భారరహిత స్థితిలో సెకన్ల కొకసారి అలా గిర్రున తిరుగుతున్నా తన కడుపులో దేవినట్లు వుండటం గానీ, కళ్ళు తిరిగినట్టు వుండటంగానీ లేకపోవటంతో అతడు ఆశ్చర్యపడ్డాడు. వాచీ చూసుకుంటే అతడికి ఆశ్చర్యం కలిగించే మరో విషయం కూడా తెలిసింది. అప్పుడే తను నౌకనుంచి విడివడి గంట అయిందని.
క్రింద చంద్రుడు ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాడు. పర్వతాలు లోయలు....చంద్రుడి సామీప్యం పెరిగేకొద్దీ తను మృత్యువుకి దగ్గిరవుతున్నాడని, అతడికి తెలుసు. మహా అయితే గంటా- రెండు గంటలు, అన్నమాట ప్రకారం వాయుపుత్ర బయల్దేరి వుంటే ఇప్పటికి సగం దూరంలో వుండి వుంటుంది వాళ్ళ వాహనం. చంద్రుడికి....అవ...తలి వైపున.
శబ్దరహితమైన శూన్యం లల్లాయిపదం పాడుతూ వుండగా అతడు నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు.
అతడికి తిరిగి మెలకువ వచ్చేసరికి భూమి చంద్రుడు అంచుమీదనుంచి క్రిందికి వెళ్తూ కనిపించింది. దాదాపు అరగంట సేపు తను నిద్రలో గడిపినట్టు గ్రహించాడు. ఇప్పుడు అతడికి చంద్రుడు మరింత దగ్గరయ్యాడు. వేగంగా చంద్రుడివైపు జారిపోతున్నాడు. అతడు తనివితీరా భూమిని చూసుకున్నాడు. అదే ఆఖరిసారి తనకి భూమి కనిపించేది. అదే ఆఖరి భ్రమణం.
సూర్యుడూ, భూమీ రెండూ అంతర్థానమవాటంతో అతడు దట్టమైన చీకటిలోకి ప్రవేశించాడు. ఇప్పుడిక రాడార్ సాయంతో తనని కనుక్కున్నా ఆ వాహనం తనని పట్టుకోలేదు.
అయిపోయింది.
గంటకి నాలుగువేల మైళ్ళ వేగంతో అతడు చంద్రుడివైపు జారిపోతున్నాడు. ఇప్పుడిక చంద్రుడిమీద పర్వతాలు కూడా అతడికి కనపడటంలేదు. ఏదో ఒక పర్వతశిఖరం తన శరీరాన్ని చిద్రం చేయటానికి ఉవ్విళ్ళూరుతూ వేచి వున్నదని అతడికి తెలుసు. ఈ శిఖరాల్నే 1959లో రష్యన్ ల్యూనిక్ చంద్రుడికి ఇవతలివైపు వచ్చి ఫోటోలు తీసింది.
చంద్రుడికి ఇరవై మైళ్ళ దూరంలోకి వచ్చేశాడు అతడు. అతడికి అనూహ్య గుర్తొచ్చింది. ఆమెతో మరికొన్ని సెకన్లు మాట్లాడనివ్వకుండా చేసిన వాయుపుత్ర మీద కోపం వచ్చింది.
దూరంగా ఎత్తయిన పర్వతశిఖరం కనపడుతూంది. తను వెళ్తూన్న వేగంబట్టి, జారుతున్న కాలంబట్టి, తన మరణం, ఆ పర్వతాన్ని ఢీ కొనటం ద్వారా ప్రాప్తిస్తుందని అతడు లెఖ్ఖ వేసుకున్నాడు. ఇరవై మైళ్ళ క్రిందుగా యాభై మైళ్ళ దూరంలో వుంది అది. అతడింకా పదిసెకన్ల కొకసారి తన చుట్టు తాను తిరుగుతూనే దానివైపు వెళుతున్నాడు. ఒక్కొక్క భ్రమణానికీ అతనికీ పర్వతానికీ మధ్యదూరం పదిమైళ్ళు తగ్గుతూంది. అంటే ఇంకో నాలుగుసార్లు ఆకాశాన్ని, నాలుగుసార్లు చంద్రుడిని చూడగలడు. అతడు లెఖ్ఖ వేశాడు......ముందు వీపు తగిలి వెన్నెముక విరుగుతుందా? లేక మొహం వెళ్ళి గద్దుకుంటుందా? ఏదీ తన చేతుల్లో లేదు. నేల మీద పడిన టెన్నీస్ బాల్ పైకి ఎగిరినట్టు ఈ చంద్రమండలం మీద తన శరీరం నాలుగైదుసార్లు ఎగిరిపడకుండా ఒక్కసారే ప్రాణం పోతే చాలు.
.....ఇంకొక రౌండ్ పూర్తయింది.
పైకి తిరిగినప్పుడు ఆకాశం - క్రిందికి తిరిగినప్పుడు చంద్రుడు.....నీళ్ళలో మునిగిపోతున్న కాగితంలా అతడు జారుతున్నాడు.
భూమి మీద నుండి అతడికోసం బయల్దేరిన వాహనం, ఇంకా యాభైవేల మైళ్ళ దూరంలో వుంది. అది చంద్రుడిని చేరుకోవటానికి కనీసం అరగంట పడుతుంది.
ఇంకొక రౌండ్ పూర్తయింది.
మరో చివరి రౌండ్ వుందంతే. పదిమైళ్ళ దూరంలో, క్రింద లోయలు, గుట్టలు.....మధ్యలో ఎత్తయిన పర్వత శిఖరం, అదే భూమ్మీద అయితే ఈపాటికి అతడు జర్రునజారి ఫెటేలున పేలిపోయేవాడే. చంద్రుడి ఆకర్షణశక్తి, భూమ్మీదకన్నా తక్కువ కాబట్టి మృత్యువు మరింత తాపీగా అతడిని తనలోకి లాక్కొంటూంది.
అంతలో అక్కడ ఒక హఠత్సంఘటన సంభవించింది. ఇంకొక నాలుగు సెకన్లలో అతడు ఆ పర్వతాన్ని ఢీకొంటాడనగా అక్కడ బ్రహ్మండమైన విస్ఫోటనం జరిగింది. ఒక థూళి మేఘం పైకి లేచింది. అగ్నిపర్వతం బ్రద్దలైనప్పుడు పొంగిన లావాలా అది విస్తరించింది. చంద్రుడిమీద ఇలాటి విస్ఫోటనాలు మామూలు కాకపోయినా, అరుదు కాదు.
ఆటంబాంబు పేలినట్టు బ్రద్దలైన ఆ ప్రదేశాన్నిచూసి, యశ్వంత్ మనసులోనే సంతోషించాడు. శరీరం వెళ్ళి ఢీకొని మరణించటంకన్నా, ఈ విధంగా ధూళిలో కాలి మరణించటం తక్కువ బాధాకరం.
అతడి పరిభ్రమణం ఆఖరి రౌండు పూర్తయింది. పైకి లేచిన ధూళి మేఘం అతడివైపు సెకనుకి ఒక మైలు వేగంతో వస్తూంది. అతడు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.
అంతలో తను పయనిస్తున్న దిశలో ఎదురుగా ఏదో ఒక కెరటం వచ్చి తనను కొట్టుకొని, వెనక్కి తోసేసినట్టు యశ్వంత్ ఫీలయ్యాడు. అప్పటివరకూ ప్రాణాలమీద ఆశ వదిలేసుకుని కళ్ళు మూసుకున్నవాడు, ఈ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపోతూ కళ్ళు తెరిచాడు.
ఆ దృశ్యం చూసి అతడికి మతిపోయింది.
తను చంద్రుడి నుంచి దూరంగా వెళుతున్నాడు....
తిరిగి శూన్యంలోకి!
చంద్రుడి మీదనుంచి లేచిన ధూళి మేఘం తాలూకు మట్టి వచ్చి అతడి స్పేస్ సూట్ కి తగుల్తూంది. కానీ అది అంత ప్రమాదకరం కాదు. దాదాపు ఆ వేగంతోనే అతడు వెనక్కు వెళుతున్నాడు కాబట్టి.
అతడు సైంటిస్టు.
ఏం జరిగిందో అర్థం చేసుకున్నాడు.
తను ప్రయాణం చేసిన అంతరిక్ష నౌక తాలూకు కెనెటిక్ ఎనెర్జీ, దాదాపు నిముషానికి అరవై మైళ్ళ వేగంతో తనతోపాటు పయనించి, తనకన్నా ముందుగా ఒక బుల్ డోజర్ లా వెళ్ళి చంద్రతలాన్ని ఢీ కొంది. అదే ఈ విస్ఫోటనానికీ తుఫానుకీ కారణం.*
అదే అతడిని రక్షించింది. తిరిగి చంద్ర కక్షలోకి తోసేసింది. అది అద్బుతం అనిర్వచనీయం.
సైన్సు గురించి తెలియని వారికి ఈ సంఘటన గురించి చెప్తే- అది అదృష్టం అంటారు. విధి అంటారు. నమ్మకం ఆలోచనా రాహిత్యాన్ని పెంచుతుంది. అపనమ్మకం కారణాలు వెతుకుతుంది. అభివృద్ధికి అది మూలం.
యశ్వంత్ తిరిగి చంద్ర కక్షలో పరిభ్రమించటం మొదలు పెట్టే సమయానికి వాయుపుత్ర అమితమైన వేగంతో ఆ దిశగా వస్తున్నాడు. యశ్వంత్ దగ్గిరున్న రేడియో పది మైళ్ళ వ్యాసార్థంలో సంకేతాల్ని పంపుతూంది. వాయుపుత్ర దగ్గిరున్న అంతరిక్ష రాడార్ దాన్ని కొంతసేపటికి పట్టుకుంది.
మరో నాలుగు నిముషాలు గడిచేసరికి వాయుపుత్ర యశ్వంత్ చూశాడు అతడికి మొట్టమొదట కలిగిన భావం......"జాలి."
_____________________________________________________________
*అంతరిక్ష నౌక తాలూకు కెనెటిక్ ఎనెర్జీ శూన్యంలో ప్రయాణం చేసి విస్ఫోటనాన్ని కలుగచేయటమన్న ఊహా ఆర్థర్ క్లార్క్ ది. అతడి కథ ఈ విధంగా వాడుకొనబడింది. -రచయిత.
శూన్యంలో, ఏ ఆధారమూ లేకుండా కొన్ని గంటల సేపట్నుంచి ఒక 'వస్తువు' లా తిరుగుతున్న యశ్వంత్ ని చూడగానే అతడికి ముందు జాలి కలిగింది. తరువాతే ఆనందం.
తన వాహనపు వేగాన్ని తగ్గించి, యశ్వంత్ వేగంలో సమానం చేశాడు. యశ్వంత్ తరపునుంచి అతడేమీ చేయలేడు. బలమైన ఆటగాడు కొట్టిన బంతిలా అతడు సాగిపోతున్నాడు. వాయుపుత్ర వాహనం నుంచి వల విసిరి అతడిని పట్టుకున్నాడు. ఎయిర్ - లాక్ వదులుచేసి నెమ్మదిగా అతడిని వాహనంలోకి లాక్కున్నాడు. మరో నిముషం గడిచేసరికి యశ్వంత్ వాహనంలో నిలబడగలిగే స్టేజీకి వచ్చాడు. భారరహిత స్థితినుంచి News లోకి వచ్చేసరికి, అతడి శరీరం ఆ Natural Environmentకి అలవాటు పడటానికి కాస్త సమయం పట్టింది. ఆ మాత్రం సత్తువ రాగానే అతడు స్పేస్ సూట్ విప్పేసి వాయుపుత్రవైపు చిరునవ్వుతో చూస్తూ చెయ్యిసాచి "థాంక్స్" అన్నాడు.
వాయుపుత్ర దీన్ని అంత సులభంగా తీసుకోలేకపోయాడు. పైకి ఎంతో అల్లరిగా కనిపించినా అతడు మనసు లోతుల్లో చాలా సెంటిమెంటల్. కళ్ళలో తిరిగే నీటిని ఏమాత్రం దాచుకునే ప్రయత్నం చేయలేదు. అతడి చేతిని తన చేతుల్లోకి తీసుకుని అలాగే చాలాసేపు బయటపడి కూడా అంత నిబ్బరంగా అతడెలా వుండగలుగుతున్నాడో వాయుపుత్రకి అర్థంకాలేదు.
యశ్వంత్ జరిగినదంతా వివరించాడు. ఒక అద్భుతాన్ని వింటున్నట్టు వాయుపుత్ర దాన్ని విన్నాడు. భూమ్మిదకు వెళ్ళగానే ఇది చెప్పే అక్కడ సంచలనం రేగుతుంది. కెనెటిక్ ఎనెర్జీ తాలూకు పవర్ ఇంత గాఢంగా వుంటుందని మరొకసారి నిరూపించబడింది. కానీ ఈసారి ప్రస్ఫుటంగా....
......"దీన్నిబట్టి మనకి ఏం అర్థమవుతుందో తెలుసా?" యశ్వంత్ అడిగాడు.
"ఏమిటి?"
"చివరివరకూ ప్రయత్నాన్ని వదిలెయ్యవద్దు"
"అదేమిటి?"
"నేను అంతరిక్ష నౌకనుంచి బయటకు దూకే సమయానికి నాకే ఆశలూ లేవు. మీరెవరో భూమిమీదనుంచి బయల్దేరి ఇక్కడి వరకూ వచ్చి నన్ను ఈ శూన్యంలో వెతికి పట్టుకునే వరకూ నేను చంద్రుడిమీద పడిపోకుండా ఆగగలగటం ఎటువంటి పరిస్థితుల్లోనూ సాధ్యంకాదని బయల్దేరిన మీకూ, దూకిన నాకూ తెలుసు. అటువంటిది- మనం చివరివరకూ మన ప్రయత్నాన్ని వదిలెయ్యకుండా వుండటంవల్లే ఇది సాధ్యపడింది. కాదంటావా?"
వాయుపుత్ర తలూపాడు.
ఇద్దరూ ఆవిధంగా సంభాషిస్తూ వుండగా, వాళ్ళ వాహనం తిరిగి భూమివైపు వెళ్ళటానికి ఆయత్తమవుతూ వుంది. చంద్రుడి చుట్టూ ఒక రౌండు తిరిగి ఆ కక్ష్యలోంచి బయటపడటానికి తయారవుతూంది.
ఆ దృశ్యం ఎంతో మనోహరంగా వుంది.
చంద్రుడి తాలూకు ఒకవేపే ఎప్పుడూ భూలోకవాసులకి కనపడుతూ వుంటుంది. వీరి వాహనం అవతలి పక్కకు వెళ్ళటంతో, అక్కణ్ణుంచి చంద్రుడి వంపు మీదుగా ఇటు భూమీ, అటు సూర్యుడు - ఒకేసారి.....సూర్యుడి కాంతిలో భూమి ఒక పెద్ద పూట్ బాల్ గా -ఊహుఁ అంతకన్నా పదిరెట్ల పెద్ద ఆకారంతో మొత్తం మూడు గోళాలూ ఒకే సరళరేఖలో......
"క్రింది వాళ్ళకి చంద్రగ్రహణం అనుకుంటా ఈ రోజు."
"కాదు సూర్యగ్రహణం" అన్నాడు యశ్వంత్. "......మనం మధ్యలో వున్నాం మర్చిపోయావా?"
"కాదు చంద్రుడు, భూమి, సూర్యుడు ఒక వరుసలో! అందుకే చంద్రగ్రహణం ఈ రోజు అంటున్నాను. బయల్దేరేటప్పుడు నాకు తెలుసు కదా ఈ రోజు సంగతి......
"కాదే..... సూర్యుడు, చంద్రుడు, భూమి...." అనబోయి ఏదో స్ఫురించిన వాడిలా "......మైగాడ్ మనం భూమి అనుకుంటున్న ఈ గోళాకారం భూమికాదు" అరిచాడు యశ్వంత్.
ఆ మాటల్ని నిజంచేస్తూ ఆ ఆకారం మరింత దగ్గరైంది.
ఒక పెద్ద గ్రెనేడ్ ఆకారంలో నల్లగా గుండ్రంగా వుంది. తన చుట్టూ తను పరిభ్రమిస్తూ వీళ్ళని దాటుకుని అమితమైన వేగంతో శూన్యంలోకి వెళ్లిపోయింది. "ప్లయింగ్ సాసరు..... ఎగిరే గాలిపళ్ళెం....." అరిచాడు వాయుపుత్ర.
"వేగం పెంచు. దాన్ని ఫాలో అవ్వు" యశ్వంత్ సూచనలు యిచ్చాడు.
'మీకేమైనా మతిపోయిందా' అన్నట్టు చూశాడు వాయుపుత్ర. "వాళ్ళు మొదటినుంచీ మనపట్ల వైరభావంతోనే వున్నారు. నిఖిల్ సహచరులని టెలీపతి ద్వారా లోబర్చుకున్నదీ, మీ అంతరిక్షనౌకని నాశనం చేసింది వాళ్ళే...."
వాయుపుత్ర మాటల్ని యశ్వంత్ పట్టించుకోలేదు. వాహనాన్ని కంట్రోల్ లోకి తీసుకుని వేగంపెంచి, ఆ ఎలీన్ బాడీ వెళ్తున్న దిశగా పోనిచ్చాడు. ఒకసారి దాన్ని చేరుకుంటుందని నమ్మకం కుదిరాక వాయుపుత్రతో అన్నాడు.