Previous Page Next Page 
కె. ఆర్. కె మోహన్ కథలు పేజి 13


    "ఏమో... నాకు మాత్రం తెలుసా?"


    "సరిగ్గా చెప్పవే... నీ వంకర వాగుడు మాని!"


    "సరే విను! ఇంటర్వ్యూ ఇలా సాగింది -"


                           *    *    *    *    *

    
    "ప్రపంచంలోఅతి తెలివైన ప్రాంతం ఎక్కడుంది?" బ్రహ్మంగారి ప్రశ్న.


    "పసిపిక్ మహా సముద్రంలో ఫిలిప్పీన్స్ కి ఆవల!"


    "నీ అభిమాన కర్ణాటక సంగీత గాయకుడు ఎవరు?" విష్ణుగారు చిద్విలాసంగా చిదిపిన ప్రశ్న.


    "పట్టుకొట్టై కుమారస్వామి అంటే... ప్రఖ్యాత గాయక శిరోమణి మీకు తెలియక పోవడమేమిటి సార్? నన్ను పరీక్షిస్తున్నారు కాని..., ఆయన ఎంతటి పేరున్న విద్వాంసుడు? క్రిందటి త్యాగరాజ ఆరాధన ఉత్సవాలకు మదరాసునుంచి వచ్చి మన హైదరాబాదులో కూడా పాడారు."


    " అవునవును... నేనూ విన్నాను. ఆయన గొప్ప విద్వాంసుడు!" శివుడు గారు వత్తాసు పలికారు.


    "అవునవును... ఆ కచేరికి నేను కూడా వెళ్లాను. గొప్ప గాయకుడాయన!" బ్రహ్మగారి  సపోర్టు.


    "ఆ ..జ్ఞాపకం వచ్చింది. రేడియోలో చాలాసార్లు విన్నాను. టీవీలో కూడా చూసేవాడిని.. వారి ప్రోగ్రాములు అర్దరాత్రివేళ వస్తాయి. పైగా.... ఈ అరవ పేర్లు సరిగ్గా గుర్తుండి చావవు!" అని విష్ణుమూర్తిగారి ముక్తాయింపు.
    

    "నువ్వు బి. యస్. సి. పాసయ్యావుకదా... గ్రూప్ లో మెయిన్ ఏమిటి?" బ్రహ్మగారి కొసరు ప్రశ్న.


    "బాటనీ....!"


    "గుడ్ .. గులాబీలలో కొన్ని వందల రకాలు వున్నాయి కదా! వాటిలో మన దేశవాళి రకం కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గులాబీ  రకం పేరు ఏదైనా చెప్పు?"


    "రోసానా పొడెస్టా!"


    "రోసానా పాడెస్టానా? ఈ పేరు విన్నట్టు లేదే! అది ఎక్కడిది?"


    "ఏమిటి సార్... నా బాటనీ నాలెడ్జిని పరీక్షిస్తున్నారు కాని, మీరు వినపడకపోవడ మేమిటి? ఇది బ్రెజిల్ కి చెందినది. రోజ్ ఎగ్జిబిషన్ ప్రతిదాంట్లోనూ  ఇది వుండి తీరుతుంది."


    "అవునవును. మొన్న  ఎగ్జిబిషన్  గ్రౌండ్స్ లో పెట్టిన రోజ్ షోలో ఈ రకానికి మొదటి  బహుమతి వచ్చిందని పేపర్లలో చదివాను" విష్ణుమూర్తిగారి వత్తాసు.


     "మీరు చెప్పింది నిజమే! ఆ రకాన్ని నేను చూశాను కూడా. ఆరంజి చక్ గ్రౌండ్ మీద గ్రీనిష్ రెడ్ కలర్ వుంటుంది. వారం రోజులకి కూడా వాడదు. పువ్వు కూడా డాతియా అంత పెద్దగా వుంటుంది" శివుడిగారి సపోర్టు.


    "వెరీగుడ్....! ఈమధ్య లక్నోలోని బొటానికల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ వారు గింజలు లేని చింతపండుని సంకర జాతిగా రూపొందించారు. ఆ వార్త నువ్వు కూడా పేపర్లో చూసి వుంటావు. దాని పేరు చెప్పగలవా?"


    "వాగబాండస్ ఇండికా!"


    "నేను మరేదో పేరు చదివినట్లున్నానే....!"


    "అదేమిటి సార్.. మీకు జ్ఞాపకం లేకపోవడమేమిటి సార్ - నన్ను కన్ ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు కాని...!"


    "ఆ పేరు కరెక్టేనండీ! ఆ హైబ్రిడ్ రకం గురించి ఒక ప్రత్యేక వ్యాసం నేను బొటానికల్ జర్నల్ లో చదివాను" బ్రహ్మగారి భాష్యం.

 
     "ఒకసారి టీవీలో టర్నింగ్ పాయింట్ లో కూడా వచ్చిందండీ! నేను చూశాను.... నాకు బాగా జ్ఞాపకం!" విష్ణుగారి విశేష పరిజ్ఞానం.

 
     "చూడమ్మా ... పెళ్ళయ్యాక ఉద్యోగం మానివేయమని మీ ఆయన కోరితే మానేస్తావా?" విష్ణుగారి విశేష పరిజ్ఞానం.

 
     "చూడమ్మా.. పెళ్లయ్యాక ఉద్యోగం మానివేయమని మీ ఆయన కోరితే  మానేస్తావా?" విష్ణుమూర్తిగారి కొసరు ప్రశ్న.


    "ఉద్యోగం చేయడానికి అభ్యంతరం లేని వాడినే చేసుకుంటాను."


    "పైన్.. ఓ. కె.! యూకెన్ గో... త్వరలోనే రిజల్టు తెలియబరుస్తాం!"


    "థాంక్యూసర్... రిజల్టు పంపుతారా? అపాయింట్ మెంట్ ఆర్డరా?"


    "వాట్ డూ యూ మీన్? ఆర్ యూ సో ఓవర్ కాన్ఫిడెంట్?" కోపంగా అన్నాడు విష్ణుమూర్తిగారు.

 
    "పోన్లెండిసార్.... పట్టుకొట్టై కుమారస్వామిగారు ఈసారి కనిపించినప్పుడు నా తరపున థాంక్స్ చెప్పండి!"


    "వాటీజ్ దిస్ నాన్సెన్స్?" ముగ్గురూ ఒకేసారి అరిచారు.


    "ఐయామ్ ఫుల్లీ ఇన్ సెన్స్! సెన్స్ లెస్ గా మాట్లాడింది మీరు. అసలు "పట్టుకొట్టై కుమారస్వామి" అనే మనిషి వుంటేగా!నేను గట్టిగా దబాయించేసరికి - "అవునవును.... విన్నాం, చూశాం!" అంటూ మీరు తలలూపారు. 'రోసానా పొడెస్టా' అనేది ఒక ఇటాలియన్ సినీ నటి పేరు. నేను గట్టిగా గద్దించేసరికి ఆ పువ్వు చూసినట్లు వర్ణించారు. దాన్ని గురించి చదివినట్లు కోశారు. 'టామారిండస్  ఇండికా' అనేది చింతచెట్టు పేరు. 'వాగబాండస్ ఇండికా' అంటే లిటరల్ గా 'భారతీయ తిరుగుబోతా!' అని అర్దం. నేని ధైర్యంగా  చెప్పేసరికి, దానిని గురించి చదివినట్లు, టీవీలో చూసినట్లు కోతలు కాశారే.... ఇటువంటి మీరా - నన్ను ఇంటర్వ్యూచేసేది? ఈ ఉద్యోగానికి  కావలసిన అర్హతకంటే ఎక్కువ అర్హతలే  నాకు వున్నాయి. ఈ ఉద్యోగం పదిరోజుల్లో గానీ నాకు రాకపోతే మీ బండారాలను  పేపర్లలో  బట్టబయలు చేస్తాను. నేను రైటర్ని కూడా...! ఈ వ్యవహారం  ఈ నాలుగు గోడల మధ్యనే వుంటుందనుకుంటే  అది పొరపాటు. దీనిని బట్టబయలు చేయగల తిరుగులేని సాక్ష్యాలు  నా దగ్గర వున్నాయి.  ఇప్పటికే మీరు షాక్ తిన్నారు -  ఆ సాక్ష్యాలేమిటో తెలిస్తే మీరు మూర్చపోతారు. ఏమైతేనేం - నేను జంటిల్ ఉమన్  గా ఈ పదిరోజుల్లో ఈ విషయాన్ని  ఎవ్వరికీ చెప్పను..... ఆఖరికి మా వాళ్లకి కూడా! మీరు మర్యాదగా ఉద్యోగం ఇస్తే మీ వ్యవహారం మన నలుగురి మధ్యనే వుంటుంది. ఇవ్వకపోతే ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ఆలోచించుకోండి.... వస్తాను!'


                                *    *    *    *    *

    
    " వండర్ ఫుల్....! ఆ తర్వాత ఏమయింది?"


    "ఇంకేమవుతుంది? షాక్ నుంచి తేరుకోవడానికి వాళ్లకి ఆరు రోజులు పట్టింది. ఏడో రోజున చచ్చినట్లు అపాయింట్ మెంట్ ఆర్డర్స్ పంపించారు" అంటూ పగలబడి నవ్వింది వనజ.


     "అంటే .. బ్లాక్ మెయిల్ చేసి ఉద్యోగాన్ని కొట్టేశావన్నమాట! నువ్వన్నట్లు వాళ్లకి భలే పాఠం నేర్పావే!" అని అభినందించింది రాగిణి.


    "లంచాల గడ్డి మేసే వాళ్లకి ఇలాగే శాస్తి చేయాలి!" అంది వనజ.

 
    "అదిసరే.... కుమారస్వామిగారు పాడిన కీర్తనలు, రాగాలు, ఆ గులాబీ వివరాలు, చింతచెట్టు సంగతులు గట్టిగా అడిగారనుకో..... బయటపడిపోయేదానివి కాదూ?"అంది రాగిణి నిర్లక్ష్యంగా.

 
    "ఓసి సత్తెకాలపు సత్తెమ్మా... అసలు పుట్టనే పుట్టని పట్టుకొమ్మని పుట్టించిన దాన్ని..., సృష్టిలో లేని గులాబీని, చింతచెట్టుని సృష్టించిన దాన్ని..., ఎవరూ వినని కీర్తననీ,ఎవరికీ తెలియని రాగాన్నీ సృష్టించలేనా? అలాగే మిగతావీను. గట్టిగా దబాయిస్తే - " అవునవును...'అంటూ తలలు ఆడించేవాళ్ళు!"


     "అదిసరే కాని... నువ్వు ఉద్యోగంలో చేరాక ఈ విషయం టాంటాం చేయవని వాళ్లకి నమ్మకమేమిటి?"


    "ఈ విషయం లో ఉమన్ - జెంటిల్మన్ అగ్రిమెంట్ వుంది. నిన్న డ్యూటీలో జాయిన్ అవడానికి వెళ్లినప్పుడు యం. డి. ముఖానికి నవ్వు పులుముకొని ఇలా అన్నారు -


     'చూడు మిస్ వనజా... యూ ఆర్ టూ స్మార్ట్... .యూ విల్ బి ఏన్ ఎసెట్ టు అవర్ ఆఫీస్. చూడు.. ఐ యామ్ వెరీ ప్లెయిన్. నువ్వు కోరినట్లు నీకు ఈ జాబ్ ఇచ్చాం. అఫ్ కోర్స్ ... యూ ఆర్ వెల్ క్వాలిఫైడ్. మొన్న జరిగింది నీవు ఎవ్వరికీ చెప్పకూడదు. మర్చిపోవాలి. ఒకవేళ టూ స్మార్ట్ గా - ఎలాగైతేం ఉద్యోగం వచ్చింది కదా... అన్న ధీమాతో  ఎవరికైనా  చెప్పావనుకో - ఏదో కారణం చూపి నిన్ను తీసేయడం మాకు కష్టం కాదు. నీకు వేరే ఉద్యోగం  రాకుండా బాడ్ రిపోర్ట్  ఇచ్చి పంపగల అవకాశం కూడా మాకు వుంది. అఫ్ కోర్స్.... యూ ఆర్ ఇంటలిజెంట్ టు అండర్ స్టాండ్ ఆల్ దీజ్ థింగ్స్! విష్ యూ బెస్ట్  ఆఫ్ లక్!' అన్నాడు.


    నేనూ అందుకు మర్యాదగా ఒప్పుకుని డ్యూటీలో జాయినయ్యాను. నాకీ జాబ్ కావాలి. వాళ్ళకి పరువు నిలవాలి. అందుకే ఈ జెంటిల్ మెన్ అగ్రిమెంట్!" అంది వనజ.


     "వాళ్ళేం జెంటిల్ మెన్ కాదులే... ఇంక ఒళ్ళు దగ్గర పెట్టుతుంటారు" అంది రాగిణి.

 
    "యూ ఆర్ రైట్! ఈ విషయం మావాళ్లకు కూడా చెప్పలేదు. కేవలం నీకు మాత్రం చెప్పాను. నీవు కూడా విననట్లే మరిచిపోవాలి" అంది వనజ.


    "అది వేరే చెప్పాలా.....?" అంది రాగిణి - వనజ భుజం నొక్కుతూ.

 

                                                                  - జాగృతి... దీపావళి ప్రత్యేక సంచిక' 94

 Previous Page Next Page