Previous Page Next Page 
పర్ణశాల పేజి 13


    "దిగాల్సిన వూరేదో నిర్ణయించేది మనం కాదు" చైతన్య దిగుతూ అన్నాడు. కాంతి కూడా దిగక తప్పలేదు.

    రైలు నెమ్మదిగా కదిలి చీకట్లో అదృశ్యమయింది. ఫ్లాట్ ఫారమంతా నిర్మానుష్యంగా వుంది. చుట్టూ చూసేడు. చిన్న దీపం మినుక్కు మినుక్కు మంటూ  వెలుగుతోంది. స్టేషన్ మాస్టరు దీపం పట్టుకుని వెళ్ళిపోయేడు.

    దూరంగా ఏదో పిట్ట వికృతంగా అరుస్తోంది. స్టేషన్ బయట పెద్ద పెద్ద చెట్లు జట్టు విరబోసుకున్న దయ్యాల్లా ఉన్నాయి.

    చైతన్య స్టేషన్ మాస్టార్ గదివేపు నడిచేడు. తలుపులువేసి వున్నాయి. లోపల్నుంచి గురక వినిపిస్తోంది. వెనుదిరిగి భార్య దగ్గరకు వచ్చేడు. ఇద్దరూ స్టేషన్ నుంచి బయటకు వచ్చేరు.

    సన్నగా తుంపర పడుతూంది.

    నిజానికి వూరు  కాదు. కొండగుహలోంచి రైలు వెళ్ళవలసి రావటంవల్ల అక్కడ హాల్టు పెట్టేరు. అదంతా చిట్టడవి, వరుసగా కొండలు. చిన్న పల్లె అక్కడికి నాలుగు మైళ్ళ దూరంలో వుంది.

    వర్షానికి నేలంతా చిత్తడిగా వుంది.

    స్టేషన్ బయట పది అడుగుల దూరంనుంచే దట్టమైన చెట్లు ప్రారంభమయ్యాయి. నీళ్ళగుంట దగ్గర్నుంచీ వినబడే కప్పల బెకబెకల శబ్దంతో కీచురాళ్ళ శబ్దం కలసి గగుర్పాటు కలిగిస్తూంది. చైతన్య చుట్టూ చూసేడు.

    ప్రకృతి మనిషిని సవాల్ చేస్తున్నట్టు వుంది.

    చెట్ల మధ్య  నుంచి కాలిబాట లేనట్లు వుంది. ఆ సమయంలో బయట అడుగు పెట్టటం అంత మంచిది కాదనుకున్నాడు. స్టేషన్  మాస్టరు గది పక్కనే క్రిందకు వంగిన రేకుల క్రింద కూర్చునే  చోటు దొరికింది భార్యా చేతుల్లోని కొడుకుని తీసుకుంటూ "నువ్వు కొంచెంసేపు పడుకో కాంతీ" అన్నాడు.

    కాంతిమతి చేతి సంచిలోంచి చీరతీసి  పక్కగా వేసింది. పడుకున్న రెండు నిముషాల్లో గాఢనిద్రలో  మునిగిపోయింది.

    బాబు శరీరం కొద్దిగా వెచ్చగా  వున్నట్లు తోచింది, అతనికి; బైట చలిగాలికి అని సరిపెట్టుకున్నాడు. కాలం నెమ్మదిగా ముందుకు సాగుతోంది. డబ్బులేనివాడికి వచ్చే మలేరియా జ్వరంలా ఆగి ఆగి తగ్గకుండా కురుస్తోంది వర్షం.

    అతనికి నిద్ర రావటం లేదు. గోడకు ఆనుకుని చీకట్లో చూస్తూ కూర్చున్నాడు. దూరంగా ఎక్కడో గట్టిగా వురిమింది. ఆ శబ్దానికి మేల్కొని ఏడవసాగాడు బాబు.

    కాంతి ఇట్నుంచి అటు వత్తిగిల్లుతూ "ఫ్రిజ్ లో కాడ్ బరీస్ వుంది. కొద్దిగా  పెట్టు" అంది నిద్రలోనే. అతనికి తెరలు తెరలుగా నవ్వు వచ్చింది. బాబును వళ్ళోంచి తీసి, భుజంమీద వేసుకుని జోకొట్టసాగేడు. అతడికి ఇప్పటివరకూ జరిగిందంతా కలకాదని, నిజమేనని నమ్మకం ఇప్పుడిప్పుడే కలుగుతోంది.

    తూర్పున వెలుగురేఖలు నెమ్మదిగా విచ్చుకుంటూ వుండగా కాంతి లేచింది. క్షణం ఆమెకు ఏమీ అర్థంకాలేదు. చైతన్య భార్యవేపు చూసి నవ్వేడు.

    ఆమె నవ్వలేదు. అతడివేపే పరిశీలనగా చూస్తూ "మీరెలా వున్నారో తెలుసా?" అంది.

    అతడు నవ్వుతూనే "ఎలా వున్నాను" అన్నాడు.

    "పదిరోజులు సముద్రం మీద పనిచేసి వచ్చిన బెస్తవాడిలా...."

    బాబును ఆమెకు  అందిస్తూ, "ముందు ముందు ఆ పనే చెయ్యాలేమో" అన్నాడు. ఆమెకు ఈ పరిహాసాన్ని ఆనందించే స్థితిలో లేదు. భర్త చేసిన  అనౌచిత్యపు పని తాలూకు ఫలితాలు ఒక్కొక్కటే కనబడుతూన్న కొద్దీ ఆమెకు  కోపం, విసుగూ ఎక్కువ అవసాగేయి. దానికితోడు అంధకారమైన భవిష్యత్తు.

    చైతన్య చెట్టునుంచి పుల్లవిరిచి "అదే బ్రష్ ..... పేస్ట్ లేదు, సారీ" అన్నాడు.

    అతడు ఈ పరిస్థితిని తేలిగ్గా తీసుకోవటానికి మానసికంగా తయారవుతూ, ఆమెని తయారు చేస్తున్నాడు. దూరంగా వెళుతున్నాడు. ప్లాట్ ప్లారం అంతా ఖాళీగా వుంది.

    బాబు లేచి గుక్కపెట్టి ఏడవసాగేడు. చైతన్య చప్పున అటు వెళ్ళి కొడుకుని చేతిలోకి తీసుకున్నాడు. బాబు ఆపకుండా ఏడుస్తూనే వున్నాడు. అతడికి పిల్లల్ని ఓదార్చటం తెలీదు.

    భార్యవేపు నిస్సహాయంగా చూస్తూ "ఏం కావాలట వీడికి....." అన్నాడు.

    ఆమె నెమ్మదిగా  జవాబిచ్చింది..... "పాలు"

    అతడికేం చెయ్యాలో తోచలేదు. "ఎలా యిప్పుడు?" అన్నాడు.

    ఆమె మాట్లాడలేదు. బాబుని ఎత్తుకుని లాలిస్తూ స్టేషను బయటకు వచ్చేడు.

    స్టేషన్ కి వంద గజాల దూరంలో చిన్నపాక కనిపించింది. అటువేపు వెళ్ళాడు. కొంచెం దగ్గరగా వెళ్ళేసరికి అదో చిన్నటీ బడ్డీలా కనిపించింది. ప్రాణం  లేచొచ్చింది. ఆ నిర్మానుష్యమైన అడవిలో ఆ మాత్రమైనా కనిపించినందుకు సంతోషించాడు.

    బల్లమీద నలభై ఏళ్ళవాడు నిలబడి 'టీ' కలుపుతున్నాడు.

    సాధారణంగా అక్కడి అమ్మకం ఏదీ జరగదు. స్టేషన్ లో దిగేవాళ్ళు కూడా ఎవరూ వుండరు. అడవిలో వున్న నాలుగయిదు పల్లెలకు  రైల్లో ప్రయాణం చేసే వాళ్ళెవరూ రారు. అంత ప్రొద్దునే తన బడ్డీ దగ్గరకు వచ్చిన వాళ్ళను చూసి వాడు  వుత్సాహంతో "రండి. బన్ వుంది, వేడి టీ వుంది" అని ఆహ్వానించేడు.

    నిజానికి చైతన్య అంతక్రితం రోజు మధ్యాహ్నం నుంచీ ఏమీ తినలేదు. అయినా తమ దగ్గిర డబ్బులేదన్న విషయం మర్చిపోలేదు అతడు. అందుకనే అతి నెమ్మదైన స్వరంతో "కొంచెం పాలు కావాలి బాబుకి....." అన్నాడు.

    వాడు గ్లాసుతో పొయ్యి మీదున్న పాలు గరిటతో తీసి యింకో గ్లాసులో పోస్తూ "పాలైతే ఇరవై పైసలు " అన్నాడు.

    చైతన్య తల సిగ్గుతో క్రిందకు వంగిపోయింది.

    "చూడు బాబూ, మా దగ్గర డబ్బు లేదు" అన్నాడు అభ్యర్థిస్తున్నట్లు.

    చప్పున చేతిని వెనక్కు తీసుకుని- ఏమిటి.... అరువు బేరమా......ప్రొద్దునే...." అన్నాడు విసుగుతో.

    చైతన్య మాట్లాడలేదు.

    కాంతిమతి ప్రేక్షకురాల్లా చూస్తూంది.

    బడ్డీవాడు ఏదో పని వున్నట్లు వెనక్కి తిరిగి నిమిషంపాటు సీసాలు  సర్ది మళ్ళీ తిరిగి ఇంకా  వాళ్ళక్కడే వుండటం చూసి, మొహం చిట్లించి "వెళ్ళండయ్యా" అన్నాడు.

    చైతన్య తటపటాయిస్తూ "బాబు ఏడుస్తున్నాడు" అన్నాడు.

    అర్థంలేని ఈ సమర్థనం వాడు విచిత్రంగా చూసి, "అయితే నన్నేం చెయ్యమంటావయ్యా? బోణీబేరం అరువు పెట్టమంటావా? ఇక ఈ రోజు నేను పస్తుండాల్సిందే" అన్నాడు.

    బోణీ అనగానే చైతన్యకి తన బిజినెస్ గుర్తుకొచ్చింది. ఉగాది రోజున ప్రతి సంవత్సరమూ లక్ష రూపాయలకి తక్కువ కాకుండా ఓ కాంట్రాక్టు మీద సంతకం చేయడం అతనికలవాటు.

    బిజినెస్ లో "సెంటిమెంటు" విలువ తెలిసిన చైతన్య తన కొడుకు క్షుద్బాధ తీర్చటం కోసం బడ్డీవాడిని అరువుమీద పాలడగలేకపోయాడు,

    బాబు ఏడుపు ఎక్కవయింది. ఆమె చేతులమధ్య ఆగకుండా ఏడుస్తున్నాడు. అతణ్ణి సముదాయించటం కోసం అటూ యిటూ వూగుతోంది.

    "ఎంత గ్లాసు పాలు?" అడిగేడు.

    "ఇరవై పైసలు......"

    "గ్లాసు పాలియ్యి. రెండు బన్ లు యిచ్చి రెండు కప్పుల టీ కూడా చెయ్యి."

    "డబ్బూ...." అనుమానంగా చూస్తూ అడిగాడు.

    "ఏం? డబ్బు చూపించకపోతే పాలు ఇవ్వావా?"

    ఆ కంఠంలో కనబడిన ఆజ్ఞ అతడిని కట్టిపడేసింది. చప్పున గ్లాసెడు పాలు అందించేడు.

    బాబు ఆత్రంగా తాగసాగేడు.

    ఖాళీ గ్లాసు బడ్డీవాడికి అందించి, బాబు మొహం పైటచెంగుతో తుడుస్తున్న భార్యతో చైతన్య నెమ్మదిగా స్ఫుటంగా అన్నాడు.

    "నీ మంగళసూత్రం యివ్వు కాంతీ పాల ఖరీదుగా"

    మిన్ను విరిగి మీదపడ్డట్టు చలించిపోయిందామె. చివ్వున తలెత్తి ఏదో అనబోయింది. చైతన్య ఆమెనే చూస్తున్నాడు. ఆ కళ్ళలో యేదో శక్తి..... ఆజ్ఞాపించే "ఇదేమిటీ?" అన్నాడు కంగారుగా.

    "అదే మా దగ్గరున్న డబ్బు....."

    భార్యతో సహా వెనుదిరుగుతూ - "ఆ రోజు తిరుపతిలో దేవుడుకిచ్చిన నిలువు దోపిడీలో మిగిలిన మంగళసూత్రాలు ఈ రోజు 'మన' దేవుడిని రక్షించుకోవటం కోసం  ఇచ్చే వినిపించింది. ఆగి ఏమిటన్నట్లు చూసేడు.

    "నేనూ మాడిసినేనయ్యా. ఈ సూత్రాలు తీసుకొని ఆడదాని ఉసురు పోసుకోమంటావా?"

    "నీ బోణీ పాడుచెయ్యటం నాకిష్టం లేదు."

    "బోణీ లేకుంటే పీడాబోయె....."

    "నీకు రుణపడటం నాకూ ఇష్టంలేదు."

    "సాల్లేవయ్యా పెద్ద చెప్పొచ్చావ్ - నాకూ పెళ్ళాం పిల్లలున్నారు. గ్లాసుడు పాలకోసం సూత్రాల్ని తీసుకోమంటావా?"

    "సూత్రాలు తప్ప ఇంకేమీ లేవు మరి?"

    ఇద్దరిలో పట్టుదలకి ఎవరూ తక్కువ కాదు.

    "పద కాంతీ...." అన్నాడు చైతన్య.

    పది అడుగులు నడిచేరు. మళ్ళీ వెనుకనుంచి ఆగమని పిలుపు.

    బడ్డీవాడు గల్లాపెట్టె తెరచి, మొత్తం చిల్లర అంతా పైకి తీసేడు.

    వాటిని పట్టుకొని పరిగెత్తుతూ వీళ్ళ దగ్గరకు వచ్చేడు.

    రెండు అయిదు రూపాయల నోట్లు. నలిగిన పాత పది రూపాయల నోటొకటీ  మిగిలిన చిల్లర అంతా చైతన్య చేతిలో పోసేడు.

    ఆశ్చర్యంగా చూసేడు చైతన్య.

    "గ్లాసుడు పాలిచ్చి ఆడదాని సూత్రాలు దోచుకున్నాడన్న చెడ్డపేరు నాకెందుకు లేవయ్యా, అంతే వున్నాయి డబ్బులు. తీసి కెళ్ళు....."

    చైతన్య అతడి మాటలోని నిజాయితీకి కదిలిపోయాడు. కళ్ళల్లో సన్నటి నీటిపోర. అక్కణ్ణుంచి సాగిపోతూ భార్యతో అన్నాడు,  వ్యాపారంలో పడి బయట ప్రపంచం గురించే తెలుసుకోలేదు సుమీ ఇన్నాళ్ళూ....."

    "అంటే?"

    "సాటి మనిషి అవసరంమీద ఆడుకోకుండా  బ్రతికున్న నిజాయితీ ఇంకా మనుష్యులలో వుందన్నమాట."


                             *    *    *

    "నిజాయితీ?" సేఠ్ చమన్ లాల్ అన్నాడు. "నిజాయితీ ఏమిటి సాబ్. అట్లా అస్థంతా వదిలేసి రాత్రికి రాత్రి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది! కొంతకాలం ఆగమంటే ఆగమా మేము? తరువాత తనే నిలదొక్కుకునేవాడు కాదా ఏమిటి?"

    రవి అవునన్నట్లు తలూపేడు. డ్రాయింగ్ రూములో సేఠ్లందరూ కూర్చున్నారు.

    చమన్ లాల్ మాట వింటుంటే అన్నయ్య ఎంత తప్పు చేశాడో అనిపిస్తోంది రవికి. అతడికి తెలీదు తన ముందు కూర్చున్నవన్నీ తాచుపాములని. అందులో ఒక పాము ఇల్లంతా పరీక్ష చేస్తోంది, ఇంకో పాము మొత్తం అప్పిచ్చిన వాళ్ళ లిస్టునీ, ఆస్థుల విలువల్ని లెక్కచూసి రూపాయికి ఎంత వస్తుందో అంచనా వేస్తోంది.  అనుమానం ఎక్కువ వున్న పాము ఆ రాత్రి చైతన్య తనతో ఎంత తీసుకుపోయాడో అని అనుమానపడుతోంది.

 Previous Page Next Page