Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 12


    అత్తగారితో కలిసి చాలా ఆలోచించింది. రెండు మూడేళ్ళలో పెళ్ళిచేయాలి. ఇప్పటినుంచీ సంబంధాలు వెదకటం మొదలు పెట్టాలి. ఆడపిల్లకదా! పెళ్ళి  సమయానికి పనిపాటలు వచ్చి ఉంటే మంచిది. గారాబంతో ఇప్పటివరకు ఇటుపుల్ల అటు పెట్టనివ్వలేదు. ఇప్పుడు ఇంటిపని నేర్పితే ఉభయతారకంగా ఉంటుంది అనుకొంది. ఇంటి పనులన్నీ నెమ్మదిగా అప్పచెప్పింది.    
    వెంకమాంబ తల్లి చెప్పినట్లు ఇంటిపనులన్నీ చక్కగా చేయటం నేర్చుకుంది. వెంకమాంబ చేసే పనులతో ఇంటికి ఒక కొత్త కళవచ్చింది. తరతరాలుగా చేస్తూ వస్తున్న పనులే. పనుల్లో మార్పులేదు. చేసే తీరులోనే తేడా.    
    పూలమొక్కలకి మొక్కుబడిగా నీళ్ళు పొయ్యటం ఎవరైనా చేసేపని. కాని, వాటిలో తన పుష్పాలని దైవానికి ఎప్పుడు సమర్పించాలా అని తపనపడే భక్త హృదయం గోచరిస్తుంది వెంకమాంబకి. అందుకని తన సోదరిలాగా ఎంతో ప్రేమగా ఆ మొక్కని పలకరించి, నీరు పోస్తుంది. పులకరించిన ఆ చెట్టు పులకాంకురాలు మొగ్గలై పూలుగా విచ్చుకుంటాయి. వెంకమాంబ కోస్తుంటే తలలువంచి తమని తాము సమర్పించుకుంటాయి. తాము పొందబోయే కృష్ణాదారవింద సాన్నిధ్యపదవిని తలచుకుని పొంగిపోతాయి. "మా వెంకుతల్లిచేతి చలవ. పూలచెట్లు విరగబూస్తున్నాయి" అని నాయనమ్మ మురిసిపోతూ ఉంటుంది.   
    పెరడు ఊడిచి కళ్ళాపి చల్లుతూ "ఎక్కడైనా చిన్నరాయి ఉంటే, దుమ్మురేగితే...కన్నయ్యపాదాలు నొచ్చుకుంటాయేమో!" అని శ్రద్ధగా చేస్తుంది. పక్కనే ఉన్న తన మిత్రుడు బాలకృష్ణుడితో మాట్లాడుతూ చీపురుతో తుడుస్తుంటే అది లయబద్ధంగా కదిలి దూరానికి ఏదో సంగీతంలాగా అనిపిస్తుంది. కళ్లాపిచల్లుతుంటే చూసేవారికి వసంతోత్సవంలో రంగులు చల్లుతోందేమో అన్నంత ఆనందంగా కనపడుతుంది. ఇక ముగ్గుల సంగతి చెప్పనే అక్కరలేదు. పెరడంతా మనోహరమైన కళాఖండాలే. ఎక్కడ నేర్చిందో ఎవరికీ తెలియదు. ఎవరి గుమ్మంలోను అటువంటి రంగవల్లికలు లేవు. ముగ్గులు వెయ్యటం మొదలు పెట్టినప్పుడు తల్లి, నాయనమ్మ, పొరుగువారు అందరూ గురువులే. ఇప్పుడు అందరు ఆడపిల్లలూ వెంకమాంబ ఇంటిముందుచేరి ప్రతిరోజూ, కొత్తముగ్గులని చూసి, నేర్చుకుని వెడుతున్నారు.
    రంగనాయకి ఇదే అడిగింది. "ఒకరోజు వేసిన ముగ్గు మరొకరోజు వెయ్యవు. నీకెవరు నేర్పిస్తున్నారు? నాకు చెపితే నేనూ నేర్చుకుంటాను" అని.
    "రోజూ రాత్రిపూట ఆకాశంలోకి చూస్తాను. అక్కడ చుక్కలుంటాయికదా! వాటిని చూసి, కలుపుతూ ఉంటే ఒక కొత్త ముగ్గువస్తుంది. పొద్దున ఇంటిముందు వేస్తాను."
    వెంకమాంబ సమాధానం చిన్నపిల్ల రంగనాయకికేకాదు, పిద్దలకి కూడా ఎవరికీ అర్థం కాలేదు. కర్ణాకర్ణిగా విన్న తాతగారు మాత్రం గుంభనగా నవ్వుకుని మురిసిపోయారు - "మనిషిచేసే ప్రతిపనీ భగవంతుని నేర్పుని, అనుసరించటమే. కళల ప్రయోజనం, పరమార్థం ఇదేనని ఎంత చక్కగా చెప్పింది నా చిట్టి మనుమరాలు" అని.
    ముగ్గువెయ్యటానికి వెళ్ళిన మనుమరాలు ఇంతసేపైనా లోపలికి రాలేదే అని నాయనమ్మ వంటింట్లో చేస్తున్నపని పక్కకి పెట్టి వచ్చింది పెరట్లోకి. వెంకమాంబ ముగ్గు అంతా వేసి పక్కనే రెండు అరచేతుల్లో గడ్డం ఆనించి కూర్చుని ఉంది. నాయనమ్మరాకని గమనించనంత శ్రద్ధగా చూస్తోంది ముగ్గువంక.
    "ఇవ్వాళ జగన్నాథ రథోత్సవంకదా! అందుకని రథం ముగ్గువేశాను. రథం ఎలాలాగుతారో చూద్దామని కూర్చున్నాను."
    ఇట్లా మాట్లాడితే తనకే అనుమానం వస్తోంది. ఊళ్లోవాళ్ళు పిచ్చి అనుకోటంలో సందేహం లేదు.
    "రథోత్సవం సాయంత్రం జరుగుతుంది. ఇప్పుడు లోపలికిరా!" అని రెక్కపుచ్చుకుని తీసుకుని వెళ్ళింది.
    ఇంకోరోజు...
    ముగ్గెయ్యటం ఎంతసేపు? లోపలికి రాదేం? అని పెరట్లోకి తొంగిచూసింది మంగమాంబ. వెంకమాంబ ముగ్గువెయ్యటం పూర్తి అయ్యింది. పక్కనే చిన్నపుల్ల పుచ్చుకుని కూర్చుని ఉంది.
    ఏమ్మో వెంకుతల్లీ! అట్లా కూర్చున్నావు?" అడిగింది మంగమాంబ.
    "నన్ను నాగాబంధం ముగ్గువెయ్యమన్నాడా? వేశానా?...ఇప్పుడు దాని తలమీద ఎక్కి తొక్కుతానంటున్నాడు. ముగ్గుపాడైపోదూ?" ఎంతో బాధగా తల్లికి చెప్పింది వెంకమాంబ.
    మంగమాంబ ఏమనగలదు? విషయం అర్థంకాగానే తానొక ఆథ్యాత్మిక అయస్కాంత వలయంలో ప్రవేశించినట్లు వళ్ళంతా ఝల్లుమంది. విద్యుత్తరంగాలు ఆపాదమస్తకం ప్రసరించినట్లయ్యింది. ఆనందంతో కన్నీరు వచ్చింది.
    "చూశావా? ముగ్గు పోతుందని నీకే ఏడుపొచ్చింది. నా మిత్రుడికి అర్థం అయ్యేట్టు చెప్పు. లేకపోతే ఈ బెత్తంతో దెబ్బలు తింటాడు."
    "... ... ..."
    "భలే! భలే! అమ్మా! నీతో చెప్పగానే వెళ్ళిపోయాడు. నువ్వంటే భయం."
    "అది నేనంటే భయంకాదు. నా దురదృష్టం. కంటితో చూడలేకపోయినా సాన్నిధ్యం ఉంది అని ఆనందిస్తుంటే, అదీ లేకుండా చేశాడు" అనుకుంది మంగమాంబ తనలో.
    "వెళ్ళిపోయాడుగా! ఇంకా లోపలికి రా!" అని ఇంట్లోకి వెళ్ళింది. వెంకమాంబ కూడా తల్లిని అనుసరించి వెడుతూ, వెనక్కి చూస్తూనే ఉంది, మళ్ళీ వచ్చి ముగ్గుపాడుచేస్తాడేమో ననే భయంతో.
    మంగమాంబ మనసులో ఆనందమూ ఉంది, ఆందోళనకూడా ఉంది. తన కూతురులో వేలెత్తి చూపించటానికి ఏలోటూ లేదు. కాని లోకుల దృష్టిలో పిచ్చిది. వెర్రిది. దెయ్యమో, భూతమో పట్టింది. అనుకుంటే అనుకున్నారుకాని పెళ్ళికి అది అడ్డంకి అవుతోందే. ఎట్లా? భర్తతో చెపుదామంటే, తనకన్న నిర్లిప్తుడాయన. పిల్లలు లేరనే బాధపడలేదు. విపరీత ప్రవర్తనకి సంతోషిస్తాడేమో కాని మందలిస్తాడనే నమ్మకం ఏకోశానా లేదు.
    తలవంచుకుని దీర్ఘాలోచనలో ఉన్న మంగమాంబ మామగారి రాకని గమనించలేదు. ఆయనే అడిగారు.
    "ఏమిటమ్మా అంత దీర్ఘాలోచనలో ఉన్నావ్?" అని.
    "అమ్మాయి గురించి భయంగా ఉంది."
    "దేనికి?"
    "ఏమిటో? అందరు పిల్లలలాగా లేదు కదా! అంతా వింత ధోరణి"
    "ఎత్తిచూపటానికేమైనా లోపం కనిపిస్తోందా?"
    "అదే సమస్య, అంతా బాగానే ఉంటుంది కాని, భక్తి ముదిరి పిచ్చిస్థాయికి వెడుతుందేమో!"
    "భక్తులందరూ అంతే కదమ్మా! వాళ్ళని అందరూ పిచ్చివాళ్ళనుకున్నారు. భక్తులే కాదు, ఏ రంగంలో ప్రముఖమైన వాళ్ళ సంగతి అయినా అంతే! వాళ్ళు అందరిలాగా ఉంటే, గుంపులో గోవిందా! ప్రత్యేకంగా ఉంటేనే గదా గుర్తింపు. పదికాలాలు కీర్తి నిలిచి ఉండటం. అయితే, ప్రత్యేకతని ఓర్వలేక లోకులు ఏమైనా అంటే వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి అటువంటి వాటికి సంజాయిషీలు ఇచ్చే తీరిక ఉండదు. ఇదుగో, చుట్టుపక్కల ఉండే మనలాంటి వారికే బాధలన్నీ. ఎందుకంటే, మనం ఇంకా మామూలు మనుషులంకదా! వాళ్ళ స్థాయికి ఎదగలేదుగా!"

 

 Previous Page Next Page