Previous Page Next Page 
క్షమించు సుప్రియా! పేజి 14


    పక్కగదిలో జరిగే సంభాషణంతా జాగ్రత్తగా వింటూన్న అనూరాధ పాణి లోపలి రావటాన్ని గమనించి, తలుపు చాటునుంచి పరుగెత్తుకు వెళ్ళి, టేబిల్ ముందు కూర్చుని, అందిన పుస్తకాన్నేదో తీసుకుని చదువుతున్నట్లు నటించసాగింది.
   
    పాణి సరాసరి లోపలి వచ్చేడు. ఎదురుగా ఉన్నది పెళ్ళి కాని ఇరవై ఏళ్ల అమ్మాయి అనైనా గమనించకుండా చేతులు పట్టుకుని "మామయ్య చెబుతున్నది నిజమేనా అనూ?" అన్నాడు. అనురాధ చప్పున అతని చేతుల్లోంచి చేతులు లాగేసుకుని మొహం దాచుకుంది. పాణి పక్కనే మోకాళ్ళమీద కూర్చుని "ఇదంతా ప్రేమేనా?" అన్నాడు.
   
    అనూరాధ మరింత సిగ్గుపడి "పో బాబూ, ఇక్కడినుంచి" అంది.
   
    పాణి ముందుకు వంగేడు.
   
                                                                    *    *    *
   
    పాణి ముందుకు వంగి అన్నాడు-
   
    "ఈ తెల్లచీరెలో నువ్వెలా వున్నావో తెలుసా?"
   
    అనూరాధ కళ్ళెత్తి అతనివైపు చూసింది. పాణి మందస్వరాన అన్నాడు. "నిన్నిలా చూచినప్పుడు వెన్నెలా, నువ్వు నవ్వినప్పుడు మల్లెలూ గుర్తొస్తున్నాయి రాధా, నాకు".
   
    అనూరాధ నవ్వి అతని గుండెల్లో తల దాచుకుంది. "ఏమిటి! ఇదంతా సిగ్గే" చిలిపిగా ప్రశ్నించాడు. అనూరాధ మరింతగా హత్తుకుపోయింది.
   
    "బావని తప్ప ఇంకెవర్నీ చేసుకోను అన్నప్పుడు ఈ సిగ్గంతా ఏమైందో?" రెచ్చగొట్టాడు. కోపంగా చూడబోయి, సిగ్గు ముంచుకొచ్చి కళ్ళు దించేసింది. ఆమె తలమీద గడ్డం ఆన్చి, ఆ రాగరంజిత రసానుబంధ ఆస్వాదనలో అలాగే కొంచెం సేపు వుండిపోయి. "రాధా!" మృదువుగా పిలిచేడు.
   
    "ఏం బావా?" కౌగిలిలోంచి విడవకుండా అడిగింది.
   
    "ఒక్క ప్రశ్న అడుగుతాను జవాబు చెబుతావా?"
   
    "ఊఁ."

    "ప్రేమంటే ఏమిటి?"
   
    రాధ ఉలిక్కిపడి అతనివైపు చూసింది. పాణి మొహంలో ఎక్కడా చిలిపితనం కనిపించలేదు. ఆమె కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగేయి. చేతులలో మొహం కప్పుకొని "నాకేం తెలియదు బావా. నిజం, నన్ను నమ్ము" అంది.
   
    పాణి కంగారుపడిపోయి, ఆమె భుజాలు పట్టుకుని కుడుపుతూ "రాధా, ఏమిటిది?" అన్నాడు.
   
    "నిజం, బావ నా మీద అనుమానం వద్దు, నిన్నే మనస్పూర్తిగా....." అంటూ ఏడ్చేసింది. తనెంత వెధవపని చేశాడో అప్పుడర్ధమైంది. ఆమెని దగ్గరగా తీసుకుంటూ, "ఛా, నా వుద్దేశ్యం అదికాదు. చాలా కాలం నుంచీ ఆ ప్రశ్నకి సమాధానం కోసం వెతుకుతున్నాను. నీకేమన్నా తెలుసునేమోనని...." అన్నాడు. రాధ తల ఎత్తి అతనివైపు చూస్తూ ఏదో చెప్పబోయింది. ఆమెని మరి మాట్లాడనివ్వలేదు అతను- ఆ వినీల నేత్రాలతో బేలత్వం, హేలగా ఊగే ముంగురులు, అర్ణవపు తీరాన్నే నిలబడి సన్నిహితత్వాన్ని ఆపాదించుకున్న శిలల నునుపుదనాన్ని ధిక్కరించే చెక్కిళ్ళు.... పాణి ముందుకు వంగేడు.
   
    భయంతోవణికే పెదవిని మృదువుగా అదిమిపెట్టి ప్రేమ కోసం వెతుక్కొంటూ, క్షణకలం అస్థిత్వపు స్పందన. అస్థిత్వం క్షణికం కాదు-క్షణం ఆలస్యం కానప్పుడు జీవితం క్షణికమైతే నేం? ఓ నిశీధిరాత్రి వినీలాకాశంలోంచి నిశ్శబ్దంగా జారిపోయే నక్షత్రం - దట్టమైన అడవిలో ఒక రోజు బ్రతికే గడ్డిపువ్వూ- ఇవి చెబుతాయి జీవితానికి అర్ధం!
   
    పేరుకున్న నిరాశావాదంలోంచి ఉద్బవించే ఆఫ్టిమిజం నిజం హక్కు విప్పితే ఈ విభావరీ సుందరి వయోధరాలపై ఎవరినీ ఈనఖక్షతాలు? ఆ లోయల్లో పేరుకున్న నిశ్శబ్దం సేదతీరి విశ్రాంతి తీసుకోవాలనుకుంటే ఒక జీవితకాలం చాలదనిపించే నీరవం.
   
    ఎన్ని కాంట్రాడిక్షన్ల ముళ్ళు?
   
    పక్కకి తిరిగి ఆమె చెయ్యి స్విచ్ మీదకు వెళుతూందెందుకు? ప్రేమలో ఇంత కాన్షస్ నెస్ ఏమిటి? అనుభవంలో ఆనందం లేదు. అనుభూతిగా మారితే తప్ప!
   
    ఆమెని పూర్తిగా ఆక్రమించుకొన్నాడతను.
   
    జీవితంలో ప్రతి స్టేజిలోనూ రికన్ సీలియేషన్.
   
                                                      *    *    *
   
    "నా కాడపిల్లే కావాలి" మారాం చేస్తున్నట్టు అడిగేడు పాణి.
   
    అనురాధ చిలిపిగా నవ్వి, "అబ్బా! ఆశ!" అంది కొంటెగా.
   
    "ప్లీజ్.....ప్లీజ్! బ్రతిమాలేడు. "మొదటిది నె చెప్పినట్టు....రెండూ మూడూ నీ ఇష్టం. మళ్ళీ నాలుగేమో!"
   
    అనూరాధ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిచేసి, "ఏమిటీ?" అంది.
   
    "ఫరవాలేదు లేవోయ్, పోషించేది నేనేగా? ఏదీ నీ చెయ్యి ఇవ్వు" అంటూ చేతిని తీసుకున్నాడు.
   
    "ఎందుకు! జ్యోతిష్యం చెబుతారా?" అంది వచ్చే నవ్వుని ఆపుకుంటూ.
   
    "అహ" అంటూ చేతిని పరీక్షగా చూసి, "ఒకటి - రెండూ - మూడు' అంటూ లెక్కపెట్టి, "అయిదుగురు పిల్లలు మనకి."
   
    అనూరాధ సిగ్గుపడి తల పక్కకి తిప్పుకుంది.
   
    "ఇదేమిటి..... ఈ సిగ్గంతా రాత్రిళ్ళు ఎటు వెళ్ళిపోతుందో?" కవ్వించేడు.
   
    "ఛీ!" అంటూ మరింత కుదించుకుపోయింది.
   
    "ఏది ఏమైనా నాకు ఆడపిల్లే కావాలి" దృఢంగా అన్నాడు పాణి.
   
    "ఎందుకో?" అంటూ ఓరగా చూసింది.
   
    పాణి నవ్వలేదు. "ఎందుకో చెప్పలేను...." సాలోచనగా ఆగేడు. ఒక క్షణం తర్వాత అన్నాడు. "బహుశా నేను కోరే స్త్రీత్వాన్ని ఆపాదించటం కోసం అయి వుండవచ్చు."
   
    "కానీ, నాకో జ్యోతిష్యుడు ఏం చెప్పాడో తెలుసా?"
   
    "ఏం చెప్పాడేమిటి?"
   
    "మొదటి కాన్పు పురిట్లో నేను పోతానుట."
   
    "రాధా!" అరిచేడు పాణి. "సరదాకికూడా లా మాట్లాడకెప్పుడూ"
   
    అనూరాధ నవ్వింది. "నేన్నిజమే చెబుతున్నాను" అంది.
   
    "ఊఁ సరేలే ఇక పడుకో" అంటూ పక్కకి తిరిగి ముసుగుదన్నేడు.
   
    "మరేం" అంటూ ఏదో చెప్పబోయింది.
   
    "నో.....నేనింకీ రాత్రి నీతో మాట్లాడను" అటువైపు తిరక్కుండానే అన్నాడు కోపంగా.
   
    అనూరాధ అతనిమీద చెయ్యివేసి, "అయితే, పిల్లి వచ్చే..... గప్ చిప్...." అంది నవ్వుతూ.
   
    దాదాపు పన్నెండూ ఆ ప్రాంతాల్లో పాణికి ఆకస్మాత్తుగా మెలకువ వచ్చింది. చప్పున లేచి కూర్చుని స్విచ్ వేశాడు. అనూరాధ మూలుగుతూంది.
   
    "రాధా, రాధా!" అంటూ తట్టేడు. రాధ కళ్ళు విప్పింది.
   
    "ఏమిటి? ఏమైంది?" కంగారుగా అడిగేడు. ఆమెని చూస్తూ ఉంటే ఎంతోబాధని పళ్ళబిగువున అదిమి పెడుతున్నట్టు వెంటనే తెలుస్తూంది.
   
    తలమీద చెయ్యివేసి, "ఏమైంది?" అన్నాడు. చేతిని గట్టిగా చెంపకి అదుముకొంటూ, "కడుపులో నొప్పి వస్తూంది. భరించలేను" అంటూ మళ్ళీ నొప్పి రావడంతో మెలికలు తిరిగిపోయింది.
   
    క్షణం పాటు పాణికి ఏం చెయ్యాలో తోచలేదు. ఇంట్లో తను తప్ప ఇంకెవరూ లేరు. అతను చూస్తూ ఉండగానే ఆమె బాధ భరించలేక కడుపు చేతితో పట్టుకుని తలగడలో మొహం దాచుకుంది.
   
    పాణి చప్పున లేచి షర్టు వేసుకొన్నాడు.
   
    "రెండు నిమిషాల్లో వస్తాను." కాజువల్ గా అని తలుపు దగ్గరగా వేసి బయటకొచ్చేడు. వడివడిగా నడుస్తూ టైమ్ చూసుకొన్నాడు.
   
    రెండున్నర.
   
    అంతలో అతని ఇంట్లో రాధ ఒక్కతే వుంటుందన్న విషయం జ్ఞాపకం వచ్చింది. అది గుర్తొచ్చిన తరువాత మామూలుగా నడవలేక పోయాడు. మిగిలిన వందగజాలు దాదాపు పరుగెత్తి గమ్యం చేరుకున్నాడు. చల్లగాలి బలంగా వీస్తున్నా అతని నుదురంతా చెమట పట్టేసింది.
   
    మెట్లెక్కి తలుపు దబదబా బాదేడు, అరనిమిషం తరువాత లోపల అలికిడి వినిపించింది. "ఎవరదీ?"
   
    "నేనూ....పాణిని" ఆ మాత్రం ఆలస్యం కూడా భరించలేనట్లు అన్నాడు.

    డాక్టరుగారు తలుపుతీసి పాణిని చూసి "ఏమిట్రా అర్దరాత్రి పూట వచ్చేవ్?" అన్నాడు.
       
    "రాధకి కడుపులో నొప్పివస్తూంది. భరించలేక పోతోంది."

 Previous Page Next Page