నీ మీద క్రిమినల్ కేసు పెట్టిస్తే?" అడిగింది బృంద.

"ఇప్పుడు నేనున్న పరిస్థితి కి జైల్ అయినా, బయట అయినా పెద్ద తేడా ఏమీ ఉండదు. నన్ను చిన్న గదిలో బంధించినా, నా ఊహలు రెక్కలు చాచుకుని విశాలమైన ప్రపంచం లో విహరిస్తుంటాయి" అన్నాడు కార్తీక్.

బృంద కి బాధ గా అనిపించింది. 
"ఎందుకు ఇటువంటి మంచి వాడిని, తన భర్త అన్ని కష్టాలు పెట్టినట్లు?" అనుకుంది.
 

 Previous Page Next Page