వెనక్కి తిరిగేడు. అతడి ముఖంలో ఏదో రిలీఫ్ కనబడుతోంది. ఒక నిర్ణయానికి వచ్చేసిన రిలీఫ్! ఏమీ మిగలలేదని తెలిసిన తరువాత రిలీఫ్.
"అందుకే వెళ్ళిపోదాం కాంతీ! పూలమ్మినచోట కట్టెలమ్మలేను. ఇన్సాల్వెన్సీ పెట్టినా కొంత డబ్బు మిగలవచ్చు మనకి. కాని కేవలం నా మీద నమ్మకంతో నాకపిచ్చిన వాళ్ళని నేను ద్రోహం చెయ్యలేను. నా ఆఖరి పైసాకూడా వాళ్ళని వుంచుకోని. నా దురదృష్టానికి వాళ్ళు ఎందుకు బాధ్యులు కావాలి? ఈ వార్త దావానలంలా వ్యాపించకముందే మనం ఇక్కడినుంచి వెళ్ళిపోవాలి.... పద....."
ఆమెకి కొద్దికొద్దిగా ఏదో అర్థమయింది. కానీ అది కోదా అస్పష్టంగానే వుండటంతో "అసలేం జరిగిందండీ" అని అడిగింది. అతడు జరిగిందంతా చెప్పేడు. రంగయ్య మరణం గురించి ఆమెకి రాత్రే తెలిసింది. కానీ, ఆ మరణం తన జీవితగతినే మార్చేస్తుందని ఆమె వూహించలేదు. అంతా పూర్తిగా అర్థమయ్యేసరికి ఆమె కాళ్ళూ చేతులు ఆడలేదు. అసలు తను విన్నదంతా కలా. నిజమా అన్న భ్రాంతిలో పడిపోయింది.
ఆమె తెప్పరిల్లి పక్కకి తిరిగేసరికి చైతన్య బాబుని ఎత్తుకొని భుజాన వేసుకున్నాడు. ఆమె చప్పున అతడి చేయి పట్టుకుని "ఈ అర్థరాత్రి పూటా?" అంది.
"రేప్రోద్దున అయినా కట్టుబట్టలతో యిలా వెళ్ళిపోవలసిన వాళ్ళమేగా కాంతీ!"
ఆమె దుఃఖం కట్టలు తెంచుకునేలా వుంది. ఆ అర్థరాత్రి పూట ఆమెకు నిద్రాభంగం కలిగించిన ఇంత పెద్ద చేదునిజాన్ని ఆమె అంత తొందరగా జీర్ణించుకోలేకపోతోంది. ఎండకన్నెరగని బాబు, కష్టం అంటే ఏమిటో తెలియని తను- నలుగురికీ ఆజ్ఞలిచ్చి పనిచేయించగల భర్త- ఎక్కడికి వెళతారు? ఈ అర్థరాత్రి తుఫానులో ఏ నీడని నమ్ముకొని బయటకు అడుగు పెడతారు?
అతణ్ణి వారించుతూ , "ఏమయితే అదవుతుంది. ఇక్కడే వుండి పోదామండీ" అంది అభ్యర్ధనగా.
చైతన్య భార్యవైపు సూటిగా చూసేడు. అతడి కళ్ళలో ఏదో చిత్రమైన భావం అరక్షణంపాటు లీలగా కదిలింది. "నువ్వు ......నువ్వు నా మాటకి ఎదురు చెప్పటం ఇదే మొదటిసారి కదూ?" అన్నాడు.
ఆమె దెబ్బతిన్నట్లు చూసి తలవంచుకొని, బలహీనమైన స్వరంతో "అబ్బే.....లేదండీ.....ఎదురు చెప్పటం కాదు..... మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి" అంది.
అన్నాక లోపలికెళ్ళి అరనిముషంలో బయటికి వచ్చి, "పదండి" అంది. అతడు అప్పటికే బాబును ఎత్తుకుని వున్నాడు. ఇద్దరూ బయటికొచ్చేరు.
అతడు ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా ఆగేడు. చేతికున్న రిస్టువాచీ తీసి భార్యకిస్తూ "లోపల పెట్టేసిరా కాంతీ. మనకి అప్పచ్చినవాడికి ఓ వంద ఎక్కువొచ్చినా సంతోషమే" అన్నాడు. ఆమె లోపలికి వెళ్ళి పెట్టేసి వచ్చింది.
ఇద్దరూ మెట్లు దిగేరు.
డ్రాయింగ్ రూమ్ నిశ్శబ్దంగా వుంది.
తలుపు చప్పుడు కాకుండా బయటకొచ్చేరు.
దారికి ఇరువేపులా వున్న మొక్కలు జాలిగా వీడ్కోలు చెబుతున్నట్లుగా వూగుతున్నాయి.
కాంతిమతి నోట్లో పైటచెంగు దోపుకొని ఏడుపు ఆపుకొంటూ, భర్త వెనుకే నెమ్మదిగా నడుస్తోంది. చైతన్య భుజం మీద బాబు- జరుగుతున్న డానికి సంబంధం లేనట్టు నిద్రపోతున్నాడు. దూరంగా మెరుస్తోంది. గాలికి ఆకులు కదిలినప్పుడల్లా అశోకవృక్షం మీదనుంచి నీటిచుక్కలు పడి శబ్దం అవుతోంది. దూరపు స్ట్రీట్ లైట్ల కాంతిలో ఆ భవనపు గోడలమీద నిల్చిన వర్షపు నీటి మరకలు, ఏడ్చి ఏడ్చి సోమ్మసిల్లిన చెక్కిళ్ళ మీద ఆరిన కన్నీటిచారల్లా వున్నాయి.
తాము పెంచిన గులాబీల్నీ, తానంతట పెరిగిన నిద్రగన్నేరునీ దాటేరు. నిర్మించుకున్న హర్మ్యల్ని వదిలి, పర్ణశాల నిర్మించుకోవడం కోసం అతడు పయనిస్తున్నాడు.
రోడ్డుకి ఇరువేపులా పాతిన సున్నపురాళ్ళు- శవం వెళుతున్నప్పుడు నిలబడ్డ సైనికుల్లా వున్నాయి.
ఆగి ఆఖరుసారిగా తన భవంతిని చూసుకున్నాడతడు. చిక్కటి చీకట్లో శిథిలమైన కోటలా నిశ్శబ్దంగా వుందది. యుద్ధంలో సామ్రాజ్యం కోల్పోయి తమని వీడి వెళ్ళిపోతున్న రాజును చూసి ముక్తకంఠంతో ఆర్తగీతం ఆలపిస్తున్న ప్రజల్లా చెట్లు తలలూపుతున్నాయి.
అతడు చప్పున వెనుదిరిగి, మళ్ళీ తన ప్రయాణం కొనసాగించేడు. కొడుకు భుజం మీద ఉన్నాడు- భార్య అనుసరిస్తూంది.
చీకటి నెమ్మదిగా వాళ్ళని తనలో కలిపేసుకొంది.
8
ఆరున్నర అయింది.
కిచెన్ లో కాఫీనీళ్ళు మరుగుతున్న శబ్దం వినిపిస్తూంది. మేడ మీద అలికిడిలేదు.
కౌసల్య ఇక వుండబట్టలేక మేడమీదకు వెళ్ళింది. తలుపులు బార్లా తెరిచి వున్నాయి. ఎక్కడి సామాన్లు అక్కడే వున్నాయి. మనుష్యుల జాడ మాత్రం లేదు. కంగారుగా క్రిందకి దిగివచ్చి రవికి చెప్పింది.
రవి మొదటిసారి నమ్మలేదు కానీ స్వయంగా చూసేక అతడికి నమ్మక తప్పలేదు. అసలేం జరిగిందో అర్థంకాలేదు.
అంతలో గూర్ఖా వచ్చి రాత్రి వాళ్ళు బయటికి వెళ్ళిన సంగతి చెప్పేడు.
దాంతో అందరిలోనూ కలవరం మొదలయింది. అంత అర్థరాత్రి ఎవరినీ లేపకుండా, ఎవరికీ చెప్పకుండా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అసలెక్కడికి వెళ్ళినట్లు?
ఆ రోజు ప్రొద్దున్నే రంగయ్య అంత్యక్రియలు. దానికి కూడా హాజరవడా అన్నయ్య?
అన్ని ప్రశ్నలకీ సమాధానం అరగంట తర్వాత తెలిసింది అతడికి-
దాదాపు పదిహేను లక్షల విలువగల స్టాకు పూర్తిగా నాశనమైపోయిందనీ లక్షాధికారయిన అన్నయ్య ఒక్క రాత్రిలో కట్టుబట్టలతో బయటకు వెళ్ళవలసిన స్థితి ఏర్పడిందనీ-
వణికిపోయేడు. ఇంత చేదు నగ్నసత్యాన్ని జీవితంలో ఎప్పుడూ ఎదుక్\ర్కోలేదతడు. అన్నయ్య పరచిన గొడుగులోనే పెరిగి పెద్దవాడయ్యేడు ఇప్పట వరకూ.
ఇప్పుడేం చెయ్యాలో తోచలేదు. ఆస్థి లాక్కుపోవటానికి అందరూ వస్తారని అతడికి తెలుసు.
అయినా ఏమైతే అదవుతుందని ఓ నిశ్చయానికి వచ్చేడు. అంతవరకూ వస్తే అప్పుడు చూసుకొందామానుకున్నాడు. ఈ లోపులో అన్నయ్యని వెదకాలి. డబ్బూ. ఆస్థీ లేకపోయినా అన్నయ్య తోడుగా ఉంటే అదో ధైర్యం అయినా వున్న ఈ ఒక్క ఆధారాన్నీ వదిలేసి వెళ్ళిపోతే ఎలా? ఎక్కడ తలదాచుకొనేది? ఎప్పుడో పోయేదాన్ని ఇప్పుడే వదులుకోవటం దేనికి? అంతవరకూ వచ్చేకే చూసుకొందాం.
రవి తీసుకున్న ఈ నిర్ణయం అతి కొద్దిరోజుల్లోనే గొప్ప ఫలితాన్నిచ్చింది.
* * *
చీకటిలో రైలు దూసుకుపోతోంది.
కంపార్టుమెంట్ జనంతో కిక్కిరిసి వుంది. కదలటానికి కూడా చోటులేదు. లావేట్రీ ప్రక్క జనం నడిచేదారిలో ఓ మూల ఒదిగి కూర్చున్నాడు చైతన్య. అతడి ఒడిలో బాబు నిద్రపోతున్నాడు. కాంతి అతడి భుజంమీద వాలి పడుకుంది.
అతడికి నిద్రరావడంలేదు. ముడుచుకొని కూర్చోవడంవల్ల మోకాళ్ళ దగ్గర నొప్పిగా వుంది. అతడికి కొద్దిదూరంలో ఓ రైతు కూర్చుని చుట్ట కాలుస్తున్నాడు. ఆ పొగకి అతడి కడుపులో తిప్పుతోంది. ఇంకో ప్రక్క ఓ కూరగాయలమ్మి తట్టలు పేర్చి కూర్చుంది.
కంపార్టుమెంటులోంచి లోపలికిగానీ బయటికి గానీ వెళ్ళటానికి దారిలేదు.
సీట్లమీద కూర్చున్నవారు నిద్రలోకి జారుకున్నారు.
రైలు మాత్రం ముందుకు సాగిపోతూనే వుంది.
కొద్ది దూరంలో కలకలం వినిపించితే చూచేడు చైతన్య. టిక్కెట్ కలెక్టర్ చెకింగ్ చేసుకొంటూ వస్తున్నాడు.
"టిక్కెట్ ప్లీజ్!"
చైతన్య తన సహజ స్వరంతో "లేదు" అన్నాడు. ఆ కంఠంలో కనబడిన 'కమేండ్' టికెట్ కలెక్టర్ కి ఒళ్ళు మండించింది.
అతడి భుజాన్ని నొక్కిపెట్టి "ఎంత ధీమాగా చెబుతున్నావురా లేదని? అడుగుతున్నది నీ నౌఖరు అనుకున్నావా?" అంటూ విసురుగా తోసేడు. చైతన్య వెనక్కిపడి తల తలుపుకు కొట్టుకుంది. విసురుగా లేస్తూ "యూ బాస్టర్డ్....." అనబోయేడు. కానీ ఆ మాట బయటికి రాలేదు. దానికిముందే- "దొంగ నాయాళ్ళందరూ టిక్కెట్ లేకుండా ఎక్కబట్టే మాలాంటివొళ్ళకి కూసునేటందుకు చోటు దొరకటంలేదు" అంది ఓ కూరగాయలమ్మి.
అతడు సిగ్గుతో కుదించుకుపోయాడు.
ఎవరికయినా ఆ అభిప్రాయం కలగటంలో తప్పులేదు. అతడి బట్టలు రష్ లో ఎక్కడంవల్ల చిరిగేయి. గెడ్డం మాసివుంది. రైలు మసికి చొక్కా నల్లగా మారి వికృతంగా తయారయింది. నిద్ర లేమివల్ల కళ్ళు ఎర్రగా వున్నాయి.
"పక్క స్టేషన్ లో దిగిపోవాలి తెలిసిందా?' అంటూ టికెట్ కలెక్టర్ ముందుకు సాగిపోయేడు. మొహంలో ఏ భావమూ లేకుండా చైతన్య కూర్చుని వున్నాడు.
అతడికిది మొదటి దెబ్బ. అంతస్తు మారిన విషయం అతడికి మొదటి అనుభవాన్ని ఇచ్చింది. పాత అలవాట్లనీ, పాతపద్ధతుల్నీ మర్చిపోవాలి యిక.
అతడా ఆలోచన్లలో వుండగానే కాంతి "ఏమండీ" అంది. అతడు ఉలిక్కిపడి భార్యవైపు తిరిగేడు. ఆమె నిద్రలోంచి లేచి చాలాసేపయినట్లుంది.
ఆమె వెంట తెచ్చుకున్న చిన్న గుడ్డసంచి తడుముతూ మొహం వాడిపోగా "అయ్యో" అంది.
"ఏమయింది?" అడిగేడు.
మ్లానమైన తన వదనం అతనికి కనిపించనివ్వకుండా తలదించుకొని "కొంచెం డబ్బూ, కొంచెం నగలూ అందులో పెట్టేనండీ. రష్ లో జారిపోయినట్టున్నాయి" అంది. ఆమె ఈ మాటలంటున్నప్పుడు చైతన్య వెనక్కి జారబడి కళ్ళు మూసుకొని వున్నాడు. ఈ మాటలకు అతడి మొహంలో ఏ భావమూ కనబడలేదు. అలా కళ్ళు మూసుకునే "మనకేదీ దక్కదని నాలుగ్గంటల క్రితమే తెలిసినా, ఇంకా దేనికోసమో పాకులాడతావేం కాంతీ?" అన్నాడు నిర్లిప్తంగా.
"అలా మాట్లాడకండి" అందామె రుద్ధమైన కంఠంతో.
"తప్పేముంది కాంతీ. ఈ జన్మలో బుణం వున్నవాళ్ళ కోసం నువ్వు కొంత పారేసుకున్నావ్, అంతే" అన్నాడు.
రైలు బిగ్గరగా కూస్తూ ఆగింది. ఏదో చిన్న స్టేషన్.
చైతన్య బాబుని భుజంమీద వేసుకుంటూ "పద కాంతీ దిగిపోదాం" అన్నాడు. ఊరూ పేరూ తెలీని ఆ చిన్న పల్లెలో దిగటం ఆమెకు యిష్టం లేదు. క్షణం తటపటాయించింది.
పక్కనున్న రైతు దాన్ని ఇంకోలా తీసుకుని చైతన్యతో- "టికెట్ కలెక్టర్ అట్లాగే అంటాడు. దాన్ని పట్టుకుని దిగిపోనక్కర లేదులే. దిగాల్సిన వూరొచ్చేవరకూ కూసో ఫర్లేదు" అన్నాడు.