అంతే!
"చూశారా! ఆ బరితెగించిన పిల్లని!"
"సానిదానిలాగా ఆ నాట్యం చెయ్యటం!"
"బ్రాహ్మల ఇంటావంటా ఇటువంటి పనులుంటాయా?"
"తల్లితండ్రులననాలి. అదుపాజ్ఞలలో పెంచనందుకు."
"ఏంచేస్తారు వాళ్ళు మాత్రం? వినద్దూ!"
"దెయ్యపిల్లకాక పోతే పూజచేయటానికి పూజారికి చెయ్యెందుకు రాదు"
"దెయ్యం పట్టింది ఖాయం!"
"ఇంకో దేవ రహస్యం వినండి. అది సాని దెయ్యమో! కామపిశాచో అయిఉండాలి."
ఈ మాటలు కర్ణాకర్ణిగా చెవుల పడుతున్నాయి కృష్ణయ్య కుటుంబ సభ్యులకి. పెళ్ళి చెయ్యటం ఒకటే మార్గంగా కనపడుతోంది. సంబంధాలు వెతుకుతున్నారు. ఒక్కటీ కుదరటం లేదు. నిజానికి కుదరనివ్వటంలేదు. తన మానాన తను గురువుగారింటికి వెళ్ళటం, తల్లిచెప్పిన పనులన్నీ చేయటం, మిగిలిన సమయమంతా దేవాలయంలో గడపటం. గుడిలో చేరిన వెంకమాంబ పాటలు, పద్యాలు, నృత్యాలకి అంతులేదు.
అంతకు ముందు ఏదో ఒక సందర్భంగా అందరూ కలిసి ఆడేవారు. ఇప్పుడు ఒక్కతే చేతిలో చిడతలు ధరించి పాడుతూ, నృత్యం చేస్తోంది. ఆమె నృత్య గానాలు తగ్గాలంటే ఎవరైనా వినేవాళ్ళుండాలి. అప్పుడు కథలు చెపుతుంది. ఆ రోజు మాత్రం దేవాలయంలో ఒక్కతీ కూర్చుంది వెంకమాంబ. పాటలు, ఆటలు లేవు. నృసింహస్వామికి ఎదురుగా దూరంగా కళ్ళుమూసుకుని ధ్యానంలో ఉన్నట్లుగా ఉండిపోయింది. మిత్ర బృందం అంతా కలకలలాడుతూ వచ్చారు. వారితోపాటు ఒక కొత్త అమ్మాయి. రుక్మిణీ వాళ్ళింటికి వచ్చిన చుట్టాలమ్మాయి. ఆ అమ్మాయి అంటోంది.
"పత్తికొండ అంటే కొండంత పత్తి ఉంటుంది. గుర్రం కొండ అంటే గుర్రాలుండే కొండ మరి, తరిగొండ అంటే ఏమిటి?"
"ఊరిపేర్లకి కూడా అర్థాలుంటాయేమిటి?" ఊర్మిళ ప్రశ్నించింది.
"ప్రతి ఊరు పేరుకి అర్థం ఉంటుంది. ఊరికో చరిత్ర కూడా ఉంటుంది." ఈ సంభాషణతో కళ్ళు తెరిచిన వెంకమాంబ
"నేను చెపుతాను ఆ చరిత్ర, పేరు చరిత్ర కూడా" అంది.
అందరూ వెంకమాంబ చుట్టూ చేరారు. ముఖంలో దివ్య తేజస్సుతో ఆరితేరిన పెద్దమనిషిలాగా మృదుగంభీర స్వరంతో చెప్పటం మొదలు పెట్టింది.
* * *
బళ్ళారి ప్రాంతం అంతా కరువుతో అట్టుడికి పోతోంది. వరుణ దేవుడు ఎందుకో అలిగాడు. చినుకుపడి ఎంతో కాలమయ్యింది. అసలే అంతంతమాత్రంగా ఉండేబావులు పూర్తిగా ఎండిపోయాయి. భూమి బీటలు వారింది. పచ్చదనం అన్నది కనుచూపు మేరలో కరువయ్యింది. పాతకాలపు పెద్దపెద్ద వృక్షాలు కూడా ఆకన్నది కనపడకుండా మోడువారి ఉన్నాయి. నేలలోతుల్లో బాగా పాదుకునిపోయిన వేళ్ళకెక్కడైనా చెమ్మతగిలితే జీవించి ఉంటాయి. ఒక్క వర్షపు చినుకు పడితే చిగురిస్తాయి. ఆ అదృష్టం మాత్రం ఎన్ని వృక్షాలకి లభిస్తుందో తెలియదు. తాగటానికి నీరు, తినటానికి తిండీలేక మనుషులంతా శల్యావశిష్టు లవుతున్నారు. పశువులసంగతి చెప్పనక్కరనే లేదు. ఎవరికి వారు ప్రాణాలరచేత బట్టుకుని వలస వెళ్ళిపోతున్నారు.
పరిస్థితిని గమనిస్తున్న రామానాయుడు దీర్ఘాలోచనలో పడ్డాడు. చాలామందిలాగా తానూ 'రాయదుర్గం' వదలి వెళ్ళాలా? ఇది ఎన్నోతరాలుగా తమ వంశీకులు పాలిస్తున్న గ్రామం. తాను పుట్టి, పెరిగిన ఊరు. తాను దీనికి ఏలిక. ప్రజలంతా తన దొరతనాన్ని సంతోషంగా శిరసావహిస్తున్నారు. తమ యోగక్షేమాలు తనమీద వేసి నిశ్చింతగా ఉంటున్నారు. అటువంటి గ్రామాన్ని, దానిపై అధికారాన్ని వదలి సామాన్యుడిలాగా, పరికి పందలాగా, అసమర్థుడిలాగా, ప్రాణాలమీది తీపితో కన్నతల్లిలాంటి గ్రామాన్ని వదిలిపోవాలా? మనస్కరించటం లేదు.
కాని, మార్గాంతరం లేదు. వానలు కురవటం తనచేతుల్లోలేదు. ప్రకృతి వైపరీత్యాలకి తానేం చెయ్యగలడు? కరువుపోయాక తిరిగి రావచ్చు. ఈ వెళ్ళటం ఏదో యాత్ర చేసినట్టు, దేశసంచారం చేసినట్టు. పూర్తిగా గ్రామాన్ని పాడు పెట్టి వెళ్ళటం లేదుగా! అయినా, గ్రామంలో మాత్రం ఎవరున్నారు? అందరినీ పోషించగల శక్తి తనకి లేదు. ఆ సంగతి తెలిసిన గ్రామస్థులెవ్వరూ తనని ఏ సహాయమూ అడగలేదు. తనతో చెప్పికొంతమంది, చెప్పకుండా కొంతమండి ఊరొదిలి వెళ్ళారు. మిగిలింది ఏ కొద్దిమందో! తనతోపాటే వాళ్ళనీ తీసుకుని వెడితేసరి! భార్య నరసమాంబతో తన ఆలోచన చెప్పాడు. తొందరపాటు లేకుండా, ఏ విషయాన్నైనా చక్కగా ఆలోచించి సలహాలిచ్చే నరసమాంబ భర్త ఆలోచనని మెచ్చుకుంది.
పశుసంతతిని, పాలేర్ల కుటుంబాలని కూడా వెంటపెట్టుకుని కుమార రామానాయుడు కుటుంబం పత్తిమిట్ట గ్రామం చేరి అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. ఎప్పుడు వానలు పడతాయా? తమ గ్రామం తిరిగి వెళ్ళిపోదామా? అనే ఆత్రుత.
ఆ గ్రామంలో రెండు బ్రాహ్మణ కుటుంబాలు కూడా ఉన్నాయి. వారిలో ఒక కుటుంబంలో ఇల్లాలు లక్ష్మీనరసమ్మ. నిష్కల్మష హృదయం, మెండైన భక్తి, సత్ప్రవార్తన ఉన్న లక్ష్మీనరసమ్మ అంటే ఊరిలో అందరికీ గౌరవమే. ఒకరోజు యథాప్రకారం తెల్లవారుజామున లేచి, పెరుగు చిలికే ప్రయత్నం చేస్తూ ఉంది. చుట్టకుదురుమీద పెరుగుకుండ పెట్టి, కవ్వానికి తాడుచుట్టి, గుంజకి కవ్వానికి బంధాలు వేసి, చిలకటం మొదలు పెట్టింది. నోట కృష్ణకర్ణామృత శ్లోకాలు జాలువారుతున్నాయి.
రాధా పునాతు జగదచ్యుత దత్తచిత్తా
మన్థానమాకలయతీ దధిరిక్తపాత్రే
తస్యాః స్తనస్తబక చంచల లోలదృష్టి,
ర్దేవోపి దోహనధియా వృషభం నిరున్థన్.
క్రుషునిమీద ప్రేమవల్ల పరవశత్వంతో తనేం చేస్తున్నదో తెలియక కాళీకుండలో కవ్వంతో చిలుకుతోందిట రాధ. ఎంత ధన్యురాలు! చిలికే సమయంలో ధ్వనిలో వచ్చే మార్పైనా గుర్తించలేదు కాబోలు.
హఠాత్తుగా పెరుగుకుండలో ఏదో రాయితిరుగుతున్న శబ్దం. రాధ కుండలో ఇటువంటి శబ్దమే వచ్చి ఉంటుంది. వచ్చి ఉండటమేమిటి? అదే ఇప్పుడు తనకి వినపడుతోంది...అప్పటిది ఇప్పుడు వినపడట మేమిటి? తన పిచ్చికాకపోతే? ...తన అనుమానాన్ని పోగొట్టి అనుగ్రహించ దలచిందేమో రాధాదేవి! అసలిది తన భ్రమ అయి ఉంటుంది. ఈ ఆలోచనరాగానే నవ్వుకుని ఆపిన పెరుగు చిలకటం మళ్ళీ ప్రారంభించింది.
మళ్ళీ అదే శబ్దం - రాయి తిరుగుతున్నట్టు. కుండలోకి చూస్తే ఏమీ కనపడలేదు. చెయ్యిపెట్టి చూసినా అంతే. ఏమీ కనపడలేదు! మళ్ళీ చిలకటం మొదలు పెట్టింది. ఈసారి రాతి ధ్వనిమరింత ప్రస్ఫుటంగా వినిపించసాగింది.
ఇదేదో మాయో, దేవుడో, దెయ్యమో అయి వుంటుందని భయపడిపోయింది. కంగారుగా, భర్తని లేపి చెప్పింది.
ఆయన భయపడవద్దని భార్యకు చెప్పి, వచ్చి పెరుగు తరచే కుండలో చెయ్యి పెట్టి చూస్తే, ఒక నల్లటి నిగనిగలాడేటి శిల చేతికందింది. పెరుగు చిలికే కుండలో రాతిశబ్దం రావటమే వింత అనుకుంటుంటే, ఏకంగా రాయే కనపడటం ఇంకావింత. పెరుగు కుండలోకి వచ్చిన ఈ రాయి ఏమిటి? అని చేతిలోకి తీసుకుని చూసిన ఆ బ్రాహ్మణుడి ఆశ్చర్యానికి అంతేలేదు. అది నృసింహసాల గ్రామం. ఆనందంతో దంపతులు ఆ సాలగ్రామాన్ని తమ పూజా గృహంలో పూజాపీఠంపై ఉంచి సాగిలపడి మొక్కారు.