Previous Page Next Page 
ప్రేమ నక్షత్రం పేజి 12


    ఫణికి ఇప్పటికి కాస్త వళ్ళు తెలిసింది. చెప్పింది చేయగలుగుతున్నాడు. ఇద్దరు ముగ్గురు సాయంపట్టి అతన్ని రిక్షాలో కూర్చోపెట్టారు. శైలజ అతని ప్రక్కనకూర్చుని భుజంచుట్టూ చెయ్యివేసి గట్టిగా పట్టుకుంది.

 

    "ఎటు పోనిమ్మంటారు, చెప్పండి?"

 

    అతను గొణుగుతున్నట్లుగా ఏదో చెప్పాడు. మొదట సరిగ్గా అర్థంకాలేదు. మొత్తంమీద అవస్థపడి ఆ సందూ, ఈ సందూ త్రిప్పి మధ్య మధ్య అతన్ని అడుగుతూ అతనుండే లాడ్జికి చేర్చింది.

 

    ఎప్పుడూ ఒంటరిగా తిరిగే ఫణి అమాంతంగా ఓ యువతితో అందునా రూపసితో, అందునా ఆమె ఇంచుమించు అతని భారమంతా మోస్తూ లోపలికి తీసుకొస్తుండగా అక్కడివాళ్లంతా కనులపండువుగా ఉత్సాహంగా, అసూయగా తిలకించారు.

 

    శైలజ అతన్ని మంచందగ్గరకు తీసుకొచ్చి పడుకోబెట్టింది. తర్వాత నిస్సహాయంగా ఆలోచిస్తూ నిలబడింది "ఏం జరిగిందితనికి? జ్వరం వున్నట్లు లేదు. మరి ఎందుకంత నీరసంగా వున్నాడు? తనమీద కోపంచేత తినటం మానేశాడా? రైల్లో రెండుగంటలు ఆకలికి ఓర్చుకోలేని ఇతను, రెండు రోజులు నిరాహారంగా ఎలా వుండగలిగాడు?"

 

    ఇంతలో అదృష్టవశాత్తూ ఈ హడావుడి అంతా చూసి ఏ గదిలోనో పనిచేస్తోన్న నారాయణమ్మ అక్కడికి వచ్చింది.

 

    "నేనీ ఇంట్లో పనిచేసేదాన్నమ్మగారూ!" అని మొదట పరిచయం చేసుకుని "ఏం జరిగిందమ్మగారూ?" అనడిగింది.

 

    శైలజ చెప్పింది.

 

    "అయ్యగారు రెండురోజులనుండి ఏమీ తింటున్నట్టు లేదమ్మగారూ! కనీసం కాఫీకూడా తాగినట్టులేదు"

 

    "ఎందుచేతనంటావు?"

 

    నారాయణమ్మ ఆలోచించి "బహుశా డబ్బులు లేవనుకుంటానమ్మగారూ!" అంది.

 

    "అయ్యో!" శైలజ గుండె కలుక్కుమంది.

 

    "డబ్బులేక..........డబ్బులేక.........."

 

    "అయ్యగారు డబ్బున్నవారు కాదనుకుంటానమ్మగారూ! అడగలేదుగానీ ఆయనేం తింటారో నాకుతెలుసు. పగటిపూట మలబారుహోటల్లో ముప్పావలా కొచ్చే ప్లేటుభోజనం, రాత్రిపూట రెండు అరటిపళ్ళు....."

 

    ఆమె ఒళ్ళు గగుర్పొడిచింది. కాళ్ళక్రింది నేల ఒణికినట్లయింది. కళ్ళలోంచి నీళ్ళు జలజలమని రాలాయి.

 

    మంచంమీద పడుకున్న ఫణి మూలిగినట్లు వినిపించింది. ఆ మూలుగు వెయ్యి గొంతులతో "ఆకలి ఆకలి" అని ఆక్రోశించినట్టు ధ్వనించింది.

 

    గబగబ హేండుబ్యాగు తెరిచింది. "ఏముంది? కర్చీఫ్, చిన్న అద్దం...ఓ రూపాయి వుండాలి....గుర్తుకువచ్చింది. ఇందాక రిక్షా అతనికి ఇచ్చి పంపివేసింది."

 

    ఆమెకు తన బీదతనానికి ఏడుపు వచ్చింది. ఈ ప్రపంచంలోని బీదతనం గురించి దుఃఖం పొంగిపొర్లింది.

 

    "ఏం చెయ్యాలి?"

 

    గుర్తుకు వచ్చింది. హఠాత్తుగా ఆమె ముఖంలో మెరుపులా చిన్న సంతోషం తళుక్కుమంది. ఆతృతగా హేండుబ్యాగులోని చిన్న అరకున్న జిప్ ను లాగింది. ఆమె వ్రేళ్ళు లోపలికిసాగి అందులోంచి నీలిరంగు కాగితం చుట్టివున్న చిన్న పొట్లాన్ని బయటకు తీశాయి. నీలిరంగు కాగితాన్ని జాగ్రత్తగా విప్పి, పొట్లాన్ని విడదీసింది.

 

    నాణాలు....పది పైసలవీ, అయిదు పైసలవీ, మూడు పైసలవీ, రెండు పైసలవీ...

 

    ఆనాడు త్రీటైర్ కంపార్టుమెంటులో అతను పైబెర్తులో పడుకున్నపుడు అతని జేబులోంచి తన గుండెలమీద గలగలమని రాలినవి అన్నీ జాగ్రత్త చేసి అతను నిద్రలేవగానే ఇచ్చేద్దామనుకుంది. చాలాసేపు గుప్పెట్లో దాచి వుంచింది. కానీ తర్వాత ఇవ్వబుద్ధికాలేదు. పదిలంగా హేండ్ బ్యాగ్ లో వేసుకుంది. ఆ తర్వాత అంతకంటే పదిలంగా దాన్ని బయటకు తీసి చూసి తనలో తాను నవ్వుకునేది.

 

    అన్నీ లెక్కపెట్టింది. ఎనభై పైసలుదాకా వున్నాయి.  

 

    అవి నారాయణమ్మకిచ్చి "తొందరగా వెళ్ళి దగ్గర్లో వున్న హోటలునుంచి ఓ బన్నూ, కాఫీ తీసుకురా" అంది.

 

    నారాయణమ్మ వెళ్ళిపోయాక గదంతా కలియచూస్తుండగా ఫణి మళ్ళీ మూలిగినట్లు వినిపించింది.

 

    దగ్గరకు వెళ్లింది. కళ్ళు మూసుకుని పడుకుని వున్నాడు. ముఖంలో ఏదో బాధ.

 

    తెలియని ఆపేక్ష పొంగిపొర్లింది. అటూ, ఇటూ చూసింది.

 

    గదిలో వేరేకుర్చీ లేదు. ఒక్కక్షణం సంకోచించి మంచంమీద అతని ప్రక్కనే కూర్చుని క్రాఫింగ్ లోకి వేళ్ళు పోనిచ్చి దువ్వుతూ "ఫణీ!" అని పిలిచింది ఆర్ద్ర స్వరంతో.

 

    కళ్ళు మూసుకుని పడుకుని వున్న ఫణికి లీలగా తానే స్థితిలో వున్నాడో, ఏం జరుగుతున్నదో తెలుస్తున్నది. ఏ అమృతహస్తమో వచ్చి తల నిమురుతున్నట్లు ఎంత హాయిగా వుంది!

 

    నెమ్మదిగా కళ్ళు విప్పాడు.

 

    "ఫణీ!"

 

    "ఊ."

 

    "ఇళా ఎందుకు చేశావు?"

 

    "ఏం చేశాను?"

 

    "నాకెందుకు చెప్పలేదు?"

 

    "ఏమిటి?"

 

    ఆమెకేమని చెప్పాలో తెలియలేదు....."నిజం"

 

    "ఎందుకంటే...." అతను బలహీనంగా నవ్వాడు "నిజం కాబట్టి."

 

    ఆమెకికూడా నవ్వువచ్చింది.

 

    ఇంతలో నారాయణమ్మ కాఫీ, బన్నూ తీసుకొచ్చింది.

 

    "ముందు కాఫీ త్రాగండి, చల్లారిపోతుంది" అతన్ని పట్టుకుని మెల్లగా కూర్చోబెట్టి తాను ప్రక్కనేకూర్చుని కాఫీ త్రాగించింది. మధ్యలో క్రిందపెట్టివున్న బన్ను, ముక్కలుగా తుంపి మెల్లిగా తినిపించింది.

 

    "ఆకలి తీరిందా?"

 Previous Page Next Page