Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 12


    అతని ప్రశ్నకు సమాధానంగా తన ప్రేమను మవునంగా వ్యక్తపరుస్తూ అతని గుండెలపై తల వాల్చింది.


    అతని మనసు సంతోషంతో పొంగిపోసాగింది.


    అంబిక మనసు కూడా హాయిగా, సంతృప్తిగా, ఆనందంగా అనిపించసాగింది.


                                   50


    జయరాం, అంబికల పెళ్ళి అయి పదిరోజులు అవసాగింది.


    వారి దాంపత్య జీవితం హాయిగా ఆనందంగా సాగిపోతుంది.


    అంబిక హాస్పిటల్ కి వెళ్ళివస్తుంది. అటు వృత్తి ధర్మం, ఇటు ఇల్లాలిగా తన బాధ్యత మర్చిపోలేదు.


    పదిరోజుల్లో యింట్లో చాలా మంచి మార్పు వచ్చిందనే చెప్పాలి.


    గణేశ్ రావు గార్కి తనపై మంచి నమ్మకం కుదిరేటట్టు ప్రవర్తించసాగింది.


    అత్తగారికి, మామగారికి టానిక్కులు టైముకి వేసుకోమని, టేబ్లేట్స్ టైముకి వాడమని పదిసార్లు చెప్పేది.


    ఆమె హాస్పిటల్ నుండి వచ్చేసరికి వాళ్ళు వేసుకోకపోతే తనే దగ్గర ఉండి వాళ్ళచేత ఆ టానిక్ తాగించేది.


    మేము బాగానే ఉన్నాం. మాకు ఎందుకు మందులు అంటున్నా వినేది కాదు. నేను డాక్టర్ ని నేను చెప్పినట్లు మీరు వినవలసిందే అని ఖచ్చితంగా చెప్పేది.


    గణేష్ రావు గారు దంపతులకి తృప్తిగా అనిపించసాగింది కోడలి ప్రవర్తన.


    ఇంద్రసేనకి మాత్రం అంబిక అంటే మనసులో కోపంగానే ఉంది. అంబిక అసలు ఆ విషయం పట్టించుకోనట్లే ఉండేది.


    గణేశ్ రావు గారు ఆమె హాస్పిటల్ గురించి మాట్లాడితే ఆయన నా పక్కన ఉంటే వందమంది కాదు వెయ్యిమంది కృష్ణమౌళిలు వచ్చినా నాకు భయం లేదు. నేను ఆ హాస్పిటల్లోనే డాక్టర్ గా వుంటాను. నన్ను ఎవరేం అంటారు? అంది. గణేష్ రావుగారు కోడలి మాటలతో పొంగిపోయారు.


    జయరామ్ గర్వంగా చూచాడు.


    అందరికీ అంబిక ప్రవర్తనలో ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తపడింది.


    రోజులు ఒక్కొక్కటి గడుస్తున్నాయి.


    ఇంద్రసేన కోపం ఎన్నాళ్ళు ఉంటుంది. అంబిక అంటే ఆమెకు ఇష్టంలేకపోయినా అన్న భార్యగా మెల్లగా కోపం తగ్గించుకుని మామూలుగా వుండడానికి ప్రయత్నిస్తుంది.


                            *    *    *        


    అంబిక ఆ రోజు తొందరగా హాస్పిటల్ కి వెళ్ళడానికి తయారవుతుంది.


    ఫోన్ లో మాట్లాడుతున్న గణేష్ రావు గారి ముఖం అదోలా అయిపోయింది. "అలాగా ఇప్పుడు ఏమిటి చెయ్యాలి!" అంటూ ఆయన కంగారుపడుతూ అవతలి వాళ్ళని అడుగుతున్నారు. అంబిక అటుగా వెళ్ళినా ఆయన కంగారుపడటం అంతగా గమనించలేదు.


    ఆయన జయరామ్ ని పిల్చి ఏదో చెప్పారు.


    "ఉండండి వాళ్ళ పనిచెప్తాను. అందర్నీ షూట్ చేసి పారేస్తాను. అంతా వాళ్ళ ఇష్టమేనా! మీరేం కంగారు పడకండి" అంటూ ఒక్క ఉదుటులో మేడమీదకు వెళ్ళాడు. టేబుల్ వద్ద నిలబడి డ్రాయర్ లో ఏదో తీసుకుంటున్న అంబిక తలతిప్పి భర్తవైపు చూసింది.


    అతను ఆమెవైపు అసలు చూడలేదు మనిషి ఆవేశంతో ఊగిపోతున్నాడు.


    "ఏమిటి అలా వున్నారు?" ఆతృతగా ప్రశ్నించింది.


    అతను మాట్లాడకుండా బట్టలు మార్చుకుని కాళ్ళకి బూట్లు వేసుకోసాగాడు.


    "ఇంత తొందరగా బయలుదేరుతున్నారు ఏమిటి?" అడిగింది మళ్ళీ.


    "ఉండు వాళ్ళ పని చెప్పాలి" అన్నాడు, బీరువాలో ఫిష్టల్ తీసుకుని జేబులో వేసుకుంటూ.


    అంబిక గుండె ఒక్కసారి గుభేల్ మంది.


    ఈయన వెళ్తున్నారు అంటే ఎక్కడ ఏదో రక్తపాతమే అవుతుంది.


    ఏం జరిగింది? ఎందుకు అంత ఆవేశపడిపోతున్నారు? ఏమండీ, ఏం జరిగింది? ఆ ఫిష్టల్ ఎందుకు తీసుకువెళ్తున్నారు!


    భర్త భుజాలపై రెండుచేతులు వేసి గట్టిగా కుదిపి మరీ అడిగింది.


    జయరామ్ జరిగింది టూకీగా చెప్పి బయలుదేరడానికి సిద్ధంగా వున్నాడు.


    కంపెనీలో వర్కర్స్ మేనేజర్ కి ఎదురు తిరిగి ఎవరూ పనుల్లో వెళ్ళలేదు అట.


    జీతాలు పెంచటం లేదని గొడవ పెడుతున్నారట.


    అంబిక క్షణంసేపు అలా నిలబడిపోయింది.


    భర్త ఎటువంటి వాడో తెల్సు అక్కడికి వెళ్తే వర్కర్స్ లో కొంతమంది ప్రాణాలు వదిలేశారు అన్నమాటే.


    భర్తని అక్కడికి వెళ్ళకుండా ఆపుచెయ్యాలి. చెప్తే అతను వింటాడా.


    అసలే మొండిమనిషి, కఠిన మనస్తత్వం, ఆవేశంలో ఊగిపోతున్నాడు.


    అంబిక వెంటనే వెళ్ళి అతని చెయ్యి పట్టుకుంది.


    "మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళవద్దు" అంది.


    ఎందుకు అక్కడికి వెళ్ళవద్దు! అన్నట్టు చూశాడు.


    "మీరు చాలా ఆవేశంలో వున్నారు. కాస్సేపు ఆగి శాంతంగా మీకు తోచింది చెయ్యండి" అంది అతనికి నచ్చచెపుతున్న ధోరణిలో.


    "ఆలోచించేది ఏమీలేదు. వెళ్ళి వాళ్ళ సంగతేమిటో తేలుస్తాను" అన్నాడు ఖచ్చితంగా చెపుతూ.


    "అయితే మీరు ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదు" అంది అంతకన్నా ఖచ్చితంగా చెపుతూ.


    "నన్ను ఆపడానికి నువ్వు ఎవరు! బయటకు ఫో!" అంటూ కోపంగా అరిచాడు.


    "మీ భార్యని. మీరు అన్యాయాలకి బాటలువేసి మంచితనాన్ని సమాధిచేసి అందరిచేతా కఠినాత్ముడు అనిపించుకుంటే నేను భరించలేను. ఆ చెడ్డపేరు నా కంఠంలో ప్రాణం వుండగా రానివ్వను" అంది ఆవేశంతో ఊగిపోతూ.


    "నోర్మూయ్! నీ ఉపన్యాసం వినడానికి నాకు తీరికలేదు" అంటూ ఆమె చేతిని బలంగా విగిలించుకున్నాడు, వెళ్ళడానికి సిద్ధపడుతూ.


    ఆమె ఊరుకోలేదు. మొండిగ అతనికి ఎదురుగానే చేతులు చాసి అడ్డుగా నిలబడింది.


    "మీరు వెళ్ళడానికి వీల్లేదు" అంది. ఆమె కంఠస్వరం ఖంగుమంది.


    "దారికి అడ్డంలే."

 Previous Page Next Page