ముప్పు తెచ్చిన మూడు ప్రశ్నలు
(జాగృతి మాస పత్రిక - 1994 దీపావళి హాస్య కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ)
డిగ్రీ చదువు పూర్తి అయ్యాక పేపర్లో పడ్డ అడ్డమైన ఉద్యోగానికీ దరఖాస్తు చేయడం అందరిలాగానే రాగిణికీ మామూలయిపోయింది.
చాలా పరీక్షలకి రాత పరీక్షలు, ఆ తర్వాత అవసరం లేకపోయినా ఇంటర్వ్యూలు వుంటాయి. రాత పరీక్షలన్నింటిలోనూ పాసయ్యేది. ఆ తర్వాత ఇంటర్వ్యూకి కూడా పిలుపు తప్పకుండా వచ్చేది. ఇంటర్వ్యూ పేరుతో తలాతోకా లేని, ప్రకటించిన ఉద్యోగానికి ఎంతమాత్రం సంబంధం లేని ప్రశ్నలు వేస్తుండేవారు.
వాటన్నిటికీ సరిగ్గా జవాబు చెప్పినా కూడా ఉద్యోగం మాత్రం వచ్చేది కాదు. అందులోని మతలబు ఏమిటో అర్దంకాక సతమతమయ్యేది.
రాగిణి ఫ్రెండ్స్ అంటుండేవారు -
"పిచ్చిదానా! ఇంటర్వ్యూలు బాగా చేసినంతమాత్రాన ఉద్యోగం వస్తుందను కుంటున్నావా? ఉత్తర దక్షిణాలని గట్టి పట్టుపట్టందే రాదు" అని.
'ఉత్తరం' అంటే... రికమండేశనట! అంతటి ఉద్దండ పిండాలెవరూ ఆ అమ్మాయికి అందుబాటులో లేరు. 'దక్షిణ' అంటే... లంచం. అదిచ్చే స్తోమతే లేదు. మనసూ ఒప్పదు. పోనీ... మనసనే ఆ కనిపించని పదార్దాన్ని చంపుకుని స్తోమత అరువు తెచ్చుకుని సమర్పించుకుందామనుకున్నా - ఏర్పాటులు పోయి ఎవరికి, ఎంత, ఎలా ముట్టజెప్పాలో తెలియదు. తెలుసుకోవాలన్నా చెప్పేవారు లేరు. అసలు ఆ మతలబులు తెలిసిన పైరవీకారులు ఎక్కడ దర్శనం ఇస్తారో అసలు తెలియదు. అందువల్ల దేముడి మీద భారం వేసి మంచిరోజుల కోసం ఎదురుచూస్తుండేది.
ఒకరోజున రాగిణికి హైదరాబాద్ లోని ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థనుంచి కాల్ లెటర్ వచ్చింది. ఉన్నవి రెండే రెండు పోస్టులు. ఇంటర్వ్యూకి వచ్చిన వారు మాత్రం ఇరవైమంది వున్నారు.
వచ్చిన అభ్యర్దులు వారిలో వారు అనుకుంటున్నారు -
"మన పిచ్చి కాని...., వాళ్లకి కావలసిన కేండెట్ల సెలక్షన్ ఎప్పుడో అయిపోయింది. ఇంటర్వ్యూలో సెలక్టు అయినట్లుండాలి కాబట్టి ఈ నాటకం! ఆ అండదండల వారెవరో మన మధ్యలోనే వున్నారు. మనల్ని మాత్రం కాసేపు ఆ ప్రశ్నలూ, ఈ ప్రశ్నలూ వేసి కాలక్షేపం చేస్తారు. మనకి అనవసర శ్రమ, డబ్బు దండుగాను!" అని ఒకరు అనగానే -
"వెళ్లగానే తండ్రి పేరు, ఊరు వగైరా అడుగుతారు. ఎందుకో తెలుసా? మనం వాళ్ల కాండిడేట్ అవునో, కాదో గుర్తుపట్టడానికి!" అని మరొకరు అన్నారు.
"తలాతోకా లేని ప్రశ్నలు వేశారనుకోండి - దాని అర్దం.... ఆ ఉద్యోగం మనకోసం కాదని చెప్పడానికన్నమాట!" అని ఇంకొకరు అన్నారు.
ఈలోగా ఇంటర్వ్యూకి వెళ్లినవారిలోని ఒకతను ఆ గదిలోంచి బయటకు వచ్చాడు.
వెంటనే అందరూ అతన్ని చుట్టుముట్టారు - "ఏం అడిగారు?" అంటూ.
"నీకు హిందీ సినిమాలు ఇష్టమా? తెలుగు సినిమాలు ఇష్టమా?"
"నీకు పాప్ మ్యూజిక్ వచ్చా? వస్తే నీ అభిమాన సింగర్ ఎవరు?"
" పాక్ - ఇండో యుద్దం ఎప్పుడు జరిగింది? ఎవరెవరికి జరిగింది?"
...ఇలా వున్నాయి ఆ ప్రశ్నలు.
అతను ఇంకా ఏదో చెప్తుండగా రాగిణికి పిలుపు వచ్చింది.
దడదడలాడే గుండెలతో లోనికి వెళ్ళింది ఆ అమ్మాయి.
లోపల ఒకపెద్ద ఓవల్ షేప్ డ్ బల్లకి మూడు వైపులా త్రిమూర్తులులాగా ముగ్గురు కూర్చొని వున్నారు. నాలుగోవైపు కుర్చీలో - అంటే..... ఆ మధ్యన వున్న విష్ణుమూర్తిగారికి ఎదురుగా వున్న కుర్చీలో రాగిణిని కూర్చోమన్నారు.
ఆ అమ్మాయి పేరు, ఊరు, తండ్రిపేరు, ఆయన ఉద్యోగం వగైరాలు అడిగాక బ్రహ్మగారు -
"ఇప్పుడు ఈ రూంలో టెంపేరచర్ ఎంత వుంటుంది?" అని అడిగారు.
కొంచెం ఆలోచించి, "38 డిగ్రీలు వుండవచ్చు" అంది రాగిణి.
"ఉండవచ్చు - అంటే.. .నీమీద నీకే నమ్మకం లేదన్నమాట!" అన్నాడు ఆయన.
"నీకు తెలిసిన కర్ణాటక విద్వాంసుని పేరు చెప్పు?" విష్ణుమూర్తిగారు ముచ్చటగా అడిగారు ప్రశ్న.
"బాల మురళీ కృష్ణ!' తడబడకుండా చెప్పింది రాగిణి.
"ఆయన రికార్డు ఇచ్చిన వాటిలో ఒక కీర్తన పేరు, దాని రాగం చెప్పు?"
రాగిణి మౌనంగా వుండిపోయింది.
"నీకీ ఉద్యోగం ఇస్తే పెళ్ళయ్యాక మానేస్తావా?" ముక్కంటిగారి మూడవ ప్రశ్న.
అప్పటికే నీరు గారిపోయింది ఆ అమ్మాయి.
"అది అప్పటి పరిస్థితిని బట్టి వుంటుంది' అంది.
అంతే.... ఇంటర్వ్యూ అయిపోయింది.
ఫలితం ఏమిటో ముందుగానే ఊహించుకుంటూ బయటకు వచ్చింది రాగిణి.
మళ్ళీ అందరూ ఆ అమ్మాయి చుట్టూ మూగారు. వాళ్లు అడిగిన ప్రశ్నలన్నిటికీ బదులిచ్చి, ఊసురోమంటూ బల్లమీద కూలబడింది రాగిణి.
"వీళ్ళకి సరియైన పాఠం నేను నేర్పుతానే! అంతేకాదు..., వారంలోగా వాళ్లు చచ్చినట్లు నాకీ ఉద్యోగం ఇచ్చేట్లు చేస్తా చూడు!" అంటూ ఛాలెంజి విసిరింది వనజ.
ఆ అమ్మాయి రాగిణి క్లాస్ మేట్... క్లోజ్ ఫ్రెండ్! ఆ అమ్మాయి ధైర్యమేమిటో రాగిణికి అర్దంకాలేదు. జోక్ చేసిందనుకొంది. తనకి ఆలస్యం అవుతుందని వనజకి చెప్పి ఇంటికి వెళ్లిపోయింది రాగిణి.
ఆశ్చర్యం....!
మరో వారంరోజుల్లో వనజకు ఉద్యోగం వచ్చింది. రాగిణికి తెలిసినంత వరకు వనజకు ఉత్తర దక్షిణాలేవీ లేవు. ఉండబట్టలేక -
"ఛాలెంజి చేసినట్లు ఉద్యోగం సంపాదించావు. ఇంతకీ.... ఇంటర్వ్యూలో నిన్ను ఏమని అడిగారే?" అని అడిగింది.
"ఇదంతా పట్టుకొట్టై కుమారస్వామి అనుగ్రహం!" అంది వనజ - తాదాత్మ్యంతో కళ్లు మూసుకుని, చిరునవ్వు, నవ్వుతూ.
"ఆయనెవరు?"