Previous Page Next Page 
ఆనంద నిలయం పేజి 13


    "పో అమ్మా! నీకెప్పుడూ పెళ్ళిగొడవే!" అని విసుక్కుంది రేవతి పైగొంతు.
    "పెళ్ళి చేసుకో! అని కూతురితో అనగానే తల్లి బాధ్యత తీరిపోతుందా? ఈనాటికయినా ఈ దేశంలో ఆడపిల్లల పెళ్ళిళ్ళు అంత తేలిగ్గా జరుగుతున్నాయా? ఎంతసేపూ నాన్న ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాడేగాని, పెళ్ళికానుకల కోసం చూస్తున్నాడా? ఎంతసేపూ, నీ డాబులూ, దర్జాలేకాని, నువ్వయినా నాకు పెళ్ళి జరగాలని ఆరాటపడుతున్నావా? ఛీ! ఛీ! మరే తల్లిదండ్రుల కడుపున పుట్టినా...." గొణుక్కుంటోంది లోపలి గొంతు.
    "భోజనాలకి లేవండి" అని పెళ్ళిపెద్దలు ఆహ్వానించటంతో అందరూ భోజనానికి లేచారు.
    భోజనాలు పూర్తయి విశ్రాంతిగా కూచున్నాక పెళ్ళికూతురు ముఖ్యులైన వాళ్ళని పలకరిస్తూ ఐరావతమ్మ దగ్గరికొచ్చి-    
    "బాగున్నారా అత్తా?" అంది.
    ఐరావతమ్మ ముఖంలోకి సంతోషం తెచ్చిపెట్టుకుంటూ "నా బాగుకేంలే. కాని, నువ్వు మాత్రం లక్ష్మీదేవిలాగ ఉన్నావు. అబ్బాయి కూడా పండులా ఉన్నాడు. ఇద్దరూ ఈడూ జోడుగా కళ్ళ పండువుగా ఉన్నారు." అంది.     
    పెళ్ళికూతురు ముసిముసి నవ్వులతో తలవంచుకుంది.
    "అవునూ, ఆ మధ్య ఎవరో అన్నారు - పెళ్ళి కొడుక్కి టి.బి. వచ్చిందటగా! ఆస్పత్రిలో ఉండి వైద్యం చేయించుకున్నాట్ట!"
    పెళ్ళికూతురు నిర్ఘాంతపోయింది - పెళ్ళి కళ ప్రతిఫలించే ఆ ముఖం కోపంతో, బాధతో ఎర్రబడింది.
    "ఛా! ఆయనకు టి.బి. ఏమిటి? ఆ మధ్యే జ్వరం వచ్చి వారం రోజులయినా తగ్గకపోతే, ఎందుకయినా మంచిదని ఆస్పత్రిలో చేరి అన్ని పరీక్షలు చేయించుకున్నారు - నాలుగు రోజుల్లోనే వచ్చేశారు. నీతో ఎవరన్నారీమాట?"      
    "ఏమో! ఆ మధ్య ఎవరో అన్నారు - ఉండు - నేను నాలుగు తమలపాకులు తెచ్చుకొస్తాను." అంటూ అక్కణ్ణించి జారుకుంది ఐరావతమ్మ.
    కన్నీళ్ళను నిగ్రహించుకుంటున్న పెళ్ళికూతురి ముఖంలోకి జాలిగా చూసింది జ్యోత్స్న.        
    జ్యోత్స్న ఆనందనిలయానికి తిరిగి వచ్చేసరికి, భాస్కర్ వాటాలోంచి సుశీల ఏడుపు గట్టిగా వినిపిస్తోంది. రేవతి, ఐరావతమ్మ స్వతంత్రంగా లోపలి వెళ్ళారు - సుశీల ఏడుపు వినటంవల్ల కలిగిన ఆరాటంతో, నిగ్రహించుకోలేక జ్యోత్స్న కూడా వెళ్ళింది.      
    సుశీల గది మధ్యలో క్రింద కూచుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. భాస్కర్ కిటికీలోంచి "ఆనంద నిలయం" అన్న అక్షరాలను చూస్తూ నిలబడ్డాడు.    
    ఐరావతమ్మ సుశీల దగ్గిరగా వచ్చి ఓదార్పుగా "ఏం జరిగిందమ్మా! ఎందుకిలా ఏడుస్తున్నావు?" అని అడిగింది.
    సుశీల మరింత ఏడుస్తూ "చూడండి. అత్తయ్యగారూ! నా కళ్ళు కనబడటం లేదుట! నన్ను తీసుకుపోయి ఆస్పత్రిలో పడేస్తారుట! ఇదెక్కడి అన్యాయం చెప్పండి! ఈ రోజుల్లో కళ్ళద్దాలు లేనిదెవరికి? కొద్దిగా షార్ట్ సైట్ ఉన్నంతమాత్రాన గుడ్డిదాన్ని అయిపోయానా?" అంది.
    ఐరావతమ్మ ఓదారుస్తూ "ఫరవాలేదులే! ఊరుకో! నీకు కళ్ళు బాగానే కనిపిస్తోంటే ఆస్పత్రికి దేనికి?" అంది.
    అంతా వింటున్న జ్యోత్స్న ఊరుకోలేక "పోనీ, ఒకసారి చూపించుకుంటే నష్టమేముందీ? ఏదైనా జబ్బుంటే బాగుపడుతుంది లేకపోతే వచ్చెయ్యచ్చు-" అంది.
    జ్యోత్స్న కంఠస్వరం వినగానే సుశీల మండిపడుతూ "నిన్నెవరు రమ్మన్నారిక్కడికి? ఛా! సిగ్గులేదు. అవతలికి ఫో!" అని కసురుకుంది.
    జ్యోత్స్న క్రుంగిపోయి వెళ్ళిపోబోతూ గుమ్మం దగ్గిర భాస్కర్ ని చూసి ఆగిపోయింది.
    రేవతి ఆశ్చర్యంగా "అయితే, ఇంతకు ముందు మాతోపాటు జ్యోత్స్న వచ్చిందని మీకు తెలీదూ?" అంది.
    సుశీల రోషంగా "ఎందుకు తెలియదూ? ఇంటికొచ్చిన దాన్ని ఏమీ అనలేక ఊరుకున్నాను - తగుదునమ్మా. అని కల్పించుకుని మాట్లాడుతూంటే ఊరుకోలేకపోయాను - ఇది నా ప్రాణానికి శనిలా దాపురించింది-" అని అంతకుముందు జ్యోత్స్న నిలబడ్డ వైపుగా మెటికలు విరిచింది.
    ఐరావతమ్మ, రేవతి, విరగబడి నవ్వేశారు.
    జ్యోత్స్న బొమ్మలాగ భాస్కర్ ని చూస్తూ నిలబడింది.
    "ఎందుకు నవ్వుతున్నారు?" కోపంగా అడిగింది సుశీల?
    "జ్యోత్స్న ఇక్కడలేదు - నువ్వు కసురుకోగానే వెళ్ళిపోయింది."
    సుశీల ముఖం పాలిపోయింది - ఆ ముఖం చూస్తే శత్రువులకైనా జాలి కలుగుతుంది.  
    "నాకు తెలుసు - అదిక్కడ లేకపోతేనేం? నా కసికొద్దీ మెటికలు విరిచాను.
    రేవతి మరింత నవ్వుతూ "ఆవిడ ఇక్కడే ఉంది. గుమ్మం దగ్గిర ఉంది" అంది.
    సుశీలకు ఏడుపొచ్చేస్తోంది - ఏడ్చేస్తూ "అది ఇక్కడే ఉందా! అది-" అంటూ బావురుమంది.
    జ్యోత్స్న అక్కడ నిలబడలేక వచ్చేసింది. తన దురదృష్టంతో సుశీల మొండిగా జరిపే పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసిన తరువాత జ్యోత్స్నకు సుశీలపైన కోపం రావటం లేదు - జాలి మాత్రమే కలుగుతోంది.

 Previous Page Next Page