Previous Page Next Page 
జాలిలేని జాబిలి పేజి 12


    "నిన్నా ? నేనా? అసహ్యించుకోవటమా? ఏం ప్రశ్న రాజ్యలక్ష్మీ?"

    సీతానగరం కొండలమాటున సూర్యుడు అస్తమిస్తున్నాడు. "మీతో పరిచయం కావటానికి కొద్దిరోజులక్రితం జరిగింది మధుబాబూ" అని చెప్పసాగింది. ఓ క్షణం ఆగి "మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయిందని మీకు చెప్పానా? మా నాన్నగారు త్వరలోనే మళ్ళీ పెళ్ళిచేసుకున్నారు. పిన్ని  మంచిదే. నన్ను ఎంత ప్రేమగానో పెంచింది. ఆమెకో తమ్ముడుండేవాడు. అప్పుడప్పుడూ మా యింటికొస్తూ వుండేవాడు. వట్టి కబుర్లపోగునన్ను కవ్విస్తూ, నవ్విస్తూ వుండేవాడు. నేను వయసులో చాలా చిన్నదాన్నే. అనుభవం బొత్తిగా లేదు. అతనంటే ప్రేమకాదుగానీ.... ఓ రకం ఆకర్షణగా. వ్యామోహంగా వుండేది. ఓరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడు తనమాటల్లో నన్ను ఏదో లోకానికి తీసుకువెళ్ళి హఠాత్తుగా నన్ను తనచేతుల్లోకి తీసుకున్నాడు. వారిద్డామనుకున్నాను. తిరస్కరిద్డామనుకున్నాను. కాని  ఎందుచేత అలా అయిపోయానో తెలీదు. వాంఛ అనీ చెప్పలేను. ఏమీ చేయలేకపోయాను. ప్రతిఘటించలేకపోయాను."

    ఆమె కళ్ళనుంచి నీళ్ళు కారసాగాయి. "నన్ను అంధకారంలో ముంచివేసి వెళ్ళిపోయాడా రాత్రి. స్తబ్దుగా పడివున్నాను మంచంమీద. ఇంత చిన్నదాన్ని ఎందుకిలా జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాను? వలవలా ఏడ్చేశాను. అంతా శూన్యంగా వుంది. చెప్పలేని బాధ.....మరునాడు వచ్చాడు. అతడ్ని చూస్తే ఓ రాక్షసుడ్ని చూసినట్లుగా అనిపించింది. అసహ్యం, భయం కలిగాయి. ఇట్లాంటి వ్యక్తికి నేనెలా లొంగిపోయాను? నేను చేసిన తప్పించుకుని తిరుగుతూ వుండేదాన్ని. అతనంటే నాకేమీలేదని  తెలుసుకున్నాను. ఎలా భరించేది అతన్ని? ఓసారి  యీ విషయం  స్పష్టంగా చెప్పేశాను. కోపంవచ్చి మా  విషయం పిన్నికి చెప్పేశాడు. ఆమె వచ్చి "నిజమేనా?" అని అడిగింది. ఒప్పుకున్నాను. నన్ను నానా తిట్లూ తిట్టి అతన్నే పెళ్లి చేసుకొమ్మని శాసించి వెళ్లిపోయింది నాకు వేరే ఇంకెవరితోనూ పెళ్ళికాదు.  అతనంటే రోజురోజుకు అసహ్యం పెరిగిపోతోంది. ఎట్లా జీవించేది ఈ సంఘర్షణతో? జీవితంమీద ఇచ్ఛ నశించింది. ఇంక బ్రతకనెంతో కాలం."

    ఏడుస్తోంది రాజ్యలక్ష్మి. చేతులతో ముఖం కప్పుకుని విలపిస్తోంది. మధుబాబు హృదయం ద్రవించసాగింది. ఇంత లేతవయసులో ఈ పసిపాప వంటి అమ్మాయికి ఏమిటిది?

    చీకటి పడుతోంది.

    "నేనంటే అసహ్యంగాలేదూ ఇప్పుడు" అనడిగింది ఆమె మొఖాన వున్న చేతులు తొలగించి డగ్గుత్తికతో.

    "లేదు. లేదు రాజ్యలక్ష్మీ" అంటూ అతనామె దగ్గరకు జరిగాడు.

    "పాపిష్టిదాన్ని పతితను. నన్ను తాకి మీ శరీరం మలినం చేసుకోకండి మధుబాబూ."

    అతడామె చేతిని అప్యాయంగా తన చేతుల్లోకి తీసుకుని "నిన్ను పెళ్ళి చేసుకుంటాను రాజ్యలక్ష్మి. ఇది నిజం" అన్నాడు దృఢనిశ్చయంతో.

    ఆమె కంగారుపడుతూ "వద్దు వద్దు మధుబాబూ! పండువంటి మీ జీవితం ఈ దౌర్భాగ్యురాలికోసం నాశనం చేసుకోకండి. అర్థంలేదు మీ త్యాగానికి" అన్నది.

    "నన్ను సంశయిస్తున్నావా రాజ్యలక్ష్మీ?"

    "మీకు  తెలీదు మధుబాబూ మీ చరిత్ర కలుషితం అవుతుంది."

    'ఎన్నటికీ కాదు.'

    కొంచెమాగి ఆమె "మా ఇంట్లో అంగీకరిస్తారనే ఆశలేదు. రాక్షసులక్రింద మారారు వాళ్ళు....."

    మధుబాబు నిట్టూర్పు విడిచి "నాకోసం మీ వాళ్లని ఎదిరించలేవా?" అన్నాడు.

    అతని చేతులలో ఆమెచెయ్యి వణికింది. "మీకోసం ఏమైనా చేస్తాను" అన్నది కాసేపు ఆగి. కాని ఆమె కంఠస్వరం ఆమెనే వెక్కిరించినట్లు తోచింది.

    చాలాసేపు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. బాగా చీకటిపడింది. మధుబాబుకు మనసులో చాలా చెప్పాలని వుంది. ఇంత లేత వయస్సు.......ఇలా ఇద్దరూ అనుకోకుండా దగ్గరకు చేరటం..... ఈ అనుభూతులు.... తన ధైర్యం..... అతనికి అయోమయంగా వుంది.

    "ఇంక పోదాం మధుబాబూ" రాజ్యలక్ష్మి గొంతు గాద్గదికంగా వినబడింది.

    "పద" అతను లేచాడు.

    ఇద్దరూ ఒకరినొకరు అనుకుని నడవసాగారు.

    "రాజ్యలక్ష్మీ! ఈ పరిస్థితి ఏమీ నీకిష్టంగా లేదా?"

    "లేదు లేదు. చాలా బాగుంది."

    అతను నిట్టూర్పు అణుచుకున్నాడు.


                               *    *    *


    అటు తల్లీ, తండ్రీ..... ఇటు భవిష్యత్..... ఏమో అర్థంకాని ఆశయాలు! ఏమిటిది అర్థంకాని పయనం? తగునా ఈ నిర్ణయం?

    తనని ఆకర్షించింది రాజ్యలక్ష్మి. హృదయంలో స్థావరం ఏర్పరచుకుంది. కానీ దీనిని ప్రేమ అనే సాహసం లేదు తనకు. తను  ఇంకా అంతటి అంతస్తుకు ఎదగలేదు. ఒకవేళ ఇది వ్యామోహమే ఐతే దీనికి అంతెక్కడ? తల్లీ.....తండ్రీ వీళ్ళని ధిక్కరించటం ఎలాగ? ఓ కుర్రవాడు తను. లేతవయసు యువకుడు. కొంత అయోమయ ప్రకృతి.

    అలిసిపోయాడు మధుబాబు ఆ రాత్రి ఆలోచనలతో.

    అతనికి భయం వెయ్యసాగింది.


                                *    *    *


    కాని మధుబాబు ధైర్యసాహసాలు ప్రదర్శించే అవకాశం సంఘటిల్ల కుండానే, అతను ఎటూ కొట్టుకుపోయే పరిస్థితి ఆసన్నం కాకుండానేరాజ్యలక్ష్మి ఓ మహాసాహసం చేసింది.

    అది ఆత్మహత్య.

    కాలేజీ అవతల నిండుగా ప్రవహించే కాలవవుందే.... ఓసారి అక్కడ ప్రాంతంలో నిలబడి సగం విరిగిన కొండను తిలకించిందే.... సరిగ్గా అక్కడే నిలబడి ఆ హతభాగ్యురాలు ప్రవహించే నీళ్ళలో దూకేసింది.

    ఆ నీళ్ళలో కొట్టుకుపోయింది రాజ్యలక్ష్మి. ఆమె శవం ఎక్కడో తేలింది.

    మధుబాబు ఓ వెర్రికేక వేశాడు. చావాలనుకున్నాడు. జుట్టు పీక్కున్నాడు. అంతే అదో అధ్యాయం .

    ప్రపంచం మామూలుగా సాగిపోతూనే వుంది సగం చచ్చిన మధుబాబుని తనతో తీసుకుపోతూ.

       
                                                                     11


    మధుబాబు రిజల్ట్సు తెలిశాయి. అతను ప్యాసయినాడు. కాని క్లాసు రాలేదు. విశ్వనాథంగారు కాస్త విసుక్కున్నారు. అందులో సగం సతిమీదా, సగం తనయుడిమీద ప్రదర్శించాడు. క్లాసు రాకపోతే ఎమ్.బి.బి.యస్. లో సీటు ఎలా వస్తుందని ఆయన ఆరాటం. తాత్కాలికంగా యీ చదువుమీద ఉత్సాహంగా లేదు మధుబాబుకి. అందుచేత ఎక్కువ దిగులనిపించలేదు. యాంత్రికంగా అన్ని మెడికల్ కాలేజీలకు అప్లికేషన్లు పంపించాడు. మణిపాల్ లోనూ, బెంగుళూర్ లోనూ  డొనేషన్ కాలేజీలున్నాయి. వాటికి రాస్తే మరో  రెండుమూడు ఏళ్లవరకూ సీట్లు రిజర్వు అయిపోయాయనీ, ఇప్పుడు డబ్బు కడితే మరో రెండేళ్ళతర్వాత సీటు లభించే అవకాశం వుందని జవాబు వచ్చింది. అంతకాలం ఆగటమా? మధుబాబుకు మనస్కరించలేదు. తాను సాధ్యమైనంత త్వరలో జీవితంలో ప్రవేశించాలి. తన కాళ్ళమీద నిలబడ గలగాలి. ఒకవేళ ఎమ్.బి.లో ఎక్కడా సీటురాకపోతే ఏం చేసేటట్లు? తండ్రిలా బిజినెస్ లో ప్రవేశించటమా? అతనికిష్టంలేదు బొత్తిగా. వ్యాపారంలో తను అసలు ప్రవేశించలేడు. అటు రాజ్యలక్ష్మి స్మృతులు, ఇటు యీ విద్యాసమస్య.....అతని  సాహిత్య వ్యాసంగం బొత్తిగా మూలపడింది. ఎక్కడకు వెళ్ళినా చుక్కెదురౌతూండేసరికి ఇంట్లో తండ్రి ధాంధూంలు హెచ్చసాగాయి. అతనికి ఇంట్లో వుండాలనిపించలేదు. ఎక్కడికైనా పోయి వంటరిగా గడపాలనిపిస్తోంది. కాని ఎలా సాధ్యం? మనశ్శాంతి నశించింది. చివరకు దేనిమీద తనకు ఇచ్ఛ వుందో తేల్చుకోలేని స్థితికి వచ్చాడు.

    అతనికి క్లాసు రాకపోయినా మార్కులు బాగానే వచ్చాయి. అందుకని అనుకోకుండా విశాఖపట్నం కాలేజీనుంచి ఇంటర్వ్యూ పిలుపు వచ్చింది. తండ్రిముఖం ఇంతయింది. సీటు వచ్చినట్లుగానే పొంగిపోయారు. ఇంటర్వ్యూలో ధైర్యంగా జవాబులు చెప్పమని కొడుకుని ప్రోత్సహించసాగాడు. తనుకూడా వస్తానన్నాడు. అక్కర్లేదు చెప్పి మధుబాబు వంటరిగా రైలెక్కాడు.

    జీవితంలో మొదటిసారిగా టక్ చేసుకుని మధుబాబు ధైర్యంగా ఇంటర్వ్యూకి వెళ్ళాడు. వాళ్ళేదో ప్రశ్నలు వేశారు కలగాపులగంగా. తనకు తోచిన సమాధానాలు చెప్పేశాడు. "నీ హాబీస్ ఏమిటి?" అని ఒకాయన అడిగాడు. "కళారాధన" అన్నాడు మధుబాబు గర్వంగా. "ఏవయినా అచ్చయినాయా?" అన్నాడు ఒకాయన ఎగతాళిగా . "ఎన్నో అచ్చయినాయి. రేడియోలో కూడా వచ్చాయి. "మరి లిటరేచర్ తీసుకోక మెడిసన్ ఎందుకు ట్రై చేస్తున్నావ్?" అది నా  హాబీ అంతే. దానిమీద జీవించలేనని నాకు తెలుసు. అంతేగాక డాక్టరునై ప్రజాసేవ చెయ్యాలని వుంది" ఇంటర్వ్యూ ముగిసింది. మధుబాబు ఆ సాయంత్రం రైలుఎక్కి ఇంటికి వచ్చేశాడు.

    రోజులు గడవ సాగాయి. ఫలితం కోసం యెదురు చూడసాగారు ఇంటిల్లపాది. అది ఒకవేళ రాకపోతే యీలోగా పుణ్యకాలం కాస్తా గడిచిపోతుందని గుంటూరు  బి.ఎన్.సి.లో చేరి మొదటి టర్మ్ జీతం కట్టివచ్చాడు.

    కొన్నాళ్ళకు ఫలితాలు తెలిశాయి. మధుబాబుకు సీటురాలేదు. కాని  అతని  పేరు వెయిటింగ్ లిస్ట్ లో వుంది. తండ్రీ కొడుకులిద్దరూ నిస్పృహ చెందారు. అయినా ఓ ఆశ మిణుకుమిణుకుమంటోంది రాకపోతుందా అని. "గుంటూరు కాలేజికి పోయి వస్తూండరా. అక్కడకూడా అటెండెన్స్ పోవటం దేనికి?" అన్నాడు తండ్రి ఉసూరుమంటూ, మధుబాబు ప్రొద్దున్నే రైలెక్కి గుంటూరెళ్లి సాయంత్రం కాగానే తిరిగి రాసాగాడు. యంత్రబద్ధంగా గడుస్తున్నాయి రోజులు. అతనికి విసుగ్గా వుంది.

    అయితే వున్నట్లుండి విశాఖపట్నంలో సీటు వచ్చిందన్న వార్త తెలిసింది.

 Previous Page Next Page