స్వప్నతో తన ప్రేమ వ్యవహారం జీవన్మరణ సమస్యలా వుంది! ఈ కులం ఎక్కువ పిల్లను ప్రేమించి తన మనసు నెంత చిత్రవధ పెట్టుకోవాల్సి వచ్చింది!
అతడి గుండె సుడిగుండంలో చిక్కుబడినట్టుగా, అగ్ని గుండంలో వేగుతున్నట్టుగా వుంది! దాన్ని బయటికి లాగాలంటే స్వప్నకి తప్ప ఆ శక్తిలేదు ఎవరికీ.
అదిగో స్వప్న!
తనని ఆ సుడిగుండంలోకి మరింత లోతుగా తోసేసి పోతుందో?
అడుగులో అడుగు వేస్తూ నడిచివచ్చి తలవంచుకు నిలబడింది స్వప్న.
"స్వప్నా! మధుర టీచర్ చెప్పేదంతా నిజమేనా!"
స్వప్న కళ్లనుండి జలజల రాలిన కన్నీళ్లు , అదిరే పెదవులు, వణికే శరీరం స్వరూప్ ప్రశ్నకు జవాబిచ్చాయి!
"స్వప్నా!" పాతాళం అడుక్కి తలక్రిందులుగా జారిపోతున్నట్టుగా పిలిచాడు!
"నేను చివరి వీడ్కోలు తీసుకోడానికి వచ్చాను!" ఎలానో గొంతు పెగల్చుకొని అంది.
"నువ్వింత పిరికిదానివా!"
"పిరికిదాన్ని కాదు, బానిసని, ఖైదీని."
"ఎవరికి?"
"కన్యగా తలిదండ్రులకి. పెళ్లయ్యాక భర్తకి. వయసు మళ్లాక పిల్లలకి. తరతరాలుగా మా స్త్రీ జాతి ఇంతే. చదువుకొన్నా, సంపాదించుకోగలిగినా మాకు స్వంతంగా ఒక నిర్ణయం చేసుకోగల హక్కులేదు. ఏ చట్టాలూ మా శృంఖలాలు తెంచలేవు. ఏ ఉపన్యాసాలూ మమ్మల్ని మనుషులుగా నిలబెట్టలేవు. "
"ఎందుకింత నిరాశ? మీ అమ్మా నాన్నా చచ్చిపోతాం అని బెదిరించడం వల్లేనా? అవి బెదిరింపులే! ఇలా బెదిరించినవాళ్లు చచ్చిపోరు, స్వప్నా!"
"కాకపోయినా మా కుటుంబం నవ్వులపాలు అవుతుంది!"
"రెండురోజులు ఒక విశేషంగా చెప్పుకొంటారు. తరువాత మామూలుగా కలిసిపోతారు! మీవాళ్లు మొదట ఎంత తిట్టినా రక్తసంబంధాన్ని, మమతని అంత తేలిగ్గా తెంచివేసుకోలేరు!"
"నన్ను భ్రమలోకి, స్వార్దంలోకి లాగవద్దు, స్వరూప్! నిజంగా మీకంటే ఎక్కువ నరకం అనుభవిస్తున్నది నేను. అయినా మీనుండి దూరం కావడానికే నిశ్చయించుకొన్నాను. ఎందుకో తెలుసా?" కన్నవాళ్ళ గుండెల్లో నిప్పులు గుమ్మరించి నేను మీ దగ్గర సుఖశాంతులనుభవించలేను. మీ ప్రేమకు న్యాయం చేయలేను.
"కాలక్రమంలో నా తలిదండ్రులు నా తప్పును మరిచిపోయి నన్ను దగ్గరికి తీస్తారంటున్నారు కదూ? ఇదే కాలం నన్ను మీరు మరిచిపోయే శక్తిని ఇస్తుంది! ఇక నాకు సెలవు ఇస్తే వెళ్ళిపోతాను...."
చేతులు జోడించి నిలబడిన స్వప్న ముఖంలో కనిపించినవి కళ్లు కావు! రెండు నిండు కోనేరులు!
జోడించిన ఆ రెండు చేతుల్ని తన చేతుల్లోకి ఆప్యాయంగా తీసుకొన్నాడు స్వరూప్. "స్వప్నా, నా కోసం నీ వాళ్లని త్యాగం చెయ్యలేవా?" రుద్దంగా అడిగాడు.
"ప్రాణమైనా త్యాగం చేస్తాను మీ కోసం! కాని, ప్రాణంకంటే గొప్పది ధర్మమనేది. అది త్యాగం చేయలేనిది. చేశాక మనిషి బ్రతుకే విలువలేనిది.
" స్వరూప్! నన్ను మీ మాటలతో బలహీనురాలిని చేయవద్దు. మీ ప్రేమతో నన్ను వివశురాలిని చేయవద్దు! కరుణ చిప్పిల్లే ఈ కళ్లతో నన్ను బంధించవద్దు. స్వరూప్, నన్ను వదిలే వే... యం... డి!" స్వరూప్ చేతుల్లో ముఖం దాచుకొని ఏడవసాగింది.
"మన ప్రేమకి గుర్తుగా నీనుండి ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను"