పాణి నవ్వేసి, "ఏమీ లేదు. ఆ అమ్మాయి నిన్న రాత్రి నన్ను అన్నయ్య అనేసింది. ఆడవాళ్ళు ఎంత తొందరగా ఆత్మవంచన చేసుకుంటారో చూడు" అన్నాడు.
శాస్త్రి కిటికీలోంచి బయటకు చూస్తూ క్షణం ఆలోచించి, "అందులో తప్పుందని అనుకోకు" అన్నాడు.
"తప్పా- తప్పున్నరా! ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళమధ్య బంధానికి 'అన్నా చెల్లెలూ' నాయి పేరు పెట్టేరు మన పెద్దలు. ఆ బాంధవ్యాన్ని తీసుకొచ్చి ఇంకెవరో అమ్మాయితో కలుపుతున్నానూ అంటే ఎలా?" అన్నాడు పాణి ఆవేశంగా.
"అదెలా? ఒకరిని చూడగానే అప్రయత్నంగా సోదర ప్రేమ కలగవచ్చు" అన్నాడు శాస్త్రి.
"సోదర ప్రేమా? అంటే ఏమిటి?"
"ఆ అమ్మాయికి ఆప్యాయత పంచి ఇవ్వాలనీ, ఆ అమ్మాయి అనురాగాన్ని పొందాలనీ వగైరా."
"అయితే, దాన్ని ధైర్యంగా 'స్నేహం' అను. మళ్ళీ ఆ 'చెల్లీ' అనే పేరెందుకు?"
"అమ్మాయితో ఉట్టి స్నేహం చేస్తానంటే లోకం ఒప్పుకోదు బ్రదర్" అన్నాడు శాస్త్రి.
"అంటే, మీరు ఈ అన్నాచెల్లెళ్ళ బంధాన్ని లోకానికి భయపడి పెట్టుకుంటున్నారన్నమాట, అంతేగా!" అన్నాడు.
శాస్త్రి మాట్లాడలేదు. మళ్ళీ పాణి అడిగేడు. "పల్లవి నీ చెల్లెలు దానితో ఎప్పుడన్నా గంటల తరబడి మాట్లాడేవా?"
శాస్త్రి "లేదు" అన్నాడు.
"దానికెప్పుడైనా రెండు పేజీల ఉత్తరం వ్రాసేవా?"
శాస్త్రి తెల్లమొహం వేసి, "ఇవన్నీ నువ్వెందుకు అడుగుతున్నావో నాకు తెలియటం లేదు" అన్నాడు.
"సోదర ప్రేమ ముసుగులో మనుష్యులు చేసుకుంటున్న ఆత్మవంచన గురించి."
"అంటే నీ ఉద్దేశ్యంలో తోడబుట్టిన చెల్లెల్ని తప్ప మిగతా వాళ్ళందర్నీ ప్రియురాళ్ళుగానే చూడాలంటావ్?"
"అనను. నీ తోడబుట్టింది చెల్లెలు. నీతో జీవితాన్ని పంచుకొనేది ప్రియురాలు. మిగతావాళ్ళంతా స్నేహితులూ, స్నేహితురాళ్ళూ! అంతే."
"నీ మెదడు పూర్తిగా కుళ్ళిపోయింది" అన్నాడు శాస్త్రి సీరియస్ గా పాణి నవ్వి ఊరుకున్నాడు.
"అయితే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పు స్నేహాన్నీ ప్రేమనీ విడదీస్తున్న ఒకే ఒక పొర సెక్సా?" అడిగేడు శాస్త్రి.
"అదీ కాదు. ఎందుకంటే, ఒకవేళ నిన్నరాత్రి నేను ఆ అమ్మాయిని అనుభవించి వుంటే అది ప్రేమ కాదుగా?"
"మరి నీ ఉద్దేశ్యంలో ప్రేమంటే ఏమిటి?"
పాణి నవ్వి, "అది తెలుసుకోవాలనే ప్రయత్నం" అన్నాడు.
"అది తెలుసుకునేవరకూ పెళ్ళిచేసుకోవా?"
"చేసుకోను" దృఢంగా అన్నాడు పాణి.
అంతలో బయట తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది. పని వెళ్ళి తలుపు తీసేడు, బయట టెలిగ్రామ్ బంట్రోతు. ఆదుర్దా పడుతూనే సంతకం చేసి టెలిగ్రామ్ విప్పేడు.
శాస్త్రి అతని పక్కన చేరి, "ఏమిట్రా అది?" అన్నాడు పాణి దాన్ని చదివి ఊపిరి పీల్చుకొని, శాస్త్రి కిచ్చేడు.
"ఆంటీ వాంట్స్ యూ సూన్" అని చదివి, "ఏమిటిది?" అన్నాడు అర్ధం కానట్టు.
"నాకు తెలియటంలేదు" అన్నాడు పాణి.
"ఇంతకీ ఎవరీవిడ?"
"మా అత్తయ్య -"
"బహుశా కూతుర్నివ్వటానికేమో!" అన్నాడు శాస్త్రి నవ్వి.
పాణికూడా నవ్వి, "అదేం కాదులే" అన్నాడు.
"ఏం? కూతుళ్ళు లేరా?" అడిగేడు శాస్త్రి.
"ఉంది. కాని మా మామయ్యకి మేనరికాలు గిట్టవు. ఆయనో సోషియాలజీ ప్రొఫెసర్లే."
"మరెప్పుడు వెళతావ్?"
పాణి టైమ్ చూసుకొని, "ఇంకో గంటలో బస్సుంది. అందులో వెళతాను" అన్నాడు బట్టలు సర్దుకోవటానికి లేస్తూ.
* * *
పాణి ఊరు చేరుకునేసరికి రాత్రి ఎనిమిదయింది. అతణ్ణి చూస్తూనే మామయ్య సంబరపడిపోయేడు.
"అత్తయ్య కెలా వుంది మామయ్యా?" కంగారుపడుతూ అడిగేడు. బాగ్ గదిలో మూలగా పెడుతూ.
"నాకేం? శుభ్రంగా ఉన్నాను" అంటూ వచ్చింది అత్తయ్య.
పాణికి అర్ధంకాక "మరి టెలిగ్రామ్ ఎందుకిచ్చినట్టూ?" అన్నాడు వాళ్ళిద్దరివైపు మార్చి మార్చి చూస్తూ.
"ముందు భోజనం చెయ్యి, తరువాత మాట్లాడుకుందాం" అన్నాడు ఆయన.
భోజనం చేసి వరండాలో కూర్చున్నాక ఆయన ఉపోద్ఘాతంగా - "నీకు తెలుసుగా- అనూరాధని నీ కివ్వకపోవటానికి కారణం, నాకు మేనరికాలు గిట్టవని" అన్నాడు.
పాణి తలవూపేడు.
"అదే ఉద్దేశ్యంతో రాధకి నాలుగైదు సంబంధాలు చూశాం అన్నీ మంచి సంబంధాలే కానీ నాలుగింటినీ అది తిరగగొట్టింది" అంటూ ఆగేడు ఆయన.
"ఎవర్నన్నా ప్రేమించిందేమో?" అన్నాడు పాణి.
"నాకూ అదే అనుమానం వేసింది" అన్నాడాయన వెంటనే.
పాణి కంగారుపడి, "వాడెవడో కనుక్కోమంటే మాత్రం నేను కనుక్కోలేను. అది అసలే మొండిఘటం" అన్నాడు.
ఆయన సీరియస్ గా "అక్కర్లేదు. మీ అత్తయ్యే మంచి మాటలు చెప్పి వాడెవరో కనుక్కుంది" అన్నాడు.
"ఎవడుట?"
"నువ్వే!" అన్నాడాయన నవ్వి.
పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడి "నేనా?" అన్నాడు.
"ఆహా! అక్షరాలా నువ్వే!"
"ఇది - ఇదెలా సాధ్యం?" అన్నాడు పాణి.
ఆయన నవ్వి "నేను సోషియాలజీ ప్రొఫెసర్ని. ఫిజిక్స్ ప్రొఫెసర్నన్నా కాకపోయేను, ప్రేమకి టెలిలింక్స్ ఏమన్నా ఉన్నాయేమో కనుక్కోవటానికి" అన్నాడు.
"మరి ఇప్పుడెలా?" ఆలోచిస్తూ అన్నాడు.
"అదేదో పెద్ద అంతర్జాతీయ సమస్యలా ఆలోచిస్తావేమిట్రా? దాన్ని పెళ్ళి చేసుకో."
పాణి బిత్తరపోయి, "దాన్నా పెళ్ళా?" అని కొంచెం ఆగి "నేనా!" అని మళ్ళీ క్షణం ఆలోచించి, "నేనా?" అన్నాడు బిక్కమొహం వేసి.
ఆయనకి ఒళ్ళు మండింది. "ఏరా, ఏదో మేనల్లుడివని ఊరుకుంటున్నాను. నీకెంత కట్నం కావాలో చెప్పు. అంతేకానీ....."
"మామయ్యా!" అంటూ గట్టిగా అరిచేడు పాణి. "చాలా డామేజింగ్ గా మాట్లాడుతున్నావ్ మామయ్యా నువ్వు. ఆదర్సపు పునాదులమీద నిర్మించుకున్న నా కలల భవంతిని ఒక్కక్షణంలో కూలదోసెయ్యటానికి ప్రయత్నిస్తే దానికి దేవుడు కూడా క్షమించడు" అనేసి అత్తయ్యవైపు తిరిగి, అదే విసురులో "రాధేదీ?" అన్నాడు. అతడ్ని బిత్తరపోయి చూస్తూ ఆవిడ అప్రయత్నంగా వేలెత్తి గదివైపు చూపించింది. పాణి పెద్ద పెద్దఅంగలు వేసుకుంటూ అటు వెళ్ళేడు.
పాణి అటు వెళ్ళగానే ఆయన అటువైపు తిరిగి, "ఏమే, ఇది ఈ నాటకాలవాడిని చేసుకుని ఏమన్నా సుఖపడుతుందంటావా?" అని అనుమానం వెలిబుచ్చేడు.