శేఖరం మాట్లాడలేదు. ఆలోచనల్లో పడ్డాడు. భార్గవ ప్లస్ వసుమతి రాసక్రీడ = జూనియర్ ప్రార్థన.
ఈజీక్వల్టు అన్నదాన్ని గుర్తుగా వేసిన వాళ్ళు ప్లస్ ని అక్షరాల్లో ఎందుకు వ్రాస్తారు? ప్రింటింగ్ లో ప్లస్ అంత బావోదని సాధారణంగా అలా వాడతారు. అలా వాడేవారు రచయితలైనా కావాలి, లేకపోతే ప్రింటింగ్ గురించి బాగా తెలిసిన వాళ్లై వుండాలి. స్కూల్లో మొదటివాళ్ళు వుండటానికే ఎక్కువ ఛాన్సు వుంది.
"శారద టీచర్ అంటే ఎవరికీ పడదు. తనే వ్రాసి వుంటుంది".
"మనం అంత తొందరగా ఒక నిర్ధారణకి వచ్చెయ్యకూడదు. రెడ్ హాండెడ్ గా పట్టుకోవాలి. చిన్న నాటకం ఆడదాం పద. ఆ డేపంజాతి స్త్రీని దూరంనుంచే నాకు చూపించు".
ఇద్దరూ టీచర్స్ రూమ్ వైపు బయల్దేరారు. ప్రార్థన కూడా తన పాత మూడ్ నుంచి బయటపడి పూర్వపు ఉత్సాహం తెచ్చుకుంది.
టీచర్స్ రూమ్ కి కాస్త అవతల ప్రార్థనని నిలబెట్టి, శేఖరం లోపలికి వెళ్ళాడు. గదిలో ఒక మూల ఇంకెవరో టీచర్ పని చేసుకుంటూంది. మధ్య టేబిల్ దగ్గిర శారద ఒక్కత్తే వున్నది.
"నమస్తే, నా పేరు ఎస్. ఎస్. బత్తుల. మాది కన్నడి దేశం!" అన్నాడు. "మీ కథలు చదువుతూ వుంటాను. చాలా బావుంటాయి".
శారద అమితమై ఆనందంతో బాధపడుతున్న దాన్లా నవ్వింది. నిజానికి ఆమె కథలు వ్రాసినవి యాభయ్- ప్రచురితమైనవి అయిదు.
"మీ కథలు కన్నడంలోకి అనువదించాలనుకుంటున్నాను. దానికి మీ పర్మిషన్ కావాలి. మీకు యాభై శాతం రాయల్టీ ఇస్తాను".
శారద మొహం సంతోషంతో వెలిగిపోయింది. "తప్పకుండా దానికే ముందండీ?" అంది.
"మీ కభ్యంతరం లేకపోతే అనుమతి ఉత్తరం వ్రాసిస్తారా?"
శారద నోటు బుక్ లోంచి కాగితం చింపి, "ఏం వ్రాయమంటారు?" అనడిగింది.
"నా కథల్ని శ్రీ ఎస్. బత్తుల కన్నడంలోకి అనువదించటానికీ, 'రాసక్రీడ' అనే పేరుతో పుస్తక రూపంలో ప్రచురించటానికి అనుమతి ఇవ్వటమైంది".
అతడు చెపుతూంటే ఆమె వ్రాసి సంతకం పెట్టి ఇచ్చింది. "థాంక్స్" అన్నాడు. అతడు లేస్తూ "మీలాగే మీ సంతకం కూడా అందముగా వుంది. కంగ్రాట్స్! మీ ఆటోగ్రాఫ్ జీవితాంతం ఉంచుకుంటాను".
ఆమె ముసిముసిగా సిగ్గుపడి "థాంక్స్" అంది.
"నెలరోజుల్లో పుస్తకం పూర్తవగానే వచ్చి కలుస్తాను. అంతవరకూ శలవు" అని బయటకు వచ్చేసాడు. అతడి చేతిలో ఆమె రాసిన కాగితం వుంది. గోడమీద వ్రాసింది ఆవిడే అన్నది నిర్థారణ అయిపోయింది. ఆమె అతడికి వ్రాసి యిచ్చిన అనుమతి పత్రంలో 'రాసక్రీడ' అని వుండాల్సినచోట స్పష్టంగా 'రాసక్రీడ' అని వ్రాసి వుంది.
* * *
"ప్లీజ్ ఏడవకండి" అన్నాడు భార్గవ ఇబ్బందిగా. ఆ సైంటిస్టుకి ఆడవాళ్ళు ఏడుస్తూంటే ఏం చేయాలో తెలీదు.
వసుమతి ఇంకా వెక్కుతూనే వుంది.
అనునయిస్తున్నట్టూ ... "ఇలాటి సమయాల్లోనే మీరు ధైర్యం తెచ్చుకోవాలి. ఇంత చిన్న విషయంమీద రాజీనామా చేసేస్తారా? లక్షమంది లక్ష అనుకుంటారు. ముందు ఆ గోడ మీద అంత దారుణంగా వ్రాసింది యెవరో కనుక్కోనివ్వండి. వాణ్ని హైడ్రోక్లోరిన ఆసిడ్ లో ముంచెయ్యకపోతే నా పేరు భార్గవ కాదు" అన్నాడు.
* * *
"వ్రాసిందెవరో కనుక్కున్నాం. అంతటితో అయిపోలేదు. మీ టీచర్ నాకు తెలీదు కానీ, భార్గవ మాత్రం చాలా సెన్సిటివ్. ఏదో రకంగా సర్దిచెప్పాలి" అన్నాడు శేఖరం.
ప్రార్థన కాస్త టైములోనూ బాగా తేరుకుంది. టీచర్ గురించీ, తండ్రి గురించీ గోడమీద చూసేసరికి ఆ పాప ముందు బాగా బెదిరిపోయి ఏడవటం ప్రారంభించినా, శేఖరం పక్కనుండటంతో కొండంత ధైర్యం వచ్చిపడ్డట్టయింది.
"నాదే తప్పు, టీచర్ ని నాన్న డిన్నర్ కి పిలిచాడని అబద్ధం చెప్పాను. ఈ సంగతి శారద టీచర్ కి తెలిసే ఇది వ్రాసి వుంటుంది" అంది ప్రార్థన.
"భార్గవ మీ వసుమతిగార్ని డిన్నర్ కి పిలవనే లేదా?"
"ఉహు. నాన్నకి ఎలానూ జ్ఞాపకం వుండదని నేనే, మేమిద్దరం కలిసి పిలిచామని టీచర్ కి చెప్పాను".
"నీ తెలివి తగలెయ్య- ఎందుకు పిలిచావు?"
"ఎందుకంటే... ఎందుకంటే..." తడబడింది ప్రార్థన. "ఎందుకో టీచర్ ని యింటికి పిలిస్తే బావుంటుందనిపించింది".
"ఇంకేముంది డిన్నరయ్యాక ఈయన ఆవిడని కారులో దిగపెట్టటం ఆ డేపంజాతి స్త్రీ చూసి వుంటుంది. దాంతో ఉక్రోషం ఆపుకోలేక ఇలా వ్రాసి ఉంటుంది..."
* * *
"ఆ వ్రాసిన వాళ్ళెవరో నా కారులో మీ బొమ్మ చూసి ఉక్రోషం ఆపుకోలేక ఇలా వ్రాసి వుంటారు" అన్నాడు భార్గవ. వసుమతి కాస్త స్థిమితపడింది. కానీ ఇంకా విచారంగానే వుంది. "కారులో బొమ్మ కట్టటమేమిటి?" అనడిగింది అర్థంకాక.
"మీరిచ్చిన బొమ్మని ప్రార్థన నా కారులో కట్టిందిగా- మీరు చూళ్ళేదా?"
ఆమె విస్తుపోయి... "నేను బొమ్మను యివ్వడం ఏమిటి? ఆ బొమ్మ ప్రార్థన తయారుచేసిందే. నేనిచ్చానని చెప్పింది- ఎందుకబ్బా?" అంది.
"మీరిచ్చారని అంటేగాని కట్టుకోనని అనుకున్నదేమో! ప్రార్థనలో ఇంత ఆర్టు వుందని నేను అనుకోలేదు సుమా! దాన్ని చూసినప్పుడల్లా 'ఎంత బావుంది ఈ బొమ్మ' అనుకునేవాడిని..." అని, కొంచెం సాహసించి, "... అలా అనుకున్నప్పుడల్లా మీరే గుర్తు వచ్చేవారు" అన్నాడు.
* * *
"ఎప్పుడూ తనే గుర్తొస్తుంది నాకు. తనతో కబుర్లు చెప్పాలనీ, తను మా ఇంటికి మాటిమాటికీ రావాలనీ అనిపిస్తుంది. అందుకే డిన్నర్ అని అబద్ధమాడేను" వప్పుకుంది ప్రార్థన.
"ఒక్కదానికేనా? జిన్నీకి, శ్రీనూకి కూడా అలానే అనిపిస్తుందా?"
"మా అందరికీ"
"అలా అయితే మనమో పని చెయ్యొచ్చు".
"ఏమిటి?"
దానికి సమాధానం చెప్పకుండా శేఖరం గంభీరంగా "ప్రొటానుచుట్టూ ఎలక్ట్రాను తిరిగితే అది అణువు అవుతుంది. అమ్మాయి చుట్టూ అబ్బాయి తిరిగితే అది ప్రేమ అవుతుంది" అన్నాడు.
ప్రార్థన బిక్కమొహంవేసి "నాకు భయమేస్తుంది. ఏమీ అర్థం కావటం లేదు" అంది.
* * *
"నాకేమీ అర్థంకావటంలేదు" అంది వసుమతి.
తనన్న మాటలకు ఆమెలో అణువిచ్చేద సిద్ధాంతం, న్యూటన్ మూడోచలన సూత్రంలాంటి రియాక్షన్స్ ఏమీ రాకపోయేసరికి భార్గవ మరింత ధైర్యంచేసి గొంతు సర్దుకుని... "విశ్వం అనంతం కాదు, పరిమితం కాదు వసుమతిగారూ! అయితే దానికి అవధులు లేవు. అదే ఐన్ స్టీన్ కనిపెట్టిన సాపేక్ష సిద్ధాంతం" అన్నాడు.
వసుమతి తెల్ల మొహం వేసి "మీకేమైనా మతిపోయిందా" అనబోయి బావోదని వూరుకుంది. భార్గవ ఆమె మొహంలో భావం చూసి బుర్రగోక్కుని "ఇదేమిటి? 'ఆపేక్ష' సిద్ధాంతం చెప్పబోయి సాపేక్ష సిద్ధాంతం చెప్పేను" అనుకున్నాడు.
* * *
"ఇందులో అర్థం కాకపోవటానికి ఏమీలేదు. సైంటిస్టులు మనసులో మాట కూడా సరిగ్గా చెప్పలేరు. మనమే సాయపడాలి. లేకపోతే ఆపేక్ష సిద్ధాంతం చెప్పబోయి సాపేక్ష సిద్ధాంతం చెప్పేస్తారు" అన్నాడు శేఖరం.
"ఆపేక్ష సిద్ధాంతం ఏమిటి?"
"ప్రేమ అనంతంకాదు. పరిమితం. అయితే దానికి అవధుల్లేవు- అదే అన్నాబత్తుల సోమశేఖరం కనిపెట్టిన అపేక్ష సిద్దాంతం. న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిలాగే ప్రేమాకర్షణ శక్తికూడా! స్త్రీ పురుషులిద్దరూ తమతమ ద్రవ్యరాసుల గుణలబ్దానికి (అమంగళం అప్రతిహతమవుగాక) అనులోమ నిష్పత్తిగల, తమ మధ్య దూరం స్క్వేర్ కి విలోమ నిష్పత్తి ఫోర్సుతో ఆకర్షించుకుంటారు. దూరం సున్నా అయితే ప్రేమ ఇన్ ఫినిట్ అవుతుంది".
ప్రార్థన అతడి మొహంలోకి తేరిపార చూసి, "నీకు పిచ్చెక్కిందన్నయా" అంది.
"పిచ్చికాదు. ఆ డేపంజాతి స్త్రీని చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పేలా చెయ్యాలంటే మనందరం, అంటే నువ్వూ, నేనూ, జిన్నీ, శ్రీనూ కలిసి ఒక మహత్తరమైన పనికి పూనుకోవాలి. ఈ శుభకార్యంలో మీరందరూ మొగపెళ్ళి తరఫువాళ్ళూ, నేనేమో ఆడపెళ్ళి తరఫువాడినీ అన్నమాట. ఇది చాలా క్లిష్టమైన పనే అనుకో. కాని మనందరం తల్చుకుంటే సాధ్యం కానిదేముంది, మరి సంప్రదింపులు ప్రారంభిద్దామా.."
మొదట ప్రార్థనకి అర్థం కాలేదు. క్రమక్రమంగా అర్థం కాగానే ఆ పాప మొహం అనందంతో విచ్చుకుంది!!
* * *
ఇది జరిగిన వారం రోజులకి టీచర్స్ రూమ్ లో వసుమతి అందరికీ కార్డులు పంచుతూ శారద దగ్గర కొచ్చి తనకీ ఒకటి అందించింది.
"ఏమిటిది?"
"వచ్చేనెల పదో తారీఖున ముహూర్తం".
"దేనికి?"
"జూనియర్ ప్రార్థన చట్టబద్దంగా ఈ భూమ్మీదకు రావటంకోసం పెళ్ళి అనే మంగళప్రదమైన రాసక్రీడ తాలూకు ముహూర్తం. పెళ్ళికి మీరు తప్పక రావాలి. ప్లీజ్...." అన్నది. ఆమె మొహంలో మారే రంగుల్ని పరిశీలిస్తూ.
మొదట పెద్ద చప్పుడు. తర్వాత బుసకొట్టిన శబ్దం వరుసగా వినిపించాయి. మొదటి శబ్దం శారద స్థూలకాయం కుర్చీలో పడటంవల్ల వచ్చింది. రెండోది బి.పి. ఎక్కువయి ఆవిడ తీసే ఊపిరివల్ల వచ్చింది.
* * *