Previous Page Next Page 
ఆఖరి మజిలి పేజి 11


    తను నాలుగు రోజులకు సరిపోతుందని  ఉంచుకున్న పాకెట్ మనీ ఈరోజుతో ఖాళీ అనుకుంటూ  కుమార్ నీరసంగా పర్సు బయటకు తీశాడు.

    కృష్ణప్రియ ఏదో గుర్తుకు వచ్చినట్టు... "సారీ కుమార్...నా పర్సు కారులోనే మరచిపోయినట్టున్నాను. ముందు బిల్ పేచేయి..." కావాలని చేసినా ఏమీ ఎరుగనట్టు అన్నది.

    ఆమె అలా అనడంతో అతనిలోని వ్యక్తిత్వం సవాలుచేసి మరింత మొహమాటపడి చేతిలోవున్న నోటుని కూడా బేరర్ కు ఇచ్చి చిల్లరకోసం కూడా ఆగకుండా విసురుగా బయటకు వచ్చాడు.

    కుమార్ కారుని స్టార్టు చేశాడు.

    "కుమార్ ...ఒక నిమిషం ఆపు..."

    కృష్ణప్రియ హాడావుడిగా చెప్పడంతో  కుమార్ షడన్ బ్రేక్ వేశాడు.

    "నేను ధియేటర్ కు తరువాత వస్తాను...నువ్వు కారు తీసుకువెళ్ళు... నేను అత్యవసరంగా ఒకచోటకు వెళ్ళి రావాలి..."

    కుమార్ జవాబుకోసం చూడకుండానే  కృష్ణప్రియ కారుదిగి వెళ్ళిపోయింది.

    దూరంగా కనిపిస్తున్న వ్యక్తిని ఆసక్తిగా గమనిస్తూ అడుగులు వేస్తున్నది కృష్ణప్రియ.

    ఆమె ఎందుకు వెళుతున్నదో...ఎక్కడకు వెళుతున్నదో  అర్ధంకాక అయోమయానికి లోనయ్యాడు కుమార్.

    కోపంతో ఒక క్షణం కారును అక్కడే వదిలి వెళ్ళిపోదామనుకున్నాడు...

    కానీ కారుకు ఏదయినా అయితే తిరిగి తనకే చుట్టుకుంటుందని  ఆ పని విరమించుకుని  కసిగా గేరుమార్చి, యాక్సిలేటర్ ను అడుగుకంటా అదిమిపట్టాడు కుమార్!


                        *    *    *


    వడివడిగా నడుస్తున్నది డాక్టర్ కృష్ణప్రియ.

    అయినా చేరువలోనే వున్న అతనిని చేరుకోలేకపోతున్నది.

    ఒకసారి వెనుదిరిగిన అతను...ఆమె సైగచేసే లోపలే తల తిప్పుకుని మరింత వేగంగా నడుస్తున్నాడు.

    అప్పుడే ఆగిన డబుల్ డెక్కర్ రెండు అంతస్థుల బిల్డింగ్ లా వుంది.

    అతను స్పీడుగా నడిచి ఆ బస్సు ఎక్కాడు.

    చాలారోజుల తరువాత కనిపించిన అతనిని ఎలాగయినా కలుసుకోవాలనే ఆతురత ఆమెను పరుగుపెట్టేలా చేసింది. అతను అందుతాడో లేదోనన్న మీమాంసలోనే బస్సు కదిలిన చివరి క్షణంలో ఎక్కింది కృష్ణప్రియ.

    కిందవున్న లేడీస్ సీట్లు ఖాళీగా వుండడంతో  అటు వెళ్ళి కూర్చున్నది.

    కండక్టరు వచ్చి టికెట్ అడగడంతో ఒక క్షణం ఎక్కడకు తియ్యాలో అర్ధంకాక కృష్ణప్రియ తికమకపడింది.

    "మేడమ్... టికెట్ ప్లీజ్ ..." అంటూ రెట్టించడంతో__

    "లాస్ట్ హాల్ట్ ..." అంటూ పదిరూపాయల నోటుని అందించింది.

    టికెట్ ఇచ్చి, చిల్లర దిగేటప్పుడు తీసుకోమని  చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు బస్ కండక్టరు...

    బస్సు ఆగినప్పుడల్లా అతను ఏ స్టేజీలో దిగుతాడోనని ఆమె బస్సు మెట్లు వైపే చూస్తున్నది.

    అతను దిగుతున్న జాడలు లేకపోవడంతో  నిట్టూరుస్తున్నది.

    తను అతన్ని వెంబడిస్తున్నాని తెలిస్తే ఏ విధంగా అనుకుంటాడో...అయినా అతను తన ఎదుటపడితే తను ఏం మాట్లాడాలి?

    టింకూను రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పడం  హాస్యాస్పదంగా వుంటుందేమో...!

    హాస్పటల్ లో జరుగుతున్న అవమానాలకుతోడు...ఒక అపరిచిత వ్యక్తికోసం ఇలా వెంటబడడం తెలిస్తే ఇంకెన్ని  అపనిందలను సృష్టిస్తారో!!

    కృష్ణప్రియ చేతిలో కండక్టరు చిల్లర వుంచాడు.

    ఆమె ఆలోచనల నుంచి  వర్తమానంలోకి వచ్చింది.

    సిటీ బస్ రివర్స్ అవుతుంటే అదే ఆఖరి స్టేజీ అని అర్ధం అయిందామెకు!

    అప్పటికే చాలామంది పాసింజర్లు బస్ దిగి వెళ్ళిపోయారు. కండక్టరు, డ్రయివరు ప్రక్కనే వున్న ఇరానియన్ రెస్టారెంట్ వైపు అడుగులు వేశారు.  

 Previous Page Next Page