తన ప్రయోగ ఫలితాలు వెలుగులోకి రావడంలేదని జగన్నాధ్ కి బాదగానే వుంది. కానీ అజేయ్ ని రచ్చకీడ్వడమూ అతడికిష్టంలేదు.
"ప్రచారంవల్లనే గుర్తింపురావడంవల్ల-ప్రతిభావంతులు కూడా ప్రచారానికే ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రొఫెసర్ అజేయ్ నిస్సందేహంగా ప్రతిభావంతుడు" అంటాడు జగన్నాధ్.
పేపర్లో చాలా వివరంగా వ్రాశారు.
చదువుతున్నంతసేపూ ఆ యువతి అజేయ్ ముఖకవళికలనే గమనిస్తోంది.చదవడం పూర్తిచేశాక ఆమె కిలకిలా నవ్వింది.
అజేయ్ కాగితం మడిచి ఆమెకిచ్చి నిట్టూర్చాడు.
ఆమె కాగితాన్ని బ్లౌజులోకి తోసేస్తూ మళ్ళీ కిలకిల నవ్వు.
"ఊఁ" ఉక్రోషంగా అన్నాడయాన.
ఆమె ఈసారి ఆగకుండా నవ్వింది.
"నీకు నవ్వు రావడంలేదు. నటిస్తున్నావు" అన్నాడు అజేయ్ చిరాగ్గా.
"నా నటనను గుర్తించడం అంత తేలిక కాదు. మహా నటులకే అది సాధ్యమవుతుంది. మీరు మహానటులని ఎప్పుడో తెలుసుకున్నాను"
"సైంటిస్టుని-ఈ గదిలోకి వచ్చి నటుణ్ణయిపోయాను మరి!"
"చాలా తేలిగ్గా ఒప్పుకున్నారు-థాంక్స్"
"చిన్నప్పుడు-అంటే పదేళ్ళ వయసులో నేనో కవిత రాశాను. అది మా నాన్నకు చదివి వినిపించాను. ఆ సమయంలో నాన్న పక్కన ఇంకో మనిషున్నాడు. ఆయన నా కవిత విని శ్రీశ్రీ తర్వాత నేనేనన్నాడు. శ్రీ శ్రీ లో దేవులపల్లి కలిస్తే నేనన్నాడు. ఆరుద్రవింటే ఈ కవితమీదే ఓ పుస్తకం రాసేవాడన్నాడు. వాళ్లేం రాశారో నాకు తెలియదుకానీ ఆ పేర్లన్నీ నాకు తెలుసు. వాళ్లు చాలా గొప్పవాళ్ళనీ నాకు తెలుసు. అందువల్ల అప్పుడు నాక్కలిగిన సంతోషమింతా అంతా కాదు. నాన్న మాత్రం-అప్పుకోసం మావాణ్ణంతలా పొగడక్కర్లేదయ్యా-వాడి కవిత బాగోలేదన్నా నీకు అప్పిస్తాను అన్నాడు"
ఆమె కిలకిలా నవ్వింది.
"అప్పుడే నవ్వేయకు. చెప్పాల్సిందింకా అయిపోలేదు" అన్నాడాయన.
"అసలిదెందుకు చెప్పారో తెలియక నవ్వాను" అందామె.
"చెప్పాల్సింది పూర్తిచేస్తే ఆ డౌటూ వుండదు" అన్నాడు అజయ్.
"చెప్పండి" అందామె కుతూహలంగా.
"కాసేపు మాటలయ్యాక నాన్న లోపలకు వెళ్ళాడు. నేనప్పుడా పెద్దమనిషి దగ్గరకు వెళ్ళినా కవితలో ఆయనకర్థమైనదేమిటో చెప్పమని బ్రతిమాలాను. ఎందుకూ అన్నాడాయన.నలుగురికీ చెప్పుకుందుకన్నాను. ఆయన కాసేపాలోచించి నీకేమర్థమైందో నాకూ అదే- అన్నాడు. అప్పుడాయనకు నిజం చెప్పేశాను. కవితైతే రాసేశానుకానీ అదేమిటో నాకూ అర్థంకాలేదు"
ఈసారి ఆమె మంచంమీద వెనక్కు పడి నవ్వింది. ఆ నవ్వు చాలాసేపే వుంది. నవ్వు పూర్తయ్యాక, "ఇది నిజం నవ్వే నటన కాదు" అంది.
"నాకు తెలుసు" అన్నాడు ప్రొఫెసర్.
"ఇంతకీ ఈ కథ ఎందుకు చెప్పారు?" అందామె.
"నేను నరిస్తున్నానని అన్నావు. వెంటనే ఒప్పేసుకున్నాను. కానీ ఎప్పుడు దేనికి నటిస్తున్నానో కూడా నువ్వే చెప్పాలి మరి- నాకు తెలియదుగా"
ఆమె లేచి కూర్చుంది. "యూ హవే వెరీగుడ్ సెన్సాఫ్ హ్యూమర్" అంది.
"ముందు నా నటన గురించి చెప్పు" కుతూహలంగా అన్నాడాయన.
"నెంబర్ ఒన్-మీ నటన గురించి మీకు తెలియనట్లు బాగా నటిస్తున్నారు...."
"ఎగ్రీడ్"
"నెంబర్ టూ-అది నీతి బాధో, ఈతి బాధో- మీకు నామీద వుండాల్సినంత ఆసక్తి లేదు. కానీ వున్నట్లు నటిస్తున్నారు. నేను మిమ్మల్ని వయసుమళ్ళినవాడిగా భావిస్తానని మీ భయం"
"ఒప్పుకొను. ఈ గదిలో నువ్వు నాకు బలహీనత. నాకు నీతి బాధ వుందంటే అది కాంప్లిమెంట్ గా తీసుకుంటాను...." అన్నాడు అజేయ్ .
"నెంబర్ త్రీ-దియా సైంటిస్టుల్లో ఎవరిమీదా మీక్కోపం లేదు- ఇంక్లూడింగ్ సుబ్రహ్మణ్యం, జగన్నాధ్! ఆ నటన నాకోసం...."
"నీ కోసమా- ఎందుకు?"
"దియాలో అందరికీ మీరు దేవుడు. ఆ విషయం మీకూ తెలుసు."
దేవుడికి ద్వారపాలకులైన జయవిజయులే-రాక్షసులై దేవుడికెదురుతిరిగి ఆయన్ని మూడు అవతారాలెత్తించి ముప్పు తిప్పులూ పెట్టారు"
"కానీ మీ విషయంలో అలా జరగడంలేదు....మీ సైంటిస్టులు మిమ్మల్ని క్షేమంగా వనక్కు రప్పించాలనుకుంటున్నారు. అందుకని మీరు సాధించిన ఘనవిజయాలను కించపరుస్తూ మీలో ఏ విశేషాలూ లేవని మమ్మల్ని నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు"
"అందువల్ల వారికేం లాభం?"
"అంతా పకడ్బందీగా ప్లాను ప్రకారం జరుగుతోంది. దీనికి ప్రభుత్వ సాయం కూడా వుంది. ఆయినా మేము మోసపోము. మీమీదఎన్ని కథలల్లి ప్రచారం చేసినా మాక్కావలసింది మీ దగ్గరుందని మాకు తెలుసు...."
"ఏమిటది?"
"నటించకండి. అంతా మాకు తెలుసు"
"ఏం కావాలి మీకు?" అసహనంగా అడిగాడు ప్రొఫెసర్ అజేయ్.
"పండు పక్వానికి వచ్చినపుడు ముట్టుకుంటే రాలిపోతుంది. మాక్కావలసింది మీరిచ్చే సమయం ఎప్పుడొచ్చిందీ బాస్ కి తెలుస్తుంది. అంతదాక మిమ్మల్ని సంతోష పెట్టడమే మా పని. సంతోషమంటే-మీలో కృతజ్ఞత పుట్టేటంత సంతోషం" అంటూ ఆమె చటుక్కున ఆయన ఒడిలో వ్రాలిమెడచుట్టూ చేతులు వేసింది.
* * *
ఆ గదిలో డాక్టర్ బ్రహ్మం ముఖం గంభీరంగా వుంది.
"ఆపరేషన్ మేడిపండు- మనదేశంలోని సైంటిఫిక్ అడ్మిని స్ట్రేషన్ని కాక- అజేయ్ సర్ నే మేడి పండును చేస్తున్నట్లు తోస్తోంది" అన్నాడు రాజు.
"నో-నో-ఆయన మేడిపండు కారు. అది నాకు తెలుసు" అన్నాడు బ్రహ్మం.
ఆ గొంతులో ఆవేదన వుంది.
"కానీ ఆయనిప్పుడు పత్రికల్లో వార్త అయ్యారు. ఓ ప్రముఖ పత్రిక సంపాదకీయం కూడా రాసింది...." అన్నాడు రాజు.
"బ్రహ్మం కుర్చీలో వెనక్కువాలి, "ఎంత గొప్పవాడైనా ముందు మనిషి. ఆ తర్వాతే గొప్పతనం దేశానికి తిరుగులేని, ఎదురులేని నాయకురాలినని తెలిసికూడా ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యం సహించని కొన్ని తప్పులు చేసి వాటిని సవరించుకునే దారి లేక ఏమర్జన్సే తెచ్చింది. అయితే అంతటితో ఆమె చరిత్ర ముగిసిపోలేదుకదా! ప్రజలామెకు తిరిగి పట్టం కట్టారు. ఐ యామ్ ష్యూర్ ...అజేయ్ సర్ విల్ బౌన్స్ బాక్...." అన్నాడు.
"అంటే తాత్కాలికంగా ఆయన పతనమైనట్లేనా?" అనడిగాడు రాజు.
"ఒక విధంగా ఇదీ మంచిదే- అసలు సంగతి నాకిప్పుడర్థమవుతోంది"
రాజు కుతూహలంగా "ఏమిటది?" అన్నాడు.
"ప్రొఫసర్ అజేయ్ కారణంగా దియాకు అంతర్జాతీయ ఖ్యాతివచ్చింది. ఇది దేశం లోని ఇతరప్రముఖ శాస్త్రజ్ఞులకు కంటగింపుగా వుంది. ఎలాగో అలా దియాను అప్రతిష్ఠపాలు చేయాలని వారు చూస్తున్నారు. అవకాశం వచ్చింది. ఉపయోగించుకుంటున్నారు"
"నేనలా అనుకోలేదే-తామూ కిడ్నాప్ కావచ్చునని శాస్త్రజ్ఞులు భయపడ్డంలేదా?"
"భయపడ్డారు. కానీ రెండు ప్రాజెక్ట్స్ లో అజేయ్ సర్ బలహీనతల బయటపడగానే ఆయన్ను సమర్థించడానికి బదులు నిరసిస్తూ ప్రముఖులు స్టేట్ మెంట్సిచ్చారు. ఆ విధంగా వారి రంగు బయలుపడింది తప్ప అజేయ్ సర్ కేమీ కాదు..."
"ఒకవిధంగా ఇదీ మంచిదీ అన్నావు. ఏవిధంగా?"
"సర్ ఒక మేడిపండని భావించి కిడ్నాపర్స్ విడిచిపెడతారు. అప్పుడాయనే తన ప్రతిభ చూపించి అందరి నోళ్ళూ మూయించగలరు"
"సర్ ని విడిచి పెట్టకపోతే?"
"ఆ భయం నాకూ వుంది. ఎందుకంటే సర్ దగ్గర చాలా రహస్యాలున్నాయి"
"ఏమిటవి?"
"ఇటీవల సర్ కు రాజమండ్రిలో సన్మానం జరిగింది. అక్కడ సర్ ఉద్రేకం పట్టలేక నీటిని విడగొట్టే ప్రయోగం గురించి ప్రస్తావించారు...."
"అయితే?"
"ఆ ప్రయోగం సామాన్యమైనదికాదు. అది ప్రపంచం స్వరూపాన్నే మార్చేస్తుంది"
"అందులో అంత విశేషమేముంది?"
"మనకలాగే అనిపిస్తుంది. కానీ అజేయ్ సర్ విషయం వేరు. ఒక చన్న విషయం వినగానే విజ్ఞానశాస్త్రంలో ఆయన ఆలోచనలు చాలా దూరం వెడతాయి.అందుకే ఆయన సుబ్రహ్మణ్యం పథకాన్ని నమ్మారు. జగన్నాధ్ విషయంలో చాలా దూరం వెళ్లారు. కానీ దెబ్బతిన్నారు. అయితే టెండూల్కర్చెప్పినట్లు అగ్రెసివ్ బ్యాట్స్ మన్ గాల్లోకి షాట్ కొడితే సిక్సర్ వెడితే చప్పట్లు, క్యాచ్ పడితే తిట్లు. అంతమాత్రాన టెండూల్కర్ తన స్టైల్ మార్చుకోలేడు. సర్ కూడా అంతే. చిన్నచిన్న ఫెయిల్యూర్స్ కి భయపడి అగ్రెషన్ విడిచి పెట్టరు. అది నీటిని విడగొట్టడంలో జరిగిందని నా అనుమానం...."
వాతావరణంలో హైడ్రోజన్ వాయువు చాలా స్వల్పంగా వుంది. పదిలక్షల్లో ఒకటో వంతు మాత్రమున్న ఈ వాయువు వల్ల ఉన్న ప్రయోజనాలన్నీ ఇన్నీ కాదు.
ఈ వాయువును ఇంధనంగా వాడితే వాతావరణ కాలుష్యముండదు.
అంతేకాదు-ఈ వాయువును లోహంగా మార్చవచ్చునని కూడా రష్యన్ శాస్త్రజ్ఞులు ఎప్పుడో కనిపెట్టారు. ఆ వాయువుతో తయారైన లోహాన్ని వంతెనల నిర్మాణానికి వాడితే అవి తుప్పుపట్టవనీ, ఇతర లోహలన్నింటికంటే శ్రేష్టంగా వుంటాయనీ వారన్నారు.
హైడ్రోజన్ వాయువును ఘనపదార్థమైన లోహంగా మార్చడం శ్రమతోనూ, ఖర్చుతోనూ కూడుకున్న పని. అయితే అసలు సమస్య అది కాదు.
అంత హైడ్రోజన్ ఎక్కడ దొరుకుతుంది?
పరిశ్రమలకు అవసరమైన హైడ్రోజన్ వాయువును-బొగ్గుమీదకు నీటిఆవిరిని పంపి తయారుచేస్తారు. అది కూడా అంత సులభమైన పద్ధతి కాదు.
నీటిని సులభంగా విడగొడితే- అటు ఇంధనంగా, ఇటు లోహంగా ఉపయోగపడేటంత హైడ్రోజన్ విస్తారంగా దొరుకుతుంది. భూమ్మీద భూమికంటే నీరే ఎక్కువకదా!
మరి-ఆ ప్రయోగం ప్రపంచం స్వరూపాన్ని మార్చడంలో ఆశ్చర్యమేముంది?
"అయితే సర్ నీటిని సులభంగా విడగొట్టగలిగారా?"
"జగన్నాద్ గోల్డ్ రేస్ తర్వత-సర్ ఓ కొత్తపద్దతి ప్రారంభించారు. దియాలో సైంటిస్టులు-ఒకరి ప్రాజెక్టు గురించి ఒకరు- పరస్పరం చర్చించుకోకూడదు. ఎవరైనా నేరుగా ఆయనతోనే చర్చించాలి. పేపరో, పేటెంటో వచ్చేదాకా అంతా రహస్యంగా వుంచాలి"
"నీటిని విడగొట్టే ప్రయోగం ఎవరు చేస్తున్నారు?" రాజులో కుతూహలం.
"అది నాకూ సర్ కీ తప్ప ఇంకెవరికీ తెలియదు" అన్నాడు బ్రహ్మం.
"అంటే ఆ ప్రయోగం నీదా?" రాజు కుతూహలం కట్టలు తెంచుకుంది.
"చెప్పను. చెప్పకూడదు...."
"చెప్పక్కర్లేదు. నీకు తెలిసిందంటే అది నీదే అయుండాలి" అన్నాడు రాజు
"సర్ కు నేనంటే నమ్మకం. ఆయన వేసే ప్రతి అడుగూ నాకు తెలుస్తుంది"
రాజు ముఖంలో రవంత భయం కనిపించింది. "తెలియక ఇంతవరకూ కూడనిచనువు మీదగ్గర తీసుకున్నానా సర్" అన్నాడు కంగారుగా.
"బ్రహ్మం నవ్వి, "నన్ను సర్ అంటే-అది అజేయ్ సర్ ని చిన్నబుచ్చినట్లేనని ముందే చెప్పాను. ఆపైన నీ ఇష్టం" అన్నాడు.
"ఇంతకూ నీటిని విడగొట్టే ప్రాజెక్టు గురించి మరికాసిని వివరాలు...."
"చెప్పను" అన్నాడు బ్రహ్మం. "ప్రస్తుత్తం సర్ కిడ్నాపై వున్నారు. ఈ విషయం ఆయనకు తప్ప తెలియదని దియాలో టాక్. అందువల్ల అది పూర్తిగా అజేయ్ సర్ టాపిక్.ఇంకొకరి పేరు రావడంవల్ల కిడ్నాపర్స్ ఆయన్ను వదలరు....."
"ఆపరేషన్ మేడిపండులో అది మూడో ప్రాజెక్టా?" అన్నాడు రాజు.
"నీకు సంబంధించినంతవరకూ ఇక సర్ ప్రాజెక్టుల గురించి తెలుసుకోవడం వృధా. ఆయన గొప్పతనం ప్రాజెక్ట్స్ లో కాదు- వ్యక్తిత్వంలో వుంది...." అన్నాడు బ్రహ్మం.
"అంటే?"
"దియాలో ఆయన సైంటిస్టులనీ, రీసెర్చి స్కాలర్స్ నీ ఎన్నిక చేసిన విధానం అపూర్వం. ఇంతవరకూ ఈ దేశంలో బహుశా ఎ డైరెక్టరూ ఫాలో అయి వుండరు" "ఏమిటా విధానం?"
"మనదేశంలో బడుగువర్గాలకు రిజర్వేషన్ వుంది. వారు ఆర్థికంగానో, సాంస్కృతికంగానో, మానసికంగానో బడుగువర్గాలవారై వుండవచ్చు. రిజర్వేషన్ వారికి చేయూతనిచ్చి అవకాశమిస్తోంది. కానీ అజేయ్ ఇందుకు వ్యతిరేకి!"
"అదా ఆయన వ్యక్తిత్వం?" అన్నాడు రాజు నిరసనగా.
"అలాతీసిపారేయకు. రిజర్వేషన్ మనిషికి అవకాశంమాత్రం ఇస్తుంది. స్వతంత్రం వచ్చి యాభైఏళ్లయినా బడుగువర్గాల సంఖ్య పెరుగుతూనేవుంది. రిజర్వేషన్ అవసరం కనబడుతూనేవుంది. అంటే వచ్చిన అవకాశాలు ఉపయోగించుకునే స్థితికి ఇన్నేళ్లలోనూ వారు ఎదగలేదనే అర్థం. అందుకే సర్ రిజర్వేషన్ పేరుతో అవకాశాలివ్వడాన్ని వ్యతిరేకించారు"
"వ్యతిరేకించడం సులభమే-కానీ అందుకు ప్రత్యామ్నాయం చూపాలికదా"
"సర్ మాటల మనిషి కాదు. చేతల మనిషి ఆయన గుర్తింపుకు రిజర్వేషన్ కావాలన్నారు. అందువల్లనే సత్ఫలితాలు వస్తాయన్నారు"
"అంటే?" అన్నాడు రాజు. అతడికిది కాస్త అయోమయంగా తోచింది.
బ్రహ్మం గొంతు సవరించుకున్నాడు. "తొంబయ్యోపడిలో పడిన మహాగాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మికి ఇటీవల 'భారతరత్న; సత్కారం జరిగింది. అంటే ఒక గాయని ఆ సత్కారం పొందాలంటే అన్ని దశాబ్దాల కృషికీ ఆ సత్కారం జరుగుతుందన్న ఆశా లేదు. అందువల్ల బడుగుగాయకులా బిరుదు నాశిస్తే నిరాశానిసృహలకు లోనవుతారు. అవునా?"
రాజు తలాడించాడు.
"భారతరత్న ఇవ్వకపోతే సుబ్బులక్ష్మి మహాగాయని కాకుండాపోతుందా? సమర్థత గుర్తింపు కోరదుకదా! వివిధ రంగాలకు చెందిన ప్రముఖులెందరో జాతీయ పురస్కారాన్ని తృణీకరించి వుండలేదా? కాబట్టి ప్రభుత్వం కానీ, సంస్థలు కానీ సమర్థులను గుర్తించే ఆలోచన విడిచిపెట్టాలి. అడలాగుంచితే- సమర్థత గుర్తింపును కోరుకున్నా గుర్తింపు సమర్థతను పెంచుతుంది. కాబట్టి గుర్తింపును బడుగుమనుషుల కోసం రిజర్వు చేయాలి"
"ఎలా?"
"వివిధ రంగాల్లో ప్రావీణ్యతను సంపాదించాలనుకుంటున్నవారిలో-ఒకో రంగానికి ఒకో బడుగు మనిషిని ఎన్నుకోవాలి. ఆ మనిషి కోసం భారతరత్న కానీ అలాంటి అవార్డును కానీ రిజర్వు చేయాలి. ఆ అవార్డు స్థాయికి ఆ మనిషిని ఎదిగేలా చేయడానికి ప్రభుత్వం కృషిచేయాలి" అన్నాడు బ్రహ్మం.
"అది సాధ్యమా?"
"రామనాథన్ రమేష్ ని తయారుచేశాడు. నంబియార్ ఉషనీ, లిల్లీ శ్రీనాథ్ ని. ఇవన్నీ వ్యక్తుల విజయాలు. సంకల్పబలంతో వ్యక్తులుసాధించగలిగిన విజయాలను సంస్థలు సాధించలేవా? ప్రభుత్వం సాధించలేదా?"
రాజు కళ్ళు పెద్దవయ్యాయి. "ఇది చాలా చాలా గొప్ప ఆలోచన" అన్నాడు.
"సర్ వన్నీ ఇలాంటి ఆలోచనలే. అందుకే ఆయన దియాలోనూ కొన్ని అవార్డులు సృష్టించారు. ఆ అవార్డుల విషయం రాజకీయనాయకుల దాకా వెళ్ళింది. ఇలాంటి పద్ధతి వాళ్ళూ ప్రారంభించాలని ఒత్తిడి వస్తోంది. కానీ ఇక్కడొ ఇబ్బంది వచ్చింది...."
"ఏమిటది?"
"బడుగు మనిషంటే ఎవరో తిరుగులేని నిర్వచనముంది. అయినా ఒకో రాజకీయ పక్షం ఒకో మనిషిని బడుగంటుంది. అందరూ అందరికీ బడుగులు కారు. అందువల్ల ప్రబుత్వాన్నేలే రాజకీయపక్షం ఓ అవార్డును ఓ బడుగు మనిషి కోసం రిజర్వు చేస్తే-ఆ బడుగు ఆ అవార్డు స్థాయికి చేరుకునేలోగా ఎన్నిరాజకీయపక్షాలు కొత్తప్రభుత్వాన్నేలతాయో తెలియదు. ఒక రాజజీయ పక్షం ఎన్నిక చేసిన బడుగుమనిషి అభివృద్ధి కోసం-ఇంకో రాజకీయపక్షం కృషిచేయగలదా?