"పడనివ్వండి."
"ఒంటరిగా ఇక్కడ ఉంటారా?"
"ఒంటరిని కాక నాకు తోడెవ్వరుంటారు?"
తెల్లబోయి చూశాడు భాస్కర్. అంతలో లేచినవాడు మళ్ళా కూచున్నాడు.
జ్యోత్స్న నవ్వుతూ "కూచున్నారేం? నాకు తోడుగానా అని అంది.
"తోడుగా నిలవలేను - ఒంటరిగా వదలలేను."
"ఏం చేస్తారు, మరి?"
"మీరు, మీ మార్గాన్ని ఎంచుకునేవరకూ చేదోడు వాదోడుగా ఉంటాను."
"థేంక్స్! అయితే ఇక నిశ్చింతగా నేను నా దారి చూసుకోవలసిందే!"
నవ్వుతూ లేచింది జ్యోత్స్న.
తన సైకిల్ తీసుకుని చెయ్యి ఊపాడు భాస్కర్.
తనూ చెయ్యి ఊపి బస్ లో కూచుంది - సంతృప్తి నిండిన మనసుతో....
6
మచ్చల డాక్టర్ ఏ మాత్రం అవకాశం చిక్కినా జ్యోత్స్నతో మాట్లాడాలని ప్రయత్నించేవాడు. అతనితో కబుర్లు చెప్పలేక అతణ్ణి నొప్పించలేక, ఎప్పటికప్పుడు కడుపునొప్పి అనో, జ్వరం వచ్చినట్లుగా ఉంది అనో తప్పించుకోవటానికి ప్రయత్నించేది జ్యోత్స్న.
జ్యోత్స్న ఆ మాట అనగానే మచ్చల డాక్టర్ మందు తెచ్చి పెట్టేవాడు. తరువాత జ్యోత్స్నను "తగ్గిందా?" అని వేధించేవాడు. అతని భాదపడలేక "తగ్గింది" అనేది జ్యోత్స్న.
తరువాత ఎవరెవరో వచ్చి జ్యోత్స్నను "మచ్చల డాక్టర్ మందులు బాగా పని చేస్తాయిట కదూ? మీ కడుపునొప్పి, జ్వరం చేత్తో తీసినట్లు తగ్గిపోయాయిట కదూ?" అని అడిగేవారు.
"అవున"ని చెప్పేది జ్యోత్స్న.
క్రమంగా మచ్చల డాక్టర్ ప్రాక్టిస్ పెరిగింది. అతనికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అయితే వైద్యం కోసం మచ్చల డాక్టర్ దగ్గరకి వచ్చేవాళ్ళు జ్యోత్స్నతో కూడా ఏదో, అదీ - ఇదీ మాట్లాడాలని ప్రయత్నించే వారు.
మచ్చల డాక్టర్ ప్రాక్టీస్ పెరిగినందుకు సంతోషంగానే ఉన్నా, అతని పేషెంట్స్ తాకిడికి తట్టుకోవటం మాత్రం యాతనగానే ఉంది జ్యోత్స్నకి....
జ్యోత్స్న పనిచేస్తున్న షాప్ యజమాని కూతురికి పెళ్ళి నిశ్చయమయింది. పెళ్ళికి తప్పకుండా రమ్మని జ్యోత్స్నని ఆహ్వానించాడు యజమాని. సాధారణంగా ఎక్కడికీ వెళ్ళని జ్యోత్స్న యజమాని ఆహ్వానాన్ని కాదనలేక బయలుదేరింది. అక్కడ రేవతినీ, ఐరావతమ్మనీ చూసి ఆశ్చర్యపోయింది.
"నువ్వూ వచ్చావే!" అంది ఐరావతమ్మ, అనవసరంగా ఆశ్చర్యపడిపోతూ.
"నేను వీరి షాప్ లోనే పని చేస్తున్నాను" అంది జ్యోత్స్న.
ఐరావతమ్మ గర్వంగా తల తిప్పి "మావారు తహసీల్దారు గదూ? అందరూ పరిచయస్థులే! అందులో ఈ పెళ్ళికూతురి తండ్రీ, మావారూ చాలా దగ్గిర స్నేహితులు. ఇతను వ్యాపారంలో బోలెడు సంపాదించాడు. తెలుసా?" అంది.
ఎదుటి వ్యక్తుల ఆర్థికస్తోమతు అంచనా వెయ్యకుండా ఐరావతమ్మ మాట్లాడలేదు.
రేవతి జ్యోత్స్నను చూసి "రా! మాతో!" అంది.
రేవతి పక్కన కూచోటానికి జ్యోత్స్నకి అంతగా ఇష్టం లేకపోయినా, అక్కడ మరెవరూ తెలిసినవాళ్ళు లేకపోవటంవల్ల వెళ్ళి కూచుంది.
అక్కడి అమ్మలక్కల్లో ఒకావిడ "అమ్మాయికి చిన్నతనంలోనే పెళ్ళి చేస్తున్నారు. ఈరోజుల్లో ఆడపిల్లలకి ఎంత వయసువచ్చినా పెళ్ళిళ్ళు కావటం లేదు." అంది.
ఆ మాటలు విన్న రేవతి ముఖం ఎలాగో అయిపోయింది.
"ఈ పెళ్ళి మూలంగానే ఆడది మొగాడికి బానిస అయిపోతోంది. ఆ బానిస బ్రతుకు నేను భరించలేను. అందుకే నేను పెళ్ళి చేసుకోను." అంది.
రేవతి పై గొంతు ఇలా మాట్లాడుతుండగానే లోగొంతు మా అమ్మాయి అదృష్టవంతురాలు. డబ్బుంది, రూపం ఉంది, బాధను తెలిసిన తల్లిదండ్రులున్నారు. లక్షణంగా పెళ్ళి చేసుకుంటే జీవితం స్థిరపడిపోతోంది. నాబోటివాళ్ళకి పెళ్ళి ఎలా అవుతుందీ? స్వతంత్రంగా మా అంతట మేము ప్రేమించడానికి ప్రయత్నిస్తే, సంఘమూ ఆడి పోసుకోంటుంది, ఈ పవిత్ర భారతదేశంలో పురుషపుంగవులు అపార్థం చేసుకుంటారు. అన్నీ కుదిరి ప్రేమ పెళ్లిళ్లు జరిగేది ఎక్కడో...." అనుకుంది.
రేవతికెప్పుడూ పై గొంతు ఒకటి పలుకుతూంటే లోగొంతు మరొకటి గొణుగుతుంది. ఈ రెండు గొంతుల సంఘర్షణ ఆ అమ్మాయి ముఖంలో వ్యక్తిత్వంలో స్పష్టంగా ప్రతిఫలిస్తూ ఉంటుంది.
రేవతి అలా సమాధానం చెప్పగానే ఐరావతమ్మ అందుకు సాధ్యామయినంత విచారంగా ముఖంపెట్టి "ఎన్ని విధాల నచ్చచెప్పినా పెళ్లి చేసుకోనంటుంది. ఏం చెయ్యగలం చెప్పండి! ఈ కాలం పిల్లలకు ఎవరు చెప్పగలరు? ఇంతకూ ఆ కళ్యాణి ఘడియ, ఏనాడు తోసుకోస్తుందో...." అంది.