Previous Page Next Page 
క్షమించు సుప్రియా! పేజి 12


    "నువ్వు వెధవ్వి" అన్నాడు శాస్త్రి అంతా విని.
   
    "ఎందుకు?" అన్నాడు పాణి నవ్వి.
   
    "నిన్ను మాత్రం ఆ అమ్మాయి సిన్సియర్ గా ప్రేమించాలా? నువ్వేమో ప్రేక్షకుడిలా దూరంగా నిలబడి ఎక్స్ పెరిమెంట్లు చేస్తూంటావా?"
   
    పాణి మాట్లాడలేదు. మళ్ళీ శాస్త్రే అన్నాడు.
   
    "పోనీ, ఆ అమ్మాయి నీమీద గుడ్డిప్రేమతో ఒప్పుకుంటుందనుకో, నువ్వేమంటావో తెలుసా? 'ఆ అమ్మాయికి నీతీ, నియమం లేవు. పెళ్ళి చేసుకోవటానికి శరీరాన్ని ఎరగా ఉపయోగించిందీ, అని."
   
    "మరి అన్ని అనుమానాలతో ఎలా ప్రేమించటం?" అడిగేడు పాణి.
   
    శాస్త్రి నవ్వేడు. "ఎవర్నన్నా ప్రేమించాలీ అనుకోని మొదలుపెడితే అది ప్రేమకాదు. హృదయంలో స్పందన హఠాత్తుగా కలగాలి. అదీ ప్రేమంటే."
   
    "ఎవర్ని చూచినా నాకు అలా కలగటంలేదు" అన్నాడు పాణి.
   
    "అంటే నువ్వు ప్రేమరాహిత్యం అనే వ్యాధితో బాధపడుతున్నావన్నమాట!" అన్నాడు శాస్త్రి నవ్వి. పాణి మాట్లాడలేదు. ఖాళీ గ్లాసుని వేళ్ళమధ్య తిప్పుతూ అలానే మౌనంగా వుండిపోయేడు.
   
    'ఏమిటి అలా మూడ్స్ లోని వెళ్ళిపోయావ్?"
   
    'ఏమీలేదు" అన్నాడు పాణి - "నువ్వు చెప్పింది నిజమే! నేను పెరిగిన పరిస్థితులు అలాటివి. నా తల్లి చిన్నప్పుడే చచ్చిపోయింది. తండ్రో చరిత్రహీనుడు. చెల్లెళ్ళు లేరు. అందువల్ల దాదాపు ఒంటరిగానే పెరిగేను."
   
    "కానీ, నువ్వు ప్రేమపట్లా, స్త్రీ పట్లా అంత గౌరవభావాన్ని పెంచుకోవటం అవసరం అలా పెంచుకొంటే ఈ రియలిజానికి తట్టుకోలేక దెబ్బతింటావ్" హెచ్చరించాడు శాస్త్రి.
   
    "కాదు, అంతవరకూ వస్తే.....అసలు ప్రేమంటే ఏమిటో తెలుసుకోకుండా పెళ్ళిచేసుకోను.....స్త్రీని ముట్టుకోను" దృఢంగా చెప్పేడు పాణి.
   
    శాస్త్రి నవ్వేడు. "తాగేసి వెధవ నిర్ణయాలు తీసుకోకు" అన్నాడు.
   
    పాణి సీరియస్ గా "నువ్వే చూస్తావుగా?" అన్నాడు.
   
    "ఏమిటి? ప్రేమంటే ఏమిటో తెలుసుకోలేకపోతే జీవితాంతం బ్రహ్మచారిగానే వుండిపోతావా?"
   
    "ఆహఁ" అన్నాడు పాణి ఒక నిశ్చయానికి వచ్చినట్టు.
   
    "సరేలే, ఇక లే" అన్నాడు శాస్త్రి తానూ లేస్తూ ఇద్దరూ బయటికొచ్చేరు. శాస్త్రి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు.
   
    "ఇటెక్కడికి?" అన్నాడు పాణి కారు అబిడ్స్ వైపు తిరగటం చూసి. "ఇక్కడో చిన్న పనుంది. అది చూసుకొని వెళదాం" అంటూ ఒక హోటల్ ముందు ఆపేడు. ఇద్దరూ కారు దిగేరు. ఆ హోటల్ కి రావటం పాణికి అదే ప్రధమం.
   
    "అక్కడే ఆగిపోయేవేం? రా!" అన్న పిలుపుతో శాస్త్రిని అనుసరించేడు. ఇద్దరూ మెట్లెక్కి పైకి వస్తూంటే..... "ఇక్కడేం పని?" అన్నాడు పాణి.
   
    "ఒక ఫ్రెండును కలుసుకోవాలి" అంటూ ఒక రూమ్ ముందు ఆగి తలుపు తోసేడు.
   
    "ఎవరతను?" అన్నాడు పాణి.
   
    "నువ్వే చూడు" అన్నాడు శాస్త్రి నవ్వి, పాణి లోపలికి అడుగు పెట్టి చటుక్కున ఆగిపోయాడు. పక్కమీద బోర్లా పడుకొని పుస్తకం చదువుతున్న అమ్మాయి తలుపు చప్పుడుకు తల పక్కకు తిప్పి అతడిని చూసింది. పాణి చప్పున వెనక్కి తిరిగేడు. అప్పటికే శాస్త్రి బయట తలుపు వేసి గెడ పెట్టేశాడు. పాణి తలుపు లాగుతూ, "ఒరేయ్..... ఏమిటిది?" అన్నాడు కోపంగా.
   
    శాస్త్రి కిటికీలోంచి చూస్తూ "సారీ బ్రదర్ నీ నిర్ణయం భయం వేసింది అందుకనే" అంటూ నవ్వేడు.
   
    "కానీ...." అంటూ ఏదో చెప్పబోయాడు పాణి.
   
    "ఇంకేం చెప్పక. ప్రొద్దున్నే తలుపు తియ్యమని బోయ్ కి చెప్తాను ఈ హోటల్ లో నేను ఎంత చెబితే అంత రేప్రొద్దున్న వరకూ ఇందులోనే వుండాలి నువ్వు" అని, "పనంతా" అంటూ పిలిచేడు గట్టిగా.
   
    అప్పటివరకూ జరుగుతూన్నదంతా అర్ధం కాక బిత్తరపోయి చూస్తున్న ఆ అమ్మాయి కిటికీ దగ్గరకు పరుగెత్తుకువచ్చి, "నువ్వా శాస్త్రీ " అంది తేలిగ్గా ఊపిరి పీల్చుకొంటూ.
   
    "ఆఁ నేనే" అన్నాడు శాస్త్రి నవ్వి.
   
    "ఏమిటిదంతా?" అని ప్రశ్నించింది.
   
    "ఏమీలేదు, మా వాడికి కొత్త కొంచెం ప్రేమంటే ఏమిటో నేర్పు" అన్నాడు శాస్త్రి. వసంత కూడా నవ్వింది. పాణి ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు.
   
    "మరి నేను వెళ్ళొస్తాను. గుడ్ బై" అంటూ శాస్త్రి వెళ్ళి పోయేడు. వసంత కిటికీ తలుపులు మూసేసి, పాణి దగ్గరికి వచ్చింది. పాణి తనను గమనించటం చూసి, "ఏమిటి ఆలోచిస్తున్నారు" అంది నవ్వుతూ.
   
    పాణి మాట్లాడలేదు.
   
    "మీరీ రాత్రంతా ఇక్కడే వుండాలి. అలా మాట్లాడకుండా బిగుసుకుపోతే ఎలా?"
   
    పాణి నవ్వేడు.
   
    "అమ్మయ్య! కొంచెం కదిలేరు. చాలు" అంది వసంత నవ్వుతూ.
   
    "అంటే, నేను జడుడిలాగానూ, అనాగరికుడిలాగానూ కనబడుతున్నానా?" అన్నాడు పాణి కోపంగా. అతనికి ఒళ్ళు మండిపోతూంది.
   
    "మీ స్నేహితుడేగా చెప్పారు!" అంది వసంత.
   
    "ఏమని?"
   
    "మా వాడికి కొత్త, ప్రేమంటే ఏమిటో నేర్పూ అని."
   
    "వాడి మొహం వాడో పెద్ద ఫూల్" అన్నాడు పాణి విసుగ్గా.
   
    "ఆయన సంగతి ఇప్పుడెందుకు? మరి..... నేను నేర్పనా!" అంది వసంత కొంటెగా.
   
    "ఏమిటి?"
   
    "మొదటి పాఠం" అంది వస్తూన్న నవ్వుని బిగబట్టి.
   
    "అంటే?" అన్నాడు అర్ధంకానట్టు పాణి. వసంత అతన్ని చటుక్కున పక్కమీదకు తోసి రెండు నిముషాలపాటు ఊపిరి సలపనివ్వకుండా అతని పెదవుల్ని నొక్కిపట్టి ముద్దుపెట్టుకొని లేచి కూర్చుని "అదీ" అంది.
   
    పాణి ఆమె మొహంలోకి సాలోచనగా చూస్తూ, "ఇదేనా ప్రేమంటే" అన్నాడు నిర్లిప్తంగా అతని ఉదాసీనతని చూసి ఆమె బెదిరింది.
   
    ఒక్క క్షణం ఆమెవైపు తదేకంగా చూసి, "కాదు......ప్రేమని చూపించటానికి ఇదో మార్గం. అంతే, నాకున్న కొద్ది అనుభవంతో చెపుతున్నాను! - ఇదే ప్రేమ అంటే నే నొప్పుకోను" అన్నాడు.
   
    "ఏమిటి, కవిత్వం మాట్లాడుతున్నారు?" అంది అతని ఛాతీమీద చెయ్యివేసి అప్పుడు జ్ఞాపకం వచ్చిందతనికి తను మాట్లాడుతూన్నది ఒక సామాన్యమైన అమ్మాయితోనని.
   
    "ఏమీలేదు పడుకో" అన్నాడు జరిగి ఆమె అతని పక్కనే చోటుచేసుకుని పడుకొని, అతనిమీద చెయ్యివేసింది అతనన్నాడు.
   
    "చూడూ, మనసులో ఒక భావం వుంచుకొని పైకి ఒకలా మాట్లాడే మనిషిని కాను నేను. నా మనసులో ఒక భావం ఏర్పడింది. ప్రేమకి క్లైమాక్స్ సెక్స్ అని! దాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను అందువల్ల నువ్వు నా ముందు నగ్నంగా నిలబడినా నాకేమీ స్పందన కలగదు. ఇలాటి చీప్ ట్రిక్స్ ఏమీ నా మీద ప్రయోగించక శుభ్రంగా నిద్రపో, రేపు పొద్దున్న వాడొచ్చి తలుపు తీసేవరకూ."
   
    వసంత చప్పున అతని చేతులు పట్టుకొని "ఇన్నాళ్ళకి నాకో అన్నయ్య-" అంటూ ఏదో చెప్పబోయింది.
   
    "ఎందుకీ ఆత్మవంచన? ఇద్దరి మధ్య సెక్స్ లేనంత మాత్రాన అన్నా చెల్లెళ్ళయిపోతారా? రేపు పొద్దున్న నీ గురించి ఎవరన్నా అసహ్యంగా మాట్లాడితే నడిబజార్లో నా చెల్లెలిని అలా అంటున్నందుకు వాడిని కొట్టాలా నేను? ఎవర్ని పడితే వాళ్ళని చెల్లెలుగా నే నొప్పుకోను. క్షమించు గుడ్ బై" అన్నాడు పక్కకి తిరుగుతూ.
   
                                                           *    *    *
   
    "నీ అంత వెధవ, స్కౌండ్రల్ మరియు ఇడియట్ ఈ లోకంలో ఇంకెవరూ ఉండరు" అన్నాడు శాస్త్రి పాణి మాట్లాడలేదు. శాస్త్రికి అనుమానమేదో వచ్చి "అసలు నువ్వు చెబుతూందంతా నిజమేనా?" అన్నాడు.
   
    పాణి నవ్వి "నిజమే" అన్నాడు.
   
    "వెధవా! అనవసరంగా వందరూపాయలు వేస్ట్ చేసేవు కదా!" అన్నాడు విసుక్కొంటూ పాణి మౌనంగా వుండిపోయేడు. అంతలో క్రితం రాత్రి తాలూకు సంభాషణ జ్ఞాపకం వచ్చి అతని పెదవుల మీద సన్నగా చిరునవ్వు వెలిసింది. అది గమనించిన శాస్త్రి - "ఎందుకు నవ్వుతున్నావ్?" అని అడిగేడు.

 Previous Page Next Page