Previous Page Next Page 
అతడు ఆమె ప్రియుడు పేజి 12


    'తలమీద దెబ్బ బలమైంది కాదు. స్పృహ రావటానికి ఇంకొద్దిసేపు పడుతుంది' అని డాక్టర్స్ చెప్పడంతో కమీషనర్ తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు. ఇద్దరు కానిస్టేబుల్స్ ని అక్కడే వుంచి తెల్లవారుజామునే వస్తానని చెప్పి వెళ్ళాడు.

    సత్యనారాయణ మాత్రం చాలా హడావుడి పడుతున్నారు. తనతో కలిసి డిన్నర్ చేసి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిన కొడుకు ఆ విధంగా రక్తసిక్తమైన శరీరంతో హాస్పిటల్ లో పడి ఉండటం ఆయన్ని అతలాకుతలం చేసింది.

    నిశ్శబ్దం తెల్లవారింది.

    ప్రొద్దున్న ఆరింటికి సిరిచందనని తీసుకొని విష్ణువర్థనరావు వచ్చాడు. వారిని చూడగానే అంతసేపు ఉగ్గాబట్టిన దుఃఖం ఒక్కసారిగా పొంగుకొచ్చి, సత్యనారాయణ తన వయసుకూడా మర్చిపోయి ఆయన చేతులు పట్టుకొని బావురుమంటూ ఏడ్చాడు.

    తలకి పూర్తిగా బ్యాండేజీ చుట్టబడిన రవితేజని చూడగానే సిరిచందనకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అతడి నుదుటిమీద చేయివేసి నిమరాలన్న కోరికని బలవంతంగా తనలో తనే అణుచుకుంది.

    "నేను డాక్టర్ తో మాట్లాడి వచ్చాను. ప్రమాదమేమీ లేదట. తలకి మాత్రం చిన్న గాయం అయిందన్నారు డాక్టర్" అని ఓదార్చాడు విష్ణువర్ణనరావు.

    కొంచెం సేపటికి సత్యనారాయణ కొద్దిగా స్థిమితపడ్డారు.

    సిరిచందన కయితే మనసు మనసులో లేదు. తనతో పెళ్ళి నిశ్చయమైన తరువాతనే ఈ దురదృష్టకరమైన సంగతి జరిగిందేమోనని అందరూ అనుకుంటారని ఆమె భయపడుతోంది. ఎవరు ఏమనుకున్నా రవితేజ మాత్రం అలా అనుకోడు. తనకు తనే నచ్చచెప్పుకుంది.

    ఇంతలో కమీషనర్ డాక్టర్ తో కలిసి అక్కడికొచ్చాడు. తేజాని డాక్టర్ పరీక్షిస్తూ "ఇంకా స్పృహ రాలేదా?" అని అడిగాడు.

    "లేదు డాక్టర్! రాత్రినుంచి కోమాలోనే వున్నాడు" అంది నర్స్.

    డాక్టర్ మరో రెండు ఇంజక్షన్స్ ఇచ్చాడు. ఆత్రుతగా ఎదురు చూస్తున్న వారివైపు తిరిగి "మరేం భయపడకండి. కాసేపటికి స్పృహ వస్తుంది. కానీ ఎక్కువ మాట్లాడించకండి. నేను మళ్ళీ వస్తాను" అని  అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఆయన మాటలకి అక్కడి వారికి ధైర్యం వచ్చింది.

     కమీషనర్ గారి కోసం కుర్చీ లాగింది సిరి. ఆయన కూర్చుంటూ  ఆమెని  చూసి "నిన్ను ఇంతకుముందు ఎక్కడో చూసినట్టు వుందే" అని సాలోచనగా అన్నాడు.

    "మొన్న తేజాతో స్కూటర్ పార్క్ దగ్గిర గొడవపడుతూ....." అని అస్పష్టంగా చెప్పింది.

    ఆయన మరింత కన్ ప్యూజ్ అయి "మరి...... తేజ....." అన్నాడు.

    "మా ఫాదరూ, వాళ్ళ ఫాదరూ చిన్ననాటి  స్నేహితులట కమీషనర్ గారూ! నిన్ననే తెలిసింది" అంది. ఆయనకి పూర్తిగా అర్థంకాలేదు. కానీ మరి ఆ విషయం ఆ పరిస్థితుల్లో ఎక్కువ చర్చించటం ఇష్టం లేనట్లుగా "ఓహో. అలాగా" అన్నాడు

    ఇంతలో తేజ కనురెప్పలు కొద్దిగా కదులుతున్నట్లు అక్కడి వారు  గమనించారు. అందరూ ఆత్రుతగా బెడ్ చుట్టూ చేరారు. తేజ కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి. కానీ....ఆ చూపుల్లో వెలుగు లేదు. నిర్జీవంగా అలాగే పైకి చూస్తున్నాడు. పక్కనే కూర్చున్న తండ్రిని కూడా చూడలేదు.

    అందరి మొహాల్లోనూ టెన్షన్.

    ఎంతసేపటి తేజ తమవైపు చూడకపోవటంతో అతని తండ్రికి అనుమానం వేసింది. "రవీ" అని పిలిచాడు. తేజ కనీసం  "ఊ" అనైనా అనలేదు. విష్ణువర్థనరావు అతడి చేతిమీద చేయివేస్తూ "రవీ..... రవీ....." అని ఆతృతగా పిల్చాడు.

    ఎక్కడో నూతిలోంచి వినబడినట్టు "ఊ....." అన్న శబ్దం వినబడింది.

    "బాబూ రవీ, నేను..... మీ డాడీని....." తేజాని దాదాపు కుదుపుతున్నట్టు అన్నారు సత్యనారాయణగారు. ఈ లోపులో నర్స్ కల్పించుకుంటూ- "అతన్ని మరీ డిస్ట్రబ్ చేయకండి" అంది.

    "డాడీ .... నువ్వా .... ఎ .....ఎక్క..... ఎక్కడున్నావు డాడీ?" అంటూ చేతులతో తడమసాగాడు రవి.

    సిరిచందన దిగ్భ్రాంతురాలై చూస్తూ వుంది.

    "నీ పక్కనే ఉన్నాను బాబూ, ఇదిగో ఇక్కడే" అంటూ తేజ చేతులు పట్టి ఊపాడు.

    తేజ చూపుల్లో ఏ మాత్రం తేడా లేదు. అలాగే పైకి చూస్తున్నాడు. "నాకు...... నాకేమీ కనిపించటం లేదు డాడీ. అంతా..... అంతా చీకటిగా వుంది డాడీ" అతడి మాటల్లోని వ్యధ అక్కడివాళ్ళ గుండెల్లోకి బాణాల్లా దూసుకుపోతోంది.

    "ఇటు ..... ఇటు చూడు బాబూ, నేనిక్కడున్నాను. ఇదిగో మీ మామయ్య, సిరి కూడా ఇక్కడే వున్నారు" అంటూ దాదాపు తేజ భూజాలు పట్టి తనవైపు హిస్టీరిక్ గా తిప్పుకున్నారు సత్యనారాయణగారు.

    తేజ వారివైపే చూస్తున్నాడు. కానీ ఆ చూపులో జీవంలేదు. గుడ్డివాడి చూపుల్లాగా ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నట్లు వుంది. చేతులతో తడుముతున్నట్లు -డాడీ! నాకెవరూ కనిపించటంలేదు డాడీ, అంతా చీకటిగా వుంది. నాకేమైంది? నా కళ్ళు పోయాయా?" అతడి స్వరం రాను రానూ ఆర్థ్రమవుతుంది. అతడి కళ్ళల్లోంచి నీరు ధారావాహికంగా చెంపలమీదకి ప్రవహిస్తోంది. చిన్న పిల్లాడికి జ్వరం వస్తే ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నాడు.

    తేజ మాటలు విన్న సిరి అక్కడినుంచి డాక్టర్ దగ్గరికి వేగంగా పరిగెత్తింది. నర్స్ మొహంలో కూడా ఆందోళన కనిపిస్తోంది. సిరి డాక్టర్ తో తిరిగొచ్చేసరికి సత్యనారాయణగారు కొడుకు తలని దాదాపు పొదివి పట్టుకొని ఏడుస్తున్నారు. డాక్టర్ ఆయన్ని అక్కడినుంచి బలవంతంగా తొలగించవలసి వచ్చింది.

    తేజ కనురెప్పలు చూపుడువేలితో క్రిందికి నొక్కి పరిక్షించి "ఆర్ యూ ఆల రైట్?" అని అడిగాడు.

    "నో...... నో..... సర్"

    "నో....నో! ఇట్స్ వెరీ సింపుల్" అంటూ విష్ణువర్థనరావు వైపు తిరిగి "తలకి బాగా దెబ్బ తగలటంవల్ల ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు పేషెంటు. అందుకే ఏమీ కనిపించటం లేదంటున్నాడు. కాసేపాగితే అంతా మామూలై పోతుంది. వీలైతే స్కానింగ్ కూడా ఒకసారి చేయించడం బెటర్" అంటూ నర్స్ వైపు తిరిగి "నర్స్! తేజాకి స్కానింగ్ కి ఏర్పాట్లు చేయ్యి" అన్నాడు.

    నర్స్ అక్కడినుంచి వేగంగా వెళ్ళిపోయింది. పది నిమిషాల తర్వాత ఆ గదిలో స్ట్రెచర్ ప్రవేశించింది. తేజాని దానిమీద పడుకోబెట్టారు.

    సిరిచందన ఈ ప్రపంచంలో లేనట్లు జరుగుతున్న సంఘటనల్ని అయోమయంగా చూస్తూంది. ఆమె మనసులో ఒక అగ్ని పర్వతం లావాని ఎగజిమ్ముతోంది. దానికి కారణం ఆమెకి ఒక్కదానికే తెలుసు.

    ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ తేజాని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టారు.

    తేజా కుడిచేతిని పట్టుకొని కమీషనర్ అనునయంగా "తేజా! ఏమైనా కనపడుతున్నాదా?" అని అడిగాడు. ఆ గొంతుని గుర్తుపట్టి "లేదు సర్. ఏమీ కనిపించటంలేదు" అన్నాడు తేజ.

    రిపోర్ట్ కోసం కమీషనర్ స్వయంగా వెళ్ళబోయాడు.

    అంతలోనే నర్సు వచ్చి "మిమ్మల్ని డాక్టరుగారు రమ్మంటున్నారు" అని  చెప్పింది.

    మగవాళ్ళు ముగ్గురూ వడివడిగా డాక్టరుగారి దగ్గరికి వెళ్లారు. సిరిచందన ఒక్కతే రవితేజ పక్కన ఉండిపోయింది. అతన్ని చూస్తూ వుంటే ఆమెలో దుఃఖం కట్టలు తెగి ప్రవహించటం మొదలైంది. ఆ చప్పుడికి తేజ కదుల్తూ "ఎవరది? అన్నాడు. "నేను సిరిచందనని" అంది. అతడు చేయి గాలిలోకి ఊపాడు. ఆమె దాన్ని పట్టుకొని మొహానికి గట్టిగా హత్తుకొంది. ఆ తరువాత తను సరదాకోసం ఆడిన నాటకం గురించి చెప్పసాగింది.

       
                         *    *    *

    చుట్టూ గ్లాసెస్ తో ప్రత్యేకంగా తయారు చేయబడిన ఎయిర్ కండీషన్డ్ గది  డాక్టర్ పార్థసారధి రివాల్వింగ్ ఛెయిర్ లో కూర్చొని వున్నాడు. అతను ఆ హాస్పిటల్ తాలూకు సూపరిండెంట్ కూడా.

    అతడు రవితేజ స్కానింగ్ రిపోర్టు చూస్తూ వుంటే ఎదురుగా కూర్చొనివున్న ముగ్గురిలోనూ ఉద్వేగం!

    మరో నిమిషంపాటుపోర్ట్ పరిశీలించి దాన్ని బల్లమీద పెడుతూ గాఢంగా విశ్వసించాడు డాక్టర్ పార్థసారధి.

    "ఏమైంది?" అని అడిగాడు కమీషనర్.

    "అయామ్ సారీ!"

    "డాక్టర్..... ఎనీధింగ్ సీరియస్?" సత్యనారాయణగారు దాదాపు కుర్చీలోంచి లేస్తూ అడిగారు.

    డాక్టర్ పార్థసారథి కంఠం స్పష్టంగా, నిరాశాజనకంగా పలికింది. "యస్...... అతను జీవితంలో మరిక చూడలేడు."

    ఎదురుగా ఉన్న ముగ్గురిమీదా ఒక్కసారి పిడుగు పడ్డట్లయింది. ముందుగా తెరుకున్నది కమీషనర్. "ఏమిటి డాక్టర్ మీరంటున్నది?" అన్నాడు. అంత పెద్ద పోలీస్ ఆఫీసరై వుండి కూడా ఆ నిజాన్ని నమ్మలేనట్టు అతడి స్వరం సన్నగా కంపించింది.

    "అవును. తేజ మళ్ళీ జీవితంలో చూడలేడు" అన్నాడు డాక్టరు.

    ఆ గదిలో మళ్ళీ నిశ్శబ్దం ఆవిరించింది.

    అప్పటివరకూ మౌనంగా వున్న విష్ణువర్థనరావు 'అసలేమయింది డాక్టర్?" అన్నాడు.

    "అతడు పై అంతస్తునుంచి తల ముడుచుకొని పడటం వల్ల వెనక భాగంలో చిన్న మెదడుకి, దానిక్రింద ఉండే 'ఆప్టికల్ లూప్స్' కి  బలమైన దెబ్బ తగిలింది. ఆప్టికల్ లూప్స్ నుంచి బ్లడ్ సర్క్యులేట్ చేసే  రక్తనాళాలు చిట్లి అక్కడ  రక్తం గడ్డ కట్టుకుపోయింది. అందుకే..... అతడు చూడలేకపోతున్నాడు. "చెప్పటం ఆపుచేసాడు డాక్టర్.

    "ఆపరేషన్ చేసి మళ్ళీ సరిచేయటానికి వీల్లేదా?" అడిగాడు కమీషనర్.

    "యూ మీన్ బ్రెయిన్ ఆపరేషన్?"

    "అవును."

    "చెయ్యొచ్చు" అన్నాడు డాక్టర్.

    వింటున్న ముగ్గురి మొహాల్లోకి వెలుగొచ్చింది. "దానివల్ల అతడికి చూపొస్తుందా డాక్టర్?" అడిగాడు విష్ణువర్ధనరావు.

    "చెప్పలేం. నూటికి పదిశాతం మాత్రమే గ్యారంటీ ఇవ్వగలం." అని ఆగి నెమ్మదిగా చివరి వాక్యం పూర్తిచేశాడు. "......కానీ దానివల్ల ప్రాణానికి పూర్తి ప్రమాదం."

    "అంటే?"

    "చూపు తిరిగి రావటానికి కొద్దిగా వీలున్నా- ఆ ఆపరేషన్ ప్రాణానికి చాలా ప్రమాదం. అందువల్ల మనం ఆ రిస్కు తీసుకోవటం మంచిది కాదు" ఒక డాక్టర్ గా సలహా చెప్పాడు పార్థసారధి.

    ముగ్గురూ నిశ్శబ్దంగా, నిస్తేజంగా అలాగే కూర్చొని వున్నారు. డాక్టర్ పార్థసారథి  అక్కడినుంచి లేచి బైటికెళ్ళిపోయాడు. ఒక  షాకింగ్ న్యూస్ చెప్పిన తరువాత ఆ పేషెంట్ తాలూకు బంధువులు తేరుకోవటానికి కొంత సమయం పడుతుందని అతనికి అనుభవం నేర్పింది.

   
                                5

    ట్రెయిన్ వేగంగా వేళుతూంది. మహర్షి ఆలోచనలు అంతకన్నా వేగంగా పయనిస్తున్నాయి.

    ఢిల్లీలో అతను వెళ్ళిన పని కాలేదు. ఆ అమ్మాయి అడ్రస్ పట్టుకుని వెతకటానికి పదిరోజులు పట్టింది. వెళ్ళాక తెలిసింది- ఆ అమ్మాయి భర్తతో కలిసి దుబాయ్ లో ఉంటుందని. దుబాయ్ అడ్రస్ దొరికింది గానీ, ఆ తరువాత  ఇంకే చెయ్యాలో తోచలేదు.  

 Previous Page Next Page