7
భాస్కర్ పరిస్థితినంతా వివరిస్తూ వెంకట్రావుగారికి ఉత్తరం వ్రాశాడు. ఆయన వెంటనే వచ్చారు.
సుశీల తండ్రిని కౌగలించుకుని బావురుమని ఏడుస్తూ "చూడు నాన్నా! నాకు లేనిపోనివన్నీ అంటగడుతున్నారు. నేను గుడ్డిదాన్నట్లు అంది.
వెంకట్రావు కూతుర్ని ఓదార్చి "ఛ! ఎవరన్నా రా మాట నీకు గుడ్డితనమేమిటి?" అన్నాడు.
సుశీల స్థిమితపడింది.
ఆ తరువాత నిదానంగా "నీ రెండు కళ్ళలోనూ పువ్వులు లేచాయి. ఆపరేషన్ చేయించుకుంటే మామూలు కళ్ళు వచ్చేస్తాయి. అలా పువ్వులు లేవటం మామూలే ఎవరికైనా వస్తాయి. ఆస్పత్రిలో చేర్పిస్తాను రా!" అన్నాడు.
సుశీల ఇంక వాదించలేక పోయింది. ఇటీవల....
భాస్కర్ ని కూడా తీసుకుని వెంకట్రావు సుశీలని ఆస్పత్రికి తీసికెళ్ళాడు.
పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షలలో బయటపడిన విషయాలకు భాస్కర్ గుండె ఝల్లుమంది. హైమమోమియా అన్నారు. అంటే పువ్వులు లేవటం మాత్రమే కాదు. లోలోపల నరాలు కూడా సరిగ్గా పనిచెయ్యడం లేదు. డిటాచ్ మెంట్ ఉంది. పస్ కూడా ఏర్పడింది. ఇన్ని కాంప్లికేషన్లలో ఆపరేషన్ చేసినా కళ్ళు రావటం కష్టం అన్నారు. అయినా ప్రయత్నిస్తామన్నారు. భాస్కర్ వెంకట్రావులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఒక్కరూ మాట్లాడలేదు.
సుశీలను ఆస్పత్రిలో చేర్పించారు. స్పెషల్ వార్డ్ లో కాదు కామన్ వార్డ్ లో చేర్పించటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
"స్పెషల్ వార్డ్ లో అయితే ఒక మనిషి కూడా ఉండాలి. అలా ఉండేవాళ్ళు లేరు. అదీగాక కామన్ వార్డ్ లో డాక్టర్స్ ఎప్పుడూ వచ్చి పోతుంటారు. అందుకే కామన్ వార్డ్ లో చేర్పించాను" అన్నాడు వెంకట్రావు.
ఈ సమాధానాలు అందరినీ అంత సంతృప్తి పరచలేదు. కన్నకూతురి వైద్యం విషయంలో కూడా ఇంత పిసినారిగా ఉంటున్నాడు. ఏం చేసుకుంటాడో, ఆ డబ్బంతా...." అనుకున్నారు.
ఈ మాటలు విన్న వెంకట్రావు బాధపడలేదు. నవ్వుకున్నాడు - తన పిసినారితనాన్ని గురించి ఎవరు విమర్శించినా, అతడు నిర్లక్ష్యంగా, హాయిగా నవ్వుకోగలడు....
ఆ సాయంత్రం పార్క్ లో కలుసుకున్నప్పుడు జ్యోత్స్నతో ఈ విషయాలన్నీ చెప్పాడు భాస్కర్. విని జ్యోత్స్న చాలా బాధపడింది.
"డాక్టర్ జగన్నాధంగారు నాకు తెలుసు. ఆయన ముగ్గురు పిల్లలకూ నేను కొన్నాళ్ళు ట్యూషన్ చెప్పాను. ఆయన నన్ను కన్నబిడ్డలా అభిమానించేవారు. నేనొచ్చి ఆయనతో మాట్లాడతాను. డాక్టర్ మనకు తెలిసినవాడయితే కాస్త శ్రద్ధగా చూస్తారు కదా!" అంది జ్యోత్స్న.
"ఎవరు చూసీ, ఏం చేసీ ప్రయోజనం లేదు" అన్నాడు భాస్కర్ నిరాశగా.
"అలా బాధపడకండి" అని ఓదార్చబోయింది జ్యోత్స్న. భాస్కర్ నవ్వేసి "ఇప్పుడు కొత్తగా బాధపడవలసింది ఏముంది?" అన్నాడు.
జ్యోత్స్న కింక మాటలు రాలేదు.
అటు ఆస్పత్రిలో సుశీలకి కావలసినవి అందిస్తూ, ఇటు ఇంట్లో పనులు చెయ్యటానికి మనిషి కావలసి వచ్చింది. సుబ్బలక్ష్మి అనే మనిషిని కుదుర్చుకున్నారు.
సుశీల నీరసంగా ఉందనీ, ఒకనెలరోజులు ఆస్పత్రిలో ఉండాలని కోలుకున్నాక ఆపరేషన్ చేస్తామనీ, ముందు బెడ్ రెస్ట్ కావాలని అన్నారు డాక్టర్సు....
'సుశీలకి 'రెస్ట్' అనేది సాధ్యమేనా?' అనుకున్నాడు భాస్కర్ మనసులో.... ఆపరేషన్ టైంకి మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు వెంకట్రావు....
ఆస్పత్రికి వెళ్ళి సుశీల ప్రక్కన కూర్చోవాలంటే ప్రాణాంతకంగా ఉంటూంది భాస్కర్ కి.... ఎందుకంటే, ఎవరున్నదీ, ఎవరులేనిదీ కూడా గమనించకుండా తను కూర్చున్న కాసేపూ సతాయించి పెడుతుంది. అలా అని ఒక్కరోజు వెళ్ళకపోయినా ఆ మరునాడు ఇక ప్రళయమే.
అడుగుల చప్పుడు విని "వచ్చారా?" అంది సుశీల....
"ఎందుకు రాను?" విసుగ్గా అన్నాడు భాస్కర్. ఎంత ప్రయత్నించినా, అతనికి విసుగు అనుచుకోవటం చేతకావటం లేదు....
"అవును. ఎందుకు రారూ? రాకుండా ఎలా ఉండగలరు నాకోసం కాకపోయినా జ్యోత్స్న కోసమయినా రారూ?"
"ఏమిటి వాగుతున్నావ్ నువ్వు?"
"నాకేమీ తెలియదనుకోకండి. డాక్టర్ జగన్నాథంగారు చెప్పారు. జ్యోత్స్న ఇక్కడి కొచ్చిందట! ఆయనతో నేను తన స్నేహితురాలినని చెప్పిందిట! ప్రత్యేకం పని కట్టుకుని పలకరించి ఇవన్నీ చెప్పి, ఏలా ఉంది అని అడిగారు?"
"మంచిదేగా?"
"ఆ! అంతామంచే! ఆవిడకి నామీద ప్రేమ ఒలికిపోతోంది. ఈ వంకతో మీ దగ్గిరకి రావాలని కాదూ!"
"కర్మ! నాకోసం ఆస్పత్రికే రావాలా ఆవిడ? పాపం ఏదో నీకు మేలు చేద్దామని వస్తే...."
"మేలు! ఆవిడ చేసే మేలుకోసం చెయ్యి చాచవలసిన కర్మేం కాలింది నాకు? డబ్బు పారేస్తే డాక్టర్లెందుకు చూడరు? నా కర్మ! అందరికందరికీ నా కంటే డబ్బే ప్రధానమయిపోయింది. మా నాన్న సరే పిసినారి మనిషి. మీరు -కట్టుకున్న మొగుడికే లేకపోయాక ఇంకెవరి కుంటుంది? అసలు నా కళ్ళు బాగవ్వాలని మీకుంటేగా? నేను గుడ్డిదాన్నయిపోతే. గుడ్డిదని నన్ను వదిలేసి హాయిగా మరొకళ్ళని పెళ్ళిచేసుకోవచ్చునని చూస్తున్నారు - అంతేకదూ!...."