Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 12


    ఇద్దరి మధ్య కొన్ని నిమిషాలు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోనే మాటలతో ప్రమేయం లేని అవగాహన ఇద్దరిమధ్య.
    కొంతసేపటికి ప్రసూన అంది "నీకు కావలసినట్లు చేసుకో! నాకు మాత్రం చెప్పటం దేనికీ?"
    "చెప్పాను గానీ ఆశీర్వాదం కావాలి!"   
    "మీ నాన్నగారికి తెలియకుండా నేను వస్తే ముందు ముందు నామీద ఆయనకి నమ్మకం పోతుంది."
    "భర్తకు విధేయత మంచిదే. కానీ కొడుకు విషయంలో ప్రేమ. బాధ్యత రెండూ ఉండాలి."

    "నాకు తెలుసు! కానీ తల్లికొడుకుల మధ్య ప్రేమ మాత్రమే ఉంటుంది.... కోపం పగ ఉండవు."

    వివేక్ మాట్లాడలేదు. తల్లి దగ్గర కూడ అతడెక్కువ మాట్లాడడు. కానీ అతడికి తన తర్వాతే లోకమంతా అని ఆమెకి తెలుసు. తల్లి బతుకుతున్నది తన కోసమేనని అతడికి తెలుసు.
    వివేక్ లేచాడు.
    "ఏం చేద్దామనుకుంటున్నావ్" కంగారుగా అడిగింది.
    "నాకిష్టంలేని పని నేను చెయ్యనని నీకు తెలుసుగా?"
    "నువ్వు ఆ అమ్మాయినే ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావ్? సాహసిలా ఉంది!"
    "తెలుసు! సరిగ్గా అందుకే ఆ అమ్మాయినే చేసుకోవాలనుకుంటున్నాను. మన ఇంటికి వచ్చాక ఆ అమ్మాయికి సాహసం కూడా చాలా అవసరం."

    "నీ మాటలు నాకు అర్థంకావటం లేదు. నాన్నగారిక్కూడా ఇష్టమున్న అమ్మాయినే చేసుకున్నావనుకో! అప్పుడిక సాహసమూ శౌర్యమూ ఇవన్నీ దేనికీ?"   

    "నేను ఈ అమ్మాయినే చేసుకోవాలనుకుంటున్నాను! నీ ఆశీర్వాదంతో...."
    వెళ్ళబోయాడు వివేక్. అతడి చెయ్యి పట్టుకుంది ప్రసూన.
    "ఏరోజు పెళ్ళి చేసుకుంటున్నావో చెప్పు! ఎన్ని గంటలకో చెప్పు. వచ్చి ఆశీర్వదిస్తాను!"  

    తల్లిచేతిని ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు....
    "మా అమ్మ చాలా మంచిది!" అన్నాడు. అతడు తల్లికి థేంక్స్ చెప్పే పధ్ధతి అది.
                                  * * *
    "హలో"
    యశోదని పలకరించింది ఒక అమ్మాయి. ఎరుపులో పసిమి కలిసిన శరీర ఛాయ. బాబ్డ్ హేర్. మేక్సీ... వంటి మీద నగలు లేవు. యూరోపియన్ లా ఉంది.  
    "సారీ! నేను మిమ్మల్ని ఎక్కడ చూశానో గుర్తుకురావడం లేదు..."
    గలగలా నవ్వింది ఆ అమ్మాయి మీరు నన్నసలు చూడలేదు. నేను మోడ్రాస్. సేంట్ మేరీస్ కాన్వెంట్ లో చదువుతున్నాను. మా జానీ కారులోంచి చూపిస్తే దూరం నుంచి మిమ్మల్ని చూశాను."

    "జానీ"
    "అవును.... మీ క్లాస్ మేట్."
    యశోద ముఖం ఎఱ్రబడింది.
    "నువ్వు అతడి మరో గర్ల్ ఫ్రెండ్ వా?"
    ఆ అమ్మాయి నాలుక కరుచుకుంది.
    "నేను జానీ సిస్టర్ ని. ఒకే తల్లికి పుట్టిన దానిని."
    "ఆయామ్ సారీ!"
    "హిడిజర్వ్స్ ఇట్" కోపంగా అంది.
    "ఏం కావాలి మీకు?"
    "నాకేం అక్కర్లేదు. మా మమ్మీ మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు! ఆవిడ బయటికిరారు! ఒకసారి మిమ్మల్ని రమ్మంటున్నారు."
    "ఇది మీ జానీ ఆడుతోన్న మరో నాటకమా?"  
    రోషంతో ఆ అమ్మాయి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

    "నాకు తెలిసినంతవరకూ జానీ నాటకాలాడడు. మోసం చెయ్యడు. అన్నీ ముక్కుకు సూటిగా స్పష్టంగా చెప్తాడు. వాడితో తిరిగే ఆడపిల్లలందరూ వాడు పెళ్ళి చేసుకోడని తెలిసే తిరుగుతున్నారు."

    ఈ సంగతి యశోదకీ తెలుసు. కాస్త తగ్గింది.
    "మీ అమ్మగారు నాతో ఎందుకు మాట్లాడతానన్నారు? ఆవిడకి నేనెలా తెలుసు?"
    "జానీ చెప్పగా వినటమే" కొంచెం ఆగి అంది ఆ అమ్మాయి.
    "జానీ అమ్మాయిలతో తిరుగుతాడని మమ్మీకి తెలుసు. అది మంచిది కాదని ఎన్నో విధాల నచ్చ చెప్పింది. కానీ వినలేదు. ఇన్నాళ్లకి జానీ మమ్మీతో 'ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు' అని చెప్పాడు. మమ్మీ మిమ్మల్నొకసారి చూడాలనుకొంది. వస్తే రండి మీ ఇష్టం."  
    "ఇప్పుడే వెళదాం పద" అంది యశోద. జానీకి భయపడి పారిపోవడం అర్థంలేనిపని. అతడంటే తనకి ఇష్టం లేదు." అంతమాత్రాన ఒక పెద్దావిడ తనను చూడాలనుకుంటోంది. ఎందుకు తిరస్కరించాలి?   
    ఇద్దరూ ఆటోలో వెళ్ళారు. జానీ ఇల్లు పెద్ద ఆడంబరంగా లేదు. ఒక మోస్తారు డాబా ఇల్లు. కానీ చాలా నీట్ గా ఉంది. గోడకి ఏసుక్రీస్తు తైలవర్ణంచిత్రం ఉంది. సోఫా సెట్ మధ్యలో టీపాయ్.
    "ఎవరూ?" లోపలి నుంచి వచ్చింది ఒక నడివయసావిడ. గంజి పెట్టి ఇస్త్రీ చేసిన వాయిల్ చీర కట్టుకుంది. ఏ అలంకారాలూ లేవు. నుదుటిమీద బొట్టు కూడా లేదు.
    "జానీ చెప్పింది ఈ అమ్మాయి గురించే మమ్మీ! నువ్వు చూడాలనుకుంటున్నావని చెప్పాను. వెంటనే వచ్చింది."
    "నువ్వా" యశోదని చూస్తూ కొంచెం ఆశ్చర్యంగా అంది ఆవిడ.

    "కూచోఅమ్మా! జానీ ప్రేమించాడంటే ఎంత స్టయిల్ గా ఉంటుందో అనుకున్నాను. నువ్వు చాలా సాదా సీదాగా ఉన్నావు. అవునులే! స్టయిల్ గా విరగబడే ఆడవాళ్ళు ఈ మొగాళ్ళకి కలిసి తిరగటానికే పనికి వస్తారు. ప్రేమించేది మాత్రం నీబోటి వాళ్లనే."   
    ఇబ్బందిగా కూచుంది యశోద. ఆవిడంటే గౌరవం కలుగుతోంది. క్రిస్టియన్స్ లో సాధారణంగా మాట మంచితనం ఒక విధమైన సభ్యత పరిశుభ్రత కనిపిస్తాయి.

 Previous Page Next Page