అప్పటికి చైతన్య ఆ ఇల్లు వదిలి పన్నెండు గంటలు కావొస్తుంది. బిజినెస్ సర్కిల్స్ లో ఏ వార్తకయినా ఆ సమయం చాలు.
"అన్నయ్యకి మీరందరూ బాగా తెల్సుగా లాల్ సాబ్....." అన్నాడు రవి. "అయినా అలా ఎందుకు వెళ్ళిపోయాడో?"
"తెల్సుగాబట్టే వెళ్ళిపోయాడు" అనుకుంది కొంచెం నిజాయితీ మిగిలివున్న పాము.
సేఠ్ చమన్ లాల్ గొంతు సర్దుకున్నాడు. "రవి సాబ్...." అన్నాడు. "చైతన్య గారుంటే ఇంకోలా జరిగి వుండేది. మీకా, ఈ బిజినెస్ ఏమీ తెలియదు. మా వేపునుంచి కూడా ఆలోచించాలి మీరు. ఈ పరిస్థితులలో ఇట్లాగే కొంతకాలం జరిగిందంటే అసలు ధరేమీ రాదు. తొందరగా అన్నీ అమ్మకానికి పెట్టాలా. ఏమంటారు మీరు?"
"అన్నీ అంటే....."
"మీకు తెలియంది ఏముంది సాబ్" వినమ్రతగా అన్నాడు సేఠ్ "స్థిరాస్థులు చరాస్థులు."
రవి గొంతులో తడారిపోయింది.
ఇదేదో అవుతుందని తెలుసు. కానీ మరీ ఇంత తొందరగా అవుతుందని అనుకోలేదు అతడు. వేలం పాడేవాడు ఒక్కొక్క సామానూ పాడుతూ వుంటే, తాము దూరంగా నిలబడి చూసే దృశ్యాల్ని ఊహించుకొన్నాడు. శరీరం జలదరించింది.
"మాకెంత మిగులుతుంది సేఠ్ జీ?" అడిగేడు.
చమన్ లాల్ నవ్వేడు.
మునిగేవాడు గడ్డిపరకను పట్టుకుని "ఇదేమిటి" అని అడిగితే ఒడ్డున వున్న వాడు నవ్వినట్టు నవ్వాడు. "ఇక్కడ వున్న వాళ్ళందరికీ యిచ్చిన దాంట్లో సగం అన్నా వస్తుందన్న నమ్మకంలేదు రవిగానూ! అందరికీ వచ్చేక ఏదయినా మిగ్లితే అది మీకే...."
అన్నయ్య రాత్రికి రాత్రి అంతా వదిలి ఎందుకు వెళ్ళిపోయాడో అర్థమైంది. అతడికి.
బిజినెస్ అంటే పూలు పరిచిన పాన్పుకాదని తెలిసింది. ఓడలు బళ్ళవటం అంటే ఏమిటో కళ్ళెదురుగా కనబడుతోంది. వాళ్ళకింకా ఏదో నచ్చచెబుదామానుకున్నాడు. ఎదురుగా కూర్చున్నవాళ్ళు ఇలాటి విషయాలలో ఢక్కా మొక్కీలు తిన్న వాళ్ళనీ తనలాటివాళ్ళని చాలామందిని చూసేరనీ అతడికి తెలీదు.
ఆ ఆస్థుల్ని అమ్మే చర్యని ఆపుచెయ్యడానికి అతడు చేస్తున్న ప్రయత్నం ఈ విధంగా ఫలించలేదు.
ఇంకో విధంగా ఫలించింది. అతడేదో చెప్పటానికి గొంతు సవరించుకొంటూ వుంటే లోపలినుంచి ఓ కేక వినిపించింది.
అది కిరణ్మయిది.
అతడు సోఫాలోంచి ఒక్క ఉదుటున లేచి లోపలికి పరుగెత్తాడు.
* * *
ఆ రోజు యింటిలో ఎవ్వరికీ భోజనాలు లేవు.
అందరి మనసులూ కలతబారి వున్నాయి.
కౌసల్యని పట్టుకోవటం ఎవరితరమూ కాలేదు. అందులోనూ ఆమెకి పెద్దన్నయ్యపట్ల వున్న చనువు ఇంకెవరితోనూ లేదు. శారద సంగతి సరేసరి. అందరిలోకి బింకంగా వున్నది కిరణ్మయే.
బీదతనంవల్ల భయం లేదామెకు. మొగవారెవరూ తోడు లేకుండానే ఆమె కష్టాల నెదుర్కొంది. ఇప్పుడు కొత్తగా ఆమెకి వచ్చే సమస్యలేమీ లేవు. అదీకాక ఇప్పుడామెకి రవి తోడున్నాడు.
కౌసల్య రూములో కూర్చుని వుంది ఆమె, కౌసల్య తలగడలో మొహం దాచుకుని నిస్త్రాణగా పడుకుని వుంది.
పక్కనే వున్న పేపరు తిరగెయ్యసాగింది ఆమె.
క్రింద డ్రాయింగ్ రూమ్ లో రవి మాట్లాడుతున్నాడు.
కిరణ్మయి పెదవుల మీద ఎందుకో నవ్వు కదిలింది. లేచి తన గదిలోకి వెళ్ళింది.
శారద ఆ గదిలో కిటికీలోంచి బయటికి చూస్తోంది. ఆమె మొహం వాడిపోయి వుంది. కళ్ళు పీక్కుపోయాయి. కిరణ్మయి లోపలికి రావటం చూసి అటు తిరిగింది.
ఆమె మాత్రం శారదని గమనించకుండా తన పెట్టె దగ్గరకు వెళ్ళి చిన్న డబ్బా తీసుకొని, ఆ గదిలోంచి నిష్క్రమించింది.
రెండు నిముషాల తరువాత ఆమెకేక ఆ భవనపు గదుల మధ్య ప్రతిధ్వనించింది. రవి పరిగెత్తుకుంటూ వచ్చాడు.
డబ్బాలో వున్న టిక్కెట్ నెంబరు - పేపరులో వెదుక్కోవటానికి ఆమెకు ఎక్కువ సమయం పట్టలేదు.
మొట్టమొదటి నెంబరే అది.
ఒక బీద స్కూలు మాస్టారి కడుపున పుట్టి కష్టాలను చివరికంటా అనుభవించి, గొప్పవాళ్ళ పట్ల హీనమైన అభిప్రాయాన్ని ఏర్పర్చుకున్న ఆ అమ్మాయి ఆమె తండ్రికున్న ఒక పాడు వ్యసనం వల్ల క్షణంలో పది లక్షలకి అధికారిణిగా మారిపోయింది.
* * *
"ఏమయింది? ఎవరూ అరిచింది? ...." అడిగాడు సేఠ్ లోపలి చూస్తూ.
"రావీసాబ్" గట్టిగా పిల్చేడు చమన్ లాల్.
లోపల్నుంచి ఎవరూ పలకలేదు.
చమన్ లాల్ సోఫాలోంచి లేవబోతూ వుంటే లోపల్నుంచి రవి వచ్చేడు. అతడి మొహంలో వినూత్నమైన కాంతి కనబడుతోంది.
"ఏమైంది?" అందరూ ఆతృతగా అడిగేరు.
అతడు వచ్చి సోఫాలో కూర్చుని గట్టిగా వూపిరి పీల్చుకున్నాడు. క్షణం నిశ్శబ్దంగా వుండి తరువాత అన్నాడు.
"మీరు ఈ ఆస్థి అమ్మి పంచుకోవాలనుకుంటే మా కభ్యంతరం లేదు. కానీ దీన్నంతా నా చేతులలో పెడితే కొద్దిరోజులలోనే మీ మీ అప్పులన్నీ తీర్చేస్తానని హామీ ఇస్తున్నాను" అతడి కంఠంలో ధీమా ధ్వనించింది.
"కొద్ది రోజుల్లోనా? ఎలా?" అనుమానంగా అడిగారెవరో.
"ఈ బిజినెస్ ని కొత్త యాజమాన్యంలోకి తీసుకురావటం ద్వారా" అన్నాడు. రవి. "యజమాని ఎవరోకాదు, నా కాబోయే భార్య కిరణ్మయి. ఆమె ఈ బిజినెస్ ని ఎలా కొంటుందీ అన్న అనుమానం వున్నవాళ్ళు ఇదిగో- ఈ లాటరీ టిక్కెట్టు, నీ ఈ రోజు పేపర్నీ పరీక్షించి చూసుకోవచ్చు...."
అయిదు నిముషాల సంప్రదింపుల తరువాత ఆ గదిలోంచి వాళ్ళు వెళ్ళిపోయారు.
9
ప్రస్థానం సాగిపోతోంది.
మహా సముద్రాల్లో అంతర్లీనంగా జల ప్రవాహాలుంటాయని..... రొయ్యలు గుంపులు గుంపులుగా ఒకచోట నుంచి ఇంకోచోటకి వలస పోతూ వుంటాయని ముందొకచోట ప్రస్తావించటం జరిగింది. కాలం అనే ప్రవాహంలో ఈ రొయ్యల ఎక్స్ పోర్టర్ కూడా అలాగే పయనించసాగేడు. కుర్చీలో కూర్చుని పనులని నిర్వహించటం వేరు- నిలబడి పని చేయటం వేరు అన్న విషయం అతడికి తెలియక కాదు. కానీ దాన్ని గురించి అతడు ప్రస్తుతం ఆలోచించే స్థితిలో లేడు. ఇల్లు పూర్తిగా తగలబడిపోతూ వుంటే అంతా సర్వనాశనం అయిపోయిందని నిశ్చయంగా తెలిసేక, జరుగుతున్న దాన్ని నిశ్చలంగా నిలబడి చూసే స్థితి అతడిది. ఇంకే కోర్కెలేదు. ఒక విధమైన స్తబ్దత అంతే.
అద్దాల గాజుమేడలాంటి అపురూపమైన వాతావరణంలో అతడు పెరిగాడు. అకస్మాత్తుగా అది పగిలిపోయింది. ఆశ్చర్యం ఏమిటంటే- అక్కడ్నుంచి క్రిందపడినా అతడికి బాధగాలేదు. బాధల్లా అతడితో ఏడడుగులు నడిచిన నేరానికి అతడితో కష్టాలనుభవిస్తున్న కాంతిమతి గురించి.
భర్త ఒక బలహీనపు క్షణంలో చూపించిన నిర్లక్ష్యతే తమ యీ స్థితికి కారణం అని ఆమెకి తెలుసు. కానీ దాన్ని ఆమె ఎందుకో క్షమించలేకపోతోంది.
తప్పు చిన్నదా పెద్దదా అన్న విషయం..... తప్పుని బట్టికాక.... ఆ తప్పువల్ల ఏర్పడే పరిణామలబట్టి వుంటుంది కాబోలు. కష్టాలు అనుభవిస్తున్న కొద్దీ అతడు చేసిన తప్పు పెరిగి పెద్దదై కళ్ళముందు విస్తృతంగా వ్యాపిస్తోంది. ఏ రోజో అది అగ్నిపర్వతంలా బ్రద్ధలవక తప్పదు. కష్టాలే మనిషిని సానబడతాయి.
కష్టాలపట్ల కాంతిమతి మానసికస్థితి ఇలా వుంటే, బాబు శరీర పరిస్థితి యింకోలా వుంది. బుతువుల మార్పుని శారీరం ఎలా అన్వయించుకోలేదో - ఆర్ధిక స్థితిలో మార్పునీ అలానే అన్వయించుకోలేదు. వేసవిలో ప్రిక్లీహీటుతోనూ - చలిలో వెచ్చని రాజాయిక్రింద ప్రకృతి నెదుర్కొన్న ఆ లేత శరీరం ఒక్కసారిగా బయటకొచ్చేసరికి తట్టుకోలేకపోయింది.
డబ్బు లేకపోవటం కూడా ఒకోసారి మంచిదేమో? ధర్మామీటరు వుండి వుంటే చాలు శారీరం నూట నాలుగు చూపించి ఆ దురదృష్టవంతులయిన దంపతుల్ని మరింత కంగారుపెట్టేది.
* * *
"శుభ్రం వున్నావ్- ఏదయినా పని చేసుకోలేవ్!"
చైతన్య నవ్వేడు. "నే నడుగుతోంది ధర్మం కాదండీ, పనే...."
అవతలి వ్యక్తి గతుక్కుమని "మాకే పనిలేక చస్తోంటే నీ సోద ఏమిటయ్యా వెళ్ళు వెళ్ళు...." అని కసురుకున్నాడు.
"నా కొడుక్కి వళ్ళు జ్వరంతో కాలిపోతోంది....."
అవతలి మనిషి మొహం చిట్లించి "ప్రతివాడికి ఏదో అలవాటయిపోయి, చిన్నపిల్లల పేరు చెప్పి పబ్బం గడుపుకోవటం....." అన్నాడు.
చైతన్య మొహం అసహనంతో కందిపోయింది. నిరాశతో అక్కణ్ణుంచి కదిలేడు. ఆలోచిస్తే వాడి తప్పేమీ కనబడలేదు. ఇలాంటి తిరస్కారాల్ని తనే అలవాటు చేసుకోవాలి.
కాళ్ళీడ్చుకుంటూ ఊరి చివరికొచ్చేడు. కూలిపోవటానికి సిద్ధంగా వున్న సత్రం కప్పుక్రింద అరుగుమీద కూర్చొని కాంతిమతి భర్తకోసం ఎదురుచూస్తోంది.
"ఎలా వుంది...." అడిగేడు.
ఆమె మాట్లాడలేదు. ఆమె ఒళ్ళో పడుకొన్న బాబు వంటి మీద చెయ్యివేసి చటుక్కున వెనక్కు తీసుకున్నాడు. పెనంలా కాలిపోతోంది వళ్ళు.
"నే వెళ్ళినప్పటి నుంచి యిలానే వుందా?"
ఆమె తలూపింది. చైతన్య చూసేడు. ఒక మూల ఎవరో బొంత కప్పుకుని నిద్రపోతున్నారు. ఇంకోమూల, ఇద్దరు బిచ్చగాళ్ళు వంట వండుకుంటున్నారు.
గోడలమీద బొగ్గుతో గీచిన పిచ్చిబొమ్మలు వున్నాయి అరుగుక్రింద మొక్కలు గుబురుగా పెరిగివున్నాయి.
"ప్రొద్దున్నుంచీ చెయ్యని ప్రయత్నం అంటూ లేదు . ఏం చేసినా ఏమీ దొరకలేదు...." అన్నాడు. ఆమె మాట్లాడలేదు.