ఆమెకో క్షణం అర్థంకాలేదు. అది కలో వాస్తవమో తెలియలేదు. గబుక్కున లేచి నిలబడింది. చెయ్యి తగిలి పేపరు కింద పడింది. ఆమె వణికే చేతుల్తో దాన్ని తీసుకుంది.
చాలా దయనీయమైన స్థితి!
ఆమె తనకు కళ్ళు లేని ఇబ్బందిని జీవితంలో మొదటిసారి ఎదుర్కొంది.
తను తడిమి చదివింది నిజమేనా?
లేక తన భ్రమా?
నిజమని నమ్మలేకపోతోంది.
అతడు రాజకీయ నాయకుడు కాదు. సంఘ సేవకుడు కాదు. అందువల్ల మొదటి పేజీలో పెద్ద అక్షరాల్తో నోచుకోలేదా వార్త. కేవలం నాలుగే లైన్లు.
తనకు కళ్ళు లేనందుకు మొదటిసారి ఆ అమ్మాయి ఏడ్చింది. ఆ వార్తా తను సరిగ్గా అర్థం చేసుకుందో లేదో తెలీదు. అన్ని వార్తల్లో అది ఎక్కుడుందో తెలుసుకోవడం కోసం మొత్తం ఆ కాగితాలన్నిటినీ వేళ్ళతో తడమసాగింది.
* * *
గౌరవసూచకంగా గాలిలో తుపాకులు పేలాయి. కదిలే మంచు పల్లకి నిండా పూలతో శవపేటిక వచ్చి ఆగింది. పోలీసు అధికారులు చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఆ డిపార్ట్ మెంట్ వ్యక్తులకి మాత్రమే తెలుసు నేత్ర దేశాన్ని ఎన్నిసార్లు విపత్కర పరిస్థితుల్నించి బయట పడేశాడో.
నేత్ర మరణంతో దేశం ఒక గొప్ప సీక్రెట్ ఏజెంట్ ని కోల్పోయిందని ప్రధాన మంత్రి సందేశం పేర్కొంది.
అతడికి తల్లి, తండ్రి లేరు. తాతే వున్నాడు. ఆయనే చితి అంటించవలసింది. ఆజానుబాహువు. ఆయనొక్కడే బింకంగా వున్నాడు.
చీఫ్ దూరంగా నిలబడి వున్నాడు. ఏజెంట్ క్యూయే నేత్రమీద పిస్తోలు పేల్చిందని తెలుసు. ఆ తెర వెనుక సర్పభూషణరావు వున్నాడనీ తెలుసు. అయినా ఏమీ చెయ్యలేని నిస్సహాయత.
నేత్ర తాతయ్య గజపతిరావు చితికి నిప్పు పెడుతున్నాడు. చీఫ్ ఆ మంటల్నే చూస్తున్నాడు. ఎర్రటి మంటలు. దూరంగా వుండి చూస్తున్న వారిలో భూషణరావు కూడా వున్నాడు. ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి. 'నిన్ను ఉరికంబం ఎక్కించేవరకు అవి మండుతూనే వుంటాయి ఎస్బీఆర్' అనుకున్నాడు చీఫ్ మనసులో.
నేత్ర శరీరం బూడిదగా మారుతూంది. అదే సమయానికి ఏజంట్ క్యూ, తెలంగాణాలో మారుమూల గ్రామం అయిన నారాయణ్ పేట్ వెళుతున్నాడు.
* * *
"అయామ్ సారీ..... ఫర్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్" అన్నాడు చీఫ్ విచారంగా.
"అయామ్ నాట్ ఫీలింగ్ సారీ. నా మనవడు ఒక శత్రువుని ఎదుర్కొని యుద్ధంలో మరణించాడు."
దూరం నుంచి వెక్కి వెక్కి ఏడుస్తున్న చప్పుడు. చీఫ్ తలతిప్పి చూశాడు. గజపతిరావు భార్య పైటకొంగు నోట్లో పెట్టుకుని ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూంది. పక్కనే ఒక గుడ్డి అమ్మాయి ఆవిడని ఓదార్చడానికి ఆవిడమీద చెయ్యి వేస్తూంది.
అతడు నిశ్శబ్దంగా బయటకు వచ్చేశాడు. భాస్కర్ అతడిని అనుసరించాడు.
ఒక శిల్పి రాత్రింబవళ్ళు కష్టపడి చెక్కుకున్న శిల్పం పిడుగుపడి వెయ్యి వక్కలైతే ఎలా వుంటుందో అలా వుంది గజపతిరావు మానసిక స్థితి. భార్య దగ్గరికి వెళ్ళాడు. "ఊరుకో పార్వతీ...... ఊరుకో. భాస్కరూ, కళ్యాణి, వీళ్ళంతా మన పిల్లలు కాదూ? కళ్యాణీ లోపలకు తీసుకెళ్ళు."
"కళ్యాణి ఆవిడని తీసుకెళ్ళింది. ఆయన నేత్ర ఫోటోవైపు చూశాడు. అతడికీ తనకీ దగ్గర పోలికలున్నాయి. నాలుగు దశాబ్ధాల క్రితం తను అలాగే వుండేవాడు. కళ్ళలో అదే కసి...... శత్రువుని యుద్ధంలో ఎలాగైనా సరే గెలవాలనే కసి. రెండు యుద్ధాల్లో గెలిచాడు. కాని గెలుపు శత్రువుల్ని నిర్మూలించదు. మళ్ళీ తయారవుతూనే వుంటారు. ఈసారి ఓటమి తన మనవడికి.
ఫోటో దగ్గరగా వెళ్ళారు. కళ్యాణి కట్టిన రాఖీ కనబడింది. 'మనిషికి సెంటిమెంట్ ఎక్కువ ఆనందం యిస్తుందా? గంభీరరత ఎక్కువ ఆనందం. యిస్తుందా? తన భార్య లాగానో, కళ్యాణి లాగానో ఏడవగలిగితే ఎంత బావుణ్ణు! అనుకుంటూ ఆ రాఖీ చేతుల్లోకి తీసుకున్నాడు. ఆయన మనసంతా అదోలాటి ఉద్విగ్నత చోటు చేసుకుంది. నేత్ర పోయినప్పుడు 'అన్నయ్యా' అంటూ ఆ రాఖీ పట్టుకుని ఆ పిల్ల ఏడుస్తూంటే చిత్రంగా అనిపించింది. ఏమిటి ఈ ఆడవాళ్ళు? అనిపించింది. మరిప్పుడు తన వేళ్ళెందుకు వణుకుతున్నాయి! నో..... నో..... అనుకున్నాడు తడి చెంపల్ని తుడుచుకుంటూ. నిజంగానే నేత్రని తన ఆలోచనలకు రూపంగా చిన్నప్పటినుంచీ తీర్చుదిద్దుకున్నాడు ఆయన.
బయట కారు దగ్గరకు వస్తూ భాస్కర్ చీఫ్ తో అన్నాడు "నన్నూ, కళ్యాణిణి చిన్నప్పటినుంచి గజపతిరావుగారే పెంచారు సార్. నేత్ర స్ఫూర్తితోనే నేనీ డిపార్ట్ మెంట్ లో చేరాను."
చీఫ్ మాట్లాడలేదు.
తన ఆలోచనలో నిశ్శబ్దంగా వున్నాడు.
ఇద్దరూ కారు దగ్గరికి వచ్చారు.
చీఫ్ భాస్కర్ భుజం మీద చెయ్యి వేశాడు "భాస్కర్...... నువ్వీకేసు టేకప్ చేస్తావా?" ఊహించన ప్రపోజల్ ఇది. ఒకవైపు ఆనందం- తనలాంటి జూనియర్ కి ఈ కేసు అప్పగించినందుకు. మరోవైపు విషాదం- స్నేహితుడు ప్రాణాలర్పించిన కేసు తను టేకప్ చేయవలసి రావడం. కానీ పగ!!
ప్రతీకారం నిండిన స్వరంతో "తప్పకుండా సర్..... ప్రాణం పొయినా సరే వాడి అంతు తేలుస్తాను" అన్నాడు భాస్కర్.
తానొక పెద్ద కొండతో ఢీకొనబోతున్నట్టు ఆ పొట్టేలుకు తెలీదు ఆక్షణం. తను చేస్తున్న తప్పు తెలియని చీఫ్ "క్యూ ఈ దేశంలోనే వున్నాడు. అంతవరకు చెప్పగలను. మిగతా వివరాలు నువ్వు సేకరించు" అన్నాడు. 'షా' చెప్పడం కోసం ప్రత్యర్థి మంత్రి పక్కనే చిన్నబంటుని నిలబెట్టటమే చీఫ్ చేస్తున్న తప్పు. దాని ఫలితం దాదాపు ఆరునెలల తరువాత కనబడింది.
"థాంక్స్ సర్. జూనియర్ నైనా నాకింత పెద్ద పని అప్పగించినందుకు".
చీఫ్ విషాదంగా నవ్వాడు "మెలో డ్రామా అంటే యిదే- సర్పభూషణరావు కేసు నేత్రకిచ్చినప్పుడు 'ఇంత చిన్న కేసు అతడికా' అనుకున్నాను. క్యూ కూడా ఇందులో వుంటాడనుకోలేదు. జాగ్రత్త భాస్కర్! అంతకన్నా ఏం చెప్పలేను. చిన్న కేసు కాదిది. అది మాత్రం చెప్పగలను" అన్నాడు.
ఆ విషయం తనకు తెలుసు అన్నట్టు తలూపి, భాస్కర్ ఒక క్షణం ఆగి "ఎస్బీ ఆర్ మీద కూడా ఒక ఏజెంట్ ణి నియమిస్తే బావుంటుందనుకున్నాను సర్" అన్నాడు.
"అవును...... ఏజెంట్ ప్రతిమకి ఆ కేసు అప్పగించాను" అన్నాడు చీఫ్.
* * *
ప్రతిమ బాత్ రూమ్ లో స్నానం చేస్తూంది.