అందుకే తిరిగి వస్తున్నాడు.
అతడి మనసంతా వాసిలేటింగ్ గా , నిస్పృహగా వుంది. స్టేషన్ లో దిగగానే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సర్రెండరయి పోదామా అనుకున్నాడు. ఇప్పటివరకూ ఎవరి అనుమానం రాలేదు గానీ, ఏ క్షణమైనా పోలీసులు పట్టుకోవచ్చు. అందులోనూ ఇప్పుడు సెంట్రీ హత్యకేసు కూడా తనమీద వుంది. పోలీసులు ఇప్పుడు మళ్ళీ తనమీద కేసు పెడతారా?
పెట్టినా- ఉరిశిక్ష కన్నా పెద్ద శిక్ష ఏముంది?
ఈ నేరానికి కూడా అదే శిక్ష వేసి- రెండుసార్లు ఉరి తీస్తారా? కోర్టులో మళ్ళీ ఈ నేరం మీద ఒక సంవత్సరంపాటు వాదోపవాదాలు జరుగుతాయా?
అంత బాధలోనూ అతనికి నవ్వొచ్చింది.
తన జీవితమంతా ప్రేమకోసం వెతుక్కోవటాలూ, నేరం చేయటాలూ, శిక్ష తప్పించుకోవటాలూ- వీటికి సరిపోతుందేమో.
సిరిచందన ఇప్పుడేం చేస్తూండి వుంటుంది? పెళ్ళయి వుంటుందా? పిల్లలతో ఆడుకుంటూ వుండి వుంటుందా?
ఒకటి మాత్రం నిజం.
ఒక అజ్ఞాత ప్రేమికుడు తనకోసం ఊళ్ళు పట్టి వెతుకుతూ తిరుగుతున్నాడు. కలలో కూడా ఊహించి వుండదు.
ఆలోచనల మధ్య రైలు ఆగింది.
స్టేషన్ నుంచి అతడు వర్మకి ఫోన్ చేశాడు. అట్నుంచి వర్మ "నువ్వేనా మహర్షీ? ఇన్ని రోజులూ నువ్వేమయిపోయావో తెలియక పోలీసులు పట్టుకున్నారేమోనని చాలా కంగారుపడ్డాను. రెండ్రోజుల క్రితమే రావాలిగా?"
రావలసిందే. కానీ ఆ అమ్మాయి అడ్రస్ పట్టుకోవడం ఆలస్యమయింది.
వర్మ ఆత్రంగా "ఏమైంది? సిరిచందన ఆచూకీ దొరికిందా?" అన్నాడు.
మహర్షి నిస్పృహగా "లేదు. ఆ సుశీల అనే అమ్మాయి దుబాయి వెళ్ళిపోయిందట" అన్నాడు.
"సరే నువ్వు హొటల్ కి రా. నేనిక్కడికోస్తాను."
అరగంట తరువాత ఇద్దరూ హొటల్ లో నిశ్శబ్దంగా టీ త్రాగసాగారు.
"ఇదంతా నీకు సిల్లీగా కనిపిస్తుందా వర్మా?"
"లేదు లేదు" ఆగి అన్నాడు. "..... ఇంకే మార్గాలు వున్నాయా అని ఆలోచిస్తున్నాను."
మహర్షి కూడా తిరిగి ఆలోచనల్లో పడ్డాడు.
అతడి దృష్టి హొటల్ టేబుల్ మీద వున్న ఆ రోజు దినపత్రిక మీద పడింది. యధాలాపంగా దాన్ని తిరగ వేయసాగాడు.
బేరర్ వచ్చి బిల్ ఇచ్చాడు. దాన్ని 'పే; చేస్తూ వర్మ అన్నాడు. "ఆ దుబాయ్ అమ్మాయి ఫోన్ నెంబర్ తెలుసా?"
"లేదు. అడ్రస్ మాత్రమే ఇచ్చారు."
"పద చెప్తాను" లేస్తూ అన్నాడు.
"ఎక్కడికి"
"దుబాయ్ లో నా స్నేహితుడు ఒకడున్నాడు. అతనికి ఈ అడ్రస్ చెప్పి, ఫోన్ వుందేమో కనుక్కోమందాం."
మహర్షి కళ్ళు తడి అయ్యాయి. కృతజ్ఞతాభావంతో మనసు ఆర్థ్రమైంది. "నా కోసం ఎంత చేస్తున్నావ్ వర్మా" అన్నాడు.
"డోంట్ బీ సిల్లీ! పద"
ఇద్దరూ వర్మ ఇంటికొచ్చారు.
ఇంటికి రాగానే వర్మ దుబాయ్ కి ఫోన్ చేశాడు. అదృష్టవశాత్తు స్నేహితుడు దొరికాడు. అతనికి అడ్రస్ చెప్పి" ఈ అడ్రస్ కి ఫోన్ వుందేమో కనుక్కో, కనుక్కుని చెపుతావా" అని అడిగాడు. ఆ తరువాత ఫోన్ పెట్టేస్తూ "ఇంకో అయిదు నిమిషాల్లో డైరెక్టరీ చూసి చెపుతానన్నాడు" అన్నాడు.
ఆ అయిదు నిమిషాలు తన జీవితంలో ఎన్నాడూ లేనంత టెన్షన్ ని అనుభవించాడు మహర్షి. అయిదు నిముషాలు గడిచాయి.
ఫోన్ రాలేదు.
తరువాత ఒక్కొక్క క్షణం గడుస్తున్న కొద్దీ మహర్షిలో ఉద్వేగం ఎక్కువ కాసాగింది.
పావుగంట తరువాత ఫోన్ మ్రోగింది. వర్మ చప్పున రిసీవర్ ఎత్తి "హల్లో" అని, "......నెంబరుందా?" ఎగ్జయిటింగ్ గా అన్నాడు.
అట్నుంచి మాటలు వినపడటం లేదు.
మహర్షి అరచేతులు చెమటలు పడుతున్నాయి.
వర్మ వంగి, పెన్సిల్ - కాగితం తీసుకోవడం చూసి, చప్పున వెళ్ళి వెనుకగా నిలబడి, వర్మ వ్రాసుకుంటున్న ఫోన్ నెంబర్ చూసాడు.
"ఏమిటీ విషయం?" అట్నుంచి స్నేహితుడు అడుగుతున్నాడు.
"చిన్న వివరం కావాల్సి వచ్చిందిలే" అని, అతడికి కృతజ్ఞతలు చెప్పి ఫోన్ పెట్టేశాడు.
ఎంతో ప్రయత్నించి, కష్టాలు పడిన తరువాత నిధి దొరికితే, దాన్ని ముట్టుకోకుండా ఉద్వేగంతో ట్రెజర్ హంటర్స్ ఎలా చూస్తారో, ఆ విధంగా ఆ ఫోన్ నెంబర్ వైపు ఇద్దరూ కొంచెంసేపు చూస్తూ వుండిపోయారు.
అర నిముషం అయ్యాక, "ఫోన్ చెయ్యి. ఎందుకలా వుండి పోయావు" అన్నాడు మహర్షి. వర్మ నవ్వి, "......దేవుడిని ప్రార్థిస్తున్నాను" అన్నాడు. తరువాత వంగి ఒక్కొక్క నెంబర్నే డయల్ చేయసాగాడు.
ముందు దుబాయ్ కి చేసాడు. ఆ తరువాత మిగతా నెంబర్లు చేయబోతుంటే బయట కాలింగ్ బెల్ మ్రోగింది. ఇద్దరూ ఒకర్నొకరు చూసుకున్నారు. కిటికీలోంచి బయటకు చూసారు.
బయట ఒక ఇన్ స్పెక్టరూ, వెనుకే ఇద్దరు పోలీసులూ నిలబడి వున్నారు.
వర్మ ఇంకా ఫోన్ చేస్తూనే వున్నాడు.
మహర్షి మెరుపులా అక్కడ్నించి తప్పుకుని వర్మ దగ్గరకొచ్చి "బయట .... పోలీసులు" అన్నాడు. వర్మ తలెత్తాడు. అతడి మొహం పాలిపోయింది. ఏం చేయాలో తోచనట్లు బ్లాంక్ గా మహర్షివైపు చూసాడు.
ఆ నిశ్శబ్దాన్ని పేలూస్తూ మళ్ళీ కాలింగ్ బెల్ గట్టిగారూమ్ లో ప్రతిధ్వనించింది.
"వెనుకనుంచి దారి ఏదైనా వుందా?"
"లేదు"
"స్టోర్ రూమ్?"
"బాచిలర్ని కదా.....లేదు"
"సరే, నేను టాయిలెట్ లో దాక్కుంటాను. జాగ్రత్తగా మానేజ్ చెయ్యి" అంటూ మహర్షి అటువైపు వేగంగా వెళ్ళి పోయాడు. అతడు తలుపు వేసుకున్న శబ్దం విన్నాక వర్మ వెళ్ళి మెయిన్ తలుపు తెరిచాడు.
భయంతో అతడి చేతులు వణకసాగాయి. టూ బెడ్ రూమ్ ప్లాట్ అది. పోలీసులు సెర్చ్ చేస్తే క్షణాల్లో దొరికిపోవటం ఖాయం.
అతడు తలుపు తెరవగానే ఇన్ స్పెక్టర్ లోపలి ప్రవేశించాడు.
"వర్మ అంటే మీరేనా?"
ఈసారి ఆశ్చర్యపోవటం వర్మ వంతయ్యింది. అతడు సినిమాల్లోనూ, పుస్తకాల్లోనూ ఇన్ స్పెక్టర్లు సెర్చ్ కోసం రాగానే, పోలీసులు గబగబా ఇంట్లో నలువైపులకీ వెళ్ళి వస్తువులన్నీ చెల్లాచెదురు చేస్తూ నేరస్థుడి కోసం వెదుకుతారని అనుకుంటూ వచ్చాడు. కానీ ఈ ఇన్ స్పెక్టర్ తీరిగ్గా సోఫాలో కూర్చుని మంచినీళ్ళివ్వండి" అనేసరికి, అందుకే ఆశ్చర్యం వేసింది.
అతడు లోపలికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడు. పోలీసులు ఇన్ స్పెక్టర్ వెనకాల నిలబడి వున్నారు.
"మహర్షి అనే వ్యక్తి మీకు తెలుసా?" మంచినీళ్ళు తాగుతూ అడిగాడు ఇన్ స్పెక్టర్.
"తెలుసు"
"అతడుమొన్న జైల్లోంచి తప్పించుకున్నాడు. అందుకే ఎంక్వైరీ మొదలు పెట్టాం. తప్పించుకుని ఇప్పటికి వారం రోజులైంది. ఈ పాటికి దేశం కూడా దాటిపోయుంటాడులెండి. ఏదో ఫార్మాలిటీ గా మా ఎంక్వైరీ మేం చేస్తున్నాం" గ్లాస్ బల్లమీద పెడుతూ అన్నాడు ఇన్ స్పెక్టర్.
ఖైదీ గురించి వెతుక్కుంటూ, అతను వెళ్ళిపోయుంటాడని నిర్ణయానికొచ్చి, రికార్డు పుస్తకాల్లో రికార్డులు పూర్తి చేసుకోవటం కోసం స్టేట్ మెంట్లు తీసుకుంటున్న ఇన్ స్పెక్టరు వైపు తెల్లబోయి చూశాడు వర్మ. అతనికి మనసులో ఆశ్చర్యం కూడా చేసింది.
"జైలునుంచి బయటపడ్డ తర్వాత మహర్షి మీకు ఫోన్ చేశాడా?"
"లేదు"
"అతను ఎక్కడికి వెళ్ళి వుంటాడో మీరేమైనా వూహించగలరా?"
"నా కంతగా తెలీదండి"
ఇన్ స్పెక్టర్ లేచి నిలబడి "టాయ్ లెట్ ఎక్కడ?" అని అడిగాడు.
వర్మ గుండెల్లో రాయి పడింది. అతనేదో సమాధానం చెప్పేలోగానే ఇన్ స్పెక్టర్ టాయ్ లెట్ దగ్గరికి వెళ్ళి తలుపు తోశాడు. లోపల గడియ ఉండడంతో అది రాలేదు.
"ఈ వర్షాలకీ చెక్క తలుపులు బిగుసుకు పోయినట్టున్నాయి" అన్నాడు బలంగా తోస్తూ.
"బెడ్ రూంలో ఇంకో టాయ్ లెట్ వుంది. రండి, చూపిస్తాను" అన్నాడు వర్మ ఎలాగో ధైర్యం చేసి, ఇన్ స్పెక్టర్ అతనితోపాటు బెడ్ రూంలోకి వెళ్ళాడు. వర్మ వచ్చి ముందు సోఫాలో కూర్చున్నాడు. అతడికి నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి స్నేహితుణ్ణి కాపాడుకో గలుగుతున్నందుకు సంతోషం వేస్తూంది. మరోవైపు పోలీసు డిపార్టుమెంట్ ఇలా ఉండటం చూసి బాధగా కూడా ఉంది.
ఈ లోపులో ఇన్ స్పెక్టర్ టాయ్ లెట్ లోంచి బయటకొచ్చి సోఫాలో కూర్చున్నాడు. "అతిమూత్ర వ్యాధి.....వర్షాలు పడటం ప్రారంభిస్తే ఈ అవసరం ఇంకా ఎక్కువతుంది" అన్నాడు తన పరిస్థితి వివరిస్తున్నట్టు.
"అవునండి. ఈసారి వర్షాలు ఎక్కువ పడుతున్నట్టున్నాయి."
"అంతా వరుణయాగం మహిమండి. చూశారుగా" అన్నాడు టేబుల్ మీదున్న పేపర్ చూపిస్తూ. "మంత్రిగారు ఎంతో శ్రద్ధ తీసుకొని వరుణ యాగం చేయించారు. అందుకే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి."
"యాగాలవల్ల వర్షాలు కురుస్తాయా? ఈ దశాబ్దంలో కూడా ఏమిటండీ ఈ మూర్ఖత్వం" అన్నాడు వర్మ.
ఇన్ స్పెక్టర్ నేరస్థుడి గురించి విచారించడం మానేసి వర్షాల గురించి చర్చించడం అతడికి ఒక రకంగా సంతోషంగానే వుంది. పోలీసులిద్దరూ ఆ గది గోడకున్న శ్రీదేవి క్యాలెండర్ వైపు, అర్థనగ్నంగా ఉన్న మరో సినిమాస్టార్ వైపు చూస్తున్నారు.
"అయితే యాగాలవల్ల వర్షాలు కురవవని మీరనుకుంటున్నారా?" ఇన్ స్పెక్టర్ కంఠంలో సీరియస్ నెస్ చూసి వర్మ భయపడ్డాడు. కాదంటే ఏదో ఒక నెపంమీద తనని అరెస్ట్ చేస్తారన్న భయంతో "అబ్బే, అలాంటిదేం లేదండి. యాగాల వల్ల వర్షాలు కురవని వ్రాసారు. ఈ పేపర్ లో ఎడిటోరియల్ చూశారా? మన మంత్రుల మూర్ఖత్వం గురించి ఎంత బాగా ఎడిటోరియల్ చూశారా? మన మంత్రుల మూర్ఖత్వం గురించి ఏమాత బాగా ఎడిటోరియల్ వ్రాశారో" అన్నాడు తనదేం తప్పులేనట్టు, తప్పంతా పేపరు చదవటం వల్ల వచ్చిన అభిప్రాయమే అన్నట్టు.
"అయితే తప్పంతా దేవాదాయ మినిష్టరుదేనంటారు?" ఇన్ స్పెక్టర్ అడిగాడు.
"నిశ్చయంగానండి. అసలు అంత మూర్ఖత్వం నేనెక్కడా చూళ్ళేదు."
"ఆ దేవాదాయ మినిష్టర్ మా మామగారు. నన్ను చిన్నప్పటినుంచి పెంచి పెద్దచేసి, పిల్లనిచ్చారు" అన్నాడు ఇన్ స్పెక్టర్ సీరియస్ గా.
వర్మ ఉలిక్కిపడ్డాడు. మొహం పాలిపోయింది. ఈ సారి ఇన్ స్పెక్టర్ తనని తప్పకుండా అరెస్ట్ చేస్తాడనుకున్నాడు. కొంచెం తడబడి "మినిష్టర్ ది ఏం తప్పులేదండీ. ఏదో ఒకటి చేయాలి కదా. ఏ పుట్టలో ఏ పాముందో! యాగాలు చేస్తే మేఘాలు కురుస్తాయని రుగ్వేదంలో వ్రాసుంది. బహుశా మినిష్టర్ గారు.... అదే మీ మామగారు వేదం చదివి వుంటారు. అందువల్ల ఆ యాగం చేస్తున్నారు. నిజంగా హానుభావుడాయన" అన్నాడు ఆయన్ని సమర్థిస్తున్నట్టు.