"రేపు నువ్వు అతడిని చూడు, చెయ్యి మళ్ళీ వుంటుంది" అన్నాడు ధర్మారావు. "ఈ మెస్మరిజానికి సైంటిఫిక్ రీజనింగ్ ఇంకా కనుక్కొనబడలేదు. కాని ఏదైనాసరే, ఎప్పుడో ఒకప్పుడు హేతువాదానికి నిలబడవలసిందే."
విద్యాధరి తలూపింది. మనసులో మాత్రం - "అనుదీప్! ఇంతకు ఇంతా నిన్ను ఫూల్ ని చెయ్యలేకపోతే నా పేరు విద్యాధరే కాదు" అనుకుంది.
ఆ రాత్రి వాళ్ళ బలవంతం మీద అక్కడే ఉండిపోయింది. నగరాల్లో వంటరిగా వుండే వర్కింగ్ వుమెన్ ఆ మాత్రం ఆరోగ్యకరమైన ఆహ్వానం దొరికితే అదోపండగలా మురిసిపోతారు. ఆమె కారోజు చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళందరితో కలిసి గడపటం ఒక్కటే కారణం కాదు. అనుదీప్ చెయ్యి తెగలేదు అన్నది కూడా కారణం కావచ్చు. అతడి మీద కోపం వున్నది. అది వేరే సంగతి. ఒక వ్యక్తిమీద ఒకే సమయంలో కోపమూ ప్రేమా వుండటం విడ్డూరమేమీ కాదు కదా! చాలా మందికి ఇది అనుభవంలోకి వచ్చే ఉంటుంది.
రాత్రి చాలాసేపటి వరకూ కమీషనర్ గారి కూతురు కబుర్లు చెప్పింది. విద్యాధరి మాత్రం పరధ్యానంగా వింటూ నిద్రలోకి జారుకుంది. మేల్కొన్న సగం కాలాన్నీ, నిద్రలో సగభాగాన్నీ అనుదీప్ ఆలోచనలే తినశాయి.
* * *
"అమ్మాయి చక్కగా ఉంది కదండి-" అంది ధర్మారావు భార్య పిల్లలు తమ గదుల్లోకి వెళ్ళిపోయాక.
"ఏమిటి, ఏదో ఎత్తువేస్తున్నా వప్పుడే-" నవ్వేడు.
"ఏమిటా మాట్లాడటం?- నేననుకున్న దేమిటంటే - మా అన్నయ్య కొడుక్కు చేసుకుంటే ఎలా వుంటుందీ అని."
"అసలా అమ్మాయి గురించి ఏమీ తెలీదు. అప్పుడే పెళ్ళి వరకు వెళ్ళావా?"
"తెలిసేదేమిటి? పెళ్ళిచూపుల్లో మాత్రం అమ్మాయి గురించి అంతకన్నా ఎక్కువ తెలుస్తుందా? ఎప్పుడూ అది లాటరీయే కదా."
ఆయన అదిరిపడ్డట్టు చూసి, "ఇన్నేళ్ళూ లేనిది నీకింత మెచ్యూరిటీ ఎప్పుడొచ్చింది" అన్నాడు.
"అదెప్పుడూ వుంది. కాని ఏ మగాడూ తన పెళ్ళానికి ఆ మాత్రం తెలివితేటలున్నాయని చచ్చినా వప్పుకోడు."
"సర్లే విరుచుకుపడకు. కొంతకాలం పోనీ, అమ్మాయి మనస్తత్వం ఈ లోపులో మరింత తెలుస్తుందిగా. ఈ లోపులో మీ అన్నయ్యకి కూడా ఒకమాట చెప్పివుంచు."
..... భార్య నిద్రపోయాక ఆయన చాలాసేపు విద్యాధరి తండ్రి గురించే ఆలోచించాడు. దాదాపు పాతిక సంవత్సరాల క్రితం అనుభవాలు ఆయన్ని చుట్టుముట్టాయి.
వ్యక్తిగా అతడిని ఎంతగానో ఇష్టపడేవాడు తను. కానీ చర్మవ్యాధి వంటిమీద ఒకచోట ప్రారంభామైఫ్ శరీరం అంతా పాకినట్టు 'స్టాటస్ దాహం' అతడిని క్రమక్రమంగా ఆక్రమించుకుంది. ప్రతి మనిషికీ కొన్ని బలహీనతలు వుంటాయి. కానీ నైతిక విలువల కోట ఆ బలహీనతల్ని ఒక హద్దుదాటి బయటకు వెళ్ళకుండా కాపాడుతూ వుంటుంది. ఎప్పుడైతే స్వార్థం మనిషిని గెలుస్తుందో ఆ కోట బ్రద్దలైపోతుంది. అలా బ్రద్దలవ్వటాన్ని ఆయన ప్రేక్షకుడిగా గమనించాడు. స్నేహితుడిగా హెచ్చరించాడు. మర్యాదగా దూరం తొలిగాడు. అప్పటినుంచీ ఇద్దరికీ సంబంధాలు లేవు. ఇళా జరిగిన దాదాపు పన్నెండు సంవత్సరాలకి మళ్ళీ ఇద్దరు కలుసుకోవటం తటస్థించింది. అప్పటికి ఆయన డి.సి.పి. అయ్యాడు.
"చూశావా నేనెంత సాధించానో! దేశపు ప్రముఖ దినపత్రిక ఎడిటర్నయ్యాను. ఎడిటర్ల కిచ్చే ప్రతిష్టాకరమైన మేగ్నెసే అవార్డుకి ఈ సంవత్సరం నా పేరు రికమెండ్ చేయబడింది. కారు - ఇల్లు - సమాజంలో హోదా - చుట్టూ పదిమంది - అన్నీ వున్నాయి నాకు. నాకు లేనిదేమిటి?"
"...హోమ్" అన్నాడు ధర్మారావు నవ్వుతూ. "నీకు 'హోమ్' లేదు. నేను చెప్పేది హౌస్ గురించి కాదు, హోమ్ గురించి, అన్నీ మర్చిపోయి విశ్రాంతిగా నిద్రించే గృహం లేదు."
అప్పటికి అతడు అయిదో రౌండ్ లో వున్నాడు. బిగ్గరగా నవ్వేడు. "ఏమీ సాధించనివాడు అన్నీ సాధించినవాడిని చూసి ఇలాగే ఈర్ష్య పడతాడు." ధర్మారావు ఆ మాటలకి బాధపడలేదు. ఎన్ని విభేదాలున్నా-విడిపోయి అన్ని సంవత్సరాలైనా, వాళ్ళు ఒకప్పుడు మంచి స్నేహితులు.
"ఏం సాధించావు నువ్వు? పదిమంది రచయితల్నీ, రచయిత్రుల్నీ కూడగట్టుకోవటం తప్ప మరేమీ సాధించలేదు. ఆ పదిమందీ నీకు సంతృప్తి ఇస్తున్నారని కూడా నేను అనుకోను. నువ్వు తెలివైన వాడివీ బాగా కష్టపడే వాడివీ అని నాకు తెలుసు. నీ కష్టాన్ని ఇలా అడ్డదారుల్లో కాకుండా ఆరోగ్యకరమైన పద్ధతుల్లో వినియోగించివుంటే నాలాంటి వాళ్ళు నీతోపాటే వుండేవారు. నీతో వున్నవాళ్ళు ఏ బలహీనతలవల్ల నీతో వుంటున్నారో నీకు తెలుసు. ఇంక నీకు సంతృప్తి ఏముంది? నీ స్నేహితులు తమ స్వార్థం కోసం నీతో స్నేహం చేస్తున్నారని తెలిశాక ఇక నువ్వు స్నేహంలో మాధుర్యం ఏమి ఆస్వాదించగలవు. ఇది కేవలం స్నేహానికే వర్తించదు, ఇంటికి కూడా వర్తిస్తుంది. నీ భార్య, నీ కూతురు ఎవరూ నీకు 'నీ' వాళ్ళు కాదు."
"అబద్ధం...." అరిచాడు.
"అబద్ధంకాదు. నిజం! ఆ ఫైలు ఆ రోజుల్లో నేనే చూశాను. నేను నా జీవితంలో ఉద్యోగ ధర్మానికి ఏనాడైనా అపకారం చేసి వుంటే అది నీ ఒక్క విషయంలోనే. నా భార్య మరణానికి ప్రత్యక్ష సాక్షి అయిన పనిమనిషిని పోలీస్ దిపార్టుమెంటు కొద్దిగా 'నొక్కి' వుంటే ఈపాటికి నువ్వు కటకటాల వెనుక ఉండేవాడివి. ధర్మానికి ధర్మం చేయలేదని నేను ఎంత క్షోభ అనుభవించానో నాకు తెలుసు. అటువంటిది- అనుక్షణం ఇంతపని చేస్తున్న నువ్వు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నావో ఊహించగలను. వీలైతే "మెఫెస్టో" అన్న సినిమా చూడు. యమలోకం అనేది ఎక్కడో లేదు మనిషి మనసులోనే వుంటుంది అని చెపుతాడు దర్శకుడు. మనసులో ఏ కల్మషమూ లేనివాడే స్వచ్చమైన చిరునవ్వు చిందించగలడు. ఈ స్టేటస్ కాన్షస్ నీలో కలిగాక ఏనాడైనా అలా నవ్వి వుంటావని నేననుకోను. అలా అనుక్షణం దగ్ధమై పోతున్నావు కాబట్టే అయిదు రౌండ్లు తాగినా నువ్వు ఆనందం అనుభవించలేకపోతున్నావు-"
"ఇంతకీ ఆ ఫైల్ క్లోజయిందా?"
"దానికేంగానీ మా కమీషనర్ పబ్లిసిటీ మానియా బాగా ఉన్నవాడు. అతడిని కొంచెం బూస్ట్ చెయ్యాలి. నీ పత్రికలో ఏమైనా చెయ్యగలవా?"
"తప్పకుండా! రేపే ఫోటోగ్రాఫర్ని పంపుతాను. నాలుగు పేజీలు వేసేస్తాను. సెంటర్ స్ప్రెడ్ వేద్దాం."
"చూశావా నీ ఆలోచన్లు ఎంత కృత్రిమంగా సాగిపోతున్నాయో! భయం నిన్నెంతగా డామినేట్ చేస్తోందో."
అతడు చేతిలో గ్లాసు విసిరికొట్టాడు. మొహం జేపురించింది. ఇంత ప్రాక్టికల్ జోక్ భరించలేకపోయాడు. అక్కణ్ణుంచి లేచి విసవిసా నడిచి వెళ్ళిపోతుంటే, ధర్మారావు భుజం మీద చెయ్యివేసి ఆపుచేశాడు.
"ఆఖరి మాట వినిపో. నీ మేలు కాంక్షించే వాడినీ, నీ నిజమైన స్నేహితుణ్ణీ నేను. ఈ రకమయిన జీవితంలో తాత్కాలికమైన ఆనందం వుంటే వుండొచ్చుగానీ అంతర్ సంఘర్షణ తప్పదు. పంధా మార్చుకో.... సాహితీ ప్రపంచంలో నీలా ఇష్టపడేవాళ్ళు తక్కువ. కబుర్లు చెప్పేవాళ్ళూ, చిందులు తొక్కేవాళ్ళే ఎక్కువ. నీ కష్టానికి ఫలితం ఎప్పుడూ వుంటుంది. దాని ఆనందం ఈ ఆనందంకన్నా వేయిరెట్లు ఎక్కువ."
అతడు విదిలించుకొని వెళ్ళిపోయాడు.
ఆ సంవత్సరం అతడికి మేగ్సెసే అవార్డు వచ్చింది. ఆ తరువాత రెండు సంవత్సరాలని పులిట్టర్ బహుమతికి పేరు రికమెండ్ చేయబడింది భారతదేశం తరఫున.
ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి అతడు మరణించాడు. ఏం అనుభవించాడో ఎవరికీ తెలియదు.
ఆలోచన్లతో ధర్మారావుకి నిద్రపట్టడంలేదు. భార్యవైపు చూశాడు. ఆమె కళ్ళు మూసుకుని నిద్రపోతూ వుంది. చేతులు జోడించి ప్రార్థించాడు.
"భగవంతుడా పోలీసు డిపార్ట్ మెంట్ లో ఇన్నేళ్ళుగా పని చేసిన నాకు- ఇప్పటికీ అర్థంకాని ప్రశ్న ఒకటే వుంది. మనిషి తెలుసి ఎందుకు పాపం చేస్తాడు? పైగా తను చేస్తున్న పనికి తన తరఫు నుంచి 'వాదన' ఎందుకు నిర్మించుకుంటాడు? ఈ ప్రశ్నకి నా జీవితకాలంలో సమాధానం దొరికేలా చెయ్యి స్వామీ...."
"ఏమిటి అర్థరాత్రి చేతులు జోడించి ప్రార్థిస్తున్నారు?"
చప్పున కళ్ళువిప్పి, భార్య తనవైపే చూస్తూ వుండటం గమనించి సిగ్గుపడి "ఏంలేదు" అన్నాడు. ఆవిడ నవ్వింది.
"ఎందుకు నవ్వుతున్నావు?"
"భగవంతుని ప్రార్థించటం కూడా ఒక సిగ్గుపడే చర్యగా అయినందుకు-"
"మైగాడ్"
"ఏం నేనన్నదాన్లో తప్పేమైనా వుందా?"
"లేదు లేదు. సిగ్గపడటం నా తప్పు. నేను అనుకున్న దేమిటంటే ప్రతి మనిషి మనసులోనూ ఇంతో అంతో స్వార్థం వుండి తీరుతుంది. కానీ అది ఎందుకు మనస్సు ఎల్లలుదాటి చుట్టూ గడ్డ కడుతుందీ అవి...."
"మీరేం మాట్లాడతారో ఒక్కొక్కసారి నా కసలు అర్థం కాదు బాబూ."
"నేనొక ప్రశ్న అడుగుతాను సమాధానం చెపుతావా?"
"ఏమిటి?"
"ఈ డిపార్టుమెంటులో ఆస్తులు సంపాదించటం చాలా సులభం. మనం తల్చుకుంటే పాతిక సంవత్సరాల క్రితమే ఈ స్థాయికి ఆర్థికపరంగా చేరుకునేవాళ్ళం. ఆ రోజుల్లో అలా చెయ్యలేదని నువ్వేమైనా బాధపడే దానివా?"
"ఇన్నాళ్ళ తరువాత ఇప్పుడా ఈ ప్రశ్న అడగటం" అని నవ్వుదామనుకుంది. కానీ భర్త ఏదో అంతర్మధనంతో ఈ ప్రశ్న అడిగాడని గ్రహించి, కొంచెం ఆలోచించి, "-లేదు" అంది.
"ఎందుకని?"
ఈసారి ఆవిడ కొద్ది సిగ్గుతో- "మీరు నవ్వనంటే చెప్తాను" అంది.
"ఏమిటది?" అన్నాడాయన ఉత్సుకతతో.
"ఆ రోజుల్లో కథలూ నవలలూ చాలా చదివే దానిని. ధనికొండ హనుమంతురావో, మధురాంతకం రాజారావో ఒక చిన్న కథ వ్రాశారు. ఎందుకో తెలీదు కానీ ఆ కథ అప్పట్నుంచీ నా మనసులో హత్తుకుపోయింది. ఒక చిన్న కాంట్రాక్టరు, ఒక బడిపంతులూ పక్కపక్క ఇళ్ళలో వుంటారు. ఉన్నట్టుండి కాంట్రాక్టరుకి సిరి అందుకుంటుంది. భార్య మెడలో బంగారం నింపుతాడు. ఎమ్మెల్యే అవుతాడు. పాత ఇంటి స్థానే మూడంతస్థుల భవనం నిర్మిస్తాడు. ఇంకేదో ట్రస్ట్ ప్రారంభిస్తాడు. పౌరసత్కారం పొందుతాడు. కాలనీ నిర్మాణాల్లో సిమెంట్ లో ఇసుక ఎక్కువ కలిపి కోటీశ్వరుడవుతాడు. అడ్డువచ్చిన ప్రతిపక్షం వాడిని రహస్యంగా తొలగిస్తాడు. ఇన్ కంటాక్స్ వాళ్ళ నోళ్ళు డబ్బుతో మూయిస్తాడు. ఇళా అంచెలంచెలుగా ఎదుగుతున్న అతడి స్టాటస్ ని అతడి భార్య ఆ వీధిలోనే వుండే ఇరుగమ్మ - పొరుగమ్మల దగ్గిర, తమ విజయానికి వాళ్ళే ప్రేక్షకులు కాబట్టి- చెప్పుకుంటూ, భర్త గొప్పతనాన్ని పొగుడుతూ వుంటుంది. ఇలా వుంటుండగా ఒకరోజు ఆవిడ భర్త అందాల రామచిలుక నొకదాన్ని పట్టి - ఆ మోజులో చిన్న ఇల్లు నిర్మిస్తున్నాడని తెలుస్తుంది. భార్య బావురుమంటుంది. ఆ వీధిలో అందరి దగ్గరా వాపోతుంది. అందరూ ఆవిడపట్ల సానుభూతి చూపిస్తారు. పక్కనున్న మాస్టారికి మాత్రం ఆవిడ ఎందుకు బాధపడుతుందో అర్థంకాదు. సామాజికపరంగా సంఘానికి ఆ మనిషి అన్ని అన్యాయాలు చేసినప్పుడు వాటిని అతడి తాలూకు విజయాలుగా అభివర్ణించిన అతడి భార్య, ఆ వరదలో తనే కొట్టుకుపోవలసి వచ్చేసరికి ఎందుకంత బాధపడుతుందో ఆయనకు బోధపడదు. నిజానికి అప్పటివరకూ ఆ కాంట్రాక్టరు చేసిన అక్రమాలతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నది.... ఎందుకో తెలీదు ఈ కథ...."
భర్త తనవైపే చూస్తూ వుండటంతో ఆవిడ చప్పున ఆపుచేసింది. ధర్మారావు మనసులో - మబ్బులు విడిపోయిన భావన కలిగింది. ఆవిడని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. "నీలో ఇన్ని తెలివితేటలున్నాయని నేను అనుకోలేదు సుమా."