Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 13


    "ఏమో! ఒక్కొక్కసారి నాకు దాని ప్రవర్తన అర్థంకాదు, దాని మిత్రుడి సంగతి తెలిసినా కూడా!"
    వెంకమాంబ తోడు, స్నేహితుడు సంగతి ఇంట్లో అందరికీ తెలుసు. లేకపోతే ఆమె ప్రవర్తన అర్థంచేసుకోటం చాలా కష్టం.
    "ప్రహ్లాదుడిని కూడా తండ్రి హిరణ్యకశిపుడు వెర్రిబాగులవాడుగానే భావించాడు. అందరూ కూడ అలాగే అనుకున్నారు. మన బంగారు తల్లి వెంకమాంబ ఆ ప్రహ్లాదుడి అపరావతారమే అనిపిస్తోంది. నాకటువంటి ఆలోచనరావటానికి కూడ ఒకటి రెండు అనుభవాలు దోహదం చేశాయి."
    "తండ్రి మాత్రం హిరణ్యకశిపుడు కాడు" అంది మంగమాంబ చటుక్కున.
    "కాని, తల్లి మాత్రం లీలావతిని మించింది. వెంకమాంబని కడుపుతో ఉన్నపుడు నీ ప్రవర్తన నీకేమాత్రమైనా గుర్తున్నదా? నీ భక్తి ఆ రోజుల్లో పిచ్చికి తక్కువేమీ కాదుగా! అమ్మాయి పుట్టాక కదా ఆ చాదస్తం తగ్గింది."
    మంగమాంబ సిగ్గుతో తలవంచుకుంది.
    "అది నీ గొప్పతనం కాదు. నీ కడుపులో ఉన్న బిడ్డది. బిడ్డ భూమి మీద పడ్డాక నీ సహజ లక్షణం వచ్చేసింది. కాని, ఆ వాసనలు మాత్రం నిలిచి ఉన్నాయి. అదృష్టవంతురాలివి."
    ...........
    "మన చిట్టి తల్లిని చూచినప్పుడు ఎప్పుడూ నీకీ పద్యం గుర్తు రాలేదూ" అంటూ గొంతెత్తి శ్రావ్యంగా పాడారు.
    "పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాసలీ
    లానిద్రాదులు సేయుచుం దిరుగుచున్ లక్షించుచున్ సంతత
    శ్రీనారాయణ పాద పద్మయుగళీచింతామృతాస్వాదసం
    దానుండై మఱచెన్ సురారి సుతుడే తద్విశ్వమున్ భూవరా!"
    ఎప్పుడు వచ్చిందో తెలియదు. వెంకమాంబ వచ్చి కళ్ళుమూసుకుని వింటూ ఉన్నది.
    పద్యం పూర్తి అయిన తర్వాత కూడా కొద్దిసేపు అలాగే ఉండిపోయింది.
    "నిజంగా ప్రహ్లాదుడెంత గొప్పవాడు? ఆహా!....." అంటూ వీధిలోకి పరుగెత్తింది.
                                    * * *
    ఇంటి పనులు అన్నీ నేర్చుకుని, చక్కగా చేస్తోంది. కాని నృసింహస్వామి దేవాలయానికి వెళ్ళటం మాత్రం మానలేదు. ఆమెను గూర్చి గుస గుసలాడుకోవాలి. వెనకాల మాట్లాడుకోవాలి. అంతేకాని ఎదురుగా ఎవ్వరూ ఏమీ అనలేరు. అయితే ఒక సంఘటన ఆ అవకాశం కూడా కల్పించింది.
    ఆ రోజు నృసింహ జయంతి. ఉదయం నుండి దేవాలయంలో అర్చనలు, విశేషపూజలు, పురాణ ప్రవచనాలు, సంగీత సేవలు వైభవోపేతంగా సాగిపోయాయి. రాత్రిపూట అర్చన కూడా అయింది. పల్లకీ సేవ తర్వాత ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణవేద, పురాణ, శాస్త్ర ఉపనిషత్ సేవలు కూడా పూర్తి అయ్యాయి. సంగీతసేవ కూడ అయింది. నృత్యసేవ మనసా సమర్పయామి అన్నాడు పూజారి. వెంకమాంబ కూర్చున్నచోటునుండి చటుక్కున లేచి "ఉండండి! నృత్యంకూడ అవనీండి" అంది.
    ఆయనకి కోపం వచ్చింది. అందరికీ కూడా వచ్చింది కోపం. కొద్దిమంది మాత్రం కుతూహలంగా చూస్తున్నారు. పూజారి
    "వెంకమ్మా! కూర్చో! ఇప్పుడిక్కడ నృత్యం చేసేవారెవ్వరూలేరు" అన్నాడు.
    "అయితే నేను చేస్తాను" అని, ఎవరూ ఏమీ అనేలోపల పాటలు పాడిన వేదిక దగ్గరికి వెళ్ళి
        "కలమయశోదే తవబాలం
        ఖాళబాలక ఖేలనలోలం         ||కల||
    అపహృత బహుతర నవగీతం
        అనుపమలీలా నటనకృతం
    కపటమానుష బాలకచరితం
        కనక గందుకఖేలన నిరతం         ||కల||
    పధిపధి లుంఠిత దధిభాండం
        పాపతిమిరశత మార్తాండం
    అధి బలోద్ధృత జగదండం
        ఆనంద బోధరసమఖండం         ||కల||
    మల్లకబాలక ఖేలన చతురం
        మనసిజ కోటిలావణ్యధరం
    కల్యాణగుణ నవ మణినికరం
        కమనీయ కౌస్తుభమణిశేఖరం         ||కల||
    నవనీత చోర బాలకచరితం
        నందాదివ్రజ పుణ్య తరుఫలితం
    ధ్రువపద ఫలమేతదతి లలితం
        భువినారాయణ తీర్థ యతిఫణితం         ||కల||    
    అంటూ తరంగం పాడుతూ నృత్యం చేయటం మొదలు పెట్టింది. ఆశ్చర్యం నుంచి తేరుకున్న తర్వాత ఒక్కొక్కరూ విషయం అర్థం చేసుకునేసరికి నృత్యం చివరికి వచ్చేసింది. పూజారి కోపంతో ఊగిపోతూ
    "ఆపు! సానిదానిలాగా ఆ గంతులేమిటి?" వెంకమాంబ చెయ్యిపట్టుకుని ఆపే ప్రయత్నం చేశాడు.
    తన్మయత్వంతో నృత్యం చేస్తున్న వెంకమాంబకి ఇది తెలియదు. తన మనోవాక్కాయ కర్మలలో ఏకతసిద్ధించింది. బాహ్య స్పృహ లేదు.
    దెబ్బకి దెయ్యం దిగుతుందని కొట్టటానికి చెయ్యెత్తాడు. అంతే! పైకి లేపిన చెయ్యి అక్కడే ఆగిపోయింది. నోటమాటలేదు. నృత్యం పూర్తిచేసి స్వామికి నమస్కరించి తనచోటుకి వచ్చి కూర్చుంది వెంకమాంబ. అందరికీ ఆశ్చర్యమే వెంకమాంబ నృత్యం నేర్వలేదు. ఇంతచక్కని అభినయం, భావానుగుణంగా ఎలా చెయ్యకలిగింది? అద్భుతమైన నృత్యాన్ని చూచి ఆనందించారు. పైకి ప్రకటించిన ఏవగింపు అడుగున ఇష్టమే ఉంది. తరువాత కార్యక్రమం పూర్తి చేయటానికి పూజారిలో చలనం లేదు. మళ్ళీ అందరి దృష్టీ వెంకమాంబ మీద పడింది. తాతగారికి సంగతి స్పష్టమయ్యింది. నెమ్మదిగా మనుమరాలి చెవిలో చెప్పారు,
    "తల్లీ! పూజారిని క్షమించమని స్వామిని ప్రార్థించు" అని
    ఎందుకో తెలియకపోయినా, తాతగారు చెప్పారు కనుక నరసింహస్వామికి నమస్కారంచేసి కళ్ళుమూసుకుని మనసులో అనుకుంది "స్వామీ! పాపం! పూజారిగారిని క్షమించు. ఎంత చదువుకున్నా ఏమీ తెలియదు ఆయనకి" అని.
    వెంకమాంబవంక వెర్రిచూపులు చూస్తున్నపూజారి చెయ్యి, నోరు కదిలాయి.
    "అమ్మయ్య! మళ్ళీ ఎప్పుడూ ఆ దెయ్యపిల్లజోలికి వెళ్ళకూడదు" అనుకున్నాడు.

 

 Previous Page Next Page