Previous Page Next Page 
అతడు ఆమె ప్రియుడు పేజి 14


    ఇన్ స్పెక్టర్ కాస్తంత గర్వంగా ఫీలినట్టు కనబడ్డాడు. అతన్ని మరింత ఉబ్బేయటం కోసం వర్మ "ఈ పేపర్ వాళ్ళకి అసలు బుద్ధిలేదండి. ఎడిటోరియల్ చూడండి- మీ మామగాగారి గురించి ఎంత దారుణంగా వ్రాశాడో! ఆయన పరిధిలో ఆయన ప్రజాసేవ చేయదలుచుకుంటే వీళ్ళదేం పోయింది. చెప్పండి? ఈ ఎడిటర్లకి కుళ్ళు" అన్నాడు.

    ఇన్ స్పెక్టర్ బల్లమీదున్న పేపర్ తీసి అదేం పేపరో చూశాడు. "మీరు ఈ  ఎడిటర్ నే కదా తిడుతోంది?"

    "అవునండి. హేతువాదం పేరిట మరీ ఇంత దారుణంగా వ్రాస్తాడా? ఇడియట్" అన్నాడు కోపంగా.

    ఇన్ స్పెక్టర్ అతడివైపు క్రూరంగా చూసి, ఈ ఎడిటర్ మా బాబాయి. నాకు  పోలీసు ఉద్యోగం యిప్పించింది ఆయనే" అన్నాడు.

    వర్మకి టాయిలెట్ కెళ్ళి ఉరేసుకోవాలనిపించింది. అతికష్టంమీద తనని తాను సంబాళించుకున్నాడు. పోలీసులిద్దరూ తనవైపు క్రూరంగా చూస్తున్నట్టు అనిపించింది. కేవలం  ఇన్ స్పెక్టర్ పర్మిషన్  కోసమే ఆగినట్టు, ఆయన అనుమతి ఇవ్వగానే లాకప్ రూంలో  పడేసి కొట్టటానికి తయారవుతున్నట్టు కనిపించారు. మొహంమీద అతి ప్రయత్నం మీద చిరునవ్వు తెచ్చుకున్నాడు.

    "అసలు అందులో ఒక లాజిక్ వుందండి. ఈ దినపత్రిక చూడండి. ఇందులో వాస్తు సలహాలు, వారఫలాలు, తిథి వార నక్షత్రాలు -అన్నీ వుంటాయి. మరోవైపు ఒక మినిష్టర్ గారు యాగాలు చేస్తానంటే , దాన్ని ఖండిస్తూ ఒకవైపు ఎడిటోరియల్ ద్వారానూ, మరో వైపు భక్తుల్ని వారఫలాల ద్వారానూ ఆకర్షించటం కోసం వ్రాస్తారు. అలాగే ఈ యాగాలవల్లే వర్షాలు కురుస్తున్నాయని చెప్పి- అలా  యాగాలు చేయించిన మినిష్టర్లకి ఓట్లు వేస్తారు జనం. కాబట్టి ఎడిటర్లూ మేధావులే. మినిష్టర్లూ మేధావులే. మీ మామయ్యని, బాబాయిని ఇద్దర్నీ మేధావులుగా పొందగలిగిన మీరు నిజంగా ఎంతో గ్రేట్"

    ఇన్ స్పెక్టర్ ఈసారి చాలా సంతృప్తిగా నవ్వాడు. లేచి నిలబడి, హేట్ తీసుకుంటూ "వెరీగుడ్! చాలా బాగా చెప్పవోయ్. అన్నట్టు నేనెందుకోసం వచ్చాను?"

    "మహర్షి అనే ఖైదీ తప్పించుకున్నాడండి. అతన్ని వెతకటం కోసం మెరు వచ్చారు".

    "ఆ....కరెక్ట్, కరెక్ట్. అతడేమన్నా ఫోన్ చేస్తే మా పోలీస్ చేస్తే మా పోలీస్ స్టేషన్ లో చెప్పు నేను లేకపోయినా మా  సబ్- ఇన్ స్పెక్టర్ ఉంటాడు" అని అక్కడినుంచి పోలీసుల్ని తీసుకుని వెళ్ళిపోయాడు.

    వర్మ చాలాసేపు వాళ్ళు వెళ్ళినవేపే చూస్తూ నిలబడి విశ్వసించాడు. తరువాత తలుపేసి, టాయిలెట్ దగ్గరికెళ్ళి మూడుసార్లు కొడుతూ "వాళ్ళు వెళ్ళిపోయారు మహర్షీ! నువ్వు రావచ్చు" అన్నాడు.

    మహర్షి టాయ్ లెట్ లోంచి బయటికొస్తూ "ఏం జరిగింది? రకరకాల ప్రశ్నలు వేస్తూ ఇబ్బంది పెట్టారా?' అని అడిగాడు.

    "ఆ! దేశంలో వర్షాలు ఎందుకు కురవట్లేదు అనే విషయం మీద చాలాసేపు డిస్కస్ చేశాం" అంటూ జరిగిందంతా చెప్పాడు.

    మహర్షి తేలికగా ఊపిరి పీల్చుకుంటూ "మైగాడ్! ప్రమాదం కొద్దిలో తప్పిందన్నమాట" అన్నాడు.

    "నువ్వు రూపురేఖలు మార్చుకోకుండా ఇంత నిర్భయంగా ఎలా తిరుగుతున్నావో ఇప్పుడు నాకర్థమైంది" అన్నాడు వర్మ నవ్వుతూ.

    ఇద్దరూ ఫోన్ దగ్గరకొచ్చి మళ్ళీ దుబాయ్ నెంబర్ కోసం ప్రయత్నించారు.

    నెంబర్ కలవగానే "మేడమ్, నేను ఇండియా నుంచి మాట్లాడుతున్నాను. సుశీల గారు మీరేనా?" అన్నాడు తెలుగులో.

    "అవునండి" అట్నుంచి వినపడింది. మహర్షికి మళ్ళీ టెన్షన్ పెరగసాగింది. అప్పటిదాకా ఉన్న భయం వేరు. ఇప్పుడు పెరుగుతున్న టెన్షన్ వేరు.

    వర్మ ఇట్నుంచి ఫోన్ లో అడుగుతున్నాడు. "చూడండి మేడమ్! సిరిచందన అనే అమ్మాయి  మీ క్లాస్ మేట్  ఒకామె ఉండాలి. ఆ అమ్మాయి అడ్రస్ మీకేమైనా తెలుసా?"

    "మీరెవరు?"

    "మీరు చదివిన కాలేజీలో ఓల్డ్ బాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని.  మీ గురించి ఢిల్లీ కూడా ప్రయత్నించాం. మీరు దుబాయ్ లో ఉన్నారని నెంబరిచ్చారు. మీరు దొరికారు. వీలైతే మీరు ఫంక్షన్ కి రాగలరా? ఇన్విటేషన్ పంపిస్తాను."

    "రాలేనండి" అట్నుంచి వినపడింది.

    "మరి సిరిచందన......"

    "సిరిచందన అడ్రస్ కూడా నాకు తెలీదండి. ఆ అమ్మాయి ఆ ఊళ్ళోనే ఉండాలి."

    రిసీవర్ దగ్గరగా చెవి పెట్టి ఆ సంభాషణంతా వింటున్న మహర్షికి ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించింది. "వాళ్ళ నాన్న పెద్ద కలప వ్యాపారండి. ఆయన పేరు ఏదో వుండాలి. గుర్తు రావడంలేదు. బట్ ..... నాకు తెలుసు. ఆ ఊళ్ళోనే పెద్ద కలప మర్చంట్."

    "పేరేమైనా గుర్తు తెచ్చుకోగలరా?"

    "ఏదో చెప్పిందండి.అంత గుర్తులేదు. కానీ ఆ అమ్మాయికి అరకులో ఏదో గార్డెన్ కూడా వుంది. మూణ్ణేల్లకోసారి అక్కడి తల్లిదండ్రులతో కలసి వెళ్ళొస్తుండేది. అంతవరకూ గుర్తుంది."

    "థాంక్సండి! ఏదైనా పేరు గుర్తుకొస్తే మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. రేపు మళ్ళీ చేస్తాను" అని చెప్పి ఫోన్ పెట్టేశాడు వర్మ.

    మహర్షి అన్ని ఆశలు కోల్పోయినవాడిలా కూర్చుండి పోయాడు.

    వర్మకి అతన్ని చూస్తే జాలేసి అన్నాడు ఓదారుస్తున్నట్టు- "కొంతలో కొంత నయంగా మహర్షీ! కనీసం ఆ అమ్మాయి తండ్రికి కలపవ్యాపారం ఉందని, అరకులో గార్డెన్స్ ఉన్నాయని తెలిసింది. ఆ  రకంగా ప్రయత్నిద్దాం."

    "ఏరకంగా?" అడిగాడు మహర్షి. "ఈ ఉళ్ళో ఉన్న పెద్ద కలప వ్యాపారస్తుల నెంబరు, టెలిఫోన్ డైరెక్టరీలో మళ్ళీ ట్రైచేద్దాం. సిరిచందన ఎక్కడున్నా దొరక్కపోదు."

    "నువ్వా పని చెయ్యి. నేనీలోపు అరకు వెళతాను."

    వర్మ ఆశ్చర్యంగా "అరకా? అరకు దేనికి?" అని అడిగాడు.

    "అక్కడ ఎవరన్నా కలపవ్యాపారస్తుల తాలూకు తోటలున్నాయేమో కనుక్కుంటాను. ఇంత పెద్ద ఊళ్ళో ఎంక్వైరీ చేయడం కన్నా అలాంటి వూర్లో ఎంక్వయిరీ చేస్తే దొరకటం సులభం."

    "అరకులో ఎక్కడుంటావ్?"

    మహర్షి టేబిల్ మీద వున్న దినపత్రికలో చిన్న ప్రకటన చూపించాడు. అందులో-

    'WANTED

    అరకులో హౌస్ కీపర్ గా పని చేయుటకు ఒక అసిస్టెంట్ కావలెను. ఉత్సాహవంతులైన యువకులు కావలెను. సంప్రదించండి....."

    అని వుంది.

    "రేప్రోద్దున్నే ఈ ఆఫీసుకి వెళ్ళి ఉద్యోగం గురించే ప్రయత్నిస్తాను" అన్నాడు మహర్షి.

    వర్మ ఏం మాట్లాడలేదు. మౌనంగా వుండిపోయాడు. అతని మౌనాన్ని చూసి మహర్షి అడిగాడు. "రేప్రోద్దున్న ఉరికంబం ఎక్కవలసిన వ్యక్తి. ఇలా ఉద్యోగాలంటూ ఆఫీసుల వెంట తిరగటం చూస్తుంటే నీకు నవ్వొస్తుంది కదూ?"

    "లేదు. లేదు. ఏదో  ఒక ప్రయత్నం చేయకుండా మనపని జరగదు కదా! నువ్వు చెప్పినట్లే అరకు వెళ్ళు. నేనిక్కడ ప్రయత్నస్తాను. విష్ యూ బెస్టాఫ్ లక్!' అన్నాడు వర్మ.

    మహర్షి అక్కడినుంచి కదిలాడు.

    మహర్షి పేపర్లో చూసిన ఆ ప్రకటన రావటానికి కారణమైన సంఘటను కొద్దిరోజుల క్రితమే జరిగింది.



                                                     6


    నమస్కారం!

    చేతిలో దినపత్రికను ప్రక్కనే పెడుతూ తలెత్తి చూసాడు విష్ణువర్ధనరావు. నుదుటిమీద బొట్టు, పంచాంగం, పట్టెనామాలు చూడగానే "నమస్కారం సిద్ధాంతిగారూ, కూర్చోండి" అంటూ ఎదురుగా నున్న సోఫా చూపించాడు.

    "ఈ రోజు మంచిరోజు. లగ్నపత్రిక వ్రాసుకొని తీసుకువచ్చాను" అంటూ పంచాంగం సంచిలోంచి సిరిచందన- రవితేజల లగ్నపత్రిక బయటకు తీసాడు సిద్ధాంతి.

    విష్ణువర్ధనరావు సోఫాలో వెనక్కివాలి సిద్ధాంతివైపు చూస్తూ "క్షమించండి ఆ సంబంధం మేం చేసుకోవటంలేదు" అన్నాడు.

    ఆ మాటలకు సిద్ధాంతి అయోమయంగా "ఏమిటి మీరంటున్నది?" అది ప్రశ్నించాడు.

    "అవును. నిజమే.... " ఆగాడు విష్ణువర్ధనరావు. ".......రవితేజ ఆ బిల్డింగ్ మీదనుంచి పడి శాశ్వతంగా గుడ్డివాడైపోయాడు. ఇంక ఈ పెళ్ళి ఎలా చేస్తాం?" అతడి గొంతు బాధతో పూడుకుపోయింది.

    "అయ్యో! అలాగా!" అంటూ జాలిగా చూసాడు సిద్ధాంతి. తరువాత ఏం మాట్లాడాలో తోచలేదు. కొంచెంసేపు మౌనంగా కూర్చొని "ఇంక నేను వెళ్ళొస్తానండి" అంటూ లగ్నపత్రిక పంచాంగంలో పెట్టుకొని, నమస్కారం చేసి అక్కడినుండి వెళ్ళబోయాడు. విష్ణువర్ధనరావు గాఢంగా విశ్వసించి తిరిగి దినపత్రిక చేతుల్లోకి తీసుకోబోతుంటే మేడమీంచి సిరిచందన మెట్లు దిగి వచ్చింది. విష్ణువర్ధనరావు ఆమెవైపు పరిశీలనగా చూసాడు. రెండు రోజుల్లోనే ఎంతో వాడిపోయినట్లుంది ఆమె మొహం!

    "డాడీ....." అంది ఎదురుగా కూర్చుంటూ. ఆమెలో ఏదో చెప్పాలన్న భావం అస్పష్టంగా కనబడుతూంది. విష్ణువర్ధనరావు కూతురివైపు ప్రశ్నార్థకంగా చూసాడు. తను ప్రారంభించాలనుకున్న విషయానికి లీడ్ చేస్తున్నాట్లుగా "సిద్ధాంతిగార్ని ఎందుకు పంపిచేసారు?" అని అడిగింది.

    "ఇప్పుడే పెళ్ళెందుకని?"

    "అంటే తేజాతో నా పెళ్ళి జరగడా డాడీ?"

    విష్ణువర్ధనరావు మొహంలో ఈసారి ఆశ్చర్యం కనబడింది. కూతురు ఏం చెప్పాలనుకుంటుందో తెలీని సందిగ్ధంతో "ఒక గుడ్డివాడికి నిన్నిచ్చి ఎలా పెళ్ళి చేస్తాననుకుంటున్నావమ్మా" అన్నాడు. ఆమె కొంచెంసేపు తలవంచుకుని తన చేతిగోళ్ళవైపు చూస్తూ మౌనంగా వుండిపోయింది. తరువాత నెమ్మదిగా తలెత్తి "నిజం తెలిస్తే మీరిలా మాట్లాడరు డాడీ" అంది.

    "ఏమిటమ్మా నువ్వనెది?"

    "అవును డాడీ. ఆ రోజు..... అంటే పెళ్ళిచూపులయిన రోజు రాత్రి తేజాని హొటల్ కి పంపింది నేనే."

    ఆయన భృకుటి ముడిపడింది. కళ్ళు చిట్లిస్తూ "ఏమిటీ?" అన్నాడు. "రూమ్ నెంబర్ మూడువందల మూడుకి వెళ్ళమని మగగొంతుతో నేనే ఫోన్ చేసాను డాడీ."

    "ఎందుకు?" ఆయన నోటినుంచి బుల్లెట్ లా వచ్చిందా ప్రశ్న.

    సిరిచందన తల మరింత క్రిందకు దిగిపోయింది. ఆమె మొహంలో అది సిగ్గో బాధో స్పష్టంగా తెలియటం లేదు. "కాబోయే భార్యమీద అతనికి యెంత నమ్మకముందో, ఎంత ప్రేముందో తెలుసుకోవాలని సరదాగా నేనే ఫోన్ చేశాను అయితే యాదృచ్చికంగా ఆ రూమ్ లో స్మగ్లర్స్ గ్యాంగ్ వుంటుందని, అది ఇంత విషాదానికి దారి తీస్తుందని నేను కల్లోకూడా ఊహించలేదు." 

 Previous Page Next Page