అక్కను చూసి రెండేళ్ళు దాటింది.
అందువల్ల ఈసారి హైదరాబాద్ రాగానే ముందుగా అక్క ఇంటికే వెళ్లాను. మామూలుగా అయితే అక్క ఇంట్లోనే దిగేవాడిని. కాని..... నేను వచ్చింది ఆఫీసు పని మీద. అదికూడా నలుగురం కలిసి వచ్చాం. మా అందరికీ స్టార్ హోటల్ లో దిగే అర్హత వుంది.
మేము ఎయిర్ పోర్ట్ లో దిగగానే కంపెనీ కారు మాకోసం రెడీగా వుంది. దాంట్లో మేం నలుగురం హోటల్ భాస్కర్ ప్యాలస్ కి వెళ్లాం.
మా ఆఫీస్ మీటింగ్ సాయంత్రం నాలుగు గంటలకు మొదలవుతుంది. అప్పటివరకూ మేము ఎక్కడికి వెళ్లి వచ్చినా పర్వాలేదు. అందుచేత హోటల్ లో దిగి స్నానాలూ, టిఫిన్ లూ పూర్తి అయ్యాక అందరం తలోవైపుకి బయలుదేరాం. నేను అక్కని చూడడానికి బయలుదేరాను. తిరిగి అందరం హోటల్ కి మూడు గంటలకల్లా వచ్చేయాలనుకున్నాం
నన్ను చూడగానే అక్క ముఖం చేటంత అయింది.
"ఏమిట్రా ... చెప్పాపెట్టకుండా ఊడిపడ్డావు. సామానేదీ?" అంది.
"ఆఫీసు పనిమీద వచ్చాన్లేవే.... హోటల్లో దిగాను" అన్నాను.
"అఘోరించినట్లుంది. మేం ఇక్కడ వుంటే హోటల్ లో దిగడమేమిటీ? వెధవ్వేషాలూ .. నువ్వూనూ!" అంది శాంతక్క - నన్ను చిన్నతనంలో తిట్టినట్లు.
"నేను ఒక్కడినే రాలేదే! ఆఫీసు పనిమీద నలుగురం వచ్చాం. మేమందరం ఒకేచోట ఉండడం అవసరం. అందుకే హోటల్ లో దిగాం. అది కూడా కంపెనీ ఖర్చుమీద!"
" సరే..... ఏ హోటల్ లో దిగావు?"
"హోటల్ భాస్కర్ ప్యాలస్ లో! అది సరేగాని..., బావగారు కనిపించరే...? ఈరోజు ఆదివారం కూడాను!"
"హూ.. నీకు తెలీనిదేముంది నాయనా? ఆయనకి నెలలో ఇరవై రోజులు క్యాంప్ లేనాయె. నిన్ననే వెళ్లారు. శనివారానికి కానీ రారు."
"బాగుంది. మరి స్వాతి ఏదీ....? బయటకి వెళ్లిందా?"
"పడుకుని వుంది."
"పడుకోవడమా? పది కావస్తున్నా ఇంకా పడుకోవడమేమిటి? ఒంట్లో బాగాలేదా?"
"ఒంట్లో బాగానే వుంది. మనసే బాగాలేదు. రాత్రంతా నిద్రపోలేదు. ఏడుస్తూ కూర్చుంది. ఏ తెల్లవారో నిద్రపట్టినట్లుంది. అందుకే నేనూ లేపలేదు."
"ఏడ్చిందా? ఎందుకు? ఏం జరిగింది?"
అక్క బరువుగా నిట్టూర్చింది.
"ఏం చెప్పమంటావు నాయనా..... అదో పెద్ద కథ! స్వాతి మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్న విషయం నీకు తెలిసినదే. ఈమధ్య దానికి రసజ్ఞ సంస్థవారు 'నాట్యమయూరి' అని బిరుదు ఇచ్చి సత్కరించారు. దాని తర్వాత మరో సంస్థ రస రంజని' 'నాట్య సుందరి' బిరుదు ఇచ్చి సన్మానించింది. ఇంతటి ప్రతిష్టాపూర్వకమైన పురస్కారాలు లభించడంతో రస ప్రోత్సాహక సంస్థవారు దానికి అభినందన సభను ఏర్పాటు చేశారు. అందులో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా "నాట్యకిన్నెర" అన్న బిరుదును ప్రదానం చేయడమేకాక...., దాని నాట్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు."
"అరే.. నా కళ్ళ ముందు పరికిణీలు కట్టుకుని ఒప్పులకుప్పలు ఆడిన పిల్ల ఎంతగా ఎదిగిపోయిందీ...? నాకు ఈ విషయాలేవీ తెలియవే...!"
"ఎలా తెలుస్తాయ్....? ఉత్తరాలు రాసే అలవాటు మాకు లేదు. ఇక్కడి వార్తలు అక్కడి పేపర్లలో రావు."
"బాగానే వుంది. ఇంతకీ స్వాతి ఎందుకు ఏడ్చిందో అర్దంకాలేదు."
"అదే చెప్తున్నాను. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత చాలామంది స్వాతి దగ్గరకు వెళ్లి అభినందించసాగారు. అంతలో ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో ఆ దరిద్రముండాకొడుకు.... బాలు కూడా అక్కడ తగలడ్డాడు."
" బాలు ఎవరు?"
" మరిచిపోయావా? ఈ ఇంట్లో ప్రక్కభాగంలో వుండేవాడు... ఐదేళ్ళ క్రితం మద్రాసుకి బదిలీ అయి వెళ్లిపోయాడు - జ్ఞాపకం లేదూ....?"
"ఎవరూ .. బాల సుబ్రమణియనా? జ్ఞాపకం వచ్చింది. ఆయన వస్తే ఏమైంది...?"
"ఏముందీ.. తానూ స్టేజి ఎక్కి స్వాతి దగ్గరకు వెళ్లి - ' అమ్మాయి.. .నేను జ్ఞాపకం వున్నానా?' అని అడిగాడట."
"అయ్యో ...జ్ఞాపకం లేకపోవడమేమిటండీ!" అందట స్వాతి."
"నీ గురించి విన్నాను. నీ పిరుదులు నీకు తగ్గట్టుగా చాలా బాగున్నాయి!"అన్నాడట. అందరూ ఫక్కున నవ్వారట. స్వాతి ఇంక అక్కడ వుండలేక ఇంటికి వచ్చి ఒకటే ఏడుపు!"
"పిరుదులు బాగుండడమేమిటి.. .వాడి పిండాకూడు!"
"అదే నాకూ అర్దం కాలేదు. ముదనష్టపోడు ఏం కూశాడో... ఏమో!"
"ఎప్పుడూ నోట్లో కారా కిళ్లీ పెట్టుకుని తగలడ్తాడు కదా...! వాడు ఏదో అంటే ఏదోలా వినిపించి వుంటుంది."
"కావచ్చు. కాని... .నలుగురిలో నవ్వుల పాలైందిగా!పిచ్చి పిల్ల.... ఇంక తనని అందరూ నీ పిరుదులు బాగున్నాయని అంటూ ఏడిపిస్తారని బాధపడ్తోంది వెర్రిది!"
"కావచ్చు. కాని.. .నలుగురిలో నవ్వుల పాలైందిగా!పిచ్చి పిల్ల..... ఇంక తనని అందరూ నీ పిరుదులు బాగున్నాయని అంటూ ఏడిపిస్తారని బాధపడ్తోంది వెర్రిది!"
" కాదు మరీ! వెధవ.... నేనుంటే గనుక వాడి కాళ్ళు విరగ్గొట్టుండేవాడిని!"
"అంతపని వద్దులే కాని... ఎక్కడైనా కనిపిస్తే కడిగి వదిలిపెట్టు. మరోసారి ఇలాంటి కారుకూతలు కూయకుండా నోట్లో ఇంత గడ్డి పెట్టు."
"అదుగో.... మన మాటలు విని లేచినట్లుంది స్వాతి. .. ఇటే వస్తోంది!"
స్వాతి నెమ్మదిగా వస్తోంది. ఏడ్చినందువల్లనో, ఏమో... కళ్లు ఉబ్బి వున్నాయి.
స్వాతి దగ్గరకు రాగానే - " హలో స్వాతీ.. కంగ్రాట్యులేషన్స్!" అన్నాను.
"కంగ్రాట్సు చెప్పాల్సినంత గొప్పేమీ లేదులే మామయ్యా...!"
"అలా అనకు. యువర్స్ ఈజ్ రియల్లీ ఎన్వియబుల్ సక్సెస్. అమ్మ చెప్తే అంతా విన్నాలే! టేకిట్ ఈజీ! ఆ బాలుగాడు ఒట్టి క్రాక్. వాడు ఏం మాట్లాడ్తాడో వాడికే తెలియదు. వాడి ముఖంలానే వుంటాయి వాడి మాటలు!"
"సర్లే మామయ్యా..... నేన ఫ్రెష్ అయి వస్తాను."